ఇదేం గోలయ్య!

ఇదేం గోలయ్య! - Sakshi

చీపురుపల్లి/నెల్లిమర్ల/ విజయనగరం ఫూల్‌బాగ్/మున్సిపాలిటీ/టౌన్, న్యూస్‌లైన్: టీడీపీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పర్యటన ఆ పార్టీ శ్రేణుల్ని నిరాశ పరిచింది. కొండనాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందన్న చందంగా బాలయ్య పర్యటనతో ఓట్లు వస్తాయనుకుంటే అసలుకే మోసం వచ్చేటట్టు  ఉందన్న అభిప్రాయం కలిగించింది. కొరవడిన ప్రజాస్పందన, పసలేని ప్రసంగం, ఆకట్టుకోని హావభావాలు వెరసీ టీడీపీ నేతల అంచనాలను తలకిందలు చేసింది. జనాల్లేక రోడ్‌షో వెలవెలబోయింది. బహిరంగ సభలు పేలవంగా జరిగాయి. బాలకృష్ణ రోడ్ షో మంగళవారం చీపురుపల్లి, గుర్ల, నెల్లిమర్ల మీదుగా విజయనగరం వరకు సాగింది. టీడీపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంత జన సమీకరణ చేసినా బాలకృష్ణ రోడ్‌షోకు స్పందన రాలేదు. నిర్దేశిత సమయానికి జనాల్లేకపోవడంతో చీపురుపల్లికి   మధ్యాహ్నం 3 గంటలకు రావల్సిన బాలకృష్ణ సాయంత్రం 5.30 గంటలకు వచ్చారు. ఇక బాలయ్య చేసిన ప్రసంగం కూడా అర్థం కాలేదు. మాటకీ... మాటకీ చాలా సమయం తీసుకోవడంతో కార్యకర్తలు విసుగెత్తిపోయారు. 

 

 ఏం మాట్లాడారో తెలియక అయోమయానికి లోనయ్యారు. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్‌షోకు ప్రజా స్పందన లేక బాలయ్య కాన్వాయ్ వేగంగా సాగిపోయింది. ఇక, నెల్లిమర్ల చేరుకున్న బాలయ్య అర్థం కాని ప్రసంగంతో అభిమానుల్ని బోరు కొట్టించారు. ఇక్కడ ప్రసంగిస్తూ తప్పుగా మాట్లాడారు. నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతవాసుల కోరిక మేరకు నెల్లిమర్లను నగర పంచాయతీగానే కొనసాగిస్తామని అన్నారు. నగర పంచాయతీగా ఉన్న నెల్లిమర్లను పంచాయతీగా ఉంచాలని కోరితే మళ్లీ నగర పంచాయతీగా ఉంచుతామని చెప్పడమేంటని స్థానికులు పెద్ద ఎత్తున గోల చేశారు. వెంటనే ఆయన పక్కనున్న ఎమ్మెల్యే అభ్యర్థి పతివాడ నారాయణస్వామినాయుడు కల్పించుకొని నెల్లిమర్ల, జరజాపుపేట వాసులకు నగర పంచాయతీ అంటే ఇష్టం లేదని, తిరిగి పంచాయతీలుగా మార్పుచేస్తామని చెప్పాలని సూచించారు.  దీంతో తమాయించుకున్న బాలకృష్ణ రెండు ప్రాంతాలను పంచాయతీలుగా కొనసాగిస్తామని తిరిగి సభలో హామీ ఇచ్చారు. 

 

 అలాగే తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఏమాత్రం అవగాహన లేకుండా టీడీపీ హయాంలో రెండు వందల కోట్ల రూపాయలతో ప్రారంభమెన ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం ఐదు వందల కోట్లకు పెరిగిందన్నారు. ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు సరికదా ప్రాజెక్టు వ్యయం రూ.250 కోట్లే లోపు ఉండడంతో అవగాహన లేక మాట్లాడారన్న గుసగుసలు విన్పించాయి. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు నానాటికి పెచ్చుమీరుతున్నాయని బాలకృష్ణ అన్నప్పుడు కూడా స్థానికుల నుంచి వ్యతిరేకత కనిపించింది. ఆ అక్రమ తవ్వకాలు చేసేవారంతా టీడీపీ వారేనని పలువురు చేతులూపారు. 

 

 విజయనగరం వచ్చేసరికి బాలకృష్ణ మరింత తడబడ్డారు. ఆలస్యంగా వచ్చిన బాలకృష్ణ 10 నిమిషాలు మాట్లాడి అందులో పదిసార్లు తడబడ్డారు.  ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయులు రాసిన ఆముక్తమాల్యద గ్రంథంలోని కవిత చదవడానికే చాలా సమయాన్ని తీసుకున్నారు.  బాలయ్య పర్యటనతో టీడీపీకి వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని ప్రజలు అనుకోవడం వినిపించింది.ఇప్పటికే విజయనగరం పట్టణంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సినీనటుడు నందమూరి బాలకృష్ణ పర్యటనపై భారీ ఆశలు పెట్టుకుంది. బాలయ్య వస్తే ఎంతోకొంత గాడిలో పడుతుందని భావించారు. కానీ ఆయన ప్రసంగం విని అసలు బాలయ్య ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్లారో తెలియకుండా పోయిందంటూ నిరాశ చెందారు.  

 

 విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ 

 సినీ నటుడు బాలకృష్ణ రోడ్ షోను హిట్  చేసేందుకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. రోడ్‌షోకు జనాలను తరలించేందుకు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేశారు. వాస్తవానికి పట్టణంలో కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి  పట్టణ ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో పరువును నిలబెట్టుకోవాలనే తాపత్రాయంతో ఆ పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కారు. సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో జనాభాకు డబ్బులు, మద్యం ఇచ్చి రప్పించుకున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బులు పంపిణీ చేశారు.  గ్రామాల నుంచి  బైక్‌లపై వచ్చే వారికి పెట్రోల్ కోసం మరికొంత  మొత్తం ఇవ్వగా..  తీసుకున్న డబ్బులతో వారు పక్కనే ఉన్న బార్‌లు వైపు పరుగులు తీశారు.  బాలయ్య రోడ్‌షో నిర్వహించే కోట జంక్షన్ సమీపంలో ఉన్న మరో బార్ వద్ద కూడా టీడీపీ కార్యకర్తల సందడి కనిపించింది.  ఓ వైపు బాలకృష్ణ ప్రసగింస్తుడగానే మరో వైపు మద్యం దుకాణాలకు క్యూకట్టారు.  పలువురు  పచ్చ జెండాలు ధరించిన కార్యకర్తలు ఏకంగా రోడ్లపైకి వచ్చి మద్యం సేవించారు.

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top