కొలువు వేటకు వీడియో బాసట!

కొలువు వేటకు వీడియో బాసట!


ఉద్యోగ ప్రయత్నం సఫలం కావాలంటే.. అర్హతలు, అనుభవం ఉండగానే సరిపోదు. వాటిని సరైన రీతిలో రిక్రూటర్ల దృష్టికి తీసుకెళ్లగలగాలి. కొలువుకు వందలు, వేలాది మంది అర్హులైన అభ్యర్థులు పోటీపడుతుంటారు. వారందరినీ దాటుకొని వెళ్లి ముం దంజలో నిలవాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఇటీవలి కాలంలో దరఖాస్తుల విషయంలో రెజ్యూమెలాగే వీడియో కూడా తప్పనిసరిగా మారుతోంది. ఆందుకే అభ్యర్థులు దీనిగురించి తెలుసుకోవాలి. కొలువు వేట ప్రారంభించినవారితోపాటు ప్రారంభించనివారు కూడా ఈ వీడియో ఇంటర్వ్యూలు, రెజ్యూమెల గురించి తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

 

 సమయం, డబ్బు ఆదా

 ఆధునిక కాలంలో హైరింగ్ మేనేజర్లు జాబ్ ఇంటర్వ్యూల కోసం వీడియోపైనే ఆధారపడుతున్నారు. దూర ప్రాంతాల్లోని అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. దీనివల్ల విలువైన సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. తమ కంపెనీల్లో జాబ్ ఇంటర్వ్యూలను వీడియో ద్వారానే కొనసాగిస్తున్నట్లు 63 శాతం హెచ్‌ఆర్ మేనేజర్లు చెప్పారు. వీడియో పాపులారిటీ నానాటికీ పెరుగుతోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ వినియోగిస్తున్నారు. ఈ విధానంలో రిక్రూటర్లు అభ్యర్థులను ఆన్‌లైన్‌లో ప్రశ్నిస్తారు. వీడియో ఇంటర్వ్యూయింగ్ టూల్స్ కూడా అమల్లో ఉన్నాయి. ఇందులో ముందే రికార్డు చేసిన ప్రశ్నలకు వరుసగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రిక్రూటర్లు కనిపించరు. అభ్యర్థులు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఫార్మాట్ ఏదైనప్పటికీ వీడియో ఇంటర్వ్యూలో నెగ్గాలంటే తగిన విధంగా ప్రిపేర్ కావాలి.

 

సాంకేతికాంశాలు

యూజర్ ఫ్రెండ్లీ వీడియో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్, వీడియో కెమెరాను ఆపరేట్ చేయగలిగితే చాలు.. వీడియో ఇంటర్వ్యూను ఎదుర్కోవచ్చు. సౌకర్యవంతమైన ఎక్విప్‌మెంట్‌ను ఎంచుకోవాలి. దాన్ని ముందే పరీక్షించి చూసుకోవాలి. ఏవైనా సమస్యలు తలెత్తితే సరిచేసుకోవాలి. సాంకేతికాంశాలు మీ ఉద్యోగావకాశాలను దెబ్బతీయకుండా చూసుకోవాలి. చక్కటి వెలుతురు, నిశ్శబ్ద వాతావరణం ఉన్నచోటును ఇంటర్వ్యూ కోసం ఎంచుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో పుస్తకాలు, వస్తువులు లేకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే.. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు రిక్రూటర్ల దృష్టిని అవి పక్కదారి పట్టిస్తాయి. కొన్ని దుస్తులు, రంగులు వీడియోలో ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి.

 

  మీరు తెల్ల దుస్తులు వేసుకొని, తెలుపురంగు గోడ ముందుకు కూర్చుంటే వీడియోలో అస్పష్టంగా కనిపిస్తారు. కాబట్టి సరిగ్గా కనిపించే రంగులను ఎంచుకోవాలి. అదేసమయంలో మీ వస్త్రధారణ పూర్తి ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఇంటర్వ్యూకు సంసిద్ధమయ్యే క్రమంలో స్నేహితులు, సహచరులతో కలిసి ముందే సాధన చేయడం మంచిది. దీంతో బెరుకు మాయమవుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వీడియోలో మిమ్మల్ని మీరు చిత్రీకరించుకొని చూసుకోండి. మాటతీరు, హావభావాల్లో మార్పులుచేర్పులు చేసుకోండి.

 

 బయోడేటా

 వీడియో అనేది ఇంటర్వ్యూలకే పరిమితం కాదు బయోడేటాకు కూడా ఉపయోగిస్తున్నారు. ఒకటి నుంచి మూడు నిమిషాల నిడివి ఉండే ఈ వీడియోలో అభ్యర్థులు తమ గురించి తాము చెప్పుకోవాలి. పరిచయం, విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం వంటివాటిని క్లుప్తంగా వివరించాలి. దరఖాస్తుతోపాటు ఈ వీడియోను సంస్థకు పంపించాలి. అంతేకాకుండా యూట్యూబ్, లింక్డ్‌ఇన్ వంటి సామాజిక అనుసంధాన వేదికల్లో పోస్టు చేయాలి. రిక్రూటర్లు వీటిని పరిశీలిస్తారు. తమకు కావాల్సిన అర్హతలున్న అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.

 

 కమ్యూనికేషన్స్

 హైరింగ్ మేనేజర్‌తో కమ్యూనికేషన్స్‌కు కూడా వీడియోను వినియోగించుకోవచ్చు. మౌఖిక పరీక్ష పూర్తయిన తర్వాత రిక్రూటర్స్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వీడియోను రూపొందించుకొని వారికి ఈ-మెయిల్ ద్వారా పంపించండి. దీనివల్ల వారికి మీపై సానుకూలమైన అభిప్రాయం కలుగుతుంది. వీడియో అనగానే అది ఎలా ఉన్నా ఫర్వాలేదు అనుకోవద్దు. నాణ్యమైన వీడియోతోనే ఆశించిన ఫలితం లభిస్తుంది.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top