కెరీర్‌ను మార్చుకుంటున్నారా?

కెరీర్‌ను మార్చుకుంటున్నారా?


జాబ్ స్కిల్స్: మీకు ప్రస్తుతం చేస్తున్న పని నచ్చడం లేదా? దాని పట్ల అయిష్టత, అనాసక్తి ఏర్పడ్డాయా? మీకున్న నైపుణ్యాలకు అది తగిన రంగం కాదని భావిస్తున్నారా? మార్పును కోరుకుంటున్నారా? మీ తెలివితేటలకు, అభిరుచికి, ఆసక్తికి తగిన కెరీర్‌ను ఎంచుకోవాలని యోచిస్తున్నారా? అయితే ఈ విషయంలో అడుగు ముందుకేసే ముందు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. కెరీర్‌ను మార్చుకోవడం అంత తేలిక కాదు. ఇందులో ఎన్నో సాధకబాధకాలు ఉంటాయి. అన్నింటినీ భరించేందుకు సిద్ధపడేవారే కెరీర్‌ను మార్చుకోవచ్చు.  

 

 మీ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు సమర్థించకపోవచ్చు. పరిచయం లేని కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నారంటే ఎవరికైనా భయాందోళనలు, సందేహాలు ఉండడం సహజమే. ముందుగా కుటుంబ సభ్యులను ఒప్పించాలి. అన్నింటికంటే ముఖ్యం మీపై మీకు పూర్తి విశ్వాసం ఉండాలి. ఇటీవలి కాలంలో బహుళ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు కెరీర్‌ను మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్త రంగంలో తమ ప్రతిభను ప్రదర్శించి, అందరి మెప్పు పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న పనిపట్ల బోర్ ఫీలవుతున్నవారు కూడా కెరీర్ మార్పుపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సక్సెస్ అవుతుండగా.. మరికొందరు బోల్తాపడుతున్నారు. కెరీర్ మార్పు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కొత్త రంగంలో విజయవంతంగా దూసుకుపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

 

 నిజాయతీగా సమీక్షించుకోండి

 కెరీర్‌ను మార్చుకోవాలనుకునేవారు మొదట చేయాల్సిన పని.. ప్రశాంతంగా కూర్చొని నిజాయతీగా తమను తాము సమీక్షించుకోవడం. ఇలాంటి పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలి. తమను తాము అనేక కోణాల్లో ప్రశ్నించుకోవాలి. కొత్త కెరీర్ దీర్ఘకాలంలో తనకు ఏ విధంగా లాభదాయకమో బేరీజు వేసుకోవాలి. ఆర్థికంగా, మానసికంగా సంతృప్తి కలుగుతుందా? లేదా? నిజంగా తనలో నైపుణ్యాలు ఉన్నాయా? అనేది తేల్చుకోవాలి. సానుకూలమైన సమాధానాలు వస్తేనే అడుగు ముందుకేయాలి. కొందరు క్షణికావేశంతో, భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకొని, నష్టపోతుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి.

 

 ఆర్థిక పరిస్థితి బాగుందా?

 సంపాదన, పొదుపు అనేవి ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. ప్రస్తుతం వస్తున్న వేతనం కంటే కొత్త కెరీర్‌లో ఎక్కువ వేతనం లభిస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. కొత్త రంగంలో అడుగుపెడుతు న్నారంటే అర్థం.. అక్కడ కింది స్థాయి నుంచి మీ జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రారంభంలో వేతనాలు తక్కువే ఉంటాయి. ఇప్పటి స్థిరమైన జీవితం ఇలాగే కొనసాగాలంటే కనీసం ఆరు నెలల వేతనం మీ దగ్గరుండాలి. లేకపోతే మాత్రం బతుకు పోరాటం తప్పదు. ఒకవైపు చేతిలో డబ్బు లేకపోవడం, మరోవైపు కొత్త ఉద్యోగం/వృత్తి.. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

 

 సపోర్ట్ నెట్‌వర్క్ అవసరమే

 మంచి సలహాలు, సూచనలు ఇచ్చే నెట్‌వర్క్ ఉండాలి. కెరీర్ ఛేంజర్స్‌కు ఈ అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. కెరీర్ మారాలనే నిర్ణయాన్ని మీరొక్కరే తీసుకోకండి. సపోర్ట్ నెట్‌వర్క్‌ను ఏర్పరచుకోండి. నలుగురు అనుభవజ్ఞుల సలహాలను తీసుకోండి. మీరు ఎంచుకున్న రంగంలోని నిపుణులను సంప్రదించండి. ఆ రంగంలోని అంతర్గత సమాచారాన్ని, అందులోని లాభనష్టాలను వారు మీకు తెలియజేస్తారు. దాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకోవచ్చు.

 

 విద్య నేర్చుకోవాల్సిందే

 అప్పటిదాకా పరిచయం లేని కొత్త రంగంలోకి వెళ్తున్నారంటే దానికి సంబంధించిన చదువు, తగిన శిక్షణ ఉంటేనే సక్సెస్ అవుతారు.  కాబట్టి దానిపై స్వల్పకాలిక కోర్సులతో అవగాహన పెంచుకోవాలి. శిక్షణ పొందాలి. ఆ రంగానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలి. ప్రస్తుత పోటీప్రపంచంలో ఏ రంగంలోనైనా రాణించాలంటే చదువు, శిక్షణ, నైపుణ్యాలు అవసరమే.

 

 మార్పు... ఒక్కరోజులో అసాధ్యం

 కొత్త కెరీర్‌లోకి దూకగానే అద్భుతాలు జరగాలని కోరుకోవొద్దు. మార్పు అనేది ఒక్క రోజులోనే జరగడం అసంభవం. అక్కడ నిలదొక్కుకోవడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. ఒక్కోసారి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. ఇంతటి సుదీర్ఘ కాలం ఎదురుచూడాలంటే నిరాశ కలగొచ్చు. కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఓపిక, సహనంతో నిరీక్షించాలి. కొత్త కెరీర్‌లో మీ సత్తా చూపండి.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top