అంటీముట్టనట్టే


 సాక్షి ప్రతినిధి, ఏలూరు : పొత్తులో భాగంగా కలసి పోటీ చేస్తున్నా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో టీడీపీ-బీజేపీ నేతలు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు చాలావరకూ ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి చాలా ప్రాంతాల్లో క్యాడర్ లేకపోవడం, టీడీపీ శ్రేణులు వారితో కలవకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. గంగరాజు టీడీపీ అభ్యర్థుల్ని కలవడానికి వెళ్లినా అది మొక్కుబడిగానే సాగుతోంది. దీంతో గంగరాజు వర్గం తన కుటుంబానికున్న పరిచయాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీంతోపాటు తన కంపెనీలు, కాలేజీల్లో పనిచేసే విద్యార్థులు, ఉద్యోగులను రంగంలోకి దింపి వారితో పని చేయించుకుంటున్నట్లు తెలిసింది. పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు తమకు తాముగానే సమావేశాలు, ప్రచారం నిర్వహించడం చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థితో కలసి తిరిగేందుకు వారు పెద్దగా ఇష్టపడటం లేదు. బీజేపీ అభ్యర్థిగా గంగరాజును ఎంపిక చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

 

 ఆ పార్టీ నేతల్లో చాలామంది ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. రఘురామకృష్ణంరాజు అయితే తమకు బాగుం టుందని బహిరంగంగానే ప్రచారం చేశా రు. ఆఖరి నిమిషంలో అయినా రఘురామకృష్ణంరాజుకే సీటు ఖరారవుతుందని భావించిన వారంతా ఇప్పుడు గంగరాజు వెంట తిరగడానికి మొహం చాటేస్తున్నారు. బీజేపీ సీటు రఘురామకృష్ణంరాజుకా, గంగరాజుకా అనే సస్పెన్స్ నడిచినప్పుడు టీడీపీ నేతలు రఘు వైపు నిలిచి సవాళ్లు, విమర్శలు, ఆరోపణలు సైతం గుప్పించారు. గంగరాజు వర్గం కూడా రఘు వర్గంపై విమర్శలు చేసింది. అయితే ఎంత లాబీయింగ్ నడిపినా రఘురాజుకు మొండిచేయే మిగిలి న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు గంగరాజును కలుపుకోవడానికి వెనుకాడుతున్నారు. గంగరాజు వర్గం కూడా పైకి టీడీపీ నేతలను కలుపుకోవాలని ప్రయత్నిస్తూనే అంతర్గతంగా సొంత బృందాలను రంగంలోకి దించి నియోజకవర్గాల్లో తిప్పుతోంది. ఇది ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులు, క్యాడర్‌కు ఇబ్బందిగా మారింది. తమతో కలిసి పనిచేయాల్సిన వారు సంబంధం లేనట్టుగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే బీజేపీ-టీడీపీ మధ్య దూరం బాగా పెరిగిపోయింది.

 

 సీటుపై ఆందోళన

 ఎంపీ అభ్యర్థి తమ పార్టీకి చెందిన వ్యక్తి కాకపోవడం.. ఆయనతో సరైన సంబంధాలు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి బాగా మైనస్‌గా మారింది. పొత్తులో భాగంగా నరసాపురం సీటును వదిలేసి అన్నివిధాలుగా నష్టపోయామనే భావన తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంక రవీంద్రనాథ్ అన్ని నియోజకవర్గాల్లో కలియతిరుగుతూ దూసుకెళుతున్న తరుణంలో తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థి బాగా మైనస్ అవడం ఆయనతో కలిసి పనిచేసే వాతావరణం లేకపోవడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో నరసాపురం ఎంపీ స్థానంపై ఆశ వదులుకోవాల్సిందేనన్న ఆందోళన తెలుగుదేశం నేతల్లో వ్యక్తమవుతోంది. 

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top