చేవెళ్ల లోక్‌సభ పరిధిలో మూడోవంతు ఓట్లు ‘శేరిలింగంపల్లి’లోనే


సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి’.. ఇది పెద్దలు చెప్పే సామెత. ఇదే మాటను జపిస్తున్నారు ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థులు. కుంభస్థలం లాంటి ప్రాంతాన్ని జయిస్తే విజయం తథ్యమని భావిస్తున్నారు వారు. ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని మొత్తం ఓట్లలో దాదాపు మూడో వంతు ఓటర్లున్న ఆ అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి కన్ను. లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 21,84,777 మంది ఓటర్లుండగా అందులో 5,91,259 మంది శేరిలింగంపల్లి  అసెంబ్లీ పరిధిలోని వారే. అభ్యర్థుల జయాపజయాలను శాసించే అంతటి కీలక శాసనసభా స్థానంలో ఆధిక్యం సాధించేందుకు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మొగ్గు తమకేనంటూ ఎవరికి వారు ఆశలు పెంచుకుంటున్నారు. శేరిలింగంపల్లిలో అధిక ఓటు షేరుసాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.



 భిన్న సంస్కృతి.. జీవన వైవిధ్యం

 శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం అటు భౌగోళికంగా ఇటు సామాజికంగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న నియోజకవర్గం. రాష్ట్రంలోని.. ఆ మాటకొస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఎంతో ఆధునికమైన జీవన శైలిని పాటించేవారు ఒకవైపు.. అంతకు రెండింతలు దుర్భర స్థితిలో మురికివాడల జీవనం మరోవైపు. కోట్ల రూపాయల వాణిజ్యం నిర్వహించే బిజినెస్ మ్యాన్‌లు ఒకవైపు, లక్షల రూపాయల ఉద్యోగాలు నిర్వహించే నిపుణులు మరోవైపు. నిత్యం కూలీ పనులతో కడుపు నింపుకొనే వర్గం మరోవైపు. నియోజకవర్గంలోని ఓటర్లలో అధిక శాతం మంది స్థానికేతరులే.



 సీమాంధ్ర, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారి సంఖ్య అధికం. ఇంతటి వైరుధ్యం కలిగిన ఓటర్లను ఆకర్శించాలంటే నాయకులు కూడా అంతే వైవిధ్యంగా వ్యవహరించాల్సి వస్తోంది. అన్ని వర్గాల ప్రజలకు వారి వారి అవసరాలను బట్టి అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. తమ విజయానికి ఎంతో కీలకమైన ఈ స్థానంలో ఆధిక్యం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు వారి వారి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.



 ఎవరి అంచనాలు వారివి

 చేవెళ్ల పార్లమెంటు బరిలో దిగిన అన్ని పార్టీల అభ్యర్థులు ప్రస్తుతం శేరిలింగంపల్లిపైనే ఆశలు పెంచుకుంటున్నారు. ఇక్కడ మెజార్టీ తమదంటే తమదంటూ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న పార్టీలు ఎక్కడ ఎన్ని ఓట్లు పడినా కలిసొచ్చినట్టేనని భావిస్తుంటే.. మరికొన్ని పార్టీలు ఈ స్థానంలో ఆధిక్యంపైనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని విశ్వసిస్తున్నారు. శేరిలింగంపల్లి ఆధిక్యంపై అన్ని పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం నియోజకవర్గ ఓటర్లు ఎలా స్పందిస్తారోనన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, టీఆర్‌ఎస్, టీడీపీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నందున అన్ని పార్టీల అభ్యర్థులు శేరిలింగంపల్లిపై దృష్టి కేంద్రీకరించారు.



 కాంగ్రెస్ ఓటు బ్యాంకు ప్రధానంగా గ్రామాల్లోనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ నగర ప్రాంతంలో కూడా పార్టీకి పట్టుంది. శేరిలింగంపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీయే కావడం వారికి కలిసొచ్చే అంశం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ ఓటు బ్యాంకు ఎంత వరకు స్థిరంగా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. అయితే పార్టీ మాత్రం తమకు నియోజకవర్గ ప్రజలు తిరిగి పట్టం కడతారనే గట్టి నమ్మకంతో ఉంది. ఇక వైఎస్సార్ సీపీ కూడా సీమాంధ్ర వలస ఓటర్లపై ప్రధానంగా దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ సంక్షేమ పథకాలు, న గరంలో పార్టీ ఉన్నత ఆశయాలను ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నేతలు  విజయంపై ధీమాతో ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం ఈ సారైనా శేరిలింగంపల్లిలో విజయం సాధించాలని భావిస్తోంది.



చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి పెద్దగా పట్టులేనందున శేరిలింగంపల్లిలో మెజార్టీ సాధించి విజయ తీరం చేరాలని టీడీపీ భావిస్తోంది. ఇక టీఆర్‌ఎస్‌కు మాత్రం ఈ ప్రాంతంపై పెద్దగా ఆశలు లేవనే చెప్పాలి. తెలంగాణ వాదం బలహీనంగా ఉన్న ఈ ప్రాంతంలో మెజార్టీ సాధించేది ఒట్టిమాటైనప్పటికీ గతం కంటే ఎక్కువ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. చివరికి శేరిలింగంపల్లిలో అధిక ‘షేరు’ ఎవరికి దక్కుతుందో తెలుసుకోవాలంటే ఎన్నికల అనంతరం వెలువడే ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top