పార్లమెంటరీ పద్ధతులు – పదజాలం

పార్లమెంటరీ పద్ధతులు – పదజాలం


పార్లమెంటు సమావేశమైనప్పుడు సభలో వివిధ చర్చలు, తీర్మానాలు, ఓటింగ్‌ వంటి ప్రక్రియలు ఉంటాయి. పార్లమెంటులో ఉపయోగించే పదాలకు ప్రత్యేక అర్థాలు ఉంటాయి.



పార్లమెంటరీ ప్రక్రియలో అధిక భాగాన్ని బ్రిటిష్‌ రాజ్యాంగం నుంచి∙గ్రహించారు.



సమావేశ కాలం (Session):    

పార్లమెంటు కార్యక్రమాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి చివరి రోజు వరకు మధ్య ఉన్న కాలాన్ని సమావేశకాలం అంటారు. ఈ మధ్య కాలంలో సభ ప్రతిరోజూ సమావేశమవుతుంది. సభా వ్యవహారాలు కొనసాగుతూ, సమయం ప్రకారం వాయిదా పడుతూ, మళ్లీ కొనసాగుతుంటాయి.



కోరమ్‌ (నిర్దిష్ట పూర్వక సంఖ్య):    

పార్లమెంటు సమావేశమయ్యేందుకు ఉండాల్సిన సభ్యుల కనిష్ట హాజరు(సంఖ్య)ను  కోరమ్‌ అంటారు. ఇది సంబంధిత సభలోని మొత్తం సభ్యుల్లో (సభాధ్యక్షునితో కలిపి) 1/10వ వంతుకు సమానం. కోరమ్‌ కంటే తక్కువ సభ్యులు హాజరైతే సభాధ్యక్షుడు కార్యక్రమాలను కొంతసేపు వాయిదా వేయాలి. కోరమ్‌ ఉందా లేదా అని నిర్ణయించే అధికారం సభాధ్యక్షునికే ఉంటుంది. ప్రçస్తుతం లోక్‌సభలో కోరమ్‌ 55 మంది కాగా, రాజ్యసభలో 25 మంది సభ్యులు.



అజెండా:    

సభలో చర్చించాల్సిన కార్యక్రమాల పట్టికను అజెండా అంటారు. దీన్ని సభా వ్యవహారాల సలహా కమిటీ రూపొందిస్తుంది. సభా కార్యక్రమాలు దీని ప్రకారమే జరుగుతాయి.



డిజల్యూషన్‌ (రద్దు)– ప్రభావం:

లోక్‌సభ పదవీకాలం పూర్తయిన తర్వాత లేదా రాజకీయ అనిశ్చితి తలెత్తినప్పుడు ప్రకరణ 85 ప్రకారం సభను రాష్ట్రపతి రద్దు చేస్తారు. కొత్త లోక్‌సభ కోసం ఎన్నికలు జరుగుతాయి.



లోక్‌సభ రద్దు – బిల్లులపై ప్రభావం:     

లోక్‌సభ పరిశీలనలో ఉన్న బిల్లులు (లోక్‌సభ లోనే ప్రవేశపెట్టినవైనా లేదా రాజ్యసభ నుంచి లోక్‌సభ ఆమోదానికి వచ్చినవైనా) రద్దవుతాయి.



లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభ పరిశీలనలో ఉన్న బిల్లులు కూడా రద్దవుతాయి.  



రాజ్యసభ పరిశీలనలో ఉన్న బిల్లులు లోక్‌సభ ఆమోదానికి రానట్లయితే అవి రద్దుకావు.



ఉభయ సభల ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపిన బిల్లులు రద్దుకావు.



ఉభయ సభల ఆమోదం పొంది రాష్ట్రపతి అనుమతికి పంపిన బిల్లులను ఆయన తిరిగి పార్లమెంటు పునఃపరిశీలనకు పంపిన సమయంలో లోక్‌సభ రద్దయినా సంబంధిత బిల్లులు రద్దు కావు.



ఒక బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశానికి నోటిఫికేషన్‌ ఇచ్చి ఉంటే సంబంధిత బిల్లులు కూడా రద్దుకావు.



వాయిదా

సమావేశకాలం మధ్యలో సభా కార్యక్రమా లను తాత్కాలికంగా నిర్ణీత వ్యవధి వరకు నిలిపివేసి, ఆ తర్వాత కొనసాగించడాన్ని వాయిదా అంటారు. ఉదా: సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు, భోజన విరామం, సెలవులు తదితర సమయాల్లో సభాధ్యక్షుడు సభా కార్యక్రమాలను నిలిపేస్తారు.



నిరవధిక వాయిదా:    

కాలపరిమితి పేర్కొనకుండా సభా సమావేశా లను వాయిదా వేయడాన్ని నిరవ«ధిక వాయిదా అంటారు. సభలను నిరవధికంగా వాయిదా వేసే అధికారం సభాధ్యక్షుడికి ఉంటుంది.



దీర్ఘకాలిక వాయిదా

సభా సమావేశాలు పరిసమాప్తం కావడం/ ముగియడాన్ని దీర్ఘకాలిక వాయిదా అంటారు. దీన్ని రాష్ట్రపతి లేదా గవర్నర్‌ లాంఛన ప్రాయంగా ప్రకటిస్తారు. ఈ సందర్భంలో బిల్లులపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ, నోటీసులు రద్దవుతాయి.



ప్రశ్నోత్తరాల సమయం:

పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిరోజూ మొదటి గంటను ప్రశ్నోత్తరాలకు కేటాయిస్తారు. సభాధ్యక్షులకు సభ్యులు నోటీసు ఇచ్చి, వివిధ అంశాలపై ప్రశ్నలు అడగొచ్చు. సంబంధిత మంత్రులు వాటికి సమాధానం చెబుతారు. ఈ ప్రశ్నలు మూడు రకాలు. అవి..



నక్షత్ర గుర్తు గల ప్రశ్నలు:    

ఈ ప్రశ్నలకు సమాధానాన్ని సంబంధిత మంత్రి మౌఖికంగా ఇస్తారు. అందువల్ల ఒకటి, రెండు అనుబంధ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది.



నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు:

ఈ తరహా ప్రశ్నలకు సంబంధిత మంత్రి  లిఖిత పూర్వక సమాధానం ఇస్తారు. అందువల్ల అనుబంధ ప్రశ్నలకు అవకాశం ఉండదు.



స్వల్ప వ్యవధి ప్రశ్నలు:

అత్యవసర, ప్రజా ప్రాముఖ్యమున్న అంశాలపై మౌఖికంగా అడిగే ప్రశ్నలను స్వల్ప వ్యవధి ప్రశ్నలు అంటారు. సాధారణంగా ఈ ప్రశ్నల కు 10 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి.



జీరో అవర్‌:    

ఈ పదాన్ని పార్లమెంటరీ నియమాలు, పద్ధతుల్లో పేర్కొనలేదు. ఇది పత్రికలు సృష్టించిన పదం. భారత పార్లమెంటరీ ప్రక్రియలో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, ఇతర సభా కార్యక్రమాల ప్రారంభానికి ముందున్న కొద్ది కాలాన్ని జీరో అవర్‌ అంటారు. ఇది సభాధ్యక్షుడి విచక్షణ మేరకు అమలవుతుంది. దీనికి నిర్ణీత గడువు ఉండదు. ఈ సమయంలో ముందస్తు నోటీసు ఇవ్వకుండానే సభ్యులు ప్రశ్నలు అడగొచ్చు. కానీ, సమాధానానికి పట్టుపట్టకూడదు. ఈ పద్ధతిని 1962 నుంచి పాటిస్తున్నారు.



అర్ధ గంట చర్చ:

సభలో అంతకుముందు లేవనెత్తిన అంశం నుంచి ఉద్భవించే కొన్ని ప్రశ్నలపై జరిగే చిన్నపాటి చర్చను అర్ధ గంట చర్చ అంటారు. సాధారణంగా లోక్‌సభలో వారంలో మూడు రోజుల పాటు చివరి అర్ధ గంట చర్చ జరుగు తుంది. రాజ్యసభలో రోజూ సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల మధ్య చర్చ జరుగుతుంది. బడ్జెట్‌ సమావేశాలు జరుగుతు న్నప్పుడు కూడా ఈ చర్చను చేపట్టవచ్చు. ఒక సభ్యుడు ఏదైనా ఒక సమస్యపై చర్చ లేవనెత్తాలనుకుంటే.. ఆ మేరకు సభ సెక్రటరీ జనరల్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.



స్వల్ప వ్యవధి చర్చ:

ముఖ్య ప్రజా సంబంధ అంశాలపై సభ్యులు స్వల్ప వ్యవధి చర్చను లేవనెత్తవచ్చు. ఇందులో ఓటింగ్‌ ఉండదు. సభా కార్యక్రమాల చివరి సమయంలో స్పీకర్‌ దీన్ని అనుమతిస్తారు.



సావధాన తీర్మానం:    

ఇది కూడా స్వతహాగా ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ. 1954 నుంచి అమలుచేస్తున్నారు. దీన్ని పార్లమెంటరీ నియమాల్లో పేర్కొన్నారు. సభాధ్యక్షుడి అనుమతితో అత్యంత ముఖ్యమైన, ప్రజా సంబంధ అంశంపై ప్రభుత్వం నుంచి అధికారపూర్వక సమాధానాన్ని రాబట్టేందుకు సభ్యలు ఈ తీర్మానాన్ని వినియోగిస్తారు. సంబంధిత మంత్రి ఆ నిర్దిష్ట అంశంపై ఒక ప్రకటన చేస్తారు. ఈ తీర్మానంలో చర్చ, ఓటింగ్, ప్రభుత్వంపై విమర్శ ఉండవు. ఒక సభ్యుడు ఒక సమావేశంలో రెండు కంటే ఎక్కువ నోటీసులు ఇవ్వకూడదు.



వాయిదా తీర్మానం:    

ఇది అత్యంత శక్తిమంత తీర్మానం. దీన్ని లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. వాయిదా తీర్మానం కోరుతూ కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్‌/సెక్రటరీ జనరల్‌కు లిఖితపూర్వకంగా ఆ రోజు ఉదయం 10 గంటలలోపు నోటీసు ఇవ్వాలి. దాన్ని స్పీకర్‌ అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అత్యంత మఖ్య సమకాలీన ప్రజా సమస్యలవైపు సభ దృష్టిని మరల్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు. వాయిదా తీర్మానంలో చర్చ, ఓటింగ్‌ ఉంటాయి. ఓటింగ్‌ నెగ్గితే ప్రభుత్వం అభిశంసనకు గురవుతుంది. కానీ, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా చర్చ ముగిసే వరకు సభను వాయిదా వేయరు.



అవిశ్వాస తీర్మానం:

దీన్ని అంతిమ తీర్మానం అని కూడా అంటారు. ప్రకరణ 75 ప్రకారం మంత్రులు సంయుక్తం గా లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. అంటే లోక్‌సభలో మెజారిటీ సభ్యుల విశ్వాసం ఉన్నంత వరకే మంత్రిమండలి అధికారంలో కొనసాగు తుంది. అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. దీని కోసం 50 మంది సభ్యులు సంతకాలు చేసిన నోటీసును స్పీకర్‌కు ఇవ్వాలి. అలాగే సభలో 50 మంది సభ్యులకు తగ్గకుండా ఆ తీర్మానానికి  మద్దతు ప్రకటించాలి. ఈ తీర్మానాన్ని అనుమతించిన తర్వాత.. పది రోజుల వ్యవధిలో స్పీకర్‌‡ నిర్ణయించిన తేదీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్‌ జరుగుతాయి.



 అప్పుడు సభకు హాజరై ఓటు వేసిన వారిలో మెజారిటీ సభ్యులు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే ప్రభుత్వం పడిపోతుంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ప్రత్యేక కారణాన్ని∙సూచించాల్సిన అవసరం లేదు. ఈ తీర్మానం గురించి రాజ్యాంగంలో ప్రత్యక్షంగా పేర్కొనలేదు. ఎన్ని పర్యాయాలైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే సాధారణంగా ఆరు నెలల్లో రెండు కంటే ఎక్కువ అవిశ్వాస తీర్మానాలను అనుమతిం చరు. ఇప్పటి వరకు లోక్‌సభలో 26 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.



మొదటిసారి 1962లో నెహ్రూ ప్రభుత్వంపై ప్రవేశపెట్టారు. కానీ, చర్చకు రాలేదు. రెండోసారి 1963లో నెహ్రూ ప్రభుత్వంపై (జె.బి.కృపలానీ) ప్రవేశపెట్టారు. కానీ, అది వీగిపోయింది. అవిశ్వాస తీర్మానాన్ని అత్యధి కంగా ఇందిరాగాంధీ ప్రభుత్వంపై 15సార్లు ప్రవేశపెట్టారు. తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వంపై 3 సార్లు, లాల్‌బహదూర్‌ శాస్త్రిపై మూడు పర్యాయాలు ప్రవేశపెట్టారు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top