నాకేం తెలీదు... అంతా అధిష్టానానిదే..

నాకేం తెలీదు... అంతా అధిష్టానానిదే.. - Sakshi


 కరకగూడెం (పినపాక), న్యూస్‌లైన్:  మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌కు ఆ పార్టీ పినపాక నియోజకవర్గస్థాయి సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది. ‘ఎంపీ గో బ్యాక్’ అంటూ, కార్యకర్తలు.. నాయకులు నినాదాలు చేయడంతో ఆయన అవాక్కయ్యారు.



దీనికి సంబంధించిన వివరాలు...

 కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గస్థాయి సమావేశం మంగళవారం కరకగూడెంలో ఏర్పాటైంది. ఈ సమావేశానికి పార్టీ నేత, మహబూబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బాలరామ్ నాయక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ‘ఎంపీ.. గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. వారిని ఎమ్మెల్యే రేగా కాంతారావు సముదాయించారు.



ఆ తరువాత ఆయన మాట్లాడుతూ.. ‘నాకు టికెట్ రాకుండా బలరామ్ నాయక్ ద్రోహం చేశారు. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. నాకు జరిగిన నష్టాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని అన్నారు. ఈ దశలో.. రేగా కాంతారావుకు మద్దతుగా, బలరామ్ నాయక్‌కు వ్యతిరేంగా సమావేశానికి హాజరైన వారు నినాదాలు చేశారు. దీంతో, సమావేశంలో దాదాపు అరగంటపాటు తీవ్ర గందరగోళం నెలకొంది. నియోజకవర్గంలో ఎలాంటి బలం లేని సీపీఐకి సీటు కేటాయించడం అన్యాయమని పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. సీపీఐకి ఓటు వేసేదే లేదని తెగేసి చెప్పారు.



 నాకేం తెలీదు... అంతా అధిష్టానానిదే..

 పరిస్థితి సద్దుమణిగిన అనంతరం, ఎంపీ అభ్యర్థి బలరామ్ నాయక్ మాట్లాడుతూ.. ‘పొత్తుల్లో భాగంగానే పినపాక అసెంబ్లీ సీటును సీపీఐకి అధిష్టానం కేటాయించింది. నాకు తెలియకుండానే ఇది జరిగింది. పినపాక సీటు త్యాగం చేసిన రేగా కాంతారావు.. అధిష్టానం దృష్టిలో ఉన్నారు. తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఆయనకు తగిన పదవి ఇచ్చేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను’ అని అన్నారు.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్-సీపీఐ కూటమి అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. తనను ఎంపీగా గెలిపించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ ఇంతగా చెప్పినా..  కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top