‘ఆతిథ్యం’లో వైవిధ్యం.. డాక్టర్ వైఎస్‌ఆర్ నిథమ్

‘ఆతిథ్యం’లో వైవిధ్యం.. డాక్టర్ వైఎస్‌ఆర్ నిథమ్


దేశంలో ప్రతి ఏటా సుస్థిరమైన అభివృద్ధి బాటలో పయనిస్తున్న రంగం.. టూరిజం అండ్ హాస్పిటాలిటీ. భారత్‌లోని అద్భుతమైన చారిత్రక కట్టడాలు, ఆహ్లాదకరమైన, సుందరమైన ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇదే సమయంలో కెరీర్ పరంగానూ యువతకు చక్కటి మార్గం చూపుతోంది. పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి నిపుణుల అవసరం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో హాస్పిటాలిటీ రంగంలో నిష్ణాతులను తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటై నాణ్యమైన విద్యను అందించడంలో మంచి గుర్తింపు పొందుతున్న డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌పై ఇన్‌స్టిట్యూట్ వాచ్..

 

దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవతో 2004లో ప్రభుత్వ సంస్థగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ ఏర్పాటైంది. అనతి కాలంలోనే ఆతిథ్య రంగంలో నిపుణులను తీర్చిదిద్దడంలో దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్.. ఆతిథ్య రంగంలోని ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌లకు అందించే ‘ఉయ్ స్కూల్ ఇన్నోవేషన్ అవార్డ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ అవార్డులను కూడా సొంతం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఇన్‌స్టిట్యూట్.. డిప్లొమా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు హాస్పిటాలిటీ, టూరిజం, అనుబంధ విభాగాల్లో పలు కోర్సులు అందిస్తూ అన్ని స్థాయిల విద్యార్థులకు కెరీర్ అవకాశాలు కల్పిస్తోంది. అంతేకాకుండా హోటల్ మేనేజ్‌మెంట్‌లో.. టూరిజం, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ కోర్సులను అందిస్తున్న సంస్థగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఫలితంగా ఒక కోర్సులో చేరిన విద్యార్థికి మొత్తం మూడు రంగాల అవసరాలపై శిక్షణ లభిస్తుంది.

 

 కోర్సులివే: ప్రస్తుతం డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ ఆరు నెలల వ్యవధి గల స్వల్ప కాలిక కోర్సుల నుంచి ఎంబీఏ వరకు పలు కోర్సులు అందిస్తోంది.  అవి..- ఎంబీఏ(హాస్పిటాలిటీ); ఎంబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ); పీజీడీఎం(టూరిజం); పీజీ డిప్లొమా ఇన్ హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్‌మెంట్; బీబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ);  బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్); వీటిలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత అర్హత. ఎంబీఏ, ఇతర పీజీ కోర్సులకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత అర్హత. పీజీడీఎం(టూరిజం); ఎంబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ) కోర్సులకు క్యాట్/ మ్యాట్/ సీమ్యాట్/ ఐసెట్ వంటి మేనేజ్‌మెంట్ ఎంట్రెన్స్ పరీక్షల్లోనూ ర్యాంకులు తప్పనిసరి. బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈలో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

 

 స్వయం ఉపాధికి.. ఊతమిచ్చే షార్ట్‌టర్మ్ కోర్సులు: డాక్టర్ వైఎస్‌ఆర్ నిథమ్ పూర్తి స్థాయి ప్రొఫెషనల్ కోర్సులతోపాటు హోటల్, హాస్పిటాలిటీ అనుబంధ విభాగాల్లో స్వయం ఉపాధికి ఊతమిచ్చేలా మూడు నెలలు, ఆరు నెలల వ్యవధిలో పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది. వీటిలో రూరల్ టూరిజం; ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ, ఆర్ట్ అప్రిసియేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఆయుర్వేద పంచకర్మ థెరపీ కోర్సులు ప్రధానమైనవి. ఇప్పటికే హోటల్స్, రెస్టారెంట్లలో పనిచేస్తున్న వారికి మరింత వృత్తి నైపుణ్యాలు అందించే విధంగా కుకింగ్ (ఎనిమిది వారాలు); రెస్టారెంట్ సర్వీసెస్ (ఆరు వారాలు)లో ఉచిత శిక్షణ కూడా అందిస్తోంది. వెబ్‌సైట్: www.nithm.ac.in

 

 లెర్న్ బై డూయింగ్ ‘ లేబొరేటరీ: హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలదే పెద్దపీట. అందుకే ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యమిచ్చేలా కరిక్యులం రూపకల్పన జరిగింది. ముఖ్యంగా లెర్న్ బై డూయింగ్ విధానంతో ప్రతి విద్యార్థికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ కలిగేలా చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో ఆహార పదార్థాల తయారీలో ఎంతో ముఖ్యమైన ఎలక్ట్రిక్ ఒవెన్స్, మైక్రోవేవ్ ఒవెన్స్; ప్లానెటరీ కేక్ మిక్సర్స్; మల్టీ పర్పస్ గ్యాస్ కుకర్స్ తదితర అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. వీటితోపాటు ఆరు వేల పుస్తకాలు; జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న దాదాపు వంద జర్నల్స్, మేగజైన్లతో కూడిన లైబ్రరీ సదుపాయం విద్యార్థులు ఈ రంగంలో థియరీ నాలెడ్జ్‌ను మరింత పెంచుకునేందుకు, తాజా పరిస్థితులపై అవగాహన పొందేందుకు దోహదం చేస్తోంది. ఇన్‌స్టిట్యూట్‌లోని డిజిటల్ లైబ్రరీ ద్వారా విద్యార్థులకు అపారమైన నైపుణ్యం సొంతమవుతోంది. వేల సంఖ్యలో ఈ-లెర్నింగ్ రిసోర్సెస్, వర్చువల్ క్లాస్ రూంల సదుపాయం అందుబాటులో ఉంది.

 

 క్షేత్ర నైపుణ్యాల దిశగా ఒప్పందాలు: విద్యార్థుల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించే దిశగా ఇండియన్ అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, జేఎన్‌టీయూ-హైదరాబాద్ వంటి సంస్థలతో డాక్టర్ వైఎస్‌ఆర్ నిథమ్ ఒప్పందాలు చేసుకుంది.

 

 ప్లేస్‌మెంట్ ష్యూర్: లాంగ్ టర్‌‌మ, షార్ట్ టర్మ్.. ఏ కోర్సు ఉత్తీర్ణులకైనా ప్లేస్‌మెంట్ కల్పించే విధంగా ఈ రంగంలోని పలు సంస్థలతో ఇన్‌స్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. ప్రతి ఏటా బీబీఏ, ఎంబీఏలో మూడో సెమిస్టర్ పూర్తయిన వెంటనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ఏర్పాట్లు జరుగుతాయి. నిథమ్ విద్యార్థులు ఏపీటీడీసీ, జీఎంఆర్, రాడిసన్, గ్రీన్‌పార్క్, థామస్‌కుక్, కాక్స్ అండ్ కింగ్స్, మేక్ మై ట్రిప్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు ప్రారంభంలో నెలకు రూ.25 వేలు, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులు రూ.30 వేల వేతనం పొందుతున్నారు.

 

 ‘‘డాక్టర్ వైఎస్‌ఆర్  నిథమ్... కోర్సులు, శిక్షణ విషయంలో నిరంతరం నిత్య నూతనంగా వ్యవహరిస్తోంది. ఈ రంగంలోని తాజా అవసరాలకు అనుగుణంగా శిక్షణలో మార్పులూచేర్పులూ చేస్తూ విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పిస్తోంది. ఫలితంగా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దోహా ఎయిర్‌పోర్ట్, ఖతార్ ఎయిర్‌వేస్ తదితర సంస్థలు కూడా ఈ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవలి కాలంలో విద్యార్థులకు కూడా హాస్పిటాలిటీ కోర్సుల పట్ల అవగాహన పెరిగింది. వారు డాక్టర్ వైఎస్‌ఆర్ నిథమ్‌ను తమ తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు’’    

- ప్రొఫెసర్ ఎస్.సుధాకుమార్

 ప్రిన్సిపాల్, స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ,

 డాక్టర్ వైఎస్‌ఆర్ నిథమ్

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top