కెరీర్‌కు ధీమానిచ్చే ‘బీమా’!

కెరీర్‌కు ధీమానిచ్చే ‘బీమా’!


ప్రతి వస్తువుకూ ఎంతో ధీమా ఇచ్చేదిగా మారింది. ఆర్థిక అవగాహన పెరగడంతో నిత్యావసరంగా మారింది. విలువైన జీవితం దగ్గరి నుంచి

 మొబైల్ ఫోన్ వరకూ బీమా పెనవేసుకుంది. ఇదే క్రమంలో ప్రైవేటు బీమా సంస్థల ప్రవేశం, ఎఫ్‌డీఐల పెంపు తదితర కారణాలతో  ఈ రంగంలో సుశిక్షితులైన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. అందుకే యువతకు ఉత్తమ కెరీర్ మార్గంగా వెలుగొందు తోంది. దేశంలో బీమా రంగం మార్కెట్ విలువ 2013-14 ఆర్థిక సంవత్సరంలో 66.4 బిలియన్ డాలర్లు. ఇది 2020 నాటికి 350-450 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా... బీమా రంగంలో 147 దేశాల జాబితాలో భారత్ పదో స్థానంలో ఉంది. ఇంతలా ఆశావహ పరిస్థితులున్న ఈ రంగం యువతకు ఓ ఉత్తమ కెరీర్ వేదికగా నిలుస్తోంది. ఈ రంగంలో 2030 నాటికి 30 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని

 అసోచాం సర్వే పేర్కొంది.

 

 విస్తరణ శరవేగం:

 36 కోట్ల పాలసీలతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద జీవిత బీమా రంగంగా గుర్తింపు పొందింది. 50కిపైగా వివిధ బీమా సంస్థలతో మార్కెట్ ప్రగతి పథంలో పయనిస్తోంది. గతంలో వ్యక్తిగత జీవితానికి ఆర్థికపరమైన రక్షణ ఇచ్చేదిగా మాత్రమే బీమా ఉండేది. ప్రస్తుతం మారుతున్న అవసరాల మేరకు ఏ కొత్త వస్తువును కొనుగోలు చేసినా బీమా అవసరమవుతోంది. ఈ క్రమంలో వాహన బీమా, ఆరోగ్య బీమా, గృహ బీమా, వ్యాపార బీమా, ప్రయాణ బీమాలుగా శరవేగంగా విస్తరిస్తోంది. ‘‘బీమా రంగంలో ప్రత్యక్షంగా పది లక్షల మంది, పరోక్షంగా మరో 50 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ రంగం రాబోయే రోజుల్లో మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. గ్లోబల్ సిటీగా పేరున్న హైదరాబాద్‌లో దాదాపు అన్ని బీమా కంపెనీలు తమ కేంద్రాన్ని ప్రారంభించాయి’’ అంటున్నారు భారతి యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ మానవ వనరుల విభాగం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, హెడ్ శిల్పా వైద్.

 

 కోర్సుల స్వరూపం:

 బీమా రంగం అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ విద్యా సంస్థలు కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. ‘‘ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పోటీ కూడా తీవ్రంగా పెరిగింది. దాంతో బాధ్యతల నిర్వహణ కత్తిమీదసాములా మారింది. అందుకే అకడమిక్‌గా, ప్రాక్టికల్స్ పరంగా పదునుపెట్టేలా ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ అంశాల్లో నిత్యనూతన కోర్సులకు రూపకల్పన చేశారు. సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ స్థాయిలో ఇవి అందుబాటులో ఉన్నాయి’’ అంటున్నారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం) దూరవిద్యా విభాగం అధిపతి ఎన్.వి.డి.ఎస్.రాజు.

 

 పెద్దన్న ఐఐఆర్‌ఎం:

 హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్(ఐఐఆర్‌ఎం) అంతర్జాతీయ గుర్తింపున్న సంస్థ. ఇందులో కోర్సులు పూర్తిచేసిన వారికి బహుళజాతి సంస్థల్లో అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇది అందించే కోర్సుల్లో ముఖ్యమైనవి.. ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్(జనరల్ అండ్ లైఫ్)/ రిస్క్ మేనేజ్‌మెంట్. ఇవే విభాగాల్లో ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్లస్ స్థాయిలోనూ కోర్సులను అందిస్తోంది. ఏడాది వ్యవధిలో ఉండే ఈ కోర్సులకు కనీస అర్హత 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. బ్యాచిలర్స్ డిగ్రీ వరకు అకడమిక్ రికార్డ్, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీటితోపాటు ఇన్సూరెన్స్ రంగంలో, విధుల్లో ఎంతో కీలక విభాగంగా పేరొందిన యాక్చుయేరియల్ సైన్స్‌కు సంబంధించి కూడా కోర్సును అందిస్తోంది. కోర్సు పీజు రూ.2.5లక్షల నుంచి రూ.3 లక్షలు.

 వెబ్‌సైట్: www.iirmworld.org.in

 

 - నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ -పుణె;  అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ యాక్చుయేరియల్ సెన్సైస్ తదితర సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి.

 వెబ్‌సైట్: www.niapune.com

 

 కొలువులు విభిన్నం: బీమా సంబంధిత కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయి. ఇన్సూరెన్స్ సంస్థలతో పాటు సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్-ఫైనాన్షియల్ రంగ సంస్థలు కూడా కోర్సులు పూర్తిచేసిన వారిని నియమించుకుంటున్నాయి.

 

 జాబ్ ప్రొఫైల్స్:

 - అనలిస్టు  

 - అండర్ రైటర్

 - కంప్లయిన్స్ ఆఫీసర్

 - క్లెయిమ్స్ మేనేజర్

 - సేల్స్ టీమ్ మేనేజర్/లీడర్  

 - రిస్క్ మేనేజర్  

 - సర్వేయర్.

 

 విధులు: వ్యాపార పరంగా సంస్థ ఉన్నతికి నిర్ణయాలు తీసుకోవడంలో అనలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తారు. వీరు ఎప్పటికప్పుడు మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులను విశ్లేషించి, నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడతారు. అండర్ రైటర్.. బీమా కవరేజీకి సంబంధించిన చెల్లింపులు, లాభనష్టాలను అంచనా వేస్తాడు. మిగిలిన విభాగాల్లో మార్కెటింగ్ ముఖ్యమైన విధి. వయోపరిమితి లేకుండా ఉపాధి లభించే రంగాల్లో బీమా ఒకటి. తాత్కాలిక ప్రాతిపదికన గృహిణులు, విద్యార్థులు, వృద్ధులు, నిరుద్యోగులు పనిచేసేందుకు వీలున్న రంగం. గతంలో ఏజెంట్‌గా పనిచేసేందుకు పదోతరగతి కనీస విద్యార్హతగా ఉండేది. ప్రస్తుతం దాన్ని ఇంటర్, గ్రాడ్యుయేషన్ స్థాయికి మార్చారు.

 

 వేతనాలు: కోర్సులు పూర్తిచేసిన వారికి రూ.2.5 లక్షల కనిష్ట వేతనం, రూ.5 లక్షల గరిష్ట వేతనం లభిస్తోంది. మొత్తంగా చూస్తే సగటున రూ.3.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. నైపుణ్యాలు, అనుభవంతో స్వల్ప వ్యవధిలోనే ఉన్నత స్థానాలకు చేరొచ్చు.

 

 విస్తరణకు అవకాశమున్న రంగం

 దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగం.. ఇన్సూరెన్స్. ప్రతి వస్తువుకూ బీమా అందించేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా పల్లెలకు తమ సేవలు విస్తరించేందుకు అవసరమైన మానవ వనరుల కోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఈ రంగంలోకి విదేశీ సంస్థలు మరిన్ని వస్తే అవకాశాలు పెరుగుతాయి. సమర్థతకు నైపుణ్యాలను జతచేసుకోగలిగితే ఈ రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.  కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇన్సూరెన్స్ రంగంపై అవగాహన పెంచుకోగలిగితే మంచి కెరీర్ సొంతమవుతుంది. టెక్నాలజీపై పరిజ్ఞానం పెంచుకోవడం ద్వారా కెరీర్‌లో పోటీని తట్టుకొని నిలదొక్కుకోవచ్చు. నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ వంటి సంస్థలు పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. ఇటీవల ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు బిజినెస్ మేనేజ్‌మెంట్ స్కూళ్లతో కలిసి కోర్సులను అందిస్తున్నాయి.   

 - శిల్పా వైద్, సీనియర్

 వైస్‌ప్రెసిడెంట్, హెడ్ (హెచ్‌ఆర్); భారతి యాక్సా జనరల్ ఇన్సూరెన్స్

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top