494 నామినేషన్లు


 కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 494 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నాటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటలకే నామినేషన్ల సమయం ముగిసినా కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం వరకు స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాత్రి ఏడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం చర్చనీయాంశమైంది. అయితే వీరంతా మూడు గంటల్లోపే వచ్చారని, టోకెన్లు ఇచ్చి అందరి నుంచి నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.

 

 పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు 393 మంది 494 నామినేషన్లను దాఖలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు 51 మంది అభ్యర్థులు 76 నామినేషన్లు అందజేశారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 342 మంది అభ్యర్థులు 418 నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా చివరి రోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో పాటు జై సమైక్యాంధ్ర అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు అసెంబ్లీ నియోజకవర్గాలకు 219 మంది, పార్లమెంట్ నియోజకవర్గాలకు 18 మంది నామినేషన్లు వేశారు. 2009 ఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 శాతం నామినేషన్లు ఎక్కువ దాఖలయ్యాయి. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి రెబల్ బెడద తప్పలేదు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ టీడీపీ తరఫున కర్నూలు ఎంపీ టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో ఒక సెట్ తెలుగుదేశం పార్టీ తరఫున, మరో సెట్ స్వతంత్య్ర అభ్యర్థిగా, ఇంకో సెట్ సమాజ్‌వాది పార్టీ తరఫున నామినేషన్లు వేయడం గమనార్హం. పాణ్యం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థికి రెబల్ బెడద పొంచి ఉంది. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లబ్బి వెంకటస్వామిదీ ఇదే పరిస్థితి.

 

 అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ మధ్యే ముఖాముఖి పోటీ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాలకు పోటీ చేసినా ప్రభావం అంతంతమాత్రమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో పార్టీలు ఎక్కువ కావడంతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడంతో సంఖ్య విపరీతంగా పెరిగింది. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 29 నామినేషన్లు దాఖలు కాగా కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి 22 మంది నామినేషన్లు వేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే అత్యధికంగా కర్నూలు స్థానానికి 45 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

 

 చివరి రోజునే 28 మంది నామినేషన్లు వేయడం విశేషం. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి 35 మంది నామినేషన్లు వేశారు. 12న కేవలం ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేశారు. 15న 15 మంది, 16న 53 మంది, 17న 85 మంది, నామినేషన్లు వేయగా, చివరి రోజు 237 మంది నామినేషన్లు వేయడం విశేషం. చివరి రోజున కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బీటీ నాయుడు ఊరేగింపుగా వచ్చి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు సోమవారం పరిశీలించనున్నారు. ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో నామినేషన్ల స్క్రుటీని జరగనుంది.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top