ఐక్యరాజ్యసమితిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

ఐక్యరాజ్యసమితిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం - Sakshi


 జాతీయం

 మేక్ ఇన్ ఇండియా ప్రారంభం

 మేక్ ఇన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలో ప్రారంభించారు. భారత దేశాన్ని అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

 

 జయలలితకు నాలుగేళ్ల జైలు

 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (66)కు బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 27న నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. అలాగే ఆమె దత్తపుత్రుడు సుధాకరన్, శశికళ, ఇళవరసిలకు నాలుగేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా విధించింది. 1991-1996 కాలం లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి రూ.66.65 కోట్లు ఆస్తులున్నాయన్న కేసులో ఆమెకు ఈ శిక్ష పడింది. దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవితోపాటు పదేళ్లు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

 

 పిల్లల సొంత బ్యాంకు ఖాతాలకు అనుమతి

 చిన్న ిపిల్లలు సొంతంగా బ్యాంకు ఖాతాలను నడిపేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు సెప్టెంబర్ 24న అనుమతించాయి. పదేళ్లు వయసు దాటిన వారికి ఈ సదుపాయాన్ని కల్పించారు.

 

 స్వచ్ఛ్ భారత్‌కు కేబినెట్ ఆమోదం

 స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 24న ఆమోదించింది.  అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ఆరుబయట మల విసర్జనను నిర్మూలించడం, వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్లను నిర్మించడం దీని లక్ష్యం.

 

 ఎన్‌టీటీ రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీం

 పన్నులకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు జాతీయ పన్ను ట్రైబ్యునల్ (ఎన్‌టీటీ)చట్టాన్ని ఏర్పాటు చేస్తూ 2005లో పార్లమెంట్ ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 25న తీర్పునిచ్చింది.  

 

 దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన

 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద ల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న ప్రకటించింది. దీనికోసం రూ. 500 కోట్లు కేటాయించింది.

 

 అవార్డులు

 గోవింద్ మిశ్రాకు 2013 సరస్వతీ సమ్మాన్

 ప్రముఖ హిందీ ర చయిత గోవింద్ మిశ్రా 2013 సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని సెప్టెంబర్ 23న అందుకున్నారు. ఆయన రచించిన ధూల్ పౌదోన్ పర్ అనే నవల ఈ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి హిందీ రచయిత హరివంశ్ రాయ్ బచ్చన్ కాగా రెండో హిందీ రచయిత గోవింద్‌మిశ్రా.

 

 రైట్ లైవ్‌లీ హుడ్ అవార్డు -2014

 2014 రైట్ లైవ్‌లీ హుడ్ అవార్డుకు నాసా మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్, బ్రిటీష్ న్యూస్ పేపర్ ఎడిటర్ అలన్ రుస్ బ్రిడ్జెర్, పాకిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త అస్మా జహంగీర్, ఆసియన్ మానవ హక్కుల కమిషన్‌కు చెందిన బాసిల్ ఫెర్నాండో, పర్యావరణ వేత్త బిల్ మాక్ కిబ్బెన్ ఎంపికయ్యారు. ప్రత్యామ్నాయ నోబెల్‌గా పిలిచే ఈ అవార్డును 1980లో ఏర్పాటు చేశారు.

 

 

 సైన్స్ అండ్ టెక్నాలజీ

 అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటార్ మిషన్

 భారత ఉపగ్రహం మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) సెప్టెంబర్ 24న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ-సీ25 ద్వారా శ్రీహరికోట నుంచి మామ్‌ను ప్రయోగించారు. 66.6 కోట్ల కిలో మీటర్లు ప్రయాణించి 300 రోజుల అనంతరం కక్ష్యలోకి చేరింది. దీంతో తొలి ప్రయత్నంలోనే అంగారక క క్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన అరుదైన ఘనతను భారత్ సాధించింది. అరుణగ్రహంపైకి ఉపగ్రహాన్ని చేర్చిన తొలి ఆసియా దేశంగానూ నిలిచింది. అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్‌లు మాత్రమే ఇప్పటివరకు విజయం సాధించాయి. అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి 51 ప్రయత్నాలు జరగ్గా, 21 మాత్రమే విజయవంతమయ్యాయి. మామ్‌కు అమర్చిన పరికరాలు అంగారక గ్రహ ఉపరితలాన్ని, అక్కడి వాతావరణాన్ని, ఖనిజ సంపదను పరిశీలిస్తాయి. జీవం ఆవిర్భవానికి ఆధారమైన మీథేన్ ఉందా? లేదా? అన్నదానిపై అన్వేషణ సాగుతుంది. అంగారకుడి నుంచి చిత్రాలు, సంకేతాలను కాన్‌బెర్రాలోని నాసా పరిశోధన కేంద్రాలు అందుకుని ఇస్రోకు చేరవేశాయి.

 

 అంగారక కక్ష్యలోకి మావెన్

 అమెరికాకు చెందిన మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (మావెన్) ఉపగ్రహం దిగ్విజయంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. ఒకప్పుడు నీరు, ఉష్ణం ఉన్న అరుణగ్రహం ఇప్పుడు శీతలంగా, పొడిగా ఎందుకు మారిందనే దానిపై ఇది అధ్యయనం చేస్తుంది. మావెన్ అంతరిక్షంలో దాదాపు 10 నెలలపాటు 71.1 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సెప్టెంబర్ 21న అంగారకుడికి చేరువైంది. ఈ గ్రహం ఎగువ వాతావరణంపై పరిశోధన కోసం పంపిన మొట్టమొదటి ఉపగ్రం ఇదే.

 

 వార్తల్లో వ్యక్తులు

 ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్‌కే అగ్రస్థానం

 ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ ఏడాది భారత కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సారథి ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ స్థానంలో నిలవడం ఆయనకిది వరుసగా ఎనిమిదో సారి. సన్ ఫార్మాస్యూటికల్ అధిపతి దిలీప్ సంఘ్వి రెండో స్థానం, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ మూడోస్థానం దక్కించుకున్నారు. అలాగే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ క్లబ్ సొంతదారునిగా ముకేశ్ అంబానీయే అగ్రగామిగా నిలిచారు.

 

 భారత్‌లో బంగ్లా రాయబారిగా సయ్యద్

 భారత్‌లో బంగ్లాదేశ్ రాయబారిగా సయ్యద్ మొవజ్జం అలీని ఆ దేశ ప్రభుత్వం సెప్టెంబర్ 28న నియమించింది. ఇప్పటివరకు రాయబారిగా కొనసాగిన తారిక్ ఏ కరీం స్థానంలో అలీ బాధ్యతలు చేపడతారు.

 

 తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం

 తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సెప్టెంబర్ 29న బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ రోశయ్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. పన్నీర్‌సెల్వం ఇప్పటివరకు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి.

 

 ఐ.సి.ఎం. సెక్రటరీ జనరల్‌గా హర్దీప్‌సింగ్ పూరీ

 బహుళ పాక్షిక సిద్ధాంతంపై స్వతంత్ర కమిషన్ (ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ మల్టీ లేట్రలిజం-ఐ.సి.ఎం) సెక్రటరీ జనరల్‌గా హర్దీప్ సింగ్ పూరీ సెప్టెంబర్ 23 న నియమితులయ్యారు. ప్రపంచ సవాళ్లపై స్పందించేందుకు, విధాన పర  ప్రతిపాదనలను గుర్తించేందుకు ఐసీఎం పనిచేస్తుంది.

 

 ఐ.ఎస్.ఐ. డెరైక్టర్ జనరల్‌గా రిజ్వాన్ అక్తర్

 పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐ.ఎస్.ఐ) కొత్త డెరైక్టర్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అక్తర్ నియమితులయ్యారు. అక్టోబర్ 1న పదవీ విరమణ చేయనున్న లెఫ్టినెంట్ జనరల్ జహీరుల్ ఇస్లాం స్థానంలో రిజ్వాన్ బాధ్యతలు చేపడతారు.

 

 సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా దత్తు

 సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హంద్యాల లక్ష్మీనారాయణ దత్తు సెప్టెంబర్ 27న ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు సీజేఐగా కొనసాగిన ఆర్.ఎం.లోధా రాజీనామా చేయడంతో జస్టిస్ దత్తు ఆ బాధ్యతలు స్వీకరించారు.

 

 అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతికి

 భారత సంతతి బాలిక

 2014 అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతికి భారత సంతతికి చెందిన నేహా (18) పేరు పరిశీలనకు వచ్చింది. అమెరికాకు చెందిన నేహా తన సొంత ఫౌండేషన్‌తో పిల్లల అవసరాలకు సాయమందిస్తోంది. రష్యాకు చెందిన అలెక్సీ (17) స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేసుకొన్న వారి అణచివేతపై పోరాటం చేస్తోంది. ఘనాకు చెందిన ఆండ్వ్రె (13) దేశంలో కరవు నివారణ, ఆహార సహాయ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.

 

 రాష్ట్రీయం సీఐఐ కార్యవర్గం

 భారతీయ పరిశ్రమల సమాఖ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కార్యవర్గం సెప్టెంబర్ 24న ఎన్నికైంది. ఆంధ్రప్రదేశ్ చైర్మన్‌గా సురేష్ చిట్టూరి, వైస్ చైర్మన్‌గా అమర్‌రాజా బ్యాటరీస్ వ్యవస్థాపకుడైన డాక్టర్ రామచంద్ర ఎన్. గల్లా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఎలికో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, సీఎఫ్‌ఓ వనితా దాట్ల చైర్ పర్సన్‌గా, పెన్నార్ గ్రూప్ చైర్మన్ జేవీ నృపేందర్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు.

 

 ఆంధ్రాబ్యాంక్ కిసాన్‌వాణి

 వ్యవసాయ సాంకేతిక సమాచారాన్ని రైతులకు అందించే లక్ష్యంతో కిసాన్‌వాణి సదుపాయాన్ని ఆంధ్రాబ్యాంకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇఫ్కో అనుబంధ సంస్థ ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్‌తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే తన 2000వ ఏటీఎం కేంద్రాన్ని హైదరాబాద్‌లోని పంజాగుట్టలో సెప్టెంబర్ 22న బ్యాంకు చైర్మన్, ఎండీ సీవీఆర్ రాజేంద్రన్ ప్రారంభించారు.

 

 ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ పేరు మార్పు

 ఆరోగ్యశ్రీ పథకం పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీ ఆర్ ఆరోగ్య సేవగా మారుస్తూ సెప్టెంబర్ 27న ఉత్తర్వులు జారీచేసింది. పేదలకు ఉచిత కార్పోరేట్ వైద్యం అందించే లక్ష్యంతో 2007లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ప్రారంభించారు.  చికిత్సకు అయ్యే వ్యయ పరిమితిని రూ. 2లక్షల నుంచి రూ. 2.50 లక్షలకు పెంచారు.

 

 కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రారంభం

 తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని సెప్టెంబర్ 27న ప్రభుత్వం ప్రారంభించింది. కాకతీయ వైద్య కళాశాలలో తాత్కాలికంగా దీన్ని ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సురేశ్ చందాను ప్రభుత్వం నియమించింది.

 

 అంతర్జాతీయం

 ఐక్యరాజ్యసమితిలో నరేంద్ర మోదీ ప్రసంగం

 ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భద్రతామండలిని 2015 నాటికి ప్రజాస్వామ్యయుతంగా, ప్రాతినిధ్య వేదికలా మార్చేందుకు సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే మాడిసన్ స్క్వే ర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

 

 సార్క్ సాంస్కృతిక రాజధానిగా బమియాన్

 ఆఫ్గానిస్థాన్‌లోని బమియాన్ పట్టణాన్ని 2015 సార్క్ సాంస్కృతిక రాజధానిగా సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సార్క్ సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. 2016-17 సంవత్సరానికి ఢాకాను సాంస్కృతిక రాజధానిగా ప్రకటించారు. 2016-17ను సార్క్ సాంస్కృతిక వారసత్వ సంవత్సరంగా సదస్సు నిర్ణయించింది.

 

 క్రీడలు

 ప్రపంచ చెస్ టోర్నీలో కార్తీక్‌కు కాంస్యం

 సెర్బియాలో జరిగిన వ్యక్తిగత చెస్ ఛాంపియన్‌షిప్ (వికలాంగుల)లో విజయవాడకు చెందిన కేవీకే కార్తీక్ కాంస్యపతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో పాటు ఫిడే మాస్టర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

 

 కపిల్‌దేవ్‌కు లైఫ్‌టైం అచీవ్ మెంట్ అవార్డు

 భారత మాజీ క్రికెట్ ఆటగాడు కపిల్‌దేవ్ ఇండో -యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో సెప్టెంబర్ 24న ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. క్రికెట్‌తో పాటు నిరాశ్రయులకు చేయూతనివ్వడంలో కపిల్ చూపిన కృషికి ఈ అవార్డు లభించింది.

 

 సచిన్, స్టీవ్‌వాలకు బ్రాడ్‌మన్ పురస్కారం

 2014 బ్రాడ్‌మన్ పురస్కారానికి క్రికెటర్లు సచిన్‌టెండూల్కర్, స్టీవ్‌వా (ఆస్ట్రేలియా)లను బ్రాడ్‌మన్ ఫౌండేషన్ ఎంపికచేసింది. ఈ ఏడాది అక్టోబర్ 29న బ్రాడ్‌మన్ ఫౌండేషన్ అవార్డులను ప్రదానం చేయనుంది.

 

 పేస్ జోడీకి మలేసియా ఓపెన్ టైటిల్

 లియాండర్ పేస్-మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలెండ్) జోడీ మలేసియా ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. సెప్టెంబర్ 27న జరిగిన పోటీలో జేమీ ముర్రే, జాన్ పిర్స్ జంటపై పేస్ జోడీ విజయం సాధించింది.

 

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top