ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభం

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభం


 జాతీయం

 పీఎంకేవీవైను ప్రారంభించిన ప్రధాని యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) కార్యక్రమాన్ని ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జూలై 15న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద దేశంలో 35 ఏళ్లలోపు యువతను వివిధ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతారు. వచ్చే ఏడాది 24 లక్షల మందికి సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. 2022 నాటికి 40 కోట్ల మందిని నిపుణులుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నైపుణ్యాభివృద్ధి-పారిశ్రామిక జాతీయ విధానం-2015, నైపుణ్య రుణాల పథకాలను కూడా ప్రధాని ప్రారంభించారు.

 

 2014లో 1.31 లక్షల మంది ఆత్మహత్య

 2014లో దేశవ్యాప్తంగా 1,31,666 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) జూలై 17న విడుదల చేసిన నివేదికలో తెలిపింది. జాతీయ ఆత్మహత్యల రేటు లక్ష జనాభాకు 10.6 శాతంగా ఉంది. మొత్తం ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మూడింట ఒక వంతు చోటుచేసుకున్నాయి. ఇందులో గృహిణులు 20,148, వ్యవసాయ పనివారు 12,360, విద్యార్థులు 8,068 మంది ఉన్నారు. ఆత్మహత్యలకు ప్రధానంగా కుటుంబ సమస్యలు, అనారోగ్యం, వైవాహిక సమస్యలు, ప్రేమవ్యవహారాలు కారణాలుగా ఉన్నాయి. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 1.4 లక్షలుగా ఉంది.

 

 2014లో విదేశీ పర్యాటకుల సంఖ్య

 2.25 కోట్లు దేశంలో 2014లో విదేశీ పర్యాటకుల సంఖ్య 2.25 కోట్లకు చేరినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ జూలై 18న విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ సంఖ్య 2013లో 1.99 కోట్లుగా ఉంది. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది.

 

 క్రీడలు

 ఐపీఎల్ నుంచి సీఎస్‌కే, ఆర్‌ఆర్‌లపై నిషేధం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెందిన చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు రెండేళ్ల పాటు నిషేధానికి గురయ్యాయి. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు పాల్పడిన వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల లోధా కమిటీ జూలై 14న ఆ రెండు ఫ్రాంచైజీలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. చెన్నై జట్టు టీం ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ సహ యజమాని రాజ్ కుంద్రాలను దోషులుగా నిర్ధారించింది. వారు అవినీతికి పాల్పడినట్లు ప్రకటిస్తూ, ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జీవితకాలం నిషేధించింది. ఈ కేసులో రాజస్థాన్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లు అరెస్టయ్యారు.

 

 చాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 రద్దు

 భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా బోర్డులు నిర్వహిస్తున్న చాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 క్రికెట్ టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు గవర్నింగ్ కౌన్సిల్ జూలై 15న ప్రకటించింది. ఈ టోర్నమెంట్లకు ప్రజాదరణ లేకపోవడంతో మూడు దేశాలు రద్దు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ఈ లీగ్‌ను 2009లో ఏర్పాటుచేశారు.

 

 లాగోస్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాట్మింటన్ చాంపియన్‌షిప్

 మహిళల డబుల్స్ టైటిల్‌ను సిక్కి రెడ్డి, ప్రద్న్యా గాద్రె (భారత్) గెలుచుకున్నారు. నైజీరియాలో జూలై 19న జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో ఒజ్గె బరాక్, నెష్లిహాన్ యిగిట్ (టర్కీ)లను సిక్కీ జోడీ ఓడించింది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను సుమీత్ రెడ్డి, మను అత్రీ(భారత్) జోడీ గెలుచుకుంది. రాబర్ట్ మతెమయెక్, నదియా జీబా(పోలండ్)లు ఫైనల్లో సిక్కి రెడ్డి, తరుణ్ కోనా(భారత్)లను ఓడించి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించారు.

 

 దులీప్ ట్రోఫీని నిలిపేసిన బీసీసీఐ

 క్రికెట్ జోనల్ టోర్నమెంట్ దులీ్‌ప్ ట్రోఫీని ప్రస్తుత సీజన్‌లో కొనసాగించరాదని బీసీసీఐ జూలై 20న ప్రకటించింది. 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ట్రోఫీని ఈ ఏడాది నిర్వహించకూడదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. 1961-62లో దులీప్ ట్రోఫీ మొదలైంది.

 

 ఆర్థికం

 జూన్‌లో -2.4 శాతంగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్ నెలలో -2.4 శాతంగా నమోదైంది. వరుసగా ఎనిమిదో నెల ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదైంది. చమురు ధరలు, కూరగాయల ధరలు తగ్గడం ప్రతికూల ద్రవ్యోల్బణానికి దారితీసింది. ఇది మే నెలలో -2.36 శాతంగా ఉందని జూలై 14న విడుదలైన గణాంకాలు తెలిపాయి.

 

 2015-16లో వృద్ధి రేటు 7.8 శాతం: ఏడీబీ

 ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) భారత జీడీపీ వృద్ధి రేటు 2015-16లో 7.8 శాతంగా కొనసాగుతుందని తెలిపింది. ఏడీబీ జూలై 17న విడుదల చేసిన అంచనాల్లో 2016-17లో భారత వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ వృద్ధిని సానుకూల రుతుపవనాలు, కొత్త పెట్టుబడుల ఆధారంగా అంచనావేసింది. అయితే, అభివృద్ధి చెందుతున్న ఆసియా వృద్ధి రేటును 2015లో ముందు అంచనావేసిన 6.3 శాతం కంటే తక్కువగా (6.1 శాతం) ఉంటుందని తెలిపింది. దక్షిణాసియా వృద్ధి రేటు 2015లో 7.3 శాతంగా ఉంటుందని అంచనావేసింది. దీన్ని గతంలో 7.2 శాతంగా పేర్కొంది.

 

 గ్రీస్ బెయిలవుట్‌కు

 యూరోజోన్ ఆమోదం గ్రీస్ బెయిలవుట్ ప్యాకేజీకి జూలై 13న బ్రసెల్స్‌లో సమావేశమైన యూరోజోన్ నేతలు ఆమోదం తెలిపారు. మూడేళ్లపాటు అమలయ్యే 86 బిలియన్ యూరోల (దాదాపు 96 బిలియన్ డాలర్లు) బెయిలవుట్ ప్యాకేజీని యూరోజోన్ నిర్ణయించింది. ఈ ప్యాకేజీ అందించేందుకు గ్రీసుకు కఠినమైన షరతులు విధించింది. ఇందులో కార్మిక, పెన్షన్ సంస్కరణలు, 50 బిలియన్ యూరోల విలువైన ప్రభుత్వ ఆస్తులు ప్రత్యేక నిధికి బదలాయించడం, ఈయూ బ్యాంకింగ్ చట్టానికి ఆమోదం వంటివి ఉన్నాయి.

 

 సైన్స్ అండ్ టెక్నాలజీ

 స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ గగన్ ప్రారంభం  జీపీఎస్ ఆధారిత దేశీయ జియో ఆగ్మెంటెడ్ నేవిగేషన్ (గగన్) వ్యవస్థను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు జూలై 13న ప్రారంభించారు. ఈ నేవిగేషన్ వ్యవస్థ సైనిక, పౌర విమాన సర్వీసులను సమర్థవంతంగా, తక్కువ వ్యయంతో నిర్వహించేందుకు; భద్రతను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుంది. ఈ వ్యవస్థ బంగాళాఖాతం, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల నుంచి ఆఫ్రికా వరకు విమానయాన దిక్సూచి సేవలను మరింత మెరుగుపరుస్తుంది. దీన్ని రూ.774 కోట్ల వ్యయంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేశాయి.

 

 హెలీనా పరీక్ష విజయవంతం


 హెలికాప్టర్ నుంచి ప్రయోగించే నాగ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఈ పరీక్షను రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జూలై 13న నిర్వహించారు. హెలికాప్టర్ తరహా నాగ్ క్షిపణిని హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్(హెలీనా)గా పేర్కొంటున్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన నాగ్ ఏడు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ప్రస్తుత ప్రయోగంలో క్షిపణిని మూడుసార్లు ప్రయోగించగా, రెండు విజయవంతమయ్యాయి.

 

 సూపర్ కంప్యూటర్ టియాన్-2

 ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన అంతర్జాతీయ కంప్యూటింగ్ సదస్సులో టాప్ 500 అత్యంత వేగవంతమైన కంప్యూటర్ జాబితాలో చైనాకు చెందిన టియాన్-2 మొదటి స్థానంలో నిలచింది. దీన్ని చైనా రక్షణ, సాంకేతిక విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది.

 

 క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష విజయవంతం

 క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్‌ను జూలై 16న తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో విజయవంతంగా పరీక్షించినట్లు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. 19 టన్నుల శక్తి గల ఇంజన్‌ను 800 సెకన్ల పాటు పరీక్షించారు. సి-25గా పిలిచే ఈ ఇంజన్‌ను నాలుగు టన్నుల బరువు గల ఉపగ్రహాలను మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3లో ఉపయోగించనున్నారు. ఇందులో అత్యల్ప ఉష్ణోగ్రతలతో కూడిన ద్రవ హైడ్రోజన్(-253 డిగ్రీల సెంటిగ్రేడ్), ద్రవ ఆక్సిజన్(-193 డిగ్రీ సెంటిగ్రేడ్)లను ఇంధనంగా వినియోగిస్తారు.    

 

 ప్లూటోకు చేరువగా ప్రయాణించిన వ్యోమనౌక

 అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన వ్యోమనౌక జూలై 14న ప్లూటోకు అతి చేరువగా ప్రయాణిస్తూ వెళ్లింది. ఈ క్రమంలో ప్లూటోకు 12,500 కి.మీ. దూరంలో గంటకు 49 వేల కి.మీ. వేగంతో వెళ్లింది. ప్లూటోకు అతిచేరువగా వెళ్లిన తొలి వ్యోమనౌకగా న్యూహోరైజాన్స్‌కు గుర్తింపు దక్కింది. ఈ యాత్రలో ప్లూటో వ్యాసం 2,370 కిలోమీటర్లుగా వ్యోమనౌక నిర్ధారించింది. ప్లూటో పరిమాణంపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. ప్లూటో గురించి అధ్యయనం చేయడానికి 2006లో నాసా న్యూహోరైజాన్స్‌ను ప్రయోగించింది. అప్పటి నుంచి అది 300 కోట్ల మైళ్ల దూరం ప్రయాణించింది.

 

 వార్తల్లో వ్యక్తులు

 సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ మృతి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్(97) అనారోగ్యంతో చెన్నైలో జూలై 14న మరణించారు. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 1200 చిత్రాలకు సంగీతం అందించారు. మరోచరిత్ర, అంతులేని కథ, ఆకలి రాజ్యం, ఇది కథ కాదు వంటి చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

 

 గాయకుడు రామకృష్ణ మృతి

 ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు విస్సంరాజు రామకృష్ణ (68) అనారోగ్యంతో హైదరాబాద్‌లో జూలై 17న మరణించారు. ఆయన సుమారు 200 చిత్రాల్లో అయిదు వేలకుపైగా పాటలు పాడారు. సినీగీతాలనే కాకుండా అనేక భక్తి గీతాలను ఆలపించారు.

 

 అంతర్జాతీయం

 ఆరు అగ్రరాజ్యాలతో ఇరాన్ అణు ఒప్పందం ఇరాన్ ఆరు అగ్రరాజ్యాలతో అణు ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 18 రోజుల చర్చల అనంతరం జూలై 14న అణు ఒప్పందం కుదిరింది. ఈ చర్చల్లో ఇరాన్‌తోపాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, రష్యాలు పాల్గొన్నాయి. అణు బాంబు తయారీ కార్యక్రమాన్ని నిలిపేసేందుకు ఇరాన్ అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో 98 శాతాన్ని తొలగించాలి. అణుకేంద్రాలను, యురేనియం ఉత్పత్తి, నిల్వ కేంద్రాలను, ప్రయోగ కేంద్రాలను అంతర్జాతీయ సమాజం తనిఖీకి అనుమతించాలి. అణ్వాయుధ తయారీకి ఉపయోగపడే ప్లుటోనియం ఉత్పత్తిని నిలిపేయాలి. ప్రతిగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేస్తారు. జప్తు చేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేస్తారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే 65 రోజుల్లో అంతర్జాతీయ ఆంక్షలను పునరుద్ధరిస్తారు.

 

 మంచి ప్రతిష్ట గల దేశం కెనడా

 న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న రెప్యుటేషన్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో 2015 సంవత్సరానికి ప్రపంచంలో మంచి ప్రతిష్ట కలిగిన దేశాల్లో కెనడా మొదటి స్థానంలో నిలిచింది. భారత్ 33వ స్థానంలో ఉంది. మొత్తం 55 దేశాలకు ర్యాంకులు ప్రకటించగా నార్వే, స్వీడన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ 53, చైనా 46వ స్థానాల్లో నిలిచాయి. సమర్థవంతమైన పాలన, మంచి పర్యావరణం, వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల ఆధారంగా దేశాలకు ర్యాంకులు కేటాయించారు.

 

 రాష్ట్రీయం

 తొక్కిసలాటలో 29 మంది మృతి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29మంది మరణించగా, 200 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 24 మంది మహిళలు ఉన్నారు. స్నానాలు చేసేందుకు ఘాట్‌లోకి వెళ్లేందుకు వేలాది మంది ఒకే మార్గం వద్ద గుమికూడడంతో తొక్కిసలాట జరిగింది. జూలై 14న ప్రారంభమైన గోదావరి పుష్కరాల తొలిరోజునే తొక్కిసలాట జరిగింది.



 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top