దేహాన్ని, మనసును సేదతీర్చే.. స్పా థెరపిస్ట్

దేహాన్ని, మనసును సేదతీర్చే.. స్పా థెరపిస్ట్


ఆధునిక యుగంలో మనిషి జీవితం ఒత్తిళ్లమయం. క్షణం తీరిక లేని ఉరుకుల పరుగుల కాలంలో జీవనం యాంత్రికంగా మారిపోయింది. శరీరం, మనసు అలసిపోతున్నాయి. ఎప్పటికప్పుడు పునరుత్తేజం పొందితేనే ఆరోగ్యం, ఆనందం చేకూరుతాయి. అలసిన దేహాన్ని, మనసును సేదతీర్చే నిపుణులే.. స్పా థెరపిస్ట్‌లు. దేశవిదేశాల్లో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. స్పా థెరపీ. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో థెరపిస్ట్‌లకు చేతినిండా అవకాశాలు లభిస్తున్నాయి.

 

 వచ్చే ఐదేళ్లలో 6 లక్షల మంది కావాలి


 స్పా థెరపీ ప్రధాన లక్ష్యం.. మనసు, దేహం, ఆత్మల మధ్య సమతూకం సాధించడం. ఇందులో హోలిస్టిక్ థెరపీ, బ్యూటీ థెరపీ, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ వంటి విభాగాలుంటాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) నివేదిక ప్రకారం.. మనదేశంలో వచ్చే ఐదేళ్లలో అదనంగా 6 లక్షల మంది స్కిల్డ్ స్పా థెరపిస్ట్‌లు అవసరం. గత పదేళ్లుగా ఈ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నైపుణ్యం గల థెరపిస్ట్‌ల కొరత వేధిస్తోంది. స్పా థెరపీ కోర్సులు అభ్యసిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు లోటు ఉండదు. తగిన అనుభవం ఉన్నవారికి ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి.

 

  నేడు అన్ని నగరాల్లో స్పాలు వెలుస్తున్నాయి. దేశ విదేశాల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. వనరులు అందుబాటులో ఉంటే సొంతంగా స్పాను ఏర్పాటు చేసుకోవచ్చు. స్పా థెరపీలో అనుకూలమైన పనివేళలు ఉంటాయి. సాధారణంగా  క్లయింట్లు ఎక్కువగా సాయంత్రం వేళలో వస్తుంటారు. ఇతర రంగాల తరహాలో ఇందులో ఎక్కువ ఒత్తిళ్లు ఉండవు. ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. మెరుగైన పనితీరుతో క్లయింట్లకు సంతృప్తి కలిగిస్తే మంచి ఆదాయం అందుతుంది. కెరీర్‌లో పేరు తెచ్చుకోవడానికి, వేగంగా పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది.

 అర్హతలు: మనదేశంలో విద్యాసంస్థలు స్పా థెరపీపై సర్టిఫికెట్, డిప్లొమా, ఫౌండేషన్, స్పా మేనేజ్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి స్వల్పకాలిక కోర్సులే. పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివినవారు వీటిలో చేరొచ్చు.

 వేతనాలు: క్వాలిఫైడ్ స్పా థెరపిస్ట్‌లకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం లభిస్తుంది. ఐదేళ్లపాటు పనిచేసి తగిన అనుభవం సంపాదిస్తే నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు అందుకోవచ్చు. మేనేజ్‌మెంట్ స్థాయికి చేరుకుంటే నెలకు 30 వేల నుంచి రూ.80 వేల దాకా ఆర్జించొచ్చు.

 స్పా థెరపీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు

  ఇస్పా ఇంటర్నేషనల్ స్పా అకాడమీ-కొచ్చిన్

 వెబ్‌సైట్: www.ispaa.com

  ఎలైట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ స్పా థెరపీస్

 వెబ్‌సైట్: www.elitebeautyschool.co.nz

  లెయిర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పా థెరపీ

 వెబ్‌సైట్: www.lairdinstitute.com

  ఆనంద స్పా ఇన్‌స్టిట్యూట్-హైదరాబాద్

 వెబ్‌సైట్: www.anandaspainstitute.com

 ఆరోగ్య థెరపీలో అవకాశాలెన్నో..

 ‘‘శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉండగలం. ఒత్తిడి, నొప్పులు వంటివి మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఆయుర్వేద చికిత్సలో ఉన్న మార్గమే స్పా థెరపీ. ఇది కేవలం శరీరాన్ని మర్దనం చేయడమే కాదు.. రక్తప్రసరణ సజావుగా సాగేందుకు అనువైన శాస్త్రీయ విధానంతో అందించే చికిత్స.  ఈ కోర్సులు చదివినవారికి 100 శాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. టూరిజం కేంద్రాలు, స్టార్ హోటళ్లు, ఆయుర్వేద ఆసుపత్రుల్లో బోలెడు అవకాశాలున్నాయి.

 

 సొంతంగా స్పా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరో పదిమందికి ఉపాధి కల్పించవచ్చు. కోర్సు పూర్తిచేసిన వారికి స్థాయికి తగిన కొలువు గ్యారంటీగా లభిస్తుంది. థెరపిస్టుగా ప్రారంభంలో నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు సంపాదించవచ్చు. థెరపిస్టు సూపర్‌వైజర్, అసిస్టెంట్ స్పా మేనేజర్, స్పా మేనేజర్, స్పా డెరైక్టర్.. ఇలా కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. రూ.లక్ష వరకూ వేతనం అందుకునే వీలుంది. విదేశాల్లో అయితే మరింత ఎక్కువ ఆదాయం లభిస్తుంది’’

  -డాక్టర్ మిలింద్ సాలుంకె,

 హెడ్ ఆఫ్ ఆనంద్ స్పా ఇనిస్టిట్యూట్

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top