విదేశీ విద్యకు ప్రవేశ పరీక్షలెన్నో..

విదేశీ విద్యకు ప్రవేశ పరీక్షలెన్నో..


విదేశీ విద్య ఇప్పుడు ప్రతి ఒక్కరి కల. విదేశాలకు వెళ్లి తమకు నచ్చిన కోర్సులు అభ్యసించి..  భావి జీవితానికి బలమైన పునాదులు వేసుకోవాలని విద్యార్థులు ఆశిస్తారు. ముఖ్యంగా  విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఇందులోనూ

 అందరూ మొదటి గమ్యంగా భావించే అమెరికాకు వెళ్లేవారి సంఖ్య చాలా ఎక్కువ.  ఫారిన్ చదువుల కోసం ఏ దేశ నగరాల నుంచి అమెరికాకు ఎక్కువమంది విద్యార్థులు  వస్తున్నారో తెలుసుకోవడానికి ఇటీవల అమెరికాకు చెందిన బ్రూకింగ్ ఇన్‌స్టిట్యూట్

 ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 26,220 మంది విద్యార్థులతో ప్రపంచవ్యాప్తంగా  ఐదోస్థానంలో, దేశంలో మొదటి స్థానంలో నిలిచింది హైదరాబాద్. ఈ నేపథ్యంలో  విదేశీ విద్యను అభ్యసించాలంటే రాయాల్సిన పరీక్షల గురించి తెలుసుకుందాం..

 

 టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ (టోఫెల్)

ఇది ప్రాథమిక స్థాయి ఆంగ్ల పరీక్ష. అమెరికాలోని యూనివర్సిటీలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కెనడా, బ్రిటన్, సింగపూర్ సహా 130 దేశాలు, దాదాపు 9000 పైగా కాలేజీలు, యూనివర్సిటీలు టోఫెల్ స్కోరు ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. పరీక్ష స్కోర్ కార్డ్ రెండేళ్లపాటు చెల్లుతుంది. టోఫెల్‌లో వచ్చిన స్కోరు ఆధారంగా ఆయా దేశాలు వీసా, స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ కూడా ఇస్తున్నాయి. పరీక్ష వ్యవధి నాలుగున్నర గంటలు. లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అంశాలపై ప్రశ్నలడుగుతారు. ప్రతి సెక్షన్‌కు 30 పాయింట్ల చొప్పున మొత్తం పాయింట్లు 120. పరీక్ష ఫీజు: 170 యూఎస్ డాలర్లు. ఏడాదిలో ఎప్పుడైనా ఆన్‌లైన్, ఫోన్, ఈమెయిల్ లేదా టోఫెల్ ఐబీటీ రిసోర్స్ సెంటర్‌కు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: www.ets.org/toefl

 

 స్కాలాస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్ (శాట్)

 విదేశాల్లో.. ముఖ్యంగా యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ)లో అండర్‌గ్రాడ్యుయేట్/బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ చదవాలనుకునేవారు రాయాల్సిన పరీక్ష స్కాలాస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్ (శాట్). ఈ స్కోర్ ఆధారంగా యూజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే వాటిలో కెనడా, ఆస్ట్రేలియా, యునెటైడ్ కింగ్‌డమ్ వంటి దేశాలున్నాయి. స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ అందించడానికి కూడా ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. శాట్‌ను యూఎస్‌ఏలోని కాలేజ్ బోర్డ్, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 20 లక్షలమంది శాట్ రాస్తున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో స్పెషలై జేషన్ చేయాలనుకునేవారు శాట్ సబ్జెక్ట్ టెస్టులు రాయాలి. 2016 నుంచి శాట్ పరీక్ష విధానంలో మార్పులు రానున్నాయి. సంవత్సరంలో ఆరుసార్లు (జనవరి, మే, జూన్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఏడాదిలో రెండుసార్లకు మించి రాయడానికి అవకాశం లేదు. 12 ఏళ్ల ఎడ్యుకేషన్.. అంటే ఇంటర్మీడియెట్ (10+2) పూర్తిచేసినవారు శాట్‌కు అర్హులు. మూడు గంటల 45 నిమిషాల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్. వీటిల్లో అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలడుగుతారు. శాట్ స్కోర్ పరీక్ష రాసిన నాటి నుంచి ఐదేళ్లపాటు చెల్లుతుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుం కింద 51 యూఎస్ డాలర్లు, ఇతర రుసుంల కింద 40 యూఎస్ డాలర్లు చెల్లించాలి. సబ్జెక్టు టెస్టులు రాసేవారు నిర్దేశిత ఫీజులు పే చేయాలి. వెబ్‌సైట్: http://sat.collegeboard.org/

 

 గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్)

 ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల్లో ఎంబీఏ, ఇతర బిజినెస్ మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే రాయాల్సిన పరీక్ష గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్). దీన్ని యూఎస్‌లోని గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 యూనివర్సిటీలు బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఆయా కోర్సుల్లో స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ అందించడానికి జీమ్యాట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పరీక్షా విధానం: మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో వెర్బల్ (41 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ (37 ప్రశ్నలు), ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ (12 ప్రశ్నలు)తోపాటు అనలిటికల్ రైటింగ్‌పైన ప్రశ్నలుంటాయి. పరీక్ష ఫీజు 250 డాలర్లు. మన దేశ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, కెనడా, ఫిన్‌లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే, యూఎస్‌లలోని ప్రముఖ కాలేజీలు/యూనివర్సిటీలు జీమ్యాట్ స్కోర్ ఆధారంగానే గ్రాడ్యుయేట్ బిజినెస్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.

 

  మనదేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు, బిట్స్ పిలానీ, ఐఎస్‌బీ-హైదరాబాద్, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ-జంషెడ్‌పూర్, మైకా-అహ్మదాబాద్, ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వంటి ప్రముఖ సంస్థలు జీమ్యాట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. జీమ్యాట్ రాసేవారికి కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. పరీక్ష తేదీ నాటికి కనీసం వారం రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక ఏడాదిలో గరిష్టంగా ఐదుసార్లు పరీక్ష రాయొచ్చు. ఒకసారి పరీక్ష రాస్తే 31 రోజుల తర్వాత మాత్రమే మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం లభిస్తుంది. ఈ స్కోర్ ఐదేళ్లపాటు చెల్లుతుంది. సాధారణంగా ఈ మొత్తం స్కోర్ 200 నుంచి 800 మధ్యలో ఉంటుంది. ప్రధాన బీ-స్కూల్స్‌లో ప్రవేశానికి కనీస స్కోరు ప్రకటించనప్పటికీ 600-700 వరకు మంచి స్కోరుగా భావించొచ్చు. ఆన్‌లైన్, ఫోన్, పోస్టల్ మెయిల్ ద్వారా సంవత్సరమంతా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: www.mba.com/india

 

 అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ)

 అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ) స్కోర్‌ను యూఎస్ కాలేజీల్లో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. యూఎస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరాలనుకునేవారు శాట్ లేదా ఏసీటీ రాసుకోవచ్చు. ఎందులో ఎక్కువ స్కోర్ వస్తే దాని ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగేళ్ల కోర్సులను అందించే అమెరికన్ యూనివర్సిటీలు, కళాశాలలన్నీ ఏసీటీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కెనడాలోని కొన్ని విద్యా సంస్థలు కూడా ఏసీటీ ఆధారంగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఏసీటీని ఏడాదికి ఆరుసార్లు నిర్వహిస్తారు. దాదాపు మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో ఇంగ్లిష్ (75 ప్రశ్నలు), మ్యాథ్స్ (60 ప్రశ్నలు), రీడింగ్ (40 ప్రశ్నలు), సైన్స్( 40 ప్రశ్నలు), వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 వెబ్‌సైట్: www.actstudent.org

 

 ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్‌టీఎస్)

 అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఫిన్‌లాండ్ వంటి దేశాల యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం 130 దేశాల్లో 900 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. నెలకు నాలుగుసార్లు చొప్పున ఏడాదికి 48 సార్లు పరీక్ష ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 9000 సంస్థలు ఐఈఎల్‌టీఎస్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వీటిలో వివిధ యూనివర్సిటీలు, ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, ఇతర సంస్థలు ఉన్నాయి.

 

 అంతేకాకుండా పని కోసం ఇతర దేశాలకు వెళ్లేవారు కూడా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండు గంటల 45 నిమిషాల వ్యవధిలో అభ్యర్థుల ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలను తెలుసుకునే విధంగా లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అంశాలపై పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగంలో కనీసం 1-9 వరకు స్కోర్ సాధించాలి. అన్ని విభాగాల్లో సాధించిన స్కోర్ ఆధారంగా సగటు స్కోరును లెక్కిస్తారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలమంది ఈ పరీక్ష రాశారు. స్కోర్ రెండేళ్లపాటు చెల్లుతుంది. ఫీజు: రూ. 9,900. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: www.ielts.org

 

 ది గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్‌ఈ)

 ది గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్‌ఈ) రివైజ్డ్ జనరల్ టెస్ట్.. విదేశాల్లో ఉన్నత విద్యావకాశానికి మార్గం వేసే పరీక్ష. విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, డాక్టోరల్ కోర్సులు చదవాలనుకునేవారు ఈ పరీక్ష రాయాలి. అమెరికాలోని గ్రాడ్యుయేట్ స్కూల్స్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 3,200 ఇన్‌స్టిట్యూట్‌లు జీఆర్‌ఈ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ ఎంపికకు కూడా ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. జీఆర్‌ఈని ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో..850 కేంద్రాల్లో నిర్వహిస్తారు. పరీక్ష రాయడానికి మూడు వారాల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.

 

  ఏడాదిలో ఐదుసార్లు జీఆర్‌ఈ రాయొచ్చు. ఒక్కో పరీక్ష మధ్య కనీసం 21 రోజుల వ్యవధి ఉండాలి. గతంలో రాసిన పరీక్షలో వచ్చిన స్కోర్‌ను మెరుగుపర్చుకొనేందుకు మళ్లీ టెస్టు రాయొచ్చు. కంప్యూటర్/పేపర్ ఆధారిత విధానాల్లో పరీక్ష ఉంటుంది. అనలిటికల్ రైటింగ్, వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్‌లపై ప్రశ్నలడుగుతారు. పరీక్ష వ్యవధి దాదాపు గంటన్నర. సంబంధిత సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్ చేయాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా జీఆర్‌ఈ సబ్జెక్టు టెస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏడాదిలో మూడుసార్లు (సెప్టెంబర్, అక్టోబర్, ఏప్రిల్) రాసుకునే సదుపాయం ఉంది. జీఆర్‌ఈ స్కోర్ పరీక్ష రాసిన నాటి నుంచి ఐదేళ్లపాటు చెల్లుతుంది.  వివరాలకు: www.ets.org/gre

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top