రాష్ర్ట శాసన సభ నిర్మాణం - అధికారాలు

రాష్ర్ట శాసన సభ నిర్మాణం - అధికారాలు


 విధాన సభ: విధానసభ నిర్మాణం గురించి అధికరణ 170 తెలియజేస్తుంది. ప్రస్తుతం దేశం మొత్తంలో 31 (29+2) విధాన సభలున్నాయి. 1957 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం విధాన సభ సభ్యుల కనీస సంఖ్య 60. కాగా గరిష్ట సంఖ్య 500. అధికరణ 172 ప్రకారం జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కమిటీ సిఫారసు మేరకు వాటిని పునర్విభజిస్తారు. నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించే, పునర్విభజించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది.

 

 ప్రస్తుత నియోజకవర్గాలను 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించారు. 1976లో 42వ సవరణ ద్వారా 2001 వరకు మార్చకూడదని నిర్ణయించారు. తిరిగి 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు మార్పులు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. 87వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను పెంచకుండా వాటిని పునర్ వ్యవస్థీకరించారు.

 

 ప్రస్తుతం అత్యధిక శాసనసభ    ఉత్తరప్రదేశ్    403

 స్థానాలు కలిగిన రాష్ట్రాలు    పశ్చిమ బెంగాల్    294

 మహారాష్ట్ర    288

 అతి తక్కువ కలిగినవి    సిక్కిం    32

 గోవా    40

 మిజోరం    40

 

 కేంద్ర పాలిత ప్రాంతాలైనఢిల్లీలో 70, పుదుచ్చేరిలో 30 స్థానాలున్నాయి. దేశం మొత్తంలో 4,120 శాసనసభ సీట్లున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 స్థానాలుండేవి. రాష్ట్రం విడిపోయాక ప్రస్తుతం తెలంగాణలో 119, ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలున్నాయి. అధికరణ 333 ప్రకారం విధాన సభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను గవర్నర్ నామినేట్ చేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో స్టీఫెన్‌సన్ కొనసాగుతున్నారు.

 

 అధికరణం 172 ప్రకారం విధాన సభ కాలపరిమితి ఐదేళ్లు. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ ఎప్పుడైనా దీన్ని రద్దు చేయవచ్చు. విధాన సభ రద్దు గవర్నర్ విచక్షణాధికారం. జాతీయ అత్యవసర సమయంలో అవసరమైతే ఒక ఏడాది దీన్ని పొడిగించవచ్చు. ఆ అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ లో మొదటి విధాన సభ 1957లో ఏర్పాటయింది. 2009లో 13వ విధానసభ ఏర్పడింది. ముందస్తు ఎన్నికలు ఒకే ఒక్కసారి 1985లో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇరురాష్ట్రాలకు ప్రత్యేక విధాన సభలు 2014లోనే ఏర్పడ్డాయి.

 

 అధికరణ 178 ప్రకారం విధాన సభ సభ్యుల్లో ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విధానసభ మొదటి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు. మొదటి డిప్యూటీ స్పీకర్ కల్లూరి సుబ్బారావు. ఏకైక మహిళా స్పీకర్ ప్రతిభా భారతి. ప్రస్తుతం తెలంగాణలో స్పీకర్‌గా మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్‌గా మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర స్పీకర్లుగా వెంకట్రామయ్య, నరసింహందొర, ైెహ దరాబాద్ రాష్ట్ర స్పీకర్‌గా కాశీనాథరావు వైద్య పనిచేశారు.

 

 విధాన పరిషత్

 రాష్ట్ర శాసన సభలో ద్విసభ విధానం తప్పనిసరి కాదు. అధికరణ 169 ప్రకారం అవసరాన్ని బట్టి విధాన పరిషత్ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా రద్దు చేసుకోవచ్చు. ఇందుకు 2/3 వంతు మెజార్టీతో విధానసభ తీర్మానించి 1/2 మెజార్టీతో పార్లమెంట్ ఆమోదించాలి. దీనిరద్దు, ఏర్పాటు... న్యాయశాఖ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం విధాన పరిషత్‌లు 7 రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ర్ట, కర్ణాటక, జమ్మూ కశ్మీర్,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అమల్లో ఉన్నాయి.

 

 ఆంధ్రప్రదేశ్‌లో విధాన పరిషత్ 1958లో ఏర్పాటు చేసి 1985లో రద్దు చేశారు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విధాన పరిషత్‌ను పునరుద్ధరించారు.విధాన పరిషత్ సభ్యుల సంఖ్యను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం పరిషత్ కనీస సభ్యుల సంఖ్య 40. అత్యధిక సభ్యుల సంఖ్య ఎంఎల్‌ఏల సంఖ్యలో 1/3 వంతు మించకూడదు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో-100, మహారాష్ట్రలో-78, బిహార్‌లో-75, కర్ణాటకలో-75, ఆంధ్రప్రదేశ్‌లో-58, తెలంగాణలో-40, జమ్ము కశ్మీర్‌లో -36 మంది సభ్యులున్నారు.

 

 అధికరణ-171 విధాన పరిషత్ నిర్మాణాన్ని తెలియజేస్తుంది. పరిషత్ మొత్తం సభ్యుల్లో 1/3 వంతు మంది ఎంఎల్‌ఏల ద్వారా, మరో 1/3 వంతు మంది స్థానిక ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా (ఎంపీటీసీ, జెడ్పీటీసీ), 1/12 వంతు మంది పట్టభద్రుల ద్వారా, మరో 1/12 వంతు మంది ఉపాధ్యాయుల ద్వారా ఎన్నికవుతారు. మిగిలిన 1/6 వంతు మందిని సాహిత్యం, సంఘ సేవ, విద్య, వైద్యం, న్యాయం, పొదుపు, రాజకీయం, క్రీడలు మొదలైన రంగాలకు చెందిన ప్రముఖులను గవర్నర్ నామినేట్ చేస్తారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుల సంఖ్య 90. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 50, తెలంగాణకు 40స్థానాలు కేటాయించారు.

 

 ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎల్‌ఏల ద్వారా 16 మంది, స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా 17 మంది, పట్టభద్రుల ద్వారా 5 మంది, ఉపాధ్యాయుల ద్వారా ఐదుగురు ఎన్నికవుతారు మిగిలిన ఏడుగురిని గవర్నర్ నామినేట్ చేస్తారు. తెలంగాణలో ఎంఎల్‌ఏల ద్వారా 15 మంది, స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా 14 మంది, పట్టభద్రుల ద్వరా ముగ్గురు, ఉపాధ్యాయుల ద్వారా ముగ్గురు ఎన్నికవుతారు. మిగిలిన ఐదుగురిని గవర్నర్ నామినేట్ చేస్తారు.గమనిక:    ఇటీవల ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను సవరించిఏపీ విధాన పరిషత్ సభ్యుల సంఖ్యను 58కి పెంచారు. విధాన పరిషత్ కాల పరిమితి గురించి అధికరణ-172 తెలియజేస్తుంది. పరిషత్ మొత్తం సభ్యుల్లో ప్రతి రెండేళ్లకు 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు. విధాన పరిషత్ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ఇది శాశ్వత సభ.

 

 అధికరణ-182 ప్రకారం విధాన పరిషత్ సమావేశాలను ఏర్పాటు చేసి నిర్వహించేందుకు ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. వీరి పదవీ కాలం ఆరేళ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ మొదటి చైర్మన్ మాడపాటి హనుమంతరావు, డిప్యూటీ చైర్మన్ జీఎస్ రాజు. 1985లో రద్దు చేసినప్పుడు సయ్యద్ ముఖసిర్ షా చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చైర్మన్‌గా చక్రపాణి, డిప్యుటీ చైర్మన్‌గా సతీష్ రెడ్డి, తెలంగాణ పరిషత్ చైర్మన్‌గా స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌రావులు కొనసాగుతున్నారు.

 

 అధికరణ 173-శాసన సభ్యుల అర్హతలు

 1)    భారతీయ పౌరుడై ఉండాలి.

 2)    విధాన సభకు 25 సంవత్సరాలు, విధాన పరిషత్‌కు 30 సంవత్సరాలు నిండి ఉండాలి.

 3)    ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో కొనసాగకూడదు.

 4)    నేరారోపణ రుజువై ఉండకూడదు.

 5)    ధరావత్తు రుసుం రూ.10,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 5,000 చెల్లించాలి. ధరావత్తు రుసుం తిరిగి రావాలంటే పోలై చె ల్లుబాటైన మొత్తం ఓట్లలో 1/6 వంతు రావాలి.

 

 జీత భత్యాలు- ప్రకరణ 195:

 సభ్యుల జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. వీటిని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

 ప్రస్తుతం శాసనసభ్యుడి జీతం     రూ.12,000

 నియోజకవర్గ అలవెన్స్    రూ.83,000

 అకామిడేషన్ అలవెన్స్    రూ.25,000

 

 మాజీ శాసన సభ్యులకి పెన్షన్ చెల్లిస్తారు. ప్రస్తుతం పెన్షన్ రూ.15,000. రెండు పర్యాయాలు ఎన్నికైతే రూ. 20,000 అంతకంటే ఎక్కువ సార్లు ఎన్నికైతే రూ.25,000 చెల్లిస్తారు.శాసన సభ కోరం గురించి ప్రకరణ 189 తెలియజేస్తుంది. దీని ప్రకారం శాసన సభ కోరం 1/10 వంతు. సభాధ్యక్షుడితో కలుపుకొని కోరం అంటే సమావేశాల నిర్వహణకు హాజరు కావాల్సిన సభ్యుల సంఖ్య. శాసన సభ సమావేశాల గురించి ప్రకరణ 174 తెలియజేస్తుంది. దీని ప్రకారం కనీసం 6 నెలలకు ఒకసారి, ఏడాదికి రెండు సార్లు శాసన సభ సమావేశం కావాలి. ప్రస్తుతం మూడుసార్లు సమావేశాలు జరుగుతున్నాయి. అవసరాన్ని బట్టి ఎన్నిసార్లైనా, ఎన్ని రోజులైనా సమావేశాలు నిర్వహించవచ్చు.

 

 శాసన సభ విధులు, అధికారాలు

 రాష్ట్ర శాసన సభకు కూడా పార్లమెంట్‌కు ఉన్నట్లుగానే శాసన, కార్యనిర్వాహక, ఎన్నిక, రాజ్యాంగ అధికారాలున్నాయి. అయితే న్యాయాధికారాలు లేవు.శాసన అధికారాలు: రాష్ట్ర శాసన సభకు రాష్ట్ర జాబితాలోని 61 అంశాలపై, ఉమ్మడి జాబితాలోని 52 అంశాలపై శాసనాధికారం ఉంటుంది. ఏదైనా శాసనాన్ని రూపొందించేందుకు ముందుగా బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టాలి. సాధారణ బిల్లును ఉభయసభల్లో ఎందులోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఒక సభ ఆమోదం పొందిన తర్వాత రెండో సభకు బిల్లును పంపుతారు. రెండో సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఏ నిర్ణయాన్ని మూడు నెలల్లో చెప్పాలి. ఒక వేళ రెండో సభ బిల్లును వ్యతిరేకిస్తే రెండోసారి పంపుతారు. అప్పుడు ఆమోదించడం, లేదా తిరస్కరించడం అనే విషయాన్ని నెల రోజుల్లో చెప్పాలి.

 

 విధాన సభ ఆమోదించి విధాన పరిషత్ వ్యతిరేకించినా బిల్లు శాసనం అవుతుంది. రెండు సభల మధ్య విభేదాలు తలెత్తితే ఉమ్మడి సభ సమావేశానికి అవకాశం లేదు.

 కార్యనిర్వాహక అధికారాలు: శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర మంత్రి మండలిని నియంత్రిస్తుంది. శాసన సభ్యులు ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నల ద్వారా రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండేలా చూస్తారు. అలాగే వారు వాయిదా, సావధాన, అవిశ్వాస తీర్మానాల ద్వారా కార్యనిర్వాహక శాఖ తన విధి నిర్వహణలో బాధ్యతతో వ్యవహరించేలా చూస్తారు. ఈ రకమైన బాధ్యత మంత్రుల్లో వ్యక్తిగతంగా, సమష్టిగా ఉంటుంది. శాసన సభ విశ్వాసం మేరకే ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ విధాన సభలో ఇప్పటి వరకు అవిశ్వాస తీర్మానాన్ని 10సార్లు ప్రవేశపెట్టారు. కానీ ఒక్కసారి కూడా నెగ్గలేదు.

 

 ఆర్థిక అధికారాలు: ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అని స్పీకర్ నిర్ణయిస్తారు. ఆర్థిక బిల్లు అయితే గవర్నర్ ఆమోదంతో మొదట విధాన సభలో ప్రవేశ పెట్టాలి. విధాన సభ ఆమోదం పొందకుంటే ప్రభుత్వం కూలిపోతుంది. ఆమోదం పొందితే విధాన పరిషత్‌కు పంపుతారు. పరిషత్ 14 రోజుల్లోపు ఆమోదించింది, లేనిది చెప్పాలి. ఒక వేళ విధాన పరిషత్ వ్యతిరేకించినా ఈ బిల్లు శాసనం అవుతుంది. అధికరణం 266 ప్రకారం రాష్ట్ర సంఘటిత నిధిపై శాసనసభకు నియంత్రణ ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఇందులో జమ చేస్తారు. కొత్త పన్నులు విధించేందుకు, పాత పన్నులు మార్చేందుకు విధాన సభ ఆమోదం తప్పనిసరి.

 

 రాజ్యాంగ అధికారాలు: రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్ర శాసన సభ భాగస్వామ్యం కొంత వరకు ఉంటుంది. రాజ్యాంగ సవరణ పద్ధతుల్లో దృఢ పద్ధతి ఒకటి. దీని ప్రకారం 2/3 మెజార్టీతో పార్లమెంట్ ఆమోదించాలి, 1/2 మెజార్టీతో కనీసం సగం రాష్ట్రాల విధాన సభలు ఆమోదం తెలపాలి. సవరణ ప్రక్రియలో విధాన పరిషత్ పాల్గొనే అవకాశం లేదు.ఎన్నిక అధికారాలు: రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎంఎల్‌ఏలు ఓటర్లుగా ఉంటారు. రాజ్యసభ సభ్యులను కూడా ఎంఎల్‌ఏలే ఎన్నుకుంటారు. విధాన పరిషత్‌కు 1/3వంతు సభ్యులను ఎంఏల్‌ఏలు ఎన్నుకుంటారు.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top