వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్


 అంతర్జాతీయం

 ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సదస్సు ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఉన్నత స్థాయి శాంతి పరిరక్షణ సదస్సు సెప్టెంబరు 29న న్యూయార్క్‌లో జరిగింది. ఈ సదస్సులో 50 దేశాల నేతలు పాల్గొన్నారు. సదస్సు అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఐరాస శాంతి పరిరక్షక ఆపరేషన్స్‌ను ఆధునికీకరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దళాలను పంపిస్తున్న దేశాలకు భద్రతామండలికి మధ్య సంప్రదింపులు పెరగాల్సిన అవసరాన్ని డిక్లరేషన్ పేర్కొంది. శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో భారత్ నుంచి 1.8 లక్షల మంది సైనికులు 49 కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారిలో 161 మంది మరణించారని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

 

 భారత్- అమెరికాల మధ్య రక్షణ ఒప్పందం

 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి సెప్టెంబరు 28న భారత్-అమెరికా మధ్య మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రక్షణ అవసరాల కోసం భారత్ రూ.19.86 వేల కోట్ల వ్యయంతో అమెరికా నుంచి 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్లను కొంటుంది.

 

 అవార్డులు

  వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

 వైద్య శాస్త్రంలో అద్భుత కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. ఐర్లాండ్‌కు చెందిన విలియం క్యాంబెల్, జపాన్‌కు చెందిన సతోషీ ఒమురా, చైనాకు చెందిన తు యూయూలు నోబెల్‌కు ఎంపికయ్యారు. బోదకాలు, రివర్ బ్లైండ్‌నెస్, మలేరియా వ్యాధులపై వీరు చేసిన పరిశోధనలకు అవార్డు లభించింది.ఏలిక పాములు.. ఇతర పరాన్న జీవుల వల్ల కలిగే బోదకాలు, రివర్ బ్లైండ్‌నెస్ వ్యాధులు.. వాటి చికిత్సలపై చేసిన పరిశోధనలకు క్యాంప్‌బెల్, ఒమురాలకు నోబెల్‌ను ప్రకటించారు. తు యూయూ మలేరియాపై చేసిన పరిశోధనతో పాటు ఇతర ఉష్ణమండల వ్యాధుల నివారణకు మందులు కనుగొన్నందుకు నోబెల్ లభించింది. భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్: భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. టకాకి కజితా (జపాన్), ఆర్థర్ బి మెక్‌డొనాల్డ్ (కెనడా)లు న్యూట్రినోలపై చేసిన పరిశోధనకు గానూ భౌతిక శాస్త్రంలో సంయుక్తంగా నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు.

 

 జాకొబ్ సిమెర్మన్‌కు శాస్త్ర రామానుజన్ ప్రైజ్

 2015 సంవత్సరానికి శాస్త్ర (ఎస్‌ఏఎస్‌టీఆర్‌ఏ) ప్రైజ్‌కు కెనడాలోని టొరొంటో విశ్వవిద్యాలయానికి చెందిన జాకొబ్ సిమెర్మన్ ఎన్నికయ్యారు. ఈ అవార్డును కుంభకోణం (తమిళనాడు)లోని శాస్త్ర విశ్వవిద్యాలయంలో జరిగే నంబర్ థియరీ అంతర్జాతీయ సదస్సులో బహూకరిస్తారు

 

 ముగ్గురికి రైట్ లైవ్లీహుడ్ అవార్డు

 స్వీడన్ మానవ హక్కుల అవార్డు రైట్ లైవ్లీ హుడ్‌కు ముగ్గురి పేర్లను స్టాక్‌హోమ్ జ్యూరీ ప్రకటించింది. ఇనూట్ జాతి గిరిజన జీవితాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు కృషి చేసిన కెనడాకు చెందిన షీలా వాట్-క్లౌటీర్, ఉగాండాకు చెందిన కాషా జాక్విలైన్ నబాగెసెరా, ఇటలీకి చెందిన వైద్యుడు గినో స్ట్రాడాలు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

 

 రాష్ట్రీయం

 ఆంధ్రప్రదేశ్‌లో రూ.1000 కోట్లతో రోడ్ గ్రిడ్ రూ.1000 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. సంబంధిత ప్రతిపాదనలకు సెప్టెంబరు 28న కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-65లను అనుసంధానం చేయనున్నారు. అనంతపురం, కర్నూలు పట్టణాలను ఎన్‌హెచ్-44 ద్వారా రాజధాని అమరావతితో కలుపుతారు. ప్రస్తుతమున్న రహదారులను ఆరు లేదా ఎనిమిది వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. అమరావతి చుట్టూ 182 కి.మీ మేర నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనకు కూడా కేంద్రం అనుమతిచ్చింది.

 

 అనంతపురంలో భెల్‌కు శంకుస్థాపన

 అనంతపురం జిల్లా పాలసముద్రం దగ్గర భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్) ఆధ్వర్యంలో నిర్మించే ‘డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్’కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబరు 30న శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. ఇక్కడ రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలను తయారు చేసి పరీక్షిస్తారు.

 

 తెలంగాణలో

 ఈ- పంచాయతీ ప్రాజెక్టు ప్రారంభం ఈ-పంచాయతీ ప్రాజెక్టును నిజమాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేటలో అక్టోబరు 2న పంచాయతీరాజ్ శాఖామంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. జనన, మరణ ధ్రువపత్రాలు, పింఛన్లు, పహాణీలు, కరెంటు బిల్లులు చెల్లింపు వంటి పౌరసేవలను ఈ-పంచాయతీలు అందిస్తాయి. దశల వారీగా రాష్ట్రంలోని 8,770 గ్రామ పంచాయతీలకు ఈ సేవలను విస్తరించనున్నారు.

 

 సిద్ధిపేట నియోజకవర్గంలో

 వందశాతం మరుగుదొడ్లు బహిరంగ మలవిసర్జన లేని నియోజకవర్గంగా సిద్ధిపేట నిలిచింది. ఈ విషయాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అక్టోబరు 2న అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గంలో 64,733 నివాస గృహాలకు 58,202 వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. నెల రోజుల్లో 5,531 మరుగుదొడ్లు నిర్మించి వందశాతం లక్ష్యాన్ని అందుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

 

 ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతి

 ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు (81) హైదరాబాద్‌లో అక్టోబరు 5న అనారోగ్యంతో మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ ద్వారా ఉత్తమ చిత్రాలను నిర్మించారు. నాగేశ్వరరావు నిర్మాతగా సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సీతాకోక చిలుక, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం వంటి ప్రజాదరణ చిత్రాలను నిర్మించారు.

 

 సైన్స్ అండ్ టెక్నాలజీ

 అంగారకుడిపై నీటి జాడలు గుర్తించిన నాసాఅంగారకుడిపై నీటి జాడలను గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సెప్టెంబరు 28న ప్రకటించింది. ఒకప్పుడు అంగారక గ్రహంపై నీరు ప్రవహించిన కారణంగానే లోయలు, కనుమలు ఏర్పడి ఉండవచ్చనే శాస్త్రవేత్తల వాదనకు ప్రస్తుతం ఆధారాలు లభ్యమయ్యాయని నాసా పేర్కొంది. అంగారకుడి ఉపరితలంపై వేసవి నెలల్లో ఉప్పునీటి ప్రవాహాలు సాగి ఉండవచ్చనే విషయాన్ని తొలిసారి శాస్త్రవేత్తలు నిర్దారించారు.

 

 యుద్దనౌక ఐఎన్‌ఎస్ కోచి జలప్రవేశం

 అతి పెద్ద స్వదేశీ యుద్దనౌక ఐఎన్‌ఎస్ కోచి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా ముంబైలో సెప్టెంబరు 30న జలప్రవేశం చేసింది. ఐఎన్‌ఎస్ కోచి బరువు 7,500 టన్నులు, పొడవు 164 మీటర్లు, నౌక మధ్య భాగం వెడల్పు 17 మీటర్లు. ఇది గంటకు 30 నాటికన్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ యుద్దనౌకలో శక్తిమంతమైన ఆయుధాలు, సెన్సర్లు, నిఘా పరికరాలు, దీర్ఘశ్రేణి లక్ష్యాలను చేధించే క్షిపణి ప్రయోగ వ్యవస్థలు ఉన్నాయి.

 

 క్రీడలు

 సానియా-హింగిస్‌లకు వుహాన్ ఓపెన్ టైటిల్ సానియా మీర్జా-మార్టినా హింగిస్‌ల జోడీ వుహాన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ జోడీ వుహాన్ (చైనా)లో అక్టోబరు 3న జరిగిన ఫైనల్లో ఇరీనా కామెలియా బెగూ-మోనికా నికెలెస్కూలను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. వీరికి ఈ ఏడాది ఇది ఏడో టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను వీనస్ విలియమ్స్ (అమెరికా) గెలుచుకుంది.

 

 బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్

 భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఎన్నికయ్యారు. అక్టోబరు 5న ముంబైలో సమావేశమైన బీసీసీఐ సర్వసభ్య సమావేశం ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శశాంక్ ఈ పదవిలో 2017 వరకు కొనసాగనున్నారు. గతంలో ఆయన 2008-11 మధ్య బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించారు.

 

 జాతీయం

 జర్మనీ చాన్సలర్ భారత పర్యటన

 భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్‌తో కూడిన 28 సభ్యుల బృందం అక్టోబరు 4 రాత్రి న్యూఢిల్లీ చేరుకుంది. పర్యటనలో భాగంగా ఆమె అక్టోబరు 5న భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో 18 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్‌లో సౌర ఇంధన ప్రాజెక్టులకు రూ.7,300 కోట్ల మేర జర్మనీ ఆర్థిక సాయం అందించనుంది. దేశంలో పెట్టుబడులు పెట్టే జర్మనీ కంపెనీలకు వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు ఉద్దేశించిన ఫాస్ట్‌ట్రాక్ సిస్టమ్ 2016 నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనుంది. ఈ సందర్భంగా మెర్కల్ 10వ శతాబ్దంలో కశ్మీర్‌లో చోరీకి గురైన మహిషాసుర మర్దిని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు.

 

 గ్రీన్ హైవేస్ పాలసీ-2015 ఆవిష్కరించిన కేంద్రం

 హరిత జాతీయ రహదారుల విధానం-2015ను (గ్రీన్ హైవేస్ పాలసీ) కేంద్ర జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సెప్టెంబరు 29న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రహదారులకు రెండు వైపులా మొక్కలు నాటుతారు. తొలి ఏడాది 6,000 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్యావరణాన్ని కాపాడటం, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

 

 ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌కు 55వ స్థానం

 ప్రపంచ పోటీతత్వ సూచీ (2015-16)లో భారత్ 55వ స్థానంలో నిలిచింది. 140 దేశాలకు సంబంధించిన సూచీని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సెప్టెంబరు 29న విడుదల చేసింది. 2014-15లో 71వ స్థానంలో ఉన్న భారత్ ఈ సంవత్సరం సూచీలో 16 స్థానాలను మెరుగుపరచుకుంది. ఈ సూచీలో స్విట్జర్లాండ్ మొదటి స్థానం దక్కించుకుంది. సింగపూర్, అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య వంటి 12 అంశాలు-వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుని సూచీని రూపొందించారు.

 

 రెపో రేటును 0.50 శాతం తగ్గించిన ఆర్‌బీఐ

 నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెప్టెంబరు 29న ప్రకటించింది. రెపో రేటును 0.50 శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు 7.25 నుంచి నాలుగేళ్ల కనిష్ట స్థాయి 6.75 శాతానికి తగ్గింది. రెపో రేటుకు అనుగుణంగా రివర్స్ రెపో రేటు 6.25 నుంచి 5.75 శాతానికి చేరుకుంది. నగదు నిల్వ నిష్పత్తిని (సీఆర్‌ఆర్) 4 శాతంగా, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్) ను 21.5 శాతంగా కొనసాగించింది.

 

 సంక్షిప్తంగా

 తెలంగాణకు చెందిన పోలీస్ అధికారిణి జీఆర్ రాధిక జమ్మూ కశ్మీర్ హిమాలయల్లోని జాన్షకర్ శ్రేణి కున్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డుకెక్కారు.

 ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలసిస్ (ఐడీఎస్‌ఏ) డెరైక్టర్ జనరల్‌గా జయంత్ ప్రసాద్ సెప్టెంబరు 29న నియమితులయ్యారు.

 2040 నాటికి కర్బన ఉద్గారాలను 33-35 శాతానికి తగ్గించాలని భారత్ నిర్ణయించింది.

 రూ. 18,000 కోట్లతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఏర్పాటు చేయనున్న డ్రెడ్జింగ్ హార్బర్ కేంద్రానికి.. కేంద్రం ఆమోదం తెలిపింది.

 దేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది జూలై నాటికి 100.93 కోట్లకు చేరినట్లు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top