భారత సమాఖ్య నిర్మాణం-పని విధానం

భారత సమాఖ్య నిర్మాణం-పని విధానం


 ప్రపంచ రాజకీయ వ్యవస్థల్లో భిన్నమైంది భారత రాజకీయ వ్యవస్థ. దీని నిర్మాణంలో కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ, సంబంధాలు, పని చేసే విధానం వివరణ, విశ్లేషణ ప్రాధాన్యత కలిగిన అంశం. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మొదలు ఇటీవల దేశంలో ప్రవేశపెట్టిన మలిదశ ఆర్థిక సంస్కరణల వరకు కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో వచ్చిన మార్పులు, రావాల్సిన మార్పుల వివరణ మన సమాఖ్య విశ్లేషణ.

 

 ఏ దేశ రాజ్యాంగమైనా ఆనాటి పరిస్థితులను ప్రతిబింబిస్తుంది అని మన మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పేర్కొన్నారు. ఆయన మాటలు వాస్తవీకరణ పొందాలంటే.. మారుతున్న దేశ కాలమాన పరిస్థితులకు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగంలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. 50 ఏళ్ల రాజ్యాంగ పనితీరును అధ్యయనం చేసేందుకు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య నేతృత్వంలో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ రెండేళ్ల తర్వాత 2002లో నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ రాజ్యాంగం  పని విధానాన్ని మొత్తం అధ్యయనం చేసే సందర్భంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల తీరును విశ్లేషించడమే కాకుండా పలు సూచనలు చేసింది. 2007లో మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంఏర్పాటు చేసిన మదన్‌మోహన్ పూంఛీ కమిషన్ కేంద్ర-రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసి 2010 మార్చిలో నివేదిక సమర్పించింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్ కూడా కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ప్రత్యేక నివేదికను రూపొందించింది.

 

 భారతదేశం - అర్ధ సమాఖ్య

 భారతదేశ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాజ్యాంగ నిర్మాతలు.. మన రాజ్యాంగాన్ని ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాల కలయికగా రూపొందించారు. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి సమాఖ్య విధానాన్ని ఆమోదిస్తూనే దేశ విభజన కాలంనాటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ బలమైన కేంద్రానికి అవకాశం కల్పించే ఏకకేంద్ర లక్షణాలకు రాజ్యాంగంలో చోటు కల్పించారు. స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ.. రాజ్యాంగ రచనలో కూడా కీలక పాత్రను నిర్వహించింది. స్వాతంత్య్రానికి పూర్వం కేంద్రీకరణ ధోరణిని సమర్థించిన కాంగ్రెస్ ఆలోచనా విధానం రాజ్యాంగంలోనూ ప్రతిబింబిస్తుంది. భిన్నత్వానికి నిలయమైన మనదేశంలో ఏకత్వాన్ని సాధించాలంటే కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటమే ఏకైక పరిష్కార మార్గంగా కాంగ్రెస్ విశ్వసించి.. బలమైన కేంద్రీకృత ధోరణిని అనుసరించింది. అందుకే కె.సి.వేర్ మన రాజ్యాంగాన్ని విశ్లేషిస్తూ ‘భారతదేశం బలమైన ఏకకేంద్ర లక్షణాల బలహీనమైన సమాఖ్యయే గానీ బలమైన సమాఖ్య లక్షణాలు గల బలహీనమైన ఏకకేంద్రం కాదు’ అని వ్యాఖ్యానించారు. అంటే ‘భారతదేశం ఒక అర్ధ సమాఖ్య వంటిది’ అని పేర్కొన్నారు.

 

 భారతదేశం - సహకార సమాఖ్య

 గ్రాన్‌విలే ఆస్టిన్, డి.ఎన్. బెనర్జీలు మన దేశాన్ని ఒక సహకార సమాఖ్యగా వర్ణించారు. అధికరణ 252 ప్రకారం రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరినప్పుడు.. రాష్ట్ర జాబితాలోని అంశంపై కేంద్రం శాసనం చేయడం, అధికరణ 258 ప్రకారం కేంద్రం.. రాష్ట్రాలను సంప్రదించి కొన్ని నిర్మాణపరమైన బాధ్యతలను అప్పగిస్తే రాష్ట్రాలు వాటిని నిర్వర్తించడం, కేంద్రానికి-రాష్ట్రాలకు, రాష్ట్రాలు-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఉద్దేశంతో అధికరణ 263 ప్రకారం అంతర్ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. అధికరణ 285 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్రాలు పన్నులు విధించకుండా, అధికరణ 289 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులపై కేంద్రం పన్నులు విధించకుండా రాజ్యాంగ పరంగా చేసిన ఏర్పాట్లు మనదేశాన్ని ఒక సహకార సమాఖ్యగా వర్ణించడానికి కారణమయ్యాయి.

 

 బలమైన కేంద్రీకృత ధోరణి

 సర్ ఐవర్ జెన్సింగ్‌‌స వంటి వారు మనదేశాన్ని ఒక బలమైన కేంద్రీకృత ధోరణి గల సమాఖ్యగా వర్ణించారు. అధికరణ 249 ప్రకారం రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేస్తే, రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశానికి జాతీయ ప్రాముఖ్యత ఉందని భావిస్తే ఆ అంశంపై శాసనం చేసే అధికారం కేంద్రానికి ఉంది. జాతీయ అత్యవసర పరిస్థితిలో అధికరణ 250  ప్రకారం కేంద్రం.. రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపైనైనా శాసనం చేయవచ్చు. 365 అధికరణను అనుసరించి కేంద్రం జారీ చేసిన ఆదేశాన్ని సదరు రాష్ట్రం తప్పనిసరిగా పాటించాలి. లేకుంటే ఆ రాష్ట్రంపై చర్య తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది. అధికరణ 356 ద్వారా విధించే రాష్ట్రపతి పాలన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండే వజ్రాయుధం వంటిది. అందుకే 356 అధికరణను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వు వంటిదని పేర్కొన్నారు.

 

 వాస్తవికమైన సమాఖ్య

 ప్రముఖ అమెరికన్ పాలనా శాస్త్రవేత్త పాల్ ఆసిల్ బీ, అలెగ్జాండ్రి విజ్ వంటి వారు మన సమాఖ్యను వాస్తవికమైన సమాఖ్యగానే పేర్కొన్నారు. గ్రాన్‌విలే ఆస్టిన్ మరొక సందర్భంలో భారత సమాఖ్య నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాతల వివేకం దాగి ఉందని వ్యాఖ్యానించారు. 7వ షెడ్యూల్‌లో పొందుపరిచిన అధికారాల పంపిణీ జాబితాలో పేర్కొన్న అంశాల ప్రాముఖ్యాన్ని అనుసరించి మాత్రమే జరిగిన అధికారాల పంపిణీగా పేర్కొంటారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉండే సమన్వయానికి నిదర్శనం ఉమ్మడి జాబితా.

 

 రాజ్యాంగ - రాజ్యాంగేతర సంస్థల ప్రభావం

 స్వాతంత్య్రానంతరం మన దేశం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను అనుసరించింది. సామాజిక, ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. 1950లో ఏర్పడిన ప్రణాళికా సంఘం.. జాతీయ ప్రణాళికలను రూపొందించడంతోపాటు ప్రాంతీయ ప్రయోజనాలను నిర్ణయించేది. కానీ ప్రణాళికా సంఘంలో రాష్ట్రాలకు ఎలాంటి ప్రాతినిథ్యం లేదు. ప్రణాళికా ముసాయిదాను ఆమోదించే జాతీయాభివృద్ధి మండలిలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ.. అందులో కూడా కేంద్రం ప్రభుత్వానిదే ఆధిపత్యం. ప్రణాళిక లక్ష్యాలను దృష్ట్యా కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేసే కేంద్ర ఫైనాన్‌‌స కమిషన్‌లో కూడా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ రెండూ కూడా మన సమాఖ్య పని తీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆర్థికపరమైన ఈ కేంద్రీకరణ దృష్ట్యా ప్రముఖ రాజ్యాంగ, ఆర్థిక నిపుణుడు కె. సంతానం మనదేశం సమాఖ్య విధానాన్ని అనుసరించాలని కోరుకున్నప్పటికీ, వాస్తవంలో ఏకకేంద్ర విధానాన్నే అనుసరిస్తుందని పేర్కొన్నారు. దీనికి గల ప్రధాన కారణం ఆర్థిక అంశాల కేంద్రీకరణే. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన నీతిఆయోగ్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రాతినిధ్యం కల్పించడం కీలక అంశం.

 

 వాస్తవిక సమాఖ్యతో మనం విభేదించే అంశాలు

 ప్రపంచంలో అత్యుత్తమమైన సమాఖ్యకు పర్యాయపదంగా నిలిచే అమెరికా సమాఖ్యతో మనదేశం పలు విషయాల్లో విభేదిస్తుందనే అంశం సుస్పష్టం. భారతదేశం ఏక పౌరసత్వాన్ని, ఒకే రాజ్యాంగం, ఏకీకృత న్యాయ వ్యవస్థను అనుసరిస్తుంది. అమెరికాలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సెనేట్‌లో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం లభిస్తుంటే మన రాజ్యసభలో పెద్ద రాష్ట్రాలకు ఎక్కువ, చిన్న రాష్ట్రాలకు తక్కువ ప్రాతినిధ్యం కల్పించారు. అమెరికా బలమైన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే మనం బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మన దగ్గర అవశిష్ట అధికారాలను కేంద్రానికి కట్టబెట్టారు. వాస్తవిక సమాఖ్యకు భిన్నంగా మన రాజ్యాంగం ప్రధానంగా అదృఢమైంది. సూత్రబద్ధమైన సమాఖ్య కాకపోడంతో మన రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని వినియోగించలేదు.

 

 కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాలు - కారణాలు

  గడిచిన ఆరు దశాబ్దాలలో కేంద్ర-రాష్ట్రాల సంబంధాల తీరును పరిశీలిస్తే పలు సందర్భాల్లో వివాదాలు, సమస్యలు కనిపిస్తాయి. 1967లో నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అప్పుడే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలనే డిమాండ్ ప్రారంభమైంది. ప్రధానమైన సంక్షేమ శ్రేయోవాద అంశాల సంబంధిత బాధ్యతలన్నీ రాష్ట్రాలకు అప్పగించగా ఆర్థిక వనరులన్నీ కేంద్రం వద్ద ఉండేవి. క్రమంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయి. దాంతో రాష్ట్రాలు నిరంతరం కేంద్రంపై ఆధారపడాల్సి వచ్చింది.

 

 గవర్నర్ వ్యవస్థ కేంద్ర-రాష్ట్రాల మధ్య వివాదాలకు మరో కారణం. రాజ్యాంగం గవర్నర్లకు విచక్షణాధికారాలను కల్పించింది. అయితే గవర్నర్లు వాటిని విచక్షణ రహితంగా వినియోగించడం ప్రధాన సమస్యగా పరిణమించింది. ఏ రాజకీయ పార్టీ శాసనసభలో మెజార్టీ సాధించలేని సందర్భంలో ముఖ్యమంత్రి నియామకం గవర్నర్ విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుంది. 1952 తమిళనాడు గవర్నర్ ప్రకాశ్ మొదలు.. జార్ఖండ్‌లో గవర్నర్ సయ్యద్ సిబ్దరజి.. శిబూ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించడం వంటివి గవర్నర్లు తమ అధికారాలను విచక్షణ రహితంగా వినియోగించరడానికి నిదర్శనాలు. రాష్ట్ర శాసనసభలో మెజార్టీని కోల్పోయిన సందర్భంలో సదరు ప్రభుత్వానికి తమ మెజార్టీ నిరూపించుకునే అవకాశాన్ని కల్పించకుండా వాటి రద్దు చేయడం మరో సమస్య. 1984లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీ రామారావు ప్రభుత్వానికి శాసనసభలో మెజార్టీ ఉన్నప్పటికీ.. మెజార్టీ నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండానే అప్పటి గవర్నర్ ప్రభుత్వాన్ని రద్దుచేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించారు.

 

 అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో అప్పటి గవర్నర్ రమేష్ బండారీ బీజేపీకి చెందిన కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి జగదంబికా పాల్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు (ఈ నియామకాన్ని అలహాబాద్ హైకోర్టు నిలిపివేయడంతోపాటు సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది).కేంద్ర-రాష్ట్రాల మధ్య వివాదాలకు మరో కారణం 356 అధికరణ దుర్వినియోగం. రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పద అధికరణ 356. కారణం దాన్ని వినియోగించిన తీరు వివాదాస్పదం కావడమే. 1959లో కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని ఈ అధికరణతో రద్దు చేశారు. 1977లో కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా ప్రభుత్వం 9 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఈ అధికరణను ప్రయోగించింది. 1980లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ ప్రభుత్వం 9 రాష్ట్రాల్లోని జనతా ప్రభుత్వాలను రద్దు చేసింది. 1989లో కర్ణాటకలో ఎస్.ఆర్. బొమ్మై ప్రభుత్వాన్ని, నాగాలాండ్‌లో ఎస్.సి. జమీర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడాన్ని 1994లో సుప్రీం కోర్టు ‘ఎస్.ఆర్. బొమ్మై/యూనియన్ ఆఫ్ ఇండియా’ మధ్య జరిగిన వ్యాజ్యాంలో అధికరణ 356 దుర్వినియోగం మన సమాఖ్య విధానానికి భంగకరం అని పేర్కొంది. అంతేకాకుండా సమాఖ్య విధానం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని కూడా వ్యాఖ్యానించింది.

 

 రాజ్యాంగ - రాజ్యాంగేతర సంస్థల పని విధానానికి సంబంధించి ముఖ్యంగా ప్రణాళికా సంఘం, కేంద్ర ఫైనాన్‌‌స కమిషన్‌ల ఏకఛత్రాధిపత్యాన్ని రాష్ట్రాలు తమ ప్రయోజనాలకు పెద్ద ఆటంకంగా భావిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కేంద్రం రాష్ట్రాలపై ఆధిపత్యాన్ని కొనసాగించడం లేదా తరచుగా జోక్యం చేసుకోవడం కూడా మరో సమస్య. 1967లో దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారంలో కార్మికుల సమ్మె సందర్భంగా కనీసం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్రం సాయుధ బలగాలను మోహరించింది. దీంతో అప్పటి ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి జ్యోతిబసు రాజీనామా చేస్తాననడం గమనించదగిన అంశం.

 

 కేంద్ర-రాష్ట్రాల వివాదాలు-పరిష్కార మార్గాలు

  1967 సాధారణ ఎన్నికల తదనంతరం వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలు రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. దీంతో 1966లో ఏర్పాటు చేసిన మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ నుంచి ఎం.సి. సీతల్‌వాడ్ కమిటీని ప్రత్యేకంగా కేంద్ర - రాష్ట్ర సంబంధాలు, వివాదాల అధ్యయనం కోసం ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించింది. సీతల్‌వాడ్ కమిటీ సమూల మార్పులను సూచించనప్పటికీ.. కొన్ని కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. కేంద్రం తరచుగా రాష్ట్రాల విషయాల్లో జోక్యం చేసుకోకుండా చర్యలు చేపట్టాలని, అంతర్ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. కేంద్ర ఫైనాన్‌‌స కమిషన్ సూచనలను కేంద్రం తప్పనిసరిగా పాటించాలని కోరింది. గవర్నర్లుగా వివాదాస్పదం కాని వ్యక్తులను నియమించాలని సూచించింది.

 

 1967లో తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం పి.వి. రాజమన్నార్ నేతృత్వంలో కేంద్ర - రాష్ట్ర సంబంధాలపై ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రధాన కారణం సీతల్‌వాడ్ కమిటీ సూచనలు రాష్ట్రాలకు సంతృప్తిని ఇవ్వకపోవడమే. రాజమన్నార్ కమిటీ ..రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలను కల్పించడం కోసం రాజ్యాంగాన్ని సవరించాలని పేర్కొంది. ఉమ్మడి జాబితాలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను కేంద్రానికి కేటాయించి మిగిలిన అధికారాలన్నీ రాష్ట్రాలకు బదలాయించాలని కోరింది. ప్రణాళికా సంఘంలో సమూల మార్పులు చేయాలని సూచించింది. ఎక్కువ ఆర్థిక వనరులను కల్పించడం కోసం విదేశీ ఎగుమతులు, దిగుమతులపై విధించే సుంకాల్లో రాష్ట్రాలకు కూడా వాటా కల్పించాలని కోరింది. 1980లో చోటు చేసుకున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం సర్కారియా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

 

  ఈ కమిషన్ కేంద్ర - రాష్ట్ర సంబంధాలపై అనేక అంశాలతో కూడిన సవివరమైన నివేదికను రాజీవ్‌గాంధీ ప్రభుత్వానికి సమర్పించింది. గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదం కాకుండా ఉండటం కోసం పలు సూచనలు చేసింది. 356 అధికరణను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని కమిషన్ పేర్కొంది. ఆదాయపన్నుపై విధించే సెస్, కార్పొరేట్ ట్యాక్స్‌లో రాష్ట్రాలకు వాటా కల్పించాలని సూచించింది. అంతర్ రాష్ట్ర వ్యాపార వాణిజ్యంపై చట్టాలు చేసేటప్పుడు, ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రం శాసనాలు చేసే సందర్భంలో రాష్ట్రాల అభిప్రాయాలను, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై వ్యాఖ్యానించే సందర్భంలో అంతర్ రాష్ట్ర కౌన్సిల్ ద్వారా కేంద్రం లేదా రాష్ట్రాలు సహకార సమాఖ్య ఏర్పాటు కోసం కృషి చేయాలని సూచించింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను, కేంద్ర పరిశీలన కోసం గవర్నర్ పంపినప్పుడు దానిపై రాష్ట్రపతి ఆరు నెలల్లోగా ఏదో ఒక నిర్ణయం ప్రకటించేలా సవరణ చేయాలని కూడా ఈ కమిషన్ సూచించింది. మదన్‌మోహన్ పూంఛీ కమిషన్ గవర్నర్లను కూడా రాష్ట్రపతి మాదిరిగానే తొలగించే అధికారం రాష్ట్ర శాసనసభలకు కల్పించాలని పేర్కొంది.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top