రాజ్యసభ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?


భారత రాజ్యాంగంలోని అయిదో భాగంలో 79 నుంచి 123 వరకు ఉన్న అధికరణలు పార్లమెంట్ నిర్మాణం, విధులు, అధికారాలు తదితర అంశాల గురించి వివరిస్తాయి. కేంద్రంలో ద్విసభ విధానాన్ని 1919 చట్టం ద్వారా మనదేశంలో ప్రవేశపెట్టారు. అధికరణ 79 ప్రకారం పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ. దీని ప్రకారం రాష్ట్రపతి కూడా పార్లమెంట్‌లో అంతర్భాగమే. ఆయన ప్రమేయం లేకుండా ఏ బిల్లూ శాసనం కాదు.

 

పార్లమెంట్ నిర్మాణం

పార్లమెంట్‌లో రెండు సభలు ఉంటాయి. అవి: 1. లోక్‌సభ, 2. రాజ్యసభ.



లోక్‌సభ

లోక్‌సభను ‘దిగువ సభ’, ‘ప్రజా ప్రాతినిధ్య సభ’ అని కూడా పేర్కొంటారు. దీని నిర్మాణం గురించి అధికరణం 81 తెలియజేస్తుంది. ఇందులో గరిష్ట సభ్యుల సంఖ్య 552. వీరిలో 550 మంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. ఇద్దరిని నిబంధన 331 ప్రకారం ఆంగ్లో ఇండియన్ వర్గం నుంచి రాష్ట్రపతి నియమిస్తారు. ఈ 550 మందిలో రాష్ట్రాల నుంచి 530, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 20 మందికి మించకూడదు.



లోక్‌సభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 545. వీరిలో 543 మందిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది ఎన్నికవుతున్నారు. ప్రారంభంలో లోక్‌సభ సభ్యుల సంఖ్య 525 మంది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545కు పెంచారు. 2026 వరకూ ఈ సంఖ్యను పెంచకూడదని 2001లో 84వ సవరణ ద్వారా నిర్ణయించారు.



లోక్‌సభకు ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువగా (80 మంది) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ట్ర - 48, పశ్చిమ బెంగాల్ - 42, బీహార్ - 40, తమిళనాడు - 39, మధ్యప్రదేశ్ - 29, కర్ణాటక - 28 ఉన్నాయి. అతి తక్కువగా సిక్కిం-1, మిజోరాం-1, నాగాలాండ్-1, గోవా-2, అరుణాచల్ ప్రదేశ్-2, మణిపూర్-2, మేఘాలయ-2, త్రిపుర-2 రాష్ట్రాల నుంచి ఎన్నికవుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో.. అత్యధికంగా ఢిల్లీ నుంచి ఏడుగురు మిగిలిన వాటి నుంచి ఒక్కొక్కరూ ప్రాతినిధ్యం  వహిస్తున్నారు.



అధికరణం 330 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక సీట్లు కేటాయించారు. ప్రస్తుతం ఎస్సీలకు 84, ఎస్టీలకు 47 స్థానాలను కేటాయించారు. ఈ రిజర్వేషన్లు పదేళ్ల వరకూ కొనసాగుతాయి. ఇప్పటివరకూ వీటిని ఆరు పర్యాయాలు పొడిగించారు.



 1. 1960లో 8వ రాజ్యాంగ సవరణ ద్వారా  1970 వరకు.

 2. 1969లో 23వ రాజ్యాంగ సవరణ ద్వారా 1980 వరకు

 3. 1980లో 45వ రాజ్యాంగ సవరణ ద్వారా 1990 వరకు

 4. 1989లో 62వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 వరకు

 5. 1999లో 79వ రాజ్యాంగ సవరణ ద్వారా 2010 వరకు

 6. 2009లో 95వ రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగించారు.



ఎస్సీ స్థానాలు అధికంగా ఉత్తరప్రదేశ్‌లో 17, ఎస్టీ స్థానాలు ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 6 ఉన్నాయి.

 ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ-2014 చట్టం ద్వారా అంతకుముందున్న 42 స్థానాలను ఆంధ్రప్రదేశ్‌కు 25, తెలంగాణకు 17గా విభజించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1; తెలంగాణాలో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 ప్రత్యేక స్థానాలను కేటాయించారు.

 

లోక్‌సభకు ఇప్పటివరకూ పదహారు సార్లు (1952, 1957, 1962, 1967, 1971, 1977, 1980, 1984, 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009, 2014) ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ఆరుసార్లు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1971లో మొదటిసారి మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. 1971లో ఏర్పడిన అయిదో లోక్‌సభ అధిక కాలం కొనసాగింది. 1998లో ఏర్పడిన 12వ లోక్‌సభ తక్కువ కాలం కొనసాగింది.



మొదటి లోక్‌సభకు ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్య 22 మంది. ప్రస్తుత 16వ సభలో 65 మంది మహిళలు ఉన్నారు.



మొదటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు కాగా, 16వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 81.45 కోట్లు.

 

కాలపరిమితి: నిబంధన 83 ప్రకారం లోక్‌సభ సాధారణ కాల పరిమితి ఐదేళ్లు. అత్యవసర సమయంలో ఏడాదిపాటు పొడిగించుకోవచ్చు. నిబంధన 85 ప్రకారం రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ముందుగానే దీన్ని రద్దు చేయవచ్చు. 1976లో 42వ సవరణ ద్వారా ఐదేళ్ల నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగించి, 1978లో 44వ సవరణ ద్వారా ఆరేళ్ల నుంచి ఐదు సంవత్సరాలకు తగ్గించారు.

 

రాజ్యసభ

రాజ్యసభను ‘ఎగువ సభ’, ‘రాష్ట్రాల ప్రాతినిధ్య సభ’ అని పేర్కొంటారు. ఇది శాశ్వత సభ. ఇది 1952లో ఏర్పడింది. దీని నిర్మాణం గురించి నిబంధన 80 తెలియజేస్తుంది. గరిష్ట సభ్యుల సంఖ్య 250 మంది. వీరిలో 238 మంది.. ఎమ్మెల్యేలతో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నికవుతారు. నిబంధన 80(3) ప్రకారం.. సాహిత్యం, కళలు, క్రీడలు, సాంఘిక సేవలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర రంగాల నుంచి 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి నియమిస్తారు.



రాజ్యసభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 245 మంది. వీరిలో 233 మంది ఎన్నికవుతున్నారు. మిగిలిన 12 మంది రాష్ట్రపతితో నియామకమవుతున్నారు. ఈ 233 మందిలో రాష్ట్రాల నుంచి 229 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నలుగురు (ఢిల్లీ-3, పాండిచ్చేరి-1) ఎన్నికవుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 31 మంది ఎన్నికవుతుండగా.. మహారాష్ర్ట- 19, తమిళనాడు- 18, పశ్చిమ బెంగాల్-16, బీహార్-16 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అతితక్కువగా సిక్కిం, గోవా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌ల నుంచి (ఒక్కొక్కరు) ఎన్నికవుతున్నారు.



రాజ్యసభ మొత్తం సభ్యుల్లో ప్రతి రెండేళ్లకు 1/3వ వంతు మంది పదవీ విరమణ చేయగా.. మరో 1/3వ వంతు మందిని ఎన్నుకుంటారు. అంటే సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు. పదవీ రీత్యా ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షులుగా కొనసాగుతారు. సభ్యుల నుంచి ఒకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. మొదటి ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి. ప్రస్తుతం  పి.జె. కురియన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

 

పార్లమెంట్ సమావేశాలు

నిబంధన 85 ప్రకారం పార్లమెంట్ ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి రెండుసార్లు సమావేశం కావాలి. ప్రస్తుతం ఆనవాయితీగా సంవత్సరానికి మూడుసార్లు సమావేశాలను నిర్వహిస్తున్నారు. గరిష్ట సమావేశాలపై పరిమితి లేదు. అవసరాన్ని బట్టి ఎన్ని రోజులైనా నిర్వహించుకోవచ్చు. కనీసం వంద రోజులు నిర్వహించాలని పౌర సంఘాలు డిమాండ్  చేస్తున్నాయి. మొదటి సమావేశం 1952 మే 13న జి.వి. మౌళాంకర్ అధ్యక్షతన జరిగింది.

 పార్లమెంట్ - కోరం: కోరం అంటే సభ సమావేశాల నిర్వహణకు హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య. నిబంధన 100 ప్రకారం పార్లమెంట్ కోరం 1/10వ వంతు మంది (అధ్యక్షులతో కలిపి)గా నిర్ణయించారు.



ఎంపీ పదవికి కావాల్సిన అర్హతలు:

 

నిబంధన 84 పార్లమెంట్ సభ్యుడిగా నిలిచే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతల గురించి వివరిస్తోంది. అవి:

 1.     భారతీయ పౌరుడై ఉండాలి.

 2.     లోక్‌సభకు 25 ఏళ్లు, రాజ్యసభకు 30 ఏళ్లు నిండి ఉండాలి.

 3.     ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండరాదు.

 4.     మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.

 5.    ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకొని ఉండాలి.



పోటీ చేసే అభ్యర్థి రూ.25,000 నామినేషన్ ఫీజుగా చెల్లించాలి. ఓడిపోయిన అభ్యర్థికి ఈ డిపాజిట్ తిరిగి రావాలంటే పోలై, చెల్లిన ఓట్లలో 1/6వ వంతు రావాలి.

 

స్పీకర్

ప్రకరణ 93 ప్రకారం లోక్‌సభకు స్పీకర్ ఉంటాడు. ఇతడే లోక్‌సభ అధ్యక్షుడిగా కొనసాగుతాడు. లోక్‌సభ సభ్యులు వారిలో ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌తో పదవీ స్వీకార ప్రమాణం చేయించేది రాష్ర్టపతి లేదా ఆయన నియమించే ప్రొటెమ్ స్పీకర్. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించాలి.



స్పీకర్ కాలపరిమితి ఐదేళ్లు. లోక్‌సభ ముందుగానే రద్దయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. నూతన లోక్‌సభ ఏర్పడేంత వరకూ పదవిలో కొనసాగుతాడు. తిరిగి ఎన్నిసార్లయినా పదవి చేపట్టవచ్చు. ఎక్కువకాలం బలరాం జక్కర్, తక్కువ కాలం బలీరాం భగత్ స్పీకర్ పదవిలో కొనసాగారు.



 స్పీకర్ జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. దీన్ని సంఘటితనిధి నుంచి చెల్లిస్తారు. ప్రస్తుతం స్పీకర్‌కు రూ. 1,25,000; డిప్యూటీ స్పీకర్‌కు రూ. 90,000 చెల్లిస్తున్నారు.



స్పీకర్‌ను తొలగించే విధానం: స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే నిబంధన 94 ప్రకారం లోక్‌సభ అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తుంది. ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు 50 మంది సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందు నోటీస్ జారీ చేయాలి. అనంతరం చర్చ జరుగుతుంది. తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. దీంట్లో సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే స్పీకర్ పదవి కోల్పోతాడు. ఈ తీర్మానం చర్చకు వచ్చినప్పుడు సభాధ్యక్షుడిగా డిప్యూటీ స్పీకర్ కొనసాగుతాడు.



మొదటి స్పీకర్ జి.వి. మౌళాంకర్, తొలి డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్. ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదొరై.

 

స్పీకర్ విధులు, అధికారాలు:

లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను నిర్వహిస్తాడు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించే సభ్యులపై చర్య తీసుకుంటాడు.

సభ్యుల హాజరు పట్టికను పరిశీలించి ఎవరైనా సభ్యుడు 60 రోజులు గైర్హాజరైతే సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు.పార్లమెంట్, రాష్ట్రపతి, మంత్రి మండలికి మధ్య సంధానకర్తగా పనిచేస్తాడు.

ఏదైనా బిల్లును స్వభావం ఆధారంగా ఆర్థికమైందా, సాధారణమైందా అని నిర్ణయిస్తాడు.

పార్లమెంట్ ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు.

సభలో బిల్లులు, తీర్మానాలపై ఓటింగ్ నిర్వహిస్తాడు. ఓట్లు సమానంగా వచ్చినప్పుడు నిర్ణయాత్మక ఓటు హక్కును వినియోగించుకుంటాడు.

కొన్ని పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షుడిగా కొనసాగుతాడు.

కామన్‌వెల్త్ స్పీకర్‌‌స ఫోరమ్‌లో సభ్యుడిగా కొనసాగుతాడు.

 

 

 1.     రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు?

     1) కె. రహమాన్‌ఖాన్    2) కరియా ముండా

     3) షంషేర్ కె. షరీఫ్    4) పి.జె. కురియన్

 2.    కిందివాటిలో దేన్ని ‘పార్లమెంట్‌ల మాతృక’గా పేర్కొంటారు?

     1) భారత పార్లమెంట్ 2) బ్రిటన్ పార్లమెంట్

     3) యూఎస్ కాంగ్రెస్

     4) స్విస్ ఫెడరల్ అసెంబ్లీ

 3.     భారత రాజ్యాంగంలోని ఎన్నో అధికరణలో వార్షిక ఆర్థిక ప్రకటన అనే పదాన్ని ప్రస్తావించారు?

     1) 116    2) 265    3) 112    4) 266

 4.    రాజ్యసభ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

     1) ఉపరాష్ట్ట్రపతి    2) లోక్‌సభ స్పీకర్

     3) రాజ్యసభ సభ్యులు ఎన్నుకున్న వ్యక్తి

     4) మెజార్టీ పార్టీ నాయకుడు

 5.    భారత రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధుల సంఖ్య ఎంతకు మించకూడదు?

     1) 10    2) 25    3) 15    4) 20

 సమాధానాలు:

     1) 4    2) 2    3) 3    4) 1    5) 4

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top