గృహస్థుకు శుభాలనిచ్చే.. వాస్తుశాస్త్రం

గృహస్థుకు శుభాలనిచ్చే.. వాస్తుశాస్త్రం


 అప్‌కమింగ్ కెరీర్

 

మానవుడి జీవితంపై పంచ భూతాల, ప్రకృతి శక్తుల ప్రభావం కచ్చితంగా ఉంటుందని భారతీయులు ప్రాచీన కాలం నుంచి నమ్ముతున్నారు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి. నివాస గృహం అనేది ప్రకృతి శక్తులను స్వేచ్ఛగా ఆహ్వానించేదిగా ఉండాలి. అప్పుడు ఆ ఇంటి యజమాని జీవితం ఒడిదుడుకుల్లేకుండా సాగిపోతుంది. పంచభూతాల గమనం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం అందరికీ తెలియదు. దానికొక శాస్త్రం ఉంది. అదే వాస్తు శాస్త్రం. గృహ నిర్మాణానికి సలహాలు, ఇంటిలో మార్పులు చేర్పులపై సూచనలు ఇచ్చేవారే వాస్తు నిపుణులు. దీనిపై ప్రజల్లో అవగాహన అధికమవుతుండడంతో డిమాండ్ ఉన్న కెరీర్... వాస్తుశాస్త్రం.

 

పెట్టుబడి లేకుండానే కెరీర్ ప్రారంభం

వ్యక్తిగత నివాస గృహాలతోపాటు కార్పొరేట్ కార్యాలయాలను కూడా వాస్తుప్రకారం నిర్మిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు వాస్తు ప్లానర్లను తప్పనిసరిగా నియమించుకుంటు న్నాయి. ప్రజలు తమ ఇంటిలో వాస్తు దోషాలను సరిచేసుకొనేందుకు నిపుణులను సంప్రదిస్తున్నారు. ఇక పత్రికలు, టీవీ ఛానళ్ల వంటి ప్రసార మాధ్య మాలు వాస్తును విస్తృతంగా ప్రచారం చేస్తుండడం తో ప్రజల్లో  దీనిపై అవగాహన పెరుగుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలని అందరూ భావిస్తున్నారు. వీటన్నింటి వల్ల వాస్తు ప్లానర్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.

 

దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదు. కచ్చితమైన పనివేళలు లేకపోవడం దీనిలో ఉన్న వెసులుబాటు. నచ్చిన సమయాల్లోనే పనిచేసుకోవచ్చు. ఎలాంటి పెట్టుబడి లేకుండానే కెరీర్ ప్రారంభించొచ్చు. వాస్తు నిపుణులుగా మంచి పేరు, తద్వారా మరిన్ని అవకాశాలు తెచ్చుకోవాలంటే ఈ శాస్త్రంపై గట్టి పట్టు, తగిన అనుభవం ఉండాలి. మిడిమిడి జ్ఞానంతో ముందుకెళితే కెరీర్‌లో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. రకరకాల మనస్తత్వాలు ఉన్న క్లయింట్లతో వ్యవహరించేందుకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వృత్తిలో భాగంగా దూర ప్రాంతాలకు కూడా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంసిద్ధంగా ఉండాలి. వాస్తు శాస్త్రంలో పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి.

 

అర్హతలు: వాస్తు శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ప్రత్యేకంగా విద్యార్హతలు అవసరం లేదు. దీనిపై నమ్మకం, ఆసక్తి, అభిరుచి ఉన్నవారెవరైనా ఇందులోకి ప్రవేశించొచ్చు. ఈ శాస్త్రంపై ప్రొఫెషనల్ కోర్సు పూర్తిచేస్తే మంచి అవకాశాలుంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పలు కోర్సులు ఉన్నాయి. కోర్సు చదివిన తర్వాత పేరు ప్రఖ్యాతలున్న వాస్తు గురువు వద్ద కొన్నాళ్లు శిష్యరికం చేసి, అనుభవం సంపాదించాలి. తర్వాత సొంతంగా పనిచేసుకోవచ్చు.

 

వేతనాలు: వాస్తు నిపుణులు ప్రారంభంలో నెలకు రూ.20 వేలు సంపాదించుకోవచ్చు. తర్వాత అనుభవం, నైపుణ్యాలను పెంచుకుంటే నెలకు దాదాపు రూ.60 వేల ఆదాయం లభిస్తుంది. డిమాండ్‌ను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. లక్షల్లో ఆర్జించే సీనియర్ వాస్తు నిపుణులు ఎందరో ఉన్నారు.

 

వాస్తుశాస్త్రాన్ని ఆఫర్ చేస్తున్న సంస్థలు:  

ఉస్మానియా విశ్వవిద్యాలయం

వెబ్‌సైట్: www.osmania.ac.in

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

వెబ్‌సైట్: http://teluguuniversity.ac.in

 

ఆర్జన, విజ్ఞాన సముపార్జన

‘‘భారతదేశంలో ఆచరించే ప్రతి అంశంలో మానవాళి శ్రేయస్సు దాగుంది. వాస్తుశాస్త్రం కూడా దానిలో భాగమే. నివాస యోగ్యమైన గృహం, వ్యాపార, పరిశ్రమలకు అనువైన వాతావరణం ఎలా ఉండాలనే  నిర్దిష్టమైన అంశాలే ఇందులో ఉంటాయి. జ్యోతిష్యం, వాస్తు రెండూ ఒకదానికొకటి విడదీయలేనివి. అందుకే ఆ రెండింటికీ కలిపి కోర్సులు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాస్తు, ఇంటీరియర్ కోర్సు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నాం.

 

వాస్తుపై అపోహలను పోగొట్టి, విజ్ఙానం పెంపొందించేందుకు వాస్తు విజ్ఙాన సంస్థ ఏడాదికి రెండుసార్లు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాస్తు శాస్త్రం అనేది ఎప్పటికీ వన్నెతగ్గని కెరీర్ అనే చెప్పొచ్చు.ఈ కోర్సులను పూర్తిచేసిన వారు కన్సల్టెన్సీలు, మీడియా, ఆన్‌లైన్ మార్గాల ద్వారా అవకాశాలను పొందొచ్చు. వాస్తు ప్లానర్లకు సంఘంలో గౌరవం, హోదా పెరిగాయి. ప్రస్తుతం వాస్తు నిపుణుడి స్థాయిని బట్టి నెలకు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదన గ్యారంటీ’’



 -ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, వైదిక్ ఆస్ట్రో విభాగం, ఓయూ

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top