కొలువుల వారధి.. సోషల్ మీడియా!

కొలువుల వారధి.. సోషల్ మీడియా! - Sakshi


ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం సందేశాలు, వినోదాత్మక అంశాలతో సరిపెట్టుకోకుండా ఉద్యోగార్థులకు, రిక్రూటర్లకు మధ్య వారధిలా పని చేస్తోంది. ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ కీలక జాబ్ సెర్చ్ టూల్‌గా మారిన తరుణంలో.. సోషల్ మీడియా మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. సమర్థులైన సిబ్బంది కోసం రిక్రూటర్లు సైతం సోషల్ మీడి యాను ఆశ్రయిస్తున్నారు. బెస్ట్ ప్రొఫైల్స్‌కు జాబ్ ఆఫర్లు అందిస్తున్నారు!!

 

 స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంబంధాలు కొనసాగించడానికి మాత్రమే సోషల్ మీడియా పరిమి తమవడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగా న్వేషణలోనూ సహకరిస్తోంది. దీని సాయంతో కొలువుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువే.  ఉద్యోగార్థుల్లో 65 శాతం మంది సోషల్‌మీడియానే తమ జాబ్‌సెర్చ్ టూల్‌గా ఉపయోగించుకుంటున్నా రని ఓ సర్వేలో తేలడం విశేషం. వృత్తి జీవితంలోనూ ఉన్నత స్థానాలు అధిరోహించడానికీ ఇది దోహదపడుతోంది.

 

 జాబ్ సెర్చింగ్!

 దాదాపు అన్ని కంపెనీలు ఫేస్‌బుక్, లింక్డ్ ఇన్, గూగుల్ ప్లస్ తదితర సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నాయి.తాజా సమాచారంతోపాటు ఖాళీల వివరాలను కూడా అందులో పేర్కొంటున్నాయి. వాటికి సంబంధించిన పేజీలను లైక్ చేయడం లేదా ఫాలో అవడం ద్వారా వాటి నెట్‌వర్క్‌లో భాగస్వాములవ్వొచ్చు. తద్వారా ఉద్యోగార్థులు కూడా ఎలాంటి శోధన లేకుండానే తాజా ఉద్యోగ సమాచారాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా సోషల్‌మీడియాలో ఉండే విభిన్న గ్రూప్‌ల్లో అభ్యర్థులు రిజిస్టర్ అవడం ద్వారా తమకు కావాల్సిన ఉద్యోగ సమాచారాన్ని మరింత సులభంగా పొందొచ్చు. వాటిల్లో కేటగిరీల వారీగా సమాచారాన్ని పోస్టు చేస్తారు. ఉదాహరణకు హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగాన్ని అన్వేషిస్తున్నవారు హెచ్‌ఆర్ జాబ్స్‌కు సంబంధించిన గ్రూప్‌లో రిజిస్టర్ అయితే సంబంధిత అప్‌డేట్స్ పొందుతారు.

 

 ఉద్యోగస్థులకూ ప్రయోజనం!

 ఉద్యోగాల్లో చేరి తర్వాత కూడా సోషల్ మీడియాను విస్మరించడంలేదు. తమ ప్రొఫెషనల్ కెరీర్‌లో ఎదుగుదలకు కూడా దీన్ని వినియోగించు కుంటున్నారు. ప్రస్తుత ఉద్యోగుల్లో 85 శాతం మంది సోషల్‌మీడియా సైట్లలో సభ్యులుగా ఉన్నారని అంచనా. వీరిలో 53 శాతం మంది కేవలం ప్రొఫెషనల్ కెరీర్ కోసం సోషల్ మీడియాలో సభ్యులుగా ఉండగా మిగతా 47 శాతం మంది సహచరులు, స్నేహితులు, బంధువులతో సంబంధాలు కొనసాగించడానికి సోషల్‌మీడియాను ఉపయోగించుకుంటున్నారు. లింక్డ్ ఇన్‌లో 35 శాతం, ట్విట్టర్ లో 7 శాతం, ఫేస్‌బుక్‌లో 15శాతం, గూగుల్ ప్లస్‌లో 13 శాతం, ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల్లో 12 శాతం మంది వృత్తి నేపథ్య కారణాలతో సభ్యులుగా ఉంటున్నారు.

 

 రోజులో ఒక గంట!

 ఎక్కువ మంది ఉద్యోగార్థులు లింక్డ్ ఇన్ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఇప్పటికే వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారితో ‘కనెక్షన్స్’ ఏర్పరచుకుంటున్నారు. తరచుగా వారితో సంబంధాలు కొనసాగించడం ద్వారా ఉద్యోగా వకాశాలు మెరుగుపర్చుకోవచ్చని వారి భావన. ఉద్యోగులు సైతం తమ సోషల్ ప్రొఫైల్‌ను ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దుకుంటూ, ఉన్నత అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సామాజిక మాధ్యమం ద్వారా ఉద్యోగాల్లో చేరేవారు ఎక్కువే. రోజులో ఒక గంట సమయం ఈ సోషల్ సైట్లకు కేటాయిస్తున్నారు. రిక్రూట్‌మెంట్ విధానంలో సోషల్‌మీడియా విస్తృత ప్రాచుర్యం పొందుతోందని రిక్రూటర్లు సైతం పేర్కొంటున్నారు.

 

 అంచనా వేస్తారు:

 లింక్డ్ ఇన్, ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ తదితర నెట్‌వర్కింగ్ సైట్లు... ఉద్యోగ నియామకాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కంపెనీల అవసరాలకు తగిన ప్రతిభ, ప్రొఫైల్స్ ఉన్నవారిని వెతకడానికి ఈ మాధ్యమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సెలక్షన్ ప్రక్రియలో భాగంగా చివరి దశల్లో సోషల్‌మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అభ్యర్థుల ఇష్టాయిష్టాలు, అంకితభావం, వ్యక్తిత్వాన్ని కంపెనీలు అంచనా వేయడానికి సాయపడుతోంది. దాంతో ఉద్యోగ స్థాయికి తగిన అభ్యర్థులనే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి.

 

 అప్‌డేట్ అవుతుండాలి!

 నిత్యం అప్‌డేట్ అవుతూ, కచ్చితమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచే సామాజిక ప్రొఫైల్స్‌కే రిక్రూటర్స్ ఆసక్తి చూపుతారు. సాధారణంగా వారు సోషల్ మీడియాలో అభ్యర్థుల సమాచారాన్ని పరిశీలించేటప్పుడు ఎక్కువ సమయాన్ని కేటాయించరు. ఒక్కో ప్రొఫైల్‌కు కేవలం రెండు లేదా మూడు నిమిషాల సమయాన్ని వెచ్చిస్తారు. కాబట్టి మొదటి చూపులోనే రిక్రూటర్ మెప్పును పొందేలా ప్రొఫైల్‌ను సిద్ధం చేసుకోవాలి. సమగ్ర వివరాలతో, సంక్షిప్తంగా ఉండేలా జాగ్రత్తపడాలి. సోషల్ మీడియాలో ఎలాంటి ఫైల్స్‌ను అప్‌లోడ్ చేస్తున్నారు? ఏయే అంశాలను స్నేహితులతో పంచుకుంటున్నారు? వాటి ద్వారా తమ అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తం చేయాలను కుంటున్నారు? అనే విషయాలపై స్పష్టత ఉండాలి.

 

 అభ్యర్థి పేరుతో సెర్చింగ్!

 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలతోపాటు బ్యాంకింగ్ తదితర కంపెనీలు సైతం సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ల ద్వారా ఉద్యోగులను పరిశీలిస్తున్నాయి. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవ డానికి చాలా వరకు కంపెనీలు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాయి. అభ్యర్థి పేరును ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సెర్చ్ చేస్తారు. లింక్డ్ ఇన్‌లో వారికి ఉన్న రికమెండేషన్లను, ట్విట్టర్‌లో ఫాలోయర్స్ సంఖ్యనూ గమనిస్తారు.  ఫేస్‌బుక్ వాల్‌నూ పరిశీలిస్తారు.

 

 సోషల్ మీడియాతో ప్రయోజనం!

 ‘కంపెనీలు, ఉద్యోగులు, అభ్యర్థులకు మధ్య వివిధ స్థాయిల్లో సోషల్‌మీడియా ఉపయోగపడుతోంది. ఉద్యోగార్థులు జాబ్ సమాచారాన్ని పొందడం దగ్గర్నుంచి, కె రీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా మారుతోంది. వృత్తి నిపుణులు ఒకళ్లనొక ళ్లు సహకరించుకునేందుకూ ఇది ఉపకరిస్తోంది. ఆయా రంగాల్లోని వృత్తి నిపుణులతో, రిక్రూటర్లతో సోషల్ సంబంధాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి.



వివిధ కంపెనీల్లోని ఖాళీలు, నియామకాల సమాచారం అందరికంటే ముందుగా తెలిసే అవకాశం ఏర్పడుతుంది. అభ్యర్థుల సెలక్షన్‌లోనూ సోషల్ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తోంది. కంపెనీలు అభ్యర్థుల ప్రొఫైల్‌నూ క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. దాంతో వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంతోపాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలనూ పరిశీలిస్తున్నాయి. ఉద్యోగ నియామక ప్రక్రియ తుది దశలోనూ ప్రొఫైల్స్ సరిగ్గా లేనట్లయితే ఉద్యోగం చేజారే పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి సోషల్‌మీడియా ఎన్ని అవకాశాలను అందిస్తుందో సరిగ్గా వినియోగించుకోకపోతే అంతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది.

 - జి.ఆర్. రెడ్డి, ఫౌండర్ అండ్ చీఫ్ ఫెసిలిటేటర్,

 హ్యుసిస్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top