పనిచేసే చోట పదిలంగా..!

పనిచేసే చోట పదిలంగా..!


ఉద్యోగమే ఒక వైకుంఠపాళి.. ఇక్కడ కెరీర్‌కు ఊతమిచ్చే నిచ్చెనలే కాదు.. సమయం వచ్చినప్పుడు కిందకు తోసేసేవి కూడా ఉంటాయి. దీన్నుంచి తప్పించుకోలేం. తప్పక ఎదుర్కోవాల్సిందే! మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని పోరాటమిది. ఎదురు దెబ్బలుంటాయి, బెదురు పరుగులుంటాయి.ఇక్కడ పనికి సంబంధించిన ఒత్తిళ్లు ఒక ఎత్తయితే.. మానవీయ సమస్యలు ఇంకోవైపు. వీటన్నింటినీ అధిగమించి కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం ఎలాగో

తెలుసుకుందాం...



కష్టపడి పని చేయడం మానాలి

చిన్నప్పటి నుంచి ఎవరూ మనకు ఆనందంగా చదువుకోమని, ప్రేమగా పని చేయమని చెప్పి ఉండరు. అందరూ ‘కష్టపడి చదవండి.. కష్టపడి పనిచేయండి’ అనే చెబుతారు. అందుకే మనం ప్రతి పనీ కష్టపడి చేస్తాం. జీవితం, ఉద్యోగం, వ్యాపారం.. ఏదీ సులభం కాదని అసంతృప్తితో బతుకుతుంటాం. ఆఫీసులోనూ, ఉద్యోగం విషయంలోనూ ఇదే చేస్తాం. చివరకు చుట్టూ ఉన్నవారిపై అసంతృప్తితో రగిలిపోతుంటాం. నిజానికి ప్రతిదీ కష్టపడి చేయడమనేది అహానికి నిదర్శనం. ఎందుకంటే.. అందరికన్నా ఒక మెట్టు పైన ఉండాలన్నదే దానికున్న ఏకైక లక్షణం. ఇది సహజంగానే అసంతృప్తికి మూల కారణమవుతుంది. అలాకాకుండా చేసే ప్రతి పనీ ఆనందంగా, ఇష్టంతో చేస్తే చేసినట్లే అనిపించదు. కాబట్టి కష్టపడి పని చేయడం మాని... ఇష్టపడి చేయడం అలవాటు చేసుకోవాలి.  



పోటీని దాటి వెళ్లాలి

ప్రస్తుతం ప్రపంచమంతటా ఎక్కడ చూసినా.. విపరీతమైన పోటీ! ప్రతి ఒక్కరూ ఇతరులను మించిపోవాలనే పరుగు పెడుతుంటారు. ఆ పోటీ వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు మాత్రం సుముఖంగా ఉండరు. అలాకాకుండా మనం చేసే ప్రతి పనికీ ఒక పర్యవసానం ఉంటుందని గ్రహించాలి. ఇతరుల కంటే ముందుండాలని కోరుకోకుండా... మనకున్న శక్తిసామర్థ్యాల గురించి ఆలోచించుకోవాలి. వేగంగా పనిచేస్తూనే కచ్చితత్వం ఉండేలా చూసుకోవాలి. మనల్ని నిరుత్సాహ పరిచే అంశాలు ఎన్ని ఉన్నా.. అన్నింటినీ తట్టుకుని ముందుగు సాగాలి. అప్పుడే కెరీర్‌ గ్రాఫ్‌ సజావుగా సాగుతుంది. సంస్థలో మంచి గుర్తింపు వస్తుంది.



స్వచ్ఛంద కార్యకర్తలా ఉండాలి

మనం స్వచ్ఛంద సేవ చేసినప్పుడు.. ఆ సేవను ఒక సమర్పణగా భావిస్తాం. అయితే ఇంట్లో లేదా ఆఫీసులో చేసే అదే పని భారంగా అనిపిస్తుంది. కారణం.. చేసే పని ఒకటే అయినా చేసే విధానంలో తేడా ఉంటుంది. అందుకని ఆఫీసులో చేసే ప్రతి పనీ ఒక సమర్పణగా భావించాలి. ఎల్లప్పుడు ఒక స్వచ్ఛంద కార్యకర్తలా వ్యవహరించాలి. ఇక్కడ స్వచ్ఛందం అంటే ఇష్టంగా అని అర్థం. స్వచ్ఛంద కార్యకర్త అంటే.. అన్ని రకాల పరిస్థితులను అంగీకరించి.. ప్రతి క్షణాన్ని సరైన రీతిలో ఇష్టంగా నిర్వహించడం. అయిష్టత ఏర్పడిన మరుక్షణం జీవితంలో ఎంతో అద్భుతం జరగబోతున్నా.. ఓడిపోతున్నామనే భావన కలుగుతుంది.



స్వీయ విశ్లేషణ చేసుకోవాలి

మనిషి తన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండాలని కోరుకోడు. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిగత జీవితంలోనూ విజయం సాధించాలని.. అత్యున్నత స్థాయికి ఎదగాలని నిరంతరం తపిస్తుంటాడు. కానీ, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోలేక ఎన్నో పొరపాట్లు చేస్తుంటాడు. ఆ సమయంలో మనలో మనకే తెలియని ఒక శూన్యత, అభద్రతా భావం, అసంతృప్తి అలముకుంటాయి. అలాంటప్పుడు మనకున్న శక్తిసామర్థ్యాలను, అనుకూల, ప్రతికూలతలను, మనం చేస్తున్న తప్పొప్పులను విశ్లేషించుకోవడం చాలా ముఖ్యం. అవసరమైతే సీనియర్ల సలహాలను కూడా తీసుకునేందుకు వెనుకాడకూడదు.



సహనం.. శ్రద్ధ.. మంచిమాట

ఆశిష్‌.. బీటెక్‌ పూర్తిచేశాడు. మంచి మాటకారి. ఇల్లు, ఆఫీసు, ఇంటర్వూ్య.. ఇలా ఎక్కడైనా సరే టపటపా మాట్లాడేస్తుంటాడు. కానీ, విచిత్రమేమిటంటే  ఇంతటి మాటకారి అయిన ఇతను ఇప్పటి వరకు ఐదారు సంస్థల్లో ఉద్యోగాలు మారాడు. ఎక్కడా రెండు మూడు నెలలకు మించి పనిచేయలేదు. కారణం.. ఎవరితో ఎలా మాట్లాడాలి.. ఎక్కడ ఏం మాట్లాడాలి.. ఎప్పుడు ఎలా మాట్లాడాలి.. అనే విషయాలు తెలియకపోవడమే. అతనిలా కాకుండా ఎవరేం చెప్పినా శ్రద్ధగా విని.. ప్రశాంతంగా ఆలోచించి.. వివేకంతో సమాధానమిస్తే అందరి మన్ననలు పొందుతాం!!

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top