జగన్‌దే అధికారం: శ్రీకాకుళంలో బాలకృష్ణ

జగన్‌దే అధికారం: శ్రీకాకుళంలో బాలకృష్ణ - Sakshi


శ్రీకాకుళం, న్యూస్‌లైన్: తెరపై పేజీలకు పేజీలు డైలాగులు దంచే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో తడబడ్డారు. గుక్క తిప్పుకోకుండా డైలాగులు పేల్చే బాలయ్య జనం మధ్యలో మాటలు రాక నీళ్లు నమిలారు. చంద్రబాబుదే అధికారం అనబోయి.. జగన్‌దే అధికారం అనేసి..  తర్వాత నాలుక్కరుచుకొని సర్దుకున్నారు. ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం చేపట్టి తుస్సుమనిపించారు.



కీలకమైన ఎన్నికల సంగ్రామంలో అక్కరకు వస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలకృష్ణ ప్రచారం తుస్సుమనడంతో ఆ పార్టీ అభ్యర్థులు ఉసూరుమంటున్నారు. నరసన్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో సోమవారం బాలకృష్ణ నిర్వహించిన రోడ్డుషోలకు జనాదరణ కరువైంది. దీనికితోడు పేలవమైన ప్రసంగాలు, నాయకుల పేర్లే తెలియక బాలయ్య పలుమార్లు తడబడటం, ఆమదాలవలసలో సమైక్యవాదుల నిరసన వంటి ఘటనలతో బాలకృష్ణ ప్రచారం టీడీపీ నేతలకు నిరాశే మిగిల్చింది. ఎక్కడా జనాలు లేకపోవడంతో ముందుగా వాహనాన్ని పెట్టి బాలకృష్ణ వస్తున్నారంటూ ప్రచారం చేసినా స్పందన కరువైంది.

 

శ్రీకాకుళం సింహద్వారం వద్దకు బాలకృష్ణ చేరుకున్నప్పుడు అక్కడ దేశం నాయకులు, మీడియా ప్రతినిధులు తప్ప ప్రజలు లేరు. అక్కడి నుంచి నరసన్నపేటకు వెళ్లి రోడ్‌షో, పోలాకిలో సభ నిర్వహించినా జనం లేక అది వెలవెలబోయింది. మబగాం, పోలాకిలలో పర్యటించిన తరువాత ఉర్లాం వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం బాలయ్య ఆమదాలవలస చేరుకున్నారు. ఆ సమయానికి అక్కడ జనం లేకపోవడంతో కొద్దిసేపు బాలకృష్ణను ఓ ఇంట్లో ఉంచి అప్పటికప్పుడు జనసమీకరణ చేశారు. ఆమదాలవలస నుంచి సింగుపురం, శ్రీకూర్మం వెళ్లారు. అప్పటికే చీకటి పడడంతో దేశం నాయకులు బతిమలాడినా జనం బాలకృష్ణ పర్యటనలో పాల్గొనేందుకు సుముఖత చూపలేదు.

 

పేర్లు తెలియక పాట్లు

స్థానిక నేతల పేర్లు తెలియక బాలకృష్ణ పలుమార్లు ఇబ్బందిపడటంతో పక్కనున్న వారు చెప్పాల్సి వచ్చింది. పోలాకిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ధర్మాన సోదరులు అనలేక ‘వారే సోదరులు...వారే సోదరులు’.. అంటుండగా పక్కనున్న వారు ధర్మాన సోదరులు అని అందించారు. అలాగే చంద్రబాబుదే అధికారం అనబోయి.. జగన్‌దే అధికారం అనేసి.. ఆ తర్వాత నాలుక్కరుచుకొని సర్దుకున్నారు.



ఆమదాలవలసలో ఇటీవల మా పార్టీలో చేరిన.. అంటూ ఆగిపోయారు. వెనుకనున్న నాయకులు మాధురి అని అందించాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ ప్రసంగం విని ఆయన పక్కనున్న దేశం నాయకులే నవ్వు ఆపుకోలేకపోయారు. ఒక సభలో మత్స్యకారులను ‘అదేదదీ...అదేదదీ’.. అంటూ ఎస్సీల్లో కలిపేస్తాం అనడంతో అందరూ గొల్లున నవ్వారు. జాతీయ ఉపాధి హామీ పథకం అని కూడా తెలియని బాలకృష్ణ జాతీయ హామీ పథకం అన్నారు.

 

విమర్శ.. ప్రతి విమర్శ

ధర్మాన తన ఇంటికి ఉపాధిహామీ పథకం ద్వారా రోడ్డు వేయించుకున్నారని బాలకృష్ణ అన్నప్పుడు సభలో నుంచి ప్రతి విమర్శ విన్పించింది. తెలుగుదేశం హయాంలో కింజరాపు ఎర్రన్నాయుడు కూడా నిమ్మాడలోని తన ఇంటి వరకు సిమెంట్ రోడ్డు వేయించుకున్నారని, శ్రీకాకుళంలో ఎంపీ కార్యాలయం నిర్మించినప్పుడు ఎక్కడా లేని విధంగా అత్యాధునికమైన వెడల్పాటి రోడ్లను తన ఇంటి చుట్టూ వేయించుకున్నారని సభికుల్లో ఎవరో అనడంతో దేశం కార్యకర్తలు బిత్తరపోయారు.



ఆమదాలవలస సభలో తెలుగుజాతి ఔన్నత్యం గురించి ప్రస్తావించగా కొందరు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర విభజన సమయంలో ఎందుకు తొడ ఎందుకు కొట్టలేదని నిలదీశారు. అప్పుడెందుకు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. అప్పుడు తెలుగు పౌరుషం ఎందుకు గుర్తు రాలేదా అని నేరుగా ప్రశ్నించినప్పుడు బాలకృష్ణ నుంచి మౌనమే సమాధానమైంది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top