సిటీలో మేటి మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్.. ఐపీఈ

సిటీలో మేటి మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్.. ఐపీఈ


ఇన్‌స్టిట్యూట్ వాచ్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్.. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ గురించి తెలియని నగర విద్యార్థులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ ఔత్సాహికులకు.. ఎంబీఏ, పీజీడీఎం అంటే టక్కున గుర్తొచ్చే పేర్లలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ ఒకటి. తొలుత 1964లో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించిన వ్యవహారాలు, విధానాలపై అధ్యయనం కోసం ఏర్పాటైన ఈ ఇన్‌స్టిట్యూట్.. క్రమేణా అకడెమిక్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. వందల మంది మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లను అందించింది.  యాభై ఏళ్ల ప్రస్థానంలో దినదిన ప్రవర్థమానం అవుతూ.. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందింది. నగరంలో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌గా నిలిచి.. గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఐపీఈపై ఫోకస్..  

 

 దేశ సామాజిక - ఆర్థిక అభివృద్ధికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌లను ప్రధాన సాధనంగా 1960ల ప్రథమార్థంలో ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలనే ఆలోచన చేసింది. అందుకనుగుణంగానే అప్పటి కేబినెట్ సెక్రెటరీ ఎస్.ఎస్.ఖేరా రూపొందించిన ప్రతిపాదనల మేరకు ఏర్పాటైన సంస్థ.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్(ఐపీఈ). తొలుత పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ల కార్యకలాపాలకు పరిమితమైన ఈ ఇన్‌స్టిట్యూట్ కాలక్రమంలో అనేక మైలురాళ్లను అధిగమిం చింది. 1976లో సోషల్ సైన్స్ రీసెర్చ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా కేంద్ర ప్రభుత్వ గుర్తింపును పొందింది.

 

 కన్సల్టెన్సీ సర్వీసుల నుంచి అకడెమిక్ కోర్సుల వరకు:

 ఐపీఈ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం.. దేశంలోని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, పరిశోధనలు, కన్సల్టెన్సీ సర్వీసులు అందించడం. అయితే ఈ ఇన్‌స్టిట్యూట్ వీటికే పరిమితం కాలేదు. మేనేజ్‌మెంట్‌లో అకడెమిక్ కోర్సుల దిశగా అడుగులు వేసింది. ఇలా 1981లో మొట్టమొదట ప్రాక్టీసింగ్ మేనేజర్ల కోసం.. పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ స్పెషలైజేషన్‌లో మూడేళ్ల  పార్ట్-టైం ఎంబీఏ కోర్సును ప్రారంభించింది. తర్వాత 1995లో రెండేళ్ల వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సును ప్రవేశపెట్టింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు.. తాజా గ్రాడ్యుయేట్లకు కూడా పలు కోర్సులను అందిస్తోంది.

 

 మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా:

 అకడెమిక్ కోర్సుల దిశగా అడుగులు వేసిన ఐపీఈ.. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలు, జాబ్ ట్రెండ్స్‌కు అనుగుణంగా కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల వ్యవధి ఉన్న రిటైల్ మేనేజ్‌మెంట్; బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్; బయోటెక్నాలజీ, ఇంటర్నేషనల్ బిజినెస్, హెచ్‌ఆర్‌ఎం స్పెషలైజేషన్లలో పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించి విద్యార్థుల ఆదరణను చూరగొంది. ఇప్పుడు మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ అందించే వరకు ఎదిగింది.

 

 ప్రాక్టికాలిటీకి పెద్దపీట:

 ఐపీఈ అకడెమిక్ కోర్సుల బోధన విషయంలో మరో ప్రత్యేకత.. మేనేజ్‌మెంట్ కోర్సుల్లోనూ ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయడం. ముఖ్యంగా అకడెమిక్‌గా ఎంతో ఆవశ్యకమైన ప్రాజెక్ట్ వర్క్, కేస్ స్టడీస్ అనాలిసిస్‌కు సంబంధించి విద్యార్థులకు రియల్‌టైం ఎక్స్‌పీరియన్స్ లభించేలా చర్యలు చేపడుతోంది. వీటితోపాటు ఇండస్ట్రీ నిపుణుల భాగస్వామ్యంతో సెమినార్లు నిర్వహిస్తూ విద్యార్థులకు మార్కెట్ పరిస్థితులపై అవగాహన కల్పిస్తోంది. అంతేకాకుండా అకడెమిక్ కోణంలో మొనాష్ యూనివర్సిటీ, నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ వంటి పలు ప్రపంచ ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌లతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది.

 

 ర్యాంకింగ్స్‌లోనూ ముందంజ:

 ‘ఇన్‌స్టిట్యూట్‌ను ఎంపిక చేసుకునేముందు సదరు ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న ర్యాంకింగ్, గుర్తింపును ప్రామాణికంగా తీసుకోవాలి’.. సాధారణంగా విద్యార్థులకు నిపుణులు ఇచ్చే సలహా. ఈ ర్యాంకింగ్స్ విషయంలోనూ ఐపీఈ ముందంజ లోనే నిలుస్తోంది. జీహెచ్‌ఆర్‌డీసీ-సీఎస్‌ఆర్, ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్, ది వీక్, బిజినెస్ ఇండియా, ఔట్‌లుక్, డీఎన్‌ఏ, మింట్ తదితర సంస్థలు నిర్వహించే బెస్ట్ -బి స్కూల్స్ సర్వేలో అఖిల భారత స్థాయిలో టాప్-30లో నిలుస్తోంది. అంతేకాకుండా 2009లో వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన సెంటర్ ఫర్ ఫోర్‌కాస్టింగ్ జాబితాలో ‘టాప్ గవర్నమెంట్ ఎయిడెడ్ బి-స్కూల్’గా గుర్తింపు పొందడం గమనార్హం.  

 

 కొత్త క్యాంపస్‌లో.. సరికొత్త సదుపాయాలతో:

 యాభై ఏళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐపీఈ..  2014-15 నుంచి శామీర్‌పేటలో నిర్మించిన కొత్త క్యాంపస్‌లోకి అడుగుపెట్టింది. రూ.150 కోట్ల వ్యయంతో 21 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక హంగులతో నిర్మించిన ఈ క్యాంపస్‌లో విద్యార్థులకు అకడెమిక్‌గా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. 400 మంది విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ సదుపాయంతోపాటు.. 50 వేల పుస్తకాలు, రీసెర్చ్ పేపర్స్ అందుబాటులో ఉండేలా లైబ్రరీ, ఆడిటోరియం, సెమినార్ హాల్స్ నిర్మించారు.

 

 ప్లేస్‌మెంట్స్

 ప్రొఫెషనల్ కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లు అనగానే విద్యార్థులకు గుర్తొచ్చేది.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. ఈ విషయంలోనూ ఐపీఈ ప్రత్యేకతను చాటుకుంటోంది. రిటైల్ మేనేజ్‌మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు పలు సంస్థలు నిర్వహిస్తున్న క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా  ప్రతి ఏటా 90 శాతంపైగా ఐపీఈ విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. 2012-14 బ్యాచ్‌కు  మహీంద్రా ఫైనాన్స్ మొదలు.. డెలాయిట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థల వరకు దాదాపు 70 కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహించాయి. సగటున రూ. 6లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ లెటర్స్ అందించాయి.

 

 ప్రవేశం పాందాలంటే

 ఐపీఈ అందించే.. ఎంబీఏ తత్సమా న పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు క్యాట్/ ఎక్స్‌ఏటీ/ ఏటీఎంఏ/ మ్యాట్/సీమ్యాట్ స్కోర్ల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ కోర్సుకు మాత్రం ఈ అర్హతలతోపాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. ప్రవేశ ప్రకటన మార్చి/ఏప్రిల్ ల్లో వెలువడుతుంది. వెబ్‌సైట్: www.ipeindia.org

 

 వినూత్న కోర్సులకు కేరాఫ్

 ‘‘దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఐపీఈ..  ఆధునిక కోర్సులను ఆఫర్ చేసేందుకు కొత్త ప్రణాళికలు రూపొంది స్తోంది. మార్కెట్ ట్రెండ్స్‌ను దృష్టిలో పెట్టుకుని రిటైల్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను ప్రవేశపెట్టాం. విద్యార్థులకు జాబ్ రెడీ స్కిల్స్ అందించేందుకు సెమినార్లు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఎంతో కీలకమైన కేస్ స్టడీస్ అధ్యయనం విషయంలోనూ ప్రత్యేక శిక్షణనందిస్తున్నాం. ఇందుకు సంబంధించి రియల్‌టైం ఎక్స్‌పీరియెన్స్ లభించే విధంగా పలు పరిశ్రమలు, వ్యాపార సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నాం. రాష్ర్టంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించే విధంగా బోధనలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నాం. క్యాట్/ ఏటీఎంఏ/ మ్యాట్/ ఐసెట్ ఉత్తీర్ణులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాం.  మేనేజ్‌మెంట్ కోర్సుల పట్ల నిజమైన ఆసక్తి, ఆప్టిట్యూడ్ ఉన్న విద్యార్థులకు సరైన వేదిక.. ఐపీఈ’’

 - ఆర్.కె. మిశ్రా, డెరైక్టర్,

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top