రూల్స్‌ కమిటీ విధులు ఏమిటి?

రూల్స్‌ కమిటీ విధులు ఏమిటి?


పార్లమెంటరీ కమిటీలు సాధారణ కమిటీలు



ప్రభుత్వ హామీల కమిటీ

ఈ కమిటీలను ఉభయ సభలకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు.



లోక్‌సభలో 15 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులుంటారు.



ప్రశ్నోత్తరాల సమయంలో బిల్లులు, తీర్మానాలపై చర్చలు జరిగేటప్పుడు మంత్రులు అనేక హామీలిస్తుంటారు. వాటి అమలు, తదితర విషయాలను ఇది పరిశీలిస్తుంది.



 దత్త శాసనాల కమిటీ (నియోజిత శాసనాల కమిటీ)

ఇది కూడా ఉభయ సభలకు వేర్వేరుగా ఉంటుంది. వీటి చైర్మన్లను ఆయా సభల అధ్యక్షులు నియమిస్తారు. 15 మంది సభ్యులుంటారు. మంత్రులు ఇందులో సభ్యులుగా ఉండకూడదు.



పార్లమెంటు కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసిన శాసనపరమైన అంశాలను, వాటి నిర్మాణంలో ఉన్న చట్టబద్ధతను పరిశీలించడం, లోగడ రూపొందించిన చట్టాల సవరణకు సంబంధించిన ఉత్తర్వులను సభకు సమర్పించేందుకు తగిన అవకాశాలు ఉండేలా చూడటం ఈ కమిటీ ముఖ్య విధులు.



ఈ కమిటీని జి.వి.మౌలాంకర్‌ పార్లమెంట్‌ విధుల రక్షణకర్తగా పేర్కొన్నారు.



ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం

ఇది ఉభయ సభలతో కూడిన సంయుక్త కమిటీ.



ఇందులో మొత్తం 30 మంది సభ్యులుంటారు. 20 మంది లోక్‌సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు.



రాజ్యాంగం, చట్టపరంగా షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు కల్పించిన రక్షణలు, సౌకర్యాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుతెన్నులను పరిశీలిస్తుంది.



ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుల కమిటీ

ఇది లోక్‌సభకే ఉద్దేశించిన ప్రత్యేక కమిటీ. రాజ్యసభలో ఉండదు. డిప్యూటీ స్పీకర్‌ (చైర్మన్‌గా ఉంటారు)తో కలుపుకొని 15 మంది సభ్యులుంటారు. ఇది ప్రైవేట్‌ మెంబర్ల బిల్లులను పరిశీలించి సూచనలిస్తుంది.



రూల్స్‌ కమిటీ

లోక్‌సభకు, రాజ్యసభకు వేర్వేరు కమిటీలుంటాయి. లోక్‌సభలో 15 మంది, రాజ్యసభలో 16 మంది సభ్యులుంటారు. ఆయా సభాధ్యక్షులే హోదా రీత్యా చైర్మన్లుగా ఉంటారు. సభా కార్యక్రమాలకు సంబంధించిన నియమ నిబంధనలపై ఇది తగిన సవరణలను సూచిస్తుంది.



జనరల్‌ పర్పస్‌ కమిటీ

ఉభయ సభలకు వేర్వేరుగా ఈ కమిటీలుంటాయి. ఆయా సభల అధ్యక్షులు వీటికి చైర్మన్లుగా ఉంటారు. వీటిలో ఇతర సభ్యులతోపాటు డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్, స్థాయీ సంఘాల చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ఆయా పార్లమెంటు కమిటీల పరిధిలోకి రాని విషయాలను అవసరాన్ని బట్టి ఈ కమిటీకి నివేదిస్తారు.



ఎథిక్స్‌ కమిటీ

ఉభయ సభలకు వేర్వేరుగా ఉంటుంది. రాజ్యసభలో 1997లో, లోక్‌సభలో 2000లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా సభ్యుల సంఖ్య మారుతుంది. సభలో సభ్యుల ప్రవర్తన, పనితీరు, సభా విలువలు తదితర అంశాలపై సూచనలు చేస్తుంది.



మహిళా సాధికారత కమిటీ

ఈ కమిటీ ఉభయ సభలకు సంయుక్తంగా ఉంటుంది. 1997లో ఏర్పాటుచేశారు. ఇందులో 30 మంది సభ్యులుంటారు. 20 మంది లోక్‌సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు.



జాతీయ మహిళా కమిషన్‌ నివేదికలను పరిశీలించడం, మహిళా సాధికారత, సమానత్వం కోసం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించడం ఈ కమిటీ విధులు.



లైబ్రరీ కమిటీ

ఇది సంయుక్త కమిటీ. 9 మంది సభ్యులుంటారు. లోక్‌సభ నుంచి 6 మంది, రాజ్యసభ నుంచి ముగ్గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. పార్లమెంటు లైబ్రరీ, అందులోని వసతులు, సేవలకు సంబంధించిన విషయాలను ఇది పరిశీలిస్తుంది.



సభ్యుల గైర్హాజరు కమిటీ

ఇది లోక్‌సభకే ప్రత్యేకించిన కమిటీ. ఇందులో 15 మంది సభ్యులుంటారు. సభ్యుల అనుమతి పత్రాలను పరిశీలిస్తుంది.



సభ్యుల జీతభత్యాలపై కమిటీ

ఇది సంయుక్త కమిటీ. మొత్తం 15 మంది సభ్యులుంటారు. లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు. సభ్యుల జీతభత్యాలకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిస్తుంది.



లాభదాయక పదవుల కమిటీ

ఇది ఉభయ సభల సంయుక్త కమిటీ. మొత్తం 15 మంది సభ్యులుంటారు. 10 మంది లోక్‌సభ నుంచి, 5 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. లాభదాయక పదవులు, సభ్యుల అనర్హతలు తదితర అంశాలను పరిశీలిస్తుంది.



డిపార్ట్‌మెంటల్‌ స్టాండింగ్‌ కమిటీలు

లోక్‌సభ రూల్స్‌ కమిటీ సిఫారసుల మేరకు 1993లో 17 డిపార్ట్‌మెంటల్‌ స్టాండింగ్‌ కమిటీలను మొట్టమొదటిసారి ఏర్పాటు చేశారు. 2004లో వీటి సంఖ్యను 24కు పెంచారు. ప్రతి కమిటీలో 31 మంది సభ్యులుంటారు. 20 మంది లోక్‌సభ నుంచి, 11 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ కమిటీ సభ్యులను ఆయా సభల అధ్యక్షులు నామినేట్‌ చేస్తారు. మంత్రులు సభ్యులుగా ఉండటానికి అనర్హులు. ఈ కమిటీల పదవీ కాలం ఏడాది. మొత్తం 24 కమిటీల్లో 16 కమిటీలు లోక్‌సభ ఆధ్వర్యంలో, మిగిలిన 8 కమిటీలు రాజ్యసభ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.



విధులు: వివిధ మంత్రిత్వ విభాగాలు, శాఖలు సమర్పించిన పద్దులను పరిశీలించడం.



వివిధ మంత్రిత్వ శాఖల బిల్లులను పరిశీలించడం, అలాగే వాటి వార్షిక నివేదికలు, మౌలిక విధానాలను పరిశీలించడం.



సంప్రదింపుల కమిటీ

ప్రతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉభయ సభలకు చెందిన సభ్యులతో ఈ కమిటీలు ఏర్పాటవుతాయి. లోక్‌సభ సాధారణ ఎన్నికల తర్వాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఇవి ఆయా మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ప్రస్తుతం 32 కమిటీలున్నాయి. మంత్రులు, పార్లమెంటు సభ్యుల మధ్య వివిధ విషయాలపై చర్చలు జరిపించడం, పథకాలను రూపొందించే ప్రక్రియ, వాటి అమల్లో తగిన సూచనలు చేయడం ఈ కమిటీల విధులు.



జాయింట్‌ పార్లమెంటరీ కమిటీలు (జేపీసీ)

సమకాలీన సమస్యలు, ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపేందుకు పార్లమెంట్‌ ఉభయ సభల సభ్యులతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేస్తారు. సంబంధిత విషయాలపై నివేదిక సమర్పించగానే ఇవి రద్దవుతాయి.



జేపీసీకి సంబంధించి కూడా రాజ్యాంగ ప్రస్తావన లేదు. పార్లమెంటులో ఆయా శాఖలకు సంబంధించిన శాశ్వత కమిటీలు, ప్రత్యేక అంశాలపై వేసే తాత్కాలిక కమిటీలు ఉంటాయి. జేపీసీలు తాత్కాలిక కమిటీల విభాగంలోకి వస్తాయి. ఉభయ సభల తీర్మానాల ద్వారా లేదా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ల పరస్పర అవగాహన ద్వారా జేపీసీలను ఏర్పాటు చేయొచ్చు. సుమారు 15–30 మందిని సభ్యులుగా తీసుకోవచ్చు. అధికారపక్ష సభ్యుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ.



 ఇప్పటివరకు వేసిన జేపీసీలు – వాటి అంశాలు

బోఫోర్స్‌ కుంభకోణం (1987, ఆగస్టు 6): అధ్యక్షులు–శంకరానంద (కాంగ్రెస్‌). 50 సార్లు సమావేశమైంది.1998, ఏప్రిల్‌ 26న ఇచ్చిన నివేదికను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి.



♦  స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణం/హర్షద్‌ మెహతా కుంభకోణం (1992, ఆగస్టు 6): అధ్యక్షులు– రాంనివాస్‌ మీర్దా (కాంగ్రెస్‌). 105 సార్లు సమావేశమైంది. 1993, డిసెంబర్‌ 21న నివేదిక ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం ఆమోదించలేదు, తిరస్కరించలేదు.



♦  కేతన్‌ పరేఖ్‌ కుంభకోణం/స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణం(2001, ఏప్రిల్‌ 26): అధ్యక్షులు–ప్రకాశ్‌ మణి త్రిపాఠి (భారతీయ జనతాపార్టీ). 109 సార్లు సమావేశమైంది. మొత్తం సభ్యుల సంఖ్య 30. లోక్‌సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. 2002, డిసెంబర్‌ 19న నివేదిక సమర్పించింది. స్టాక్‌ మార్కెట్ల నియంత్రణలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.



♦  శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు (2003, ఆగస్టు 8): అధ్యక్షుడు – శరద్‌ పవార్‌ (నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌). 17 సార్లు సమావేశమైంది. మొత్తం సభ్యుల సంఖ్య 15. లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది సభ్యులు నియమితులయ్యారు. 2004, ఫిబ్రవరి 4న నివేదిక ఇచ్చింది. శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు నిజమేనని తేల్చింది. ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ఏర్పడింది.



2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం (2011, మార్చి 1): అధ్యక్షులు – పి.సి.ఛాఖో (కాంగ్రెస్‌). మొత్తం సభ్యుల సంఖ్య 30. లోక్‌సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు.



పార్లమెంటరీ కమిటీలు – ప్రభావం

♦  పార్లమెంటరీ కమిటీలు, భారత రాజకీయ వ్యవస్థను మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును నిరంతరం సమీక్షిస్తూ, పాలన యంత్రాంగం సమర్థంగా పనిచేయడానికి తోడ్పడుతున్నాయి. నిరంతర పర్యవేక్షణ ద్వారా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పార్లమెంటుకు బాధ్యత వహించేలా చూస్తూ, దుబారా, లంచగొండితనం, పక్షపాత వైఖరి, బాధ్యతారాహిత్య ధోరణులను సాధ్యమైనంతవరకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. అవి అందించే వార్షిక నివేదికలు సభ్యులకు, ప్రజానీకానికి చాలా ఉపయోగపడుతున్నాయి.



♦  ఇటీవలి కాలంలో ఈ కమిటీలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాయనే ఆరోపణ ఉంది. నానాటికీ క్లిష్టమవుతున్న పాలనా కార్యక్రమాలను సక్రమంగా అవగాహన చేసుకొని నియంత్రించే శక్తి సామర్థ్యాలు, ఉత్సాహం సభ్యుల్లో లేకపోవడం, పార్లమెంటుకు తగిన సమయం ఉండకపోవడం, దత్త శాసనాలు, ఆర్డినెన్సులు, సమర్థ ప్రతిపక్షం లేకపోవడం, బడ్జెట్‌లో ఇమిడి ఉన్న క్లిష్ట ప్రక్రియ తదితరాలు వీటి పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి.



  శాసనసభా కమిటీలు ఆధునిక కాలంలో మినీ శాసనసభలుగా అవతరించాయని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయవేత్త ఉడ్రోవిల్సన్‌ అభిప్రాయపడ్డారు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top