కొలువు కోసం ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ గ్రూప్

కొలువు కోసం ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ గ్రూప్


ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆన్‌లైన్    వేదికల ద్వారానే జరుగుతోంది. కొలువుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నెట్‌వర్కింగ్ వ్యూహంలో భాగంగా ఆన్‌లైన్‌లో కంపెనీలు, రిక్రూట ర్లు, సంబంధిత రంగాల వ్యక్తులతో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి. దీనివల్ల మీకు జాబ్ మార్కెట్‌లో వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది.

 

 అంతర్జాలంలో మీ స్థానం: మంచి నెట్‌వర్క్‌తో అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. మీ రంగానికి చెందిన ప్రొఫెషనల్స్‌తో కనెక్ట్ కావడం వల్ల పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు, ఉద్యోగాల భర్తీ, కెరీర్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన పెరుగుతుంది. తాజా సమాచారం తెలుసుకోవచ్చు. రొటీన్ హైరింగ్ ప్రాసెస్ పట్ల రిక్రూటర్లు కూడా విసుగెత్తిపోయారు. పోస్టుల్లో వచ్చే అభ్యర్థుల అర్హతల జాబితాలను పక్కన పడేసి అంతర్జాలంలో వారి బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తున్నారు. కాబట్టి మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు మీరు కూడా ఆన్‌లైన్‌లో మీ కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోండి. జాబ్ నెట్‌వర్కింగ్ గ్రూపుల్లో చేరండి. వాటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనండి. మీ ప్రొఫెషన్‌కు చెందినవారితో కలిసి ఒక జట్టుగా మారండి. కావాల్సిన సమాచారాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోండి.

 

 గ్రూప్‌తో ప్రయోజనాలెన్నో.. : జాబ్ సైట్లలో ప్రొఫైల్‌ను పోస్టు చేయడం, నెట్‌వర్కింగ్ గ్రూప్‌లో చేరడం.. ఈ రెండూ ఒకటేనని చాలామంది అపోహ పడుతుంటారు. నిజానికి ఇవి పూర్తిగా భిన్నం. ఆన్‌లైన్ గ్రూప్‌లో చేరితే రిక్రూటర్లు, సహచరుల నుంచి తాజా సమాచారం తెలుస్తుంది. ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్, నియామక విధానం పట్ల అవగాహన వస్తుంది. దాని ప్రకారం సన్నద్ధం కావొచ్చు. కెరీర్‌ను మార్చుకోవడానికి కూడా ఈ గ్రూప్స్ ఉపయోగపడతాయి.  ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ గ్రూప్ కూడా ఒక మౌఖిక పరీక్ష లాంటిదే. మీ అర్హతలు, అనుభవాలు, నైపుణ్యాలతో రిక్రూటర్‌ను మెప్పించగలిగితే ప్రయత్నం సఫలం కావడం ఖాయం. గ్రూప్‌లో మిమ్మల్ని మీరు ప్రభావవంతంగా వ్యక్తీకరించుకోవాలి. మీ ప్రొఫెషనల్ ప్రొఫైల్ రిక్రూటర్లను ఆకట్టుకొనేలా ఉండాలి.  

 

 వ్యక్తిగత విషయాలు వద్దు : ఇతరుల అవసరం మీకే కాదు, మీ అవసరం కూడా ఇతరులకు ఉంటుంది. ఏదైనా సంస్థలో కొలువులు ఖాళీగా ఉన్నట్లు మీకు తెలిస్తే సదరు సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. అది వారికి ఉపయోగపడుతుంది. వివరాలను ఆన్‌లైన్‌లో పోస్టు చేయండి. అందరికీ అవసరమైన స్కిల్ బిల్డింగ్, కెరీర్ అడ్వాన్స్‌మెంట్‌పై ఆసక్తికర సమాచారం ఏదైనా ఇవ్వొచ్చు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేస్తూ మరో ఉద్యోగం కోసం ప్రయత్నించేటప్పుడు నెట్‌వర్కింగ్ గ్రూప్‌ను వాడుకోండి. కానీ, ప్రస్తుత యాజమాన్యం గురించి చెడు ప్రచారం చేయకండి. జాబ్, కెరీర్ వంటి అంశాలకే ఈ గ్రూప్‌లను పరిమితం చేయాలి. పర్సనల్ విషయాలను పబ్లిక్‌లోకి తీసుకురావొద్దు. ఎల్లప్పుడూ పాజిటివ్ ప్రొఫెషనల్ ఇమేజ్‌నే కొనసాగించాలి. ఉద్యోగం దక్కిన తర్వాత కూడా నెట్‌వర్కింగ్ గ్రూప్‌తో అనుబంధం ఎప్పటిలాగే ఉండడం మంచిది. ఇది లాంగ్‌టైమ్ జాబ్ ఇన్సూరెన్స్ లాంటిది. ఈ గ్రూప్ ప్రతిదశలో మీకు అండగా నిలుస్తుంది. కెరీర్‌లో ఎదగడానికి తోడ ్పడుతుంది.

 

 విద్యార్థినులు విజ్ఞాన వారధులు

 ఆరోగ్యం నుంచి అగ్ని పరీక్షల వరకూ.. అన్నింటా విజ్ఞానానిదే ప్రధాన భాగస్వామ్యం. తరగతి గదిలో విద్యార్థి మదిలో మెదిలే ఆలోచనలే పరిశోధనలతో ఫలవంతమవుతున్నాయి. తాము కూడా ఇదే దారిలో ఉన్నామంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్(కోఠి ఉమెన్స్ కాలేజీ) విద్యార్థినులు. కళాశాల 90వ వార్షికోత్సవం సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పలు ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాంకేతికత, సృజనాత్మకత, బృందస్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకోవడంతోపాటు విజ్ఞానాన్ని పంచుతోంది. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను విద్యార్థినులు తమ ప్రదర్శన ద్వారా తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్, కొత్త అంశాలను నేర్చుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్, నేర్పు, ఓర్పు పెంపొందుతాయంటున్నారు కాలేజీ విద్యార్థినులు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన నేడు కూడా ఉంటుందని వెల్లడించారు.

 

 ఆర్‌ఆర్‌బీ -సికింద్రాబాద్

 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ)-సికింద్రాబాద్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  సీనియర్ సెక్షన్ ఇంజనీర్  చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటిండెంట్:

  జూనియర్ ఇంజనీర్  డిపో మెటీరియల్ సూపరింటిండెంట్

  కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్. ఎంపిక: రాత పరీక్ష ద్వారా.

 విభాగాల వారీగా పోస్టులు, అర్హతలు, వయోపరిమితి.. తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.

 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబర్ 19

 రాతపరీక్ష తేదీలు:

 జూనియర్ ఇంజనీర్, డీఎంఎస్, సీఎంఏ: డిసెంబర్ 14

 సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పోస్టులకు: డిసెంబర్ 21

     వెబ్‌సైట్: http://rrbsecunderabad.nic.in

 

  కాంపిటీటివ్ కౌన్సెలింగ్

 డీఎస్సీ, టెట్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు మెథడాలజీ విభాగంలో మంచి మార్కులు సాధించడానికి ఏవిధంగా చదవాలి?

 - ఎల్.గాయత్రి, విద్యానగర్

 టెట్, డీఎస్సీ, మోడల్ స్కూల్స్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు బోధనా పద్ధతులు సబ్జెక్టును తప్పనిసరి చేశారు. ర్యాంకు సాధనలో ఈ విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో ప్రతి మార్కు కీలకమే కాబట్టి అభ్యర్థులు తెలుగు మెథడాలజీపై ప్రత్యేక దృష్టి సారించి చదవాలి. దీంట్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఎస్‌జీటీ, గ్రేడ్-2 తెలుగు పండిట్స్ పోస్టుల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ‘డీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’; బీఎడ్, టీపీటీ చేసి స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసే వారు ‘బీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. టెట్, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలన్నింటిలో తెలుగు మెథడాలజీ సిలబస్‌కు సంబంధించి కింద పేర్కొన్న పాఠ్యాంశాలున్నాయి.

 

 1. భాష - వివిధ భావనలు

 2. మాతృభాష బోధన - లక్ష్యాలు, స్పష్టీకరణలు

 3. భాషా నైపుణ్యాలు

 4. ప్రణాళికా రచన - పాఠ్య గ్రంథాలు

 5. పాఠ్య బోధన ప్రక్రియలు

    - ఆధునిక బోధన పద్ధతులు

 6. విద్యా సాంకేతిక శాస్త్రం

    - సహ పాఠ్య కార్యక్రమాలు

 7. మూల్యాంకనం - పరీక్షలు

 తెలుగు మెథడాలజీ అనేది తరగతి గదిలో మాతృభాషా బోధనకు సంబంధించింది. కాబట్టి పద్య, గద్య, వ్యాకరణ, ఉపవాచక బోధనలు, వాటికి సంబంధించిన పాఠ్య పథకం, సోపాన క్రమం, తరగతి గదిలో సందర్భానుసారంగా ప్రదర్శించే బోధనోపకరణాలు, మూల్యాంకనం - పరీక్షల నిర్వహణ మొదలైన అంశాలపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించి చదివితే మంచి మార్కులు సాధించవచ్చు.     

 ఇన్‌పుట్స్: ఎన్.కె. మద్దిలేటి,

  -   సీనియర్ ఫ్యాకల్టీ

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top