ఫ్యాషన్ చదువులకు ఆహ్వానం!

ఫ్యాషన్ చదువులకు ఆహ్వానం! - Sakshi


నేడు వస్త్ర ఎగుమతుల్లో భారత్ వాయు వేగంతో దూసుకెళ్తోంది.. జర్మనీ, ఇటలీలను  వెనక్కునెట్టి రెండో స్థానాన్ని చేజిక్కించుకుంది. దుస్తుల ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) నివేదిక ప్రకారం 2013లో వస్త్ర ఎగుమతుల విలువ దాదాపు  రూ.2.44 లక్షల కోట్లు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే పట్టుచీర, గళ్ల చొక్కా,  కళ్ల జోడు.. ఇలా ప్రతి ఒక్కదాంట్లోనూ ఫ్యాషన్ ఉట్టిపడాలని కోరుకునే ఆధునిక

 ప్రపంచం మరోవైపు! ఈ నేపథ్యంలో ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ రంగంలో సృజనాత్మక  కెరీర్‌ను కోరుకునే వారికోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) నుంచి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. దీనిపై స్పెషల్ ఫోకస్..

 

 దేశ వ్యాప్తంగా 15 క్యాంపస్‌లు

 కేంద్ర టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిఫ్ట్‌కు దేశవ్యాప్తంగా 15 క్యాంపస్‌లున్నాయి. అవి.. న్యూఢిల్లీ, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, గాంధీనగర్ (గుజరాత్), హైదరాబాద్, జోధ్‌పూర్, కోల్‌కతా, కన్నూర్ (కేరళ), ముంబై, పాట్నా, రాయ్‌బరేలి, షిల్లాంగ్, కాంగ్రా (హిమాచల్‌ప్రదేశ్). ఇవి డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ విభాగాల్లో ఫ్యాషన్ విద్యను అందిస్తున్నాయి.

 

 కోర్సులు

     బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులు (నాలుగేళ్లు): ఫ్యాషన్ డిజైన్ (420 సీట్లు), లెదర్ డిజైన్ (120), యాక్సెసరీ డిజైన్ (420), టెక్స్‌టైల్ డిజైన్ (390), నిట్‌వేర్ డిజైన్ (210), ఫ్యాషన్ కమ్యూనికేషన్ (360). బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విభాగంలోని అపెరల్ ప్రొడక్షన్‌లో 330 సీట్లున్నాయి.

     మాస్టర్ కోర్సులు (రెండేళ్లు): మాస్టర్ ఆఫ్ డిజైన్ (90 సీట్లు), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ (420), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (100).

     అర్హత: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులకు 10+2 ఉత్తీర్ణత. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లతో 10+2 ఉత్తీర్ణత. ఆయా విభాగాల్లో బ్యాచిలర్ కోర్సులు పూర్తిచేసిన వారు మాస్టర్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ కోర్సులకు గరిష్ట వయోపరిమితి 2014, అక్టోబర్ 1 నాటికి 23 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌పీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. మాస్టర్ కోర్సులకు వయో పరిమితి లేదు.

 

 ప్రవేశ పరీక్ష

     బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులో ప్రవేశాలకు క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ (CAT), జనరల్ ఎబిలిటీ టెస్ట్ (GAT) రాయాలి. వీటిలో అర్హత సాధించిన వారు సిచ్యువేషన్ టెస్ట్‌కు హాజరుకావాలి. మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుకు సిట్యుయేషన్ టెస్ట్‌కు బదులు జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.

     బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి GATరాయాలి. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సులకు GATతర్వాత జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.

     పరీక్షలో నెగిటివ్ మార్కులు లేవు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు పేపర్ బేస్డ్ టెస్ట్‌తో పాటు కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ అందుబాటులో ఉంది. నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

 

  ప్రిపరేషన్: క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్‌లో పరిశీలనా శక్తిని; డిజైనింగ్, డ్రాయింగ్ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల వీటిపై పట్టు సాధించాలి. కూరగాయల దుకాణం చిత్రాన్ని గీయండి? లోగోను రూపొందించండి? వంటి ప్రశ్నలు ఎదురవుతాయి.

 

     జనరల్ ఎబిలిటీ టెస్ట్: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్ పరీక్షల్లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, అనలిటికల్ ఎబిలిటీ, జీకే, కరెంట్‌అఫైర్స్‌లపై ప్రశ్నలుంటాయి.

     బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలకు క్వాంటిటేటివ్ ఎబిలిటీ; కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్; అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ; జీకే, కరెంట్ అఫైర్స్; కేస్‌స్టడీ ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు గణితం ప్రాథమిక అంశాలు, వొకాబ్యులరీ, వర్తమాన వ్యవహారాలపై అవగాహన పెంపొందించుకోవాలి.

 

 ముఖ్య తేదీలు

     ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:

 నవంబర్ 10, 2014- జనవరి 10, 2015.

     పరీక్ష తేదీ: ఫిబ్రవరి 8/ఫిబ్రవరి 22, 2015.

     సిచ్యువేషన్ టెస్ట్/జీడీ/ఇంటర్వ్యూ:ఏప్రిల్-మే, 2015

     వెబ్‌సైట్: www.nift.ac.in

 

 ఆధునిక ప్రపంచంలో సృజనాత్మకత ఉన్నవారికి ఫ్యాషన్ రంగంలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ అంటే కేవలం వస్త్రాలకు సంబంధించింది మాత్రమే కాదు. వివిధ ఉత్పత్తులకు కొత్త సొబగులు అద్ది, వినియోగదారులు ఆకర్షితులయ్యేలా చేయడంలోనూ ఫ్యాషన్ డిజైనర్ల పాత్ర కీలకం.  ఆభరణాలు, హస్తకళా వస్తువులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దే విధంగా ఫ్యాషన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. డ్రాయింగ్ నైపుణ్యాలు మెండుగా ఉన్నవారు కెరీర్‌లో త్వరగా ఎదుగుతారు. గతంతో పోల్చితే ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలో ఉద్యోగావకావకాశాలు బాగా పెరిగాయి. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు సమానంగా కెరీర్ అవకాశాలు అందుతున్నాయి. ఫ్యాషన్ కోర్సుల్లో గ్రామీణ ప్రాంతాల వారూ రాణిస్తున్నారు.     

 - డాక్టర్ ఎన్.జె.రాజారామ్, డెరైక్టర్, నిఫ్ట్, హైదరాబాద్.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top