టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

టెక్నాలజీని  అందిపుచ్చుకోవాలి


నేటి తరం విద్యార్థులు ముఖ్యంగా నాలుగు అంశాల్లో నైపుణ్యాలు సాధించాలి.అవి సింథసిస్(సమన్వయం), ఇంటర్నేషనలైజేషన్, సాఫ్ట్‌స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్.



‘ఇంజనీరింగ్, టెక్నాలజీ.. దశాబ్దాలుగా ఎవర్‌గ్రీన్ రంగాలు. నేటికీ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయి. అకడమిక్స్ పరంగానూ ఎంతో క్రేజ్ కలిగిన విభాగాలివి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో మేక్ ఇన్ ఇండియా.. అంతర్జాతీయంగా గ్లోబల్ దృక్పథం కారణంగా.. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో సమీప భవిష్యతలో మరింత డిమాండ్ ఏర్పడనుంది. ఆ మేరకు మానవ వనరుల అవసరం ఉంటుంది. విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు మహీంద్రా ఎకోల్ సెంట్రేల్ డెరైక్టర్ ప్రొఫెసర్ సంజయ్ జి.ధాండే. 12ఏళ్లు ఐఐటీ-కాన్పూర్ డెరైక్టర్‌గా పనిచేయడంతోపాటు ఐఐటీ-రాజస్థాన్ ఫౌండర్ డెరైక్టర్‌గా, ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహా మండలి సభ్యులుగా వ్యవహరించిన  ప్రొఫెసర్ సంజయ్ జి.ధాండేతో గెస్ట్‌కాలం..

 

జాతీయ స్థాయిలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలను పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్ నిపుణులకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియాతో రానున్న ఐదేళ్లలో ఉత్పత్తి రంగం మరింత వృద్ధి చెందనుంది. ఈ కార్యక్రమం సమర్థంగా అమలైతే ప్రస్తుతం జీడీపీలో 17 శాతంగా ఉన్న ఉత్పత్తి రంగం వాటా 25 శాతానికి పెరగనుంది. అంటే.. కొత్త ఉత్పత్తులు, పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. ఇది ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది.

 

ఇతరులతో సమన్వయంతో పనిచేయాలి: అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే.. నేటి తరం విద్యార్థులు ముఖ్యంగా నాలుగు అంశాల్లో నైపుణ్యాలు సాధించాలి. అవి సింథసిస్(సమన్వయం), ఇంటర్నేషనలైజేషన్, సాఫ్ట్‌స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. కారణం.. ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్పత్తి రంగంలో పలు విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇతరులతో సమన్వయంతో ముందుకు సాగడం చాలా అవసరం. అలాగే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు ఒక ఉత్పత్తికి సంబంధించి విశ్లేషించే నైపుణ్యాలు ఉంటే విధుల్లో సమర్థంగా రాణించగలుగుతారు. టీంలో పనిచేసేటప్పుడు కమ్యూనికేషన్, సాఫ్ట్‌స్కిల్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది.

 

కరిక్యులం.. ఆర్ అండ్ డీ: విద్యార్థులకు నైపుణ్యాలు అలవడాలంటే కరిక్యులంను పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించే నైపుణ్యాలను అందించేలా రూపొందించాలి. సమీప భవిష్యత్తులో సదరు రంగంలో రానున్న మార్పులు అంచనా వేసి ఆ మేరకు శిక్షణ ఇచ్చేలా కరిక్యులం రూపొందించాలి. అప్పుడే విద్యార్థులు అధునాతన పరిజ్ఞానంతో జాబ్ మార్కెట్‌లో రాణించగలరు. మన దేశంలో ఇటీవల కాలంలో ఇన్‌స్టిట్యూట్‌ల పరంగా ఆర్ అండ్ డీపై అవగాహన పెరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇన్‌స్టిట్యూట్‌లు ఆర్ అండ్ డీ దృక్పథంతోపాటు పరిశ్రమ వర్గాలు కోరుకునే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. గత కొన్నేళ్లుగా కార్పొరేట్ సంస్థలు సొంతంగా ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఆర్ అండ్ డీ, పరిశ్రమలకు అనువుగా రాణించడం కోసమే!

 

గ్లోబల్ దృక్పథం కావాలి: విద్యార్థులు లోకల్, ఇంటర్నేషనల్ అనే కోణంలో ఆలోచించడం మానేయాలి. పూర్తిగా ‘గ్లోబల్’ దృక్పథంతో నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. ఇప్పుడు కంపెనీల పరంగా లోకల్, ఇంటర్నేషనల్ అనే హద్దులు చెరిగిపోయాయి. పెద్ద కంపెనీలు అన్నీ వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎంఎన్‌సీలుగా పరిగణనలో ఉన్నాయి. ఎంఎన్‌సీలు అంటే మన దేశంలో ఉన్న విదేశీ సంస్థలుగానే భావిస్తాం. కానీ ఇతర దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మన దేశంలోని సంస్థలు కూడా ఎంఎన్‌సీలే. ఉదాహరణకు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు ఇతర దేశాల్లో సర్వీస్ డెలివరీ సెంటర్స్ ఉన్నాయి. మన దేశంలోని సంస్థలో పనిచేస్తున్నా, విదేశాల్లోని కంపెనీలో చేరినా.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పనిచేసేలా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాలి.

 

 ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యమివ్వాలి: ఇంజనీరింగ్‌కు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం.. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడం. ఉదాహరణకు ఇటీవల కాలంలో డిజిటల్ ఫ్యాబ్రికేషన్, 3-డి ప్రింటింగ్ వంటి వాటి ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే విద్యార్థులు తమ కోర్ సబ్జెక్ట్‌లకే పరిమితం కాకుండా.. సరికొత్త టెక్నాలజీలో నైపుణ్యాలు పొందేలా శిక్షణ తీసుకోవాలి. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో ఆవిష్కరణలకు కీలకమైన ప్రాథమిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడం విద్యార్థుల్లో సమస్యగా మారింది. ఇంజనీరింగ్ ఔత్సాహిక, ఇప్పటికే ఈ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ విషయాన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి.

 

 స్వీయ లెర్నింగ్‌తో..: మంచి కాలేజీలో చేరితేనే మెరుగైన నైపుణ్యాలు లభిస్తాయి అనే అపోహను వీడండి. కాలేజ్/ఇన్‌స్టిట్యూట్ స్థాయి ఏదైనా.. ఇంజనీరింగ్ వంటి కోర్సులో స్వీయ ఆసక్తితో, సొంతగా నేర్చుకోవడం ద్వారా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. తరగతి గదిలో ప్రొఫెసర్ ఒక అంశం చెబితే దానికి అనుసంధానంగా ఉన్న ఇతర అంశాలపై పరిజ్ఞానం పొందేందుకు విద్యార్థి సొంతగా కృషి చేయాలి. దాంతోపాటు ప్రొఫెసర్లు చేసే పరిశోధనల్లో పాల్గొనేలా వ్యవహరించాలి. ఒక బ్రాంచ్‌లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచ్‌లోని కోర్సులకే పరిమితం కాకుండా.. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో ముందుకు సాగాలి. అప్పుడే ఎలాంటి కాలేజీలో చేరినా.. భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు!!

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top