మూడింటిపై బీజేపీ ఆశలు!


* నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్‌లో గట్టి పోటీ

* అధిష్టానానికి జవదేకర్ నివేదిక

* ఆ మూడు చోట్ల మోడీ పర్యటన ఖరారు

* చివరి నిమిషంలో పాలమూరుకూ చోటు


 

సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ప్రధానంగా మూడు లోక్‌సభ స్థానాలపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో పార్టీ నెగ్గడానికి అనుకూల పరిస్థితి ఉందని పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. అందుకే ఈ మూడు స్థానాల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. అయితే మహబూబ్‌నగర్‌లోనూ మోడీ సభ పెడితే గట్టి పోటీ ఇవ్వగలవుని తెలంగాణ నేతలు రెండు రోజుల క్రితం అధిష్టానం దృష్టికి తెచ్చారు.

 

 దీంతో పార్టీ పెద్దలు మోడీతో చర్చించి దాన్ని కూడా ఆయన ప్రచారంలో చేర్చారు. ఈనెల 22న ఈ నాలుగు ప్రాంతాల్లో మోడీ సభలు జరగనున్నాయి. కాగా, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ ఇప్పటికే తెలంగాణలో పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. లోక్‌సభ స్థానాలపైనే ఎక్కువగా సమాచారం సేకరించారు. అన్నింటికంటే కరీంనగర్‌లో పరిస్థితి కొంత అనుకూలంగా ఉందని, ఆ తర్వాత సికింద్రాబాద్, నిజామాబాద్‌లలో పరిస్థితి మెరుగ్గా ఉందన్న అభిప్రాయానికి వచ్చారు.

 

 కరీంనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై స్థానికంగా వ్యతిరేకత ఉందని, టీఆర్‌ఎస్ అభ్యర్థి గణనీయ సంఖ్యలో ఓట్లను సాధిస్తారని, దీంతో ఓట్లు చీలిపోరుు ఓ మోస్తరు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌రావు గెలవొచ్చన్నది జవదేకర్‌కు అందిన సమాచారం. ఇక సికింద్రాబాద్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె కవితకు ఊహించిన స్థాయిలో ఓట్లు రాకపోవచ్చని, ఇక్కడ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఆమెతో సవుంగా ఉన్నారని, స్థానిక నేత, మాజీ మంత్రి ఆంజనేయులు బీజేపీలో చేరడంతో పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని జవదేకర్ విశ్లేషించుకున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి నివేదించారు.  దీని ఆధారంగానే మోడీ సభలు ఖరార య్యాయి.  

 

22న మోడీ సభల షెడ్యూల్

 నిజామాబాద్ సభ మధ్యాహ్నం 2.40గంటల వరకు..

 కరీంనగర్ సభ మధ్యాహ్నం 3.15-3.45 గంటల వరకు

 మహబూబ్‌నగర్ సభ సాయంత్రం 5.40 గంటల వరకు

 సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సాయంత్రం

 6.15-7.15 గంటల వరకు..

 (సికింద్రాబాద్ సభలో బీజేపీతోపాటు ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్యులు కూడా హాజరవుతారు.


టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు).

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top