‘అనంత’ సంపద చిలక్కొట్టుడు?

‘అనంత’ సంపద చిలక్కొట్టుడు?


అనంత పద్మనాభస్వామి అసలు నగలను దొంగిలించి నకిలీలను ఉంచినట్లు అనుమానం

సుప్రీంకు అమికస్ క్యూరీ నివేదిక

కాగ్ ఆడిటింగ్‌కు సిఫార్సు

 


 తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగలో ఉన్న లక్ష కోట్లకుపైగా విలువైన సంపద చిలక్కొట్టుడుకు గురవుతోందా? దీని వెనక ‘ఉన్నత వ్యక్తుల’ చేతివాటం ఉందా? ఆలయ నిర్వహణ, సంపద పరిరక్షణపై నివేదిక సమర్పించాలంటూ సుప్రీంకోర్టు నియమించిన మాజీ సొలిసిటర్ జనరల్, అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియం శుక్రవారం సమర్పించిన నివేదిక ఈ అనుమానాలనే రేకెత్తిస్తోంది. ఆలయ నిర్వహణ, సంపద పరిరక్షణలో తీవ్ర లోపాలను గుర్తించినట్లు సుబ్రమణియన్ తన సమగ్ర నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు. గతంలో నేలమాళిగలోని సంపద మదింపు సమయంలో కల్లారా-బీ అనే గదిని తెరవనివ్వకుండా ట్రస్టీలు అడ్డుకున్నప్పటికీ దాన్ని కొనేళ్ల కిందట తెరిచినట్లుగా ప్రత్యక్ష సాక్షుల ఆధారాలు ఉన్నాయని వివరించారు.



నేలమాళిగలోని సంపదను ఉన్నత స్థాయి వ్యక్తులు వ్యవస్థీకృతంగా వెలికితీసే అవకాశం కూడా ఉందన్నారు. ఈ వ్యవహారంపై చాలా ఉదాహరణలను చూపారు. బంగారు పూతపూసే యంత్రం ఇటీవల ఆలయం ఆవరణలో లభించిందని పేర్కొన్నారు. దీంతో అసలైన బంగారు నగలను దొంగిలించి, వాటి స్థానంలో న కిలీ నగలను ఉంచి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ సంపదపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాజీ డెరైక్టర్ వినోద్ రాయ్ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో ఆడిటింగ్ నిర్వహించాలని సిఫార్సు చేశారు. అలాగే ఆలయ రోజువారీ వ్యవహారాల్లో ఆలయ ట్రస్టీగా ఉన్న ట్రావెన్‌కోర్ రాచ కుటుంబ పెద్ద జోక్యాన్ని నివారించాలని కోరారు.



 నా మాటే రుజువైంది: అచ్యుతానందన్



 ఆలయ పరిరక్షణలో లోపాలు ఉన్నట్లు అమికస్ క్యూరీ పేర్కొన్న నేపథ్యంలో మాజీ సీఎం, సీపీఎం నేత వి.ఎస్. అచ్యుతానందన్ స్పందించారు. ఆలయ సంపదను దొంగిలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా యూడీఎఫ్ ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందన్న తన వాదనే నిజమైనదన్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top