మౌలిక రంగం.. ఉజ్వల తరంగం

మౌలిక రంగం.. ఉజ్వల తరంగం - Sakshi


నగరంలో నిర్మాణ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. భాగ్యనగరిని కేంద్రంగా చేసుకుని ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరెన్నో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు మెట్రో రైలు నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు  ప్రభుత్వం చెబుతోంది. నిర్మాణ రంగంలో లక్షలాది నిపుణుల అవసరం ఏర్పడింది. నిర్మాణ రంగ నిపుణులకు గల్ఫ్ దేశాలు కూడా సాదర స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో అవకాశాలు.. వివిధ సంస్థలు.. అందిస్తున్న కోర్సులు.. వేతనాలపై ఫోకస్..

 

 -    ‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపొందిస్తాం. భాగ్యనగరిలో మురికివాడలు లేకుండా చేస్తాం. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం’.. ఇది ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన.

 -    ‘దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తాం. దేశంలోని ముఖ్య నగరాలను అనుసంధానిస్తూ స్వర్ణ చతుర్భుజి రహదారులను నిర్మిస్తాం’... ఇది దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్య.

 -    ‘దేశంలో ప్రధాన నగరాల మధ్య బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేస్తాం’.. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ప్రకటన.

 -    ‘తక్కువ ఖర్చుతో మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ఇళ్లు నిర్మిస్తాం’ - వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు.

 

 ఇలా ఎవరు ఏం చెప్పినా తెలుస్తోంది ఏమిటంటే.. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక రంగానికి పెద్దపీట వేయనున్నాయి. ఇందుకోసం భారీ స్థాయిలో నిధులను కేటాయించనున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా గ్రామీణ రహదారులను నిర్మించడం, అభివృద్ధి చేయడం, వాటిని జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారులతో అనుసంధానించనున్నారు. ఇవేకాకుండా దేశంలో వంద స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయడానికి, ఇతర పట్టణాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టడానికి రంగం సిద్ధమవుతోంది.

 

 హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి, ప్రపంచస్థాయిలో బ్రాండ్ ఇమేజ్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర స్థాయిలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, నదులపై నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇవన్నీ సాకారం కావాలంటే నిర్మాణ రంగ నిపుణుల అవసరం ఎంతో ఉంది. కాబట్టి నిర్మాణ రంగ నిపుణులకు మంచి అవకాశాలు రానున్నాయి.

 

 అవకాశాలెన్నో

 నిర్మాణ రంగంలో ఎన్నో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ముందు సంబంధిత నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించడం, దాని వాస్తును సరిచూడటం, స్థలాన్ని సర్వే చేయడం, సైట్/ప్రాజెక్టును పర్యవేక్షించడం, నిర్మాణానికి అవసరమైన వనరులు అంటే.. ఆర్కిటెక్టులు, నిర్మాణ కూలీల నుంచి తాపీ మేస్త్రీల వరకు, టిప్పర్-లారీ-క్రేన్ డ్రైవర్లు, ప్లంబింగ్ అండ్ శానిటేషన్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, కార్పెంటరీ, పెయింటింగ్ అండ్ డెకరేషన్, ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్, బయట గార్డెన్, ఇంటిపైన రూఫ్ గార్డెన్.. ఇలా ఆయా విభాగాల్లో లక్షల మంది నిపుణుల అవసరం ఉంది.

 

 కోర్సులు.. సంస్థలు

 నిర్మాణ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నగరంలో ఎన్నో సంస్థలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సైబరాబాద్‌లో ఉన్న నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నాక్)కు ఈ కోర్సులను అందించడంలో మంచి గుర్తింపు ఉంది. ఇందులో ఐదో తరగతి ఉత్తీర్ణుల నుంచి గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక, లాంగ్‌టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారికి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్‌ను కూడా నాక్ అందిస్తోంది.  

 

 లాంగ్‌టర్మ్ కోర్సులు

 పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఇన్ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, కన్‌స్ట్రక్షన్ సేఫ్టీ, క్వాంటిటీ సర్వేయింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, ఆర్గనైజేషనల్ అండ్ మేనేజీరియల్ స్కిల్స్, సెమినార్/లోకల్ విజిట్స్ వంటి సబ్జెక్టులను అందిస్తోంది.

 

 స్వల్పకాలిక శిక్షణ  కోర్సులు

 షార్ట్‌టర్మ్ కోర్సుల్లో భాగంగా ఐదో తరగతి అర్హతతో ప్లంబింగ్ అండ్ శానిటేషన్, ఫామ్‌వర్క్ కార్పెంట్రీ, బిల్డింగ్ కార్పెంట్రీ, బార్ బెండింగ్, పెయింటింగ్ అండ్ డెకరేషన్ వంటి కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల వ్యవధి 600 గంటలు. ఎనిమిదో తరగతి అర్హతతో వెల్డింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్  కోర్సులూ, ఇంటర్మీడియెట్ అర్హతతో జనరల్ వర్క్స్ సూపర్‌వైజర్, హైవే వర్క్స్ సూపర్‌వైజర్, ల్యాండ్ సర్వేయర్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్ వంటి కోర్సులూ ఉన్నాయి. వీటి వ్యవధి కూడా 600 గంటలు. గ్రాడ్యుయేషన్ అర్హతతో స్టోర్ కీపర్ కోర్సు అందుబాటులో ఉంది. దీని వ్యవధి 600 గంటలు. ఈ కోర్సులన్నింటికి 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారు అర్హులు.

 మరిన్ని వివరాలకు www.nac.edu.in

 

 నగరంలోనే కొలువుదీరిన మరో సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్. ఇందులో ఫుల్‌టైం ప్రోగ్రామ్స్‌లో భాగంగా.. రెండేళ్ల వ్యవధి ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్- డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కోర్సులను మహారాష్ర్టలోని పుణెలో ఆఫర్ చేస్తున్నారు.

 

 దూరవిద్య ద్వారా అందిస్తున్న కోర్సులు

 రెగ్యులర్‌గానే కాకుండా దూరవిద్య ద్వారా కూడా ఎన్‌ఐసీఎంఏఆర్ కోర్సులను అందిస్తోంది. అవి.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ బిజినెస్ మేనేజ్‌మెంట్, రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్, క్వాంటిటీ సర్వేయింగ్, హెల్త్- సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. బీటెక్/బీఈ/బీఆర్క్/బీప్లానింగ్ ఉత్తీర్ణులు, ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి రెండేళ్లు పని అనుభవమున్నవారు ఈ కోర్సులకు అర్హులు. వీటితోపాటు వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వీటికి ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/ప్లానింగ్ ఉత్తీర్ణులు లేదా ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి నిర్మాణ రంగంలో రెండేళ్లు పని అనుభవమున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

 మరిన్ని వివరాలకు www.nicmar.ac.in  

 

 పై సంస్థలే కాకుండా జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) - హైదరాబాద్.. బీటెక్‌లో ప్లానింగ్, బీఆర్క్ కోర్సులను, ఎంటెక్‌లో భాగంగా.. ప్లానింగ్, ప్రాపర్టీ డెవలప్‌మెంట్, కన్జర్వేషన్ ప్లానింగ్, ఎంఆర్క్‌లో ఇంటీరియర్ డిజైన్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - వరంగల్, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) - హైదరాబాద్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ)- విజయవాడ,  మరికొన్ని కళాశాలలు.. బీటెక్, ఎంటెక్ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ సంబంధిత కోర్సులను  అందిస్తున్నాయి. సెట్విన్.. కార్పెంట్రీ వంటి వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది.   

 

 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు

 రాబోయే పదేళ్లలో భారత్‌లో దాదాపు 100 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా. దీనిలో సగ భాగం అంటే 50 మిలియన్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మౌలిక రంగం నుంచే వస్తాయంటున్నారు ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్(ఐఐఎఫ్‌సీఎల్) మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.బి.నాయర్. ‘మౌలిక రంగంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులు దేశీయ, విదేశీ పెట్టుబడులకు మరింత ఊతమిస్తాయి’ అని అంటున్నారు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ రాష్ట్ర చైర్మన్ అశోక్‌రెడ్డి. దీనివల్ల నిపుణులతోపాటు నైపుణ్యం లేని కార్మికులకూ ఉపాధి అవకాశాలు గ్యారంటీ అంటున్నారాయన. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఆయా ప్రాంతాలకు అనువుగా ఉండేలా ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు, కారిడార్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు,  భవన సముదాయాల నిర్మాణం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఐఐటీఆర్, మెట్రోరైలు విస్తరణ, ఇండస్ట్రియల్, ఐటీ కంపెనీలతో ఇన్‌ఫ్రాస్టక్చర్ రంగం రాబోయే పదేళ్లలో 7 నుంచి 10 శాతం వరకూ వృద్ధి చెందుతుందని అంచనా.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top