రైతులను మోసగించిన దళారీ


 బల్మూర్, న్యూస్‌లైన్ :  ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఉడాయించిన ఓ దళారీని ఎట్టకేలకు రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. సుమారు 30ఏళ్ల నుంచి బల్మూర్ మండలం లక్ష్మీపల్లికి చెందిన సాయిబాబు గింజల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. వ్యాపార లావాదేవీల కోసం కొండనాగుల, లక్ష్మీపల్లిలోని కొందరు వ్యక్తుల వద్ద సుమారు రూ.పది లక్షలు వడ్డీకి తీసుకున్నాడు. అలాగే గత ఖరీఫ్‌లో ఈ రెండు గ్రామాల తోపాటు బిల్లకల్‌కు చెందిన రైతుల నుంచి రూ.30 లక్షల విలువజేసే వరి ధాన్యం కొనుగోలు చేశాడు. అయితే వాటికి సంబంధించి డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు ఒత్తిడి తేగా నాలుగు నెలలక్రితం అతను కుటుంబ సభ్యులతో సహా రాత్రికి రాత్రే ఉడాయించాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ ద ళారీ కోసం వెతకసాగారు. గత నెలలో అతని సెల్ నంబర్‌కు ఫోన్ చేయగా తాను అప్పుల పాలై దివాళా తీశానని, డబ్బులు అడగవద్దన్నాడు. ఈ మేరకు ఓ న్యాయవాది ద్వారా వారికి ఐపీ నోటీసులు ఇప్పిం చాడు.

 

 చివరకు బుధవారం కల్వకుర్తి పట్టణంలో సాయిబాబు ఉన్నట్లు తెలుసుకున్న కొండనాగులకు చెందిన ఓ యువకుడు వెంటనే బాధితులకు సమాచారమివ్వడంతో అక్కడికి వెళ్లారు. గురువారం ఉదయం పోలీ సుల సాయంతో అతడిని స్వగ్రామానికి తీసుకొచ్చి తమ డబ్బులు ఇవ్వాలని పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయితే కొంతకాలం తర్వాత బాకీలు తీర్చుతానంటూ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో నిలదీశారు. చివరకు పోలీసులకు నిందితుడిని అప్పగించి, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై ఎస్‌ఐ నవీన్‌సింగ్‌ను వివరణ కోరగా బాధితుల ఫిర్యాదు మేరకు విచారిస్తున్నామన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top