బీజేపీ నోట్లో మట్టికొట్టిన బాబు


వారికిచ్చిన సీట్లలో టీడీపీ అధికారిక పోటీ

 మూడు స్థానాల్లో తమ అభ్యర్థులకు బీ ఫారాలిచ్చిన చంద్రబాబు

 పలుచోట్ల రెబెల్స్‌గా టీడీపీ నేతలు   

 పొత్తుల్లో మొదటి నుంచి కోతలే

 అభ్యర్థుల ఎంపికపైనా పెత్తనం   

 మండిపడుతున్న బీజేపీ అభ్యర్థులు


 

 

 హైదరాబాద్: బీజేపీ నాయకత్వం అనుమానించినట్టే జరిగింది. పొత్తు పేరుతో తెలుగుదేశం పార్టీ బీజేపీ నోట్లో మట్టి కొట్టింది. పొత్తు కుదిరిన రోజు నుంచి రోజుకో డ్రామా నడిపిస్తూ బీజేపీకి కేటాయించిన సీట్లల్లో కోత పెడుతూ చివరికొచ్చేసరికి అసలుకే ఎసరు పెట్టింది. కేవలం మూడు నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాల్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్నేహ ధర్మాన్ని పక్కనపెట్టారు. నామినేషన్ల ఘట్టం చివరి రోజు వరకూ మిత్రపక్షానికి సాకులు చెబుతూ పొత్తు సీట్లలో కోత పెట్టిన చంద్రబాబు.. నామినేషన్ల చివరి రోజు శనివారం బీజేపీకి కేటాయించిన మరో మూడు సీట్లలో తమ పార్టీ నేతలకు అధికారిక బీ ఫారాలు అందజేసి అభ్యర్థులను పోటీకి దించారు. పొత్తులో బీజేపీకి ఇవ్వాల్సిన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, వైఎస్‌ఆర్ జిల్లాలోని కడప, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ అధికారిక బీ ఫారంతోనే పోటీకి పెట్టింది. మిగిలిన చోట్ల కూడా టీడీపీ నేతలు పలువురు బీజేపీకి వ్యతిరేకంగా స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. హైడ్రామా నడుమ ఇరు పక్షాల నేతలు శుక్రవారం పొత్తుపై మరో దఫా చర్చలు జరిపి ఒక అంగీకానికి వచ్చిన దరిమిలా టీడీపీ అధికారికంగా అభ్యర్థులను బరిలోకి దింపడంపై కమల దళం అగ్గిమీదగుగ్గిలమవుతోంది.



సంతనూతలపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ కాంగ్రెస్ పార్టీకి స్వస్తి చెప్పి కమలం, సైకిల్ పొత్తు కుదరడానికి కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరారు. పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థి దారా సాంబయ్యకు వ్యతిరేకంగా విజయకుమార్ మూడు రోజుల కిందట నామినేషన్ వేయగా.. శనివారం ఆయనకు చంద్రబాబు బీ ఫారం అందజేశారు. కడప అసెంబ్లీ స్థానంలో బీజేపీ ప్రకటించిన కె.హరినాథరెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నేత ఆర్. శ్రీనివాస్‌రెడ్డి బీ ఫారంతో శనివారం నామినేషను దాఖలు చేశారు. గుంతకల్లులో జితేంద్రగౌడ్‌కు బీ ఫారం ఇచ్చి బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ పోటీలో నిలిపింది. వీటితో పాటు బీజేపీకి కేటాయించిన పాడేరు అసెంబ్లీ స్థానంలో ఇద్దరు టీడీపీ నేతలు రెబల్స్‌గా పోటీలో ఉంటే, తాడేపల్లిగూడెం, విజయవాడ పశ్చిమ, కైకలూరులో ఒక్కొక్కరు, నరసరావుపేట, మదనపల్లిలో ముగ్గురేసి టీడీపీ నాయకులు రెబల్స్‌గా పోటీలో ఉన్నారు. వీటిలో పలువురు టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. నరసాపురం లోక్‌సభ స్థానంలో బీజేపీ నేత రఘురామకృష్ణరాజు రెండు రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు సూచన మేరకే ఆయన నామినేషన్ దాఖలు చేశారని ప్రచారం జరిగింది. దీనికి తోడు రాజమండ్రి అర్బన్ స్థానంలో టీడీపీ నేత గోరుంట్ల బుచ్చయ్యచౌదరి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు రాజమండ్రి రూరల్ స్థానం కేటాయించడంతో అర్బన్‌లో వేసిన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి.



 కోతలపై కోతలు..



 రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినపుడు సీమాంధ్రలో బీజేపీకి 5 లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ప్రాంతంలో నామినేషన్లు ప్రారంభమయ్యే నాటికి ముందు అనుకున్న సీట్లలో ఒక్కో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు కోత పెట్టి బలవంతంగా బీజేపీ రాష్ట్ర నేతలను ఒప్పించారు. మిగిలిన నాలుగు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా... వారు బలహీనంగా ఉన్నారంటూ టీడీపీ కొత్త నాటకానికి తెరతీసింది. తుది ధపా చర్చల్లో మరో అసెంబ్లీ సీటుకు సైతం చంద్రబాబు కోత పెట్టారు. తీరా ఇప్పుడు మరో మూడు బీజేపీ నియోజకవర్గాలలో టీడీపీ తమ పార్టీ అధికారిక అభ్యర్థులను పోటీలో నిలిపి బీజేపీకి గట్టి షాకిచ్చింది.



 అగ్రనేతల సీట్లు సేఫ్..



 పొత్తులలో పార్టీకి కేటాయించిన దాదాపు అన్ని సీట్లలో టీడీపీ నేతలు అధికారికంగానో, రెబల్స్‌గానో పోటీలో ఉన్నప్పటికీ బీజేపీ ముఖ్యనేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో మాత్రం కనీసం రెబల్స్ బెడద కూడా లేకపోవడం విశేషం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పోటీ చేస్తున్న విశాఖ, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజంపేట లోక్‌సభ స్థానాల్లో పోటీ అభ్యర్థులు లేరు. ఇక కోడుమూరులో అయితే బీజేపీ తొలుత ప్రకటించిన అభ్యర్థిని టీడీపీ బలవంతంగా మార్పించింది. ఇక్కడ టీడీపీ నేతలు పోటీలో లేకపోవడం గమనార్హం.

 

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top