లింక్డ్ ఇన్‌లో జాబ్ సెర్చ్ చేయండిలా!

లింక్డ్ ఇన్‌లో జాబ్ సెర్చ్ చేయండిలా! - Sakshi


లింక్డ్ ఇన్.. నేటి యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో కంప్యూటర్లలో, స్మార్ట్‌ఫోన్లలో చోటు సంపాదించుకుంటోంది. ఉద్యోగాల వేట విషయంలో ఈ సైట్ ఎంతో ఉపయోగకరంగా మారింది. కంపెనీలకు, అభ్యర్థులకు మధ్య వారధిగా పనిచేస్తోంది.

 

 కంపెనీల్లో కొలువుల సమాచారాన్ని అభ్యర్థులకు, వారి వివరాలను కంపెనీలకు లింక్డ్ ఇన్ వేగంగా చేరవేస్తోంది. ఇందులో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. లింక్డ్ ఇన్ ఇప్పుడు ప్రభావంతమైన, ఆధునిక జాబ్ సెర్చ్ టూల్‌గా మారింది. వివిధ రంగాల ప్రొఫెషనల్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ సైట్ ప్రత్యేకత. ప్రపంచంలోని చాలా కంపెనీల సమాచారాన్ని, వాటిలో కొలువుల వివరాలను క్షణాల్లో కళ్లముందుంచుతోంది. జాబ్ హంట్ విషయంలో లింక్డ్ ఇన్ సహాయం పొందితే సులువుగా విజయం సాధించొచ్చు. ఇష్టమైన కొలువును సొంతం చేసుకోవచ్చు.

 

 ఇన్ఫర్మేషన్ అప్‌లోడ్

 మీ అకడమిక్, ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్, మీ అర్హతలు, నైపుణ్యాలను లింక్డ్ ఇన్ పేజీలో అప్‌లోడ్ చేయండి. సైట్ సెర్చ్ ఇంజన్‌లో ఈ సమాచారమంతా నమోదవుతుంది. రిక్రూటర్లు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం వెతికేటప్పుడు మీ వివరాలను పరిశీలిస్తారు. తగిన అభ్యర్థి అని భావిస్తే మిమ్మల్ని ఎంచుకుంటారు.

 

 రికమండేషన్లు

 ప్రొఫైల్ పూర్తి కావాలంటే రికమండేషన్లు అవసరం. ఈ లింక్డ్ ఇన్‌లో ఈ ఫీచర్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోండి. మీ పాత యాజమాన్యం లేదా సహోద్యోగులు, ప్రొఫెసర్లు మీ పేరును సిఫార్సు చేసేలా చూసుకోండి. రికమండేషన్‌లను చేరిస్తే జాబ్ మార్కెట్‌లో మీ ప్రొఫైల్‌కు విలువ పెరుగుతుంది.

 

 అప్‌డేట్స్

  సైట్‌లో మీ ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. మీ అర్హతలు, అనుభవాలు పెరిగితే వాటిని చేర్చండి. రిక్రూటర్లు మీ నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతారు. వారి సంస్థల్లో కొలువులు ఖాళీగా ఉన్నప్పుడు మీకు సమాచారం చేరవేస్తారు. ఒక కంపెనీలో మీ అర్హతలకు తగిన కొలువులుంటే మీకు వివరాలు తెలుస్తాయి. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఒక రెజ్యూమెగా కూడా పనిచేస్తుంది.

 

 గ్రూప్‌ల్లో చేరండి

 మీ రంగానికి, మీ కెరీర్ లక్ష్యాలకు, అభిరుచులకు సంబంధించిన గ్రూప్‌లను లింక్డ్ ఇన్‌లో సెర్చ్ చేయండి. వాటిలో సభ్యులుగా చేరండి. ఆయా గ్రూప్‌ల డిస్కషన్ బోర్డుల్లో పాల్గొనండి. దీంతో మీ నెట్‌వర్క్ విస్తరిస్తుంది. మీ రంగంలో వస్తున్న మార్పులు, తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. కొత్త ధోరణులపై అవగాహన పెరుగుతుంది. కొలువు సంపాదించడానికి, కెరీర్‌లో ఎదగడానికి ఇది తోడ్పడుతుంది.

 

 పీపుల్స్ ట్యాబ్

 లింక్డ్ ఇన్ సైట్‌లో పీపుల్స్ ట్యాబ్ విభాగంలో పరిశ్రమ ప్రముఖుల సమాచారం, మీ రంగానికి చెందిన కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ఉంటాయి. వారిని సంప్రదించి, మీ సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కంపెనీ ప్రొఫైల్స్ విభాగంలో ఉద్యోగుల కెరీర్ హిస్టరీ ఉంటుంది. అభ్యర్థుల నుంచి రిక్రూటర్లు ఏయే అంశాలను కోరుకుంటున్నారో దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూ సన్నద్ధతకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

 

 జాబ్ బోర్డు

 లింక్డ్ ఇన్ సొంతంగా జాబ్ బోర్డును నిర్వహిస్తోంది. ఇది ఒక జాబ్ పోర్టల్ లాగే పనిచేస్తుంది. రిక్రూటర్ల పేర్లతో సహా కొలువుల వివరాలు ఇందులో ఉంటాయి. రిక్రూటర్‌తో డెరైక్ట్ కమ్యూనికేషన్‌కు ఇది వీలు కల్పిస్తుంది.  

 

  ఎడ్యూ న్యూస్

 మ్యాట్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 25

 దేశవ్యాప్తంగా వివిధ  కళాశాలల్లో పీజీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్)- డిసెంబర్ పరీక్షకు నవంబర్ 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ విధానాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు, బ్యాచిలర్స్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మ్యాట్ రాయొచ్చు. పేపర్ బేస్డ్ పరీక్ష డిసెంబర్ 7న ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) డిసెంబర్ 13 నుంచి ప్రారంభమవుతుంది. అడ్మిట్ కార్డులను నవంబర్ 29 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) మ్యాట్‌ను నిర్వహిస్తారు.

 వెబ్‌సైట్: www.aima.in

 

 భవిష్య జ్యోతి ఉపకార వేతనాలు

 గుర్గావ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్‌ఐఐటీ) భవిష్య జ్యోతి స్కాలర్‌షిప్‌లను ఆఫర్ చేస్తోంది. ఎన్‌ఐఐటీ అందిస్తున్న అన్ని కోర్సులను అభ్యసిస్తున్నవారు ఈ ఉపకార వేతనం పొందడానికి అర్హులు. కోర్సులో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌లను అందజేస్తారు. ఎంపికైన వారికి రూ.60 వేల వరకు ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 వెబ్‌సైట్: www.niitcloudcampus.com/

 

 భారత విద్యార్థులకు

 ఆస్ట్రేలియా వర్సిటీ స్కాలర్‌షిప్

 ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వొలన్‌గాంగ్(యూఓడబ్ల్యూ) భారత విద్యార్థుల కోసం సర్ డాన్ బ్రాడ్‌మన్ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. 2014 సంవత్సరానికి గాను బ్రాడ్‌మన్ ఫౌండేషన్‌తో కలిసి ఈ ఉపకార వేతనాన్ని అందిస్తోంది. క్రికెట్‌ను ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఈ స్కాలర్‌షిప్‌ను ప్రతిఏటా భారత విద్యార్థులకు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వొలన్‌గాంగ్ వర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన భారతీయులకు వారి కోర్సు ఫీజులో 50 శాతం చెల్లిస్తారు.

 వివరాలకు వెబ్‌సైట్: www.uow.edu.au

 

 జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స

 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

     ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ

 అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభా గంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి.

     టెక్నీషియన్ ‘సి’

 అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.

 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 1

 వెబ్‌సైట్: www.bel-india.com

 నిమ్స్

 హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్) కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

  ఎంఎస్సీ (నర్సింగ్). సీట్ల సంఖ్య: 21,  

 అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉండాలి.

     మాస్టర్ ఆఫ్ ఫిజియో థెరపీ

 సీట్ల సంఖ్య: 15

 అర్హతలు: ఫిజియో థెరపీలో డిగ్రీ ఉండాలి.

     పోస్ట్ గ్రాడ్యుయేట్ పారా మెడికల్ డిప్లొమా కోర్సెస్. సీట్ల సంఖ్య: 57

 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 30

 వెబ్‌సైట్: www.nims.edu.in

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

     పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్

     పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(డ్యూయల్ కంట్రీ)

     ఎంబీఏ  పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(ఎగ్జిక్యూటివ్)

     పార్ట్‌టైం పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్

 అర్హతలు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. క్యాట్/గ్జాట్/జీమ్యాట్‌లో అర్హత సాధించాలి.

 దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 24

 వెబ్‌సైట్: http://imt.edu/

 

 కాంపిటీటివ్ కౌన్సెలింగ్

 కానిస్టేబుల్ రాత పరీక్షలో ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాధాన్యతను తెలపండి? ఎలా ప్రిపేరవ్వాలి?

     - బద్ధం కన్నారెడ్డి, ఉప్పల్

 పరీక్షలో చరిత్ర నుంచి సుమారు 25 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి 4 నుంచి 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ అంశాలను పక్కాగా ప్రిపేరైతే సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. జైన, బౌద్ధమత సంబంధిత అంశాల నుంచే ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతారు.  కాబట్టి మహావీరుడు, గౌతమ బుద్ధుడు జన్మించిన, నిర్యాణం చెందిన ప్రదేశాలను గుర్తుంచుకోవాలి. అలాగే జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన ప్రధాన సూత్రాలను, గ్రంథాలను, నియమాలను అభ్యర్థులు ప్రత్యేక దృష్టితో చదవాలి.

 

 వీటిని పట్టిక రూపంలో సిద్ధం చేసుకుంటే గుర్తుంచుకోవడానికి సులువుగా ఉంటుంది. గౌతమ బుద్ధుడికి సంబంధించిన మహాభినిష్ర్కమణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరినిర్యాణం తదితర అంశాలు ఎక్కడ, ఎందుకు జరిగాయో తెలుసుకోవాలి. బౌద్ధమత అష్టాంగ మార్గాలు, జైన మత పంచవ్రతాలనూ సులభంగా గుర్తుంచుకోవడానికీ వాటిలోని మొదటి అక్షరాలతో ఒక పదాన్ని రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు బౌద్ధమత అష్టాంగ మార్గాలైన సరైన మాట(వాక్కు), జీవనం, ఆలోచన, ధ్యానం, పని(క్రియ), కష్టం(శ్రమ), నిర్ణయం, చూపు(దృష్టి) నుంచి ‘మాజీ ఆధ్యాపకుని చూపు’ అని ఒక సులభమైన వాక్యంగా తయారు చేసుకోవచ్చు.

 ఇన్‌పుట్స్: బొమ్మనబోయిన శ్రీనివాస్, సీనియర్ ఫ్యాకల్టీ, హన్మకొండ

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top