మౌర్యుల అనంతర యుగం


మౌర్య సామ్రాజ్యం పతనమైనప్పటి నుంచి గుప్తుల పరిపాలన ప్రారంభమయ్యేంత వరకున్న కాలాన్ని (క్రీ.పూ.200 - క్రీ.శ.300) భారతదేశ చరిత్రలో మౌర్యుల అనంతర యుగంగా పేర్కొంటారు. ఈ కాలంలో అనేక దేశీయ,  విదేశీ రాజ్యాలు ఆవిర్భవించాయి. దేశంలో రాజకీయంగా వికేంద్రీకరణ, అనిశ్చిత పరిస్థితులు ఉండటం వల్ల కొందరు చరిత్రకారులు ఈ యుగాన్ని ‘చీకటియుగం’గా పేర్కొన్నారు. ఈ కాలంలో సాంస్కృతికంగా, ఆర్థికంగా అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవి భారతదేశ చరిత్రపై ప్రభావం చూపాయి.

 

 దేశీయ రాజవంశాలు

 శుంగవంశం శుంగవంశం.. విదిష రాజధానిగా మగధను పాలించిన వంశం.వంశంలో ముఖ్య రాజులు పుష్యమిత్ర శుంగుడు: శుంగవంశ స్థాపకుడు. చివరి మౌర్య చక్రవర్తి బృహద్రధుని వద్ద సేనాధిపతిగా ఉంటూ, చక్రవర్తిని చంపి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని వద్ద పతంజలి ప్రధాన పురోహితునిగా పనిచేశాడు. ఇతని ఆధ్వర్యంలో పుష్యమిత్రుడు అశ్వమేధ యాగం నిర్వహించాడు.

 

 అగ్నిమిత్రుడు: పుష్యమిత్రుని తర్వాత సింహాసనం అధిష్టించిన రాజు. కాళిదాసు రచించిన ’మాళవికాగ్నిమిత్ర’ అనే కావ్యంలోని కథానాయకుడు ఇతడే. అగ్నిమిత్రుని తర్వాత జేఠమిత్రుడు, వజ్రమిత్రుడు అనే అంతగా ప్రాధాన్యం లేని రాజులు పాలించారు.భాగవతుడు: బేసనగర్ స్తంభ శాసనంలో పేర్కొన్న భాగభద్రుడు ఇతడే. ఇండోగ్రీకు రాజు యాంటియాల్‌సిదాస్ రాయబారి హెలియోడోరస్ ఇతని కాలంలోనే ఆస్థానాన్ని సందర్శించాడు. దేవభూతి: శుంగవంశంలో చివరి రాజు. ఇతడు తన మంత్రి వాసుదేవ కణ్వుని చేతిలో హత్యకు గురయ్యాడు.

 

 కణ్వ వంశం

 ఇది శుంగుల తర్వాత మగధను పాలించిన మరో బ్రాహ్మణ వంశం. వీరి రాజధాని పాటలీపుత్రం. వంశంలో ముఖ్య రాజులువాసుదేవకణ్వుడు: కణ్వవంశ స్థాపకుడు. ఇతని తర్వాత భూమిమిత్రుడు, నారాయణుడు అనే బలహీన రాజులు పాలించారు.సుశర్మ: కణ్వవంశంలో చివరి పాలకుడు. ఒక ఆంధ్ర శాతవాహన రాజు మగధపై దాడిచేసి, సుశర్మను అంతంచేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ శాతవాహన రాజు వాశిష్టిపుత్ర పులోమావి లేదా మొదటి పులోమావి అని చరిత్రకారుల అభిప్రాయం.

 

 చేది వంశం

 ఈ వంశాన్నే మహామేఘవాహన వంశమని కూడా పిలుస్తారు. ఈ వంశస్థాపకుడు మహామేఘ వాహనుడు.

 వంశంలో ముఖ్య రాజులు ఖారవేలుడు: ఈ వంశంలో అందరికంటే గొప్పవాడు ఖారవేలుడు. తన పాలనాకాలంలోని తొలి 14 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తూ, భువనేశ్వర్ సమీపంలోని ఉదయగిరి కొండలపైనున్న హతిగుంఫ అనే గుహ వద్ద ఒక శాసనం వేయించాడు. ఇతడు మగధను జయించి నందుల కాలంలో కళింగ నుంచి తీసుకెళ్లిన జైనతీర్థంకరుల విగ్రహాలను వెనక్కు తెచ్చాడు. శాతవాహనులను కూడా ఓడించి వారి సామ్రాజ్యంలోని పితుండ అనే నగరాన్ని ధ్వంసం చేశాడు.

 

 సంగం రాజ్యాలు

 ఈ కాలంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ, చేర, పాండ్య రాజ్యాలను సంగం రాజ్యాలు అంటారు. పాండ్యుల రాజధాని మధురైలో జరిగిన కవుల సమ్మేళనాలను (సమావేశాలు) సంగం అని పిలుస్తారు. ఈ సమావేశాల్లో సంకలనం చేసిన సాహిత్యాన్ని ‘సంగం సాహిత్యం’గా అభివర్ణించారు. అశోకుని శిలాశాసనాల్లో, మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో సంగం రాజ్యాల ప్రస్తావన ఉంది.

 

 చోళరాజ్యం

 వీరి మొదటి రాజధాని ఉరయూరు. రెండో రాజధాని పుహార్ లేదా కావేరి పట్నం. పులి వీరి రాజచిహ్నం. వంశంలో ముఖ్య రాజులుఎలారా: శ్రీలంకను జయించిన తొలి చోళరాజుగా ప్రసిద్ధి చెందాడు.    పెరునార్‌కిల్లి: రాజసూయ యాగాన్ని నిర్వహించిన ఏకైక చోళ రాజు.కరికాల చోళుడు: ప్రాచీన చోళుల్లో అందరికంటే గొప్పవాడు. పుహార్ రాజధాని నిర్మాత. తంజావూర్ సమీపంలో జరిగిన వెన్ని యుద్ధంలో కరికాలుడు సాధించిన విజయాన్ని పత్తినపలై అనే సంగం సాహిత్య గ్రంథంలో ప్రస్తావించారు.ఇతడు శ్రీలంక నుంచి బందీలుగా తెచ్చిన కార్మికులతో, కావేరి నదికి ఆనకట్టలు నిర్మించాడు. ‘వహైప్పరండాలి’ అనే మరో యుద్ధంలో తొమ్మిది తెగల కూటమిపై ఘన విజయం సాధించాడు.సెంగానన్: చోళవంశంలో మరో ముఖ్యమైన రాజు. గొప్ప శివభక్తుడు. 70 శివాలయాలు నిర్మించాడు.

 

 చేరరాజ్యం

 నేటి కేరళను వీరు పాలించారు. వీరి రాజధాని వంజీ లేదా కరూర్.వంశంలో ముఖ్య రాజులు ఉదయాంజిరెల్: చేరవంశంలో తొలి పాలకుడు. ఇతడు ఒక భారీ వంటశాలను నిర్మించినట్లు ప్రతీతి. కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న కౌరవ, పాండవ సైన్యాలకు భోజనాలు పెట్టించినట్లు ‘పురీచను’ అనే గ్రంథం తెలియజేస్తోంది. నెడుంజెరల్ ఆదన్: ఇతనికి ‘ఇమయావరంబన్’ అనే బిరుదు ఉంది. తన రాజ్యపు సరిహద్దులుగా హిమాలయాలు ఉన్నాయి.సెంగుట్టవన్: ఇతనికి ‘ఎర్రచేర’ అనే బిరుదు ఉంది. ఇతడు హిమాలయాల నుంచి తెచ్చిన శిలతో, కన్నగి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కన్నగిని ఆదర్శపత్నిగా కొలిచే ‘పత్తిని’ పూజా పద్ధతిని ప్రవేశపెట్టాడు.

 

 పాండ్యులు

 పాండ్యుల రాజధాని మధురై. వంశంలో ముఖ్య రాజులు నెడూజెళియన్: పాండ్యుల్లో తొలి ముఖ్యమైనరాజు. తలైయాలంగనం యుద్ధ విజేత. ఇతని ఆస్థాన కవి మంగుడి మరుదన్.. ‘మదురైక్కంజి’ అనే గ్రంథాన్ని రచించాడు. మరో ఆస్థాన కవి నక్కిరార్. ఇలాంగో అడిగల్ రచించిన ‘శిలప్పాధిగారం’ గ్రంథంలోని కొవలన్‌ను ఉరితీసిన సంఘటన ఈ రాజు కాలంలోనే చోటుచేసుకుంది.

 

 శాతవాహన రాజ్యం

 దక్కన్‌ను పాలించిన రాజులు శాతవాహనులు. ఈ వంశంలో దాదాపు 30 మంది రాజులు 450 ఏళ్లు దక్కన్‌ను పాలించారు. వీరి రాజధాని ప్రతిష్టానపురం. మౌర్యుల పాలన నుంచి పొందిన అనుభవం ఆధారంగా పటిష్టమైన పాలనా వ్యవస్థను నిర్మించుకున్నారు. వీరికి సంబంధించిన తొలి ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. మెగస్తనీస్ వీరి బలసంపత్తిని వర్ణించాడు. అయితే శాతవాహనుల కులం, వంశం, జన్మస్థలం తదితర అంశాలపై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. వారి మధ్య భిన్న వివాదాలు కొనసాగుతున్నాయి.

 

 వంశంలో ముఖ్య రాజులు

 శ్రీముఖుడు: శాతవాహన వంశస్థాపకుడు. కోటిలింగాల వద్ద ఇతని నాణాలు లభించాయి.కన్హ లేదా కృష్ణ: శ్రీముఖుని సోదరుడు. ఈ వంశంలో రెండో రాజు. రాజ్య విస్తరణను ప్రారంభించాడు.మొదటి శాతకర్ణి: వైదికమతాన్ని శాతవాహనుల అధికారిక మతంగా చేశాడు. అనేక వైదిక యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించాడు. మొదటి శాతకర్ణి విజయాల గురించి, అతని భార్య నాగనిక వేయించిన నానాఘాట్ శాసనం తెలియజేస్తోంది. ఇతనికున్న బిరుదు ‘దక్షిణాపథపతి’.

 

 కుంతల శాతకర్ణి: ఇతని ఆస్థానంలో శర్వవర్మ, గుణాఢ్యుడు అనే కవులుండేవారు. శర్వవర్మ ‘కాతంత్ర వ్యాకరణం’, గుణాఢ్యుడు ‘బృహత్కథ’ అనే గ్రంథాలు రచించారు. వాత్సాయనుడు ఈ కాలానికి చెందినవాడనే అభిప్రాయం ఉంది.హాలుడు: వంశంలో 17వ రాజు. ఇతడు ‘గాథాసప్తశతి’ అనే ప్రాకృత కావ్యాన్ని రచించాడు. దీనికి ‘శాలివాహన సప్తశతి’ అనే మరో పేరుంది. తన ఆస్థానంలో అనేకమంది కవులకు ఆశ్రయమిచ్చిన హాలుడు ‘కవివత్సలుడు’ అనే బిరుదు పొందాడు.

 

 గౌతమీపుత్ర శాతకర్ణి: శాతవాహన చక్రవర్తుల్లో గొప్పవాడు. అతను సాధించిన విజయాల గురించి, తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి తెలుపుతోంది. క్షహరాట నహపాణున్ని ఓడించి శకుల రాజ్యాన్ని ఆక్రమించాడు. జోగల్‌తంబి వద్ద లభించిన నాణేలు ఈ విజయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఇతనికి ఏకబ్రాహ్మణ, ఆగమనిలయ, ‘త్రిసముద్ర తోయ పీత వాహన’ వంటి బిరుదులున్నాయి.

 యజ్ఞశ్రీ శాతకర్ణి: ఇతడు ఓడ గుర్తు కలిగిన నాణేలను జారీ చేశాడు. ఆచార్య నాగార్జునుడు రాసిన ‘సుహృల్లేఖ’ అనే గ్రంథం ఈ రాజును ఉద్దేశించినదేనని చరిత్రకారుల అభిప్రాయం. బాణుడు ఇతన్ని ‘త్రిసముద్రాధిపతి’ అనే బిరుదుతో ప్రస్తావించాడు.

 మూడోపులోమావి: శాతవాహన వంశంలో చివరివాడు.

 

 మాదిరి ప్రశ్నలు

 

 

 1.    పతంజలి రాసిన మహాభాష్యం దేనికి వ్యాఖ్యాన గ్రంథం?

     1) పాణిని అష్టాధ్యాయి

     2) వసుమిత్రుని మహావిభాషా శాస్త్రం

     3) అశ్వఘోషుని శారిపుత్ర ప్రకరణం

     4) చరకుని చరకసంహిత

 2.    రాజవంశాలు వాటి రాజచిహ్నాలలో సరికానిది?

     1) చోళులు-పులి     2) చేర- విల్లు, బాణం

     3) పాండ్యులు-ఏనుగు    4) 1, 2, 3

 3.    కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఏ రాజు నాణేలు వెలుగుచూశాయి?

     1) శ్రీముఖ శాతకర్ణి    2) కృష్ణ లేదా కన్హ

     3) మొదటి శాతకర్ణి    4) 1, 2, 3

 4.    అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన తొలి శాతవాహన రాజు?

     1) గౌతమీ పుత్రశాతకర్ణి    2) రెండో శాతకర్ణి

     3) మొదటి శాతకర్ణి    4) శ్రీముఖ శాతకర్ణి

 5.    పుష్యమిత్ర శుంగుని సమకాలీనుడైన ఇండో-గ్రీకు రాజు?

     1) మినాండర్    2) డెమిట్రియస్

     3) డిమోడోదిస్    4) యూధీడిమస్

 6.    నాసిక్ శాసనం ఎవరి పాలనా కాలంలో వేశారు?

     1) గౌతమీపుత్ర శాతకర్ణి    2) వాసిష్టీపుత్ర పులోమావి

     3) యజ్ఞశ్రీ శాతకర్ణి    4) రెండో పులోమావి

 7.    రోమన్ చక్రవర్తులు అగస్టస్, ట్రోజన్‌ల వద్దకు రాయబారులను పంపిన దక్షిణ భారతదేశ రాజులు?

     1) చోళులు        2) చేరరాజులు

     3) శాతవాహనులు    4) పాండ్యులు

 8.    సంగం సాహిత్యంలో సరిగా జతపరచనిది?

     1) శిలప్పాధిగారం -ఇలాంగో అడిగల్

     2) మణిమేగలై - సిత్తాలై సత్తానార్

     3) తిరుక్కురల్ - తిరువల్లువార్

     4) తొల్కప్పియం - అగట్టియార్

 9.    రుద్రదమనుని కుమార్తెను వివాహమాడిన శాతవాహనరాజు?

     1) వాశిష్టీపుత్ర శివశ్రీ శాతకర్ణి

     2) వాశిష్టీపుత్ర మొదటి పులోమావి

     3) వాశిష్టీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి

     4) గౌతమీపుత్ర యజ్ఞశ్రీ

 10.    తమిళ లిపికి ఆధారమైన లిపి ఏది?

     1) బ్రాహ్మీలిపి    2) గ్రంథలిపి

     3) ఖరోష్టిలిపి    4) అరమిక్ లిపి

 11.    భారతదేశంలో తొలిసారిగా భూదానాలు చేసిన రాజులు?

     1) శుంగులు    2) గుప్తులు

     3) శాతవాహనులు    4) మౌర్యులు

 12.    గాథాసప్తశతిని ఏ భాషలో రాశారు?

     1) సంస్కృతం    2) ప్రాకృతం

     3) పాలీ        4) మగధి

 13.    రాజ్యాలు-వాటి రాజధానుల్లో సరైంది?

     1) శాతవాహనులు - ప్రతిష్టానపురం

     2) శుంగులు - పాటలీపుత్రం

     3) కణ్వులు - విదీష    4) చోళులు - మధురై

 14.    రెండు తెరచాపలున్న ఓడగుర్తుతో నాణేలను ఎవరు జారీచేశారు?

     1) యజ్ఞశ్రీ శాతకర్ణి    2) గౌతమీపుత్ర శాతకర్ణి

     3) కుంతల శాతకర్ణి    4) రెండో శాతకర్ణి

 15.    వాత్సాయనుడు ఎవరి కాలానికి చెందినవాడనే అభిప్రాయం ఉంది?

     1) హాలుడు        2) కుంతల శాతకర్ణి

     3) గౌతమీపుత్ర శాతకర్ణి    4) మొదటి శాతకర్ణి

 

 సమాధానాలు

 1) 1    2) 3    3) 4    4) 3    5) 2

 6) 2    7) 4    8) 4    9) 1    10) 2

 11) 3    12) 2    13) 1    14) 1    15) 2

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top