మానవాభివృద్ధిలో భారత్‌ది 135వ స్థానం

మానవాభివృద్ధిలో భారత్‌ది 135వ స్థానం


 వార్తల్లో వ్యక్తులు

 హర్యానా గవర్నర్‌గా కప్టన్ సింగ్


 బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కప్టన్ సింగ్ సోలంకి హర్యానా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి జూలై 25న ప్రకటన వెలువడింది. జగన్నాథ్ పహాడియా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.

 

 ఇండోనేసియా అధ్యక్ష ఎన్నికల్లో జోకో విడోడో విజయం

 ఇండోనేసియా అధ్యక్ష ఎన్నికల్లో జోకో విడోడో విజయం సాధించినట్లు జూలై 22న ప్రకటించారు. ప్రత్యర్థి సుబియాంతోపై 8.4 మిలియన్ల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అక్టోబర్‌లో అధ్యక్ష పగ్గాలు చేపట్టే విడోడో ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు.

 

 ఇరాక్ అధ్యక్షుడిగా పుఅద్ మాసుమ్


 కుర్దు రాజకీయవేత్త పుఅద్ మాసుమ్ ఇరాక్ కొత్త అధ్యక్షుడిగా జూలై 24న బాధ్యతలు చేపట్టారు. ఇరాక్ స్వతంత్ర కుర్దీస్ ప్రాంతానికి మొదటి ప్రధానిగా ఆయన పనిచేశారు.

 

 భారత్‌లో పర్యటించిన ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు

 ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ జూలై 21 నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలుసుకున్నారు. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక తోడ్పాటుతో తమిళనాడులో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను

 సంద ర్శించారు.

 

 జాతీయం

 రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శనశాల


 జూలై 25 నాటికి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఒక ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఇందులో మాజీ రాష్ట్రపతుల ఫైబర్ గ్లాస్ ప్రతిమలు, విదేశీ పర్యటనల సందర్భంగా వారు బహుమతులుగా స్వీకరించిన కళాఖండాలను ఉంచారు. ఈ సందర్భంగా ‘వింగ్‌డ్ వండర్స్’ అనే పుస్తకాన్ని, రాష్ట్రపతి భవన్‌లో 2012, ఆగస్టు నుంచి జరిగిన సంగీత, నృత్య కార్యక్రమాల సమాహారమైన ‘ఇంద్రధనుష్’ అనే మరో పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.

 

 మరో రెండు క్షిపణి ప్రయోగ కేంద్రాలు

 ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులలో కొత్తగా మరో రెండు క్షిపణి ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ జూలై 25న లోక్‌సభకు తెలియజేశారు. వీటి కోసం కృష్ణా జిల్లాలోని నాగాయలంక, అండమాన్‌లోని రుట్లాండ్ దీవిని డీఆర్‌డీవో ఎంపిక చేసిందని ఆయన తెలిపారు.

 

 టీసీఎస్ రికార్డు

 టాటా గ్రూప్‌నకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీల విలువ జూలై 23న రూ. 5లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయగా కంపెనీగా రికార్డు సృష్టించింది. తొలిసారి 2004లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన టీసీఎస్ తొలిసారి 84 బిలియన్ డాలర్ల(రూ.5,06,703 కోట్లు) విలువను అందుకున్న ఒక దేశీ కంపెనీగా నిలిచింది. టీసీఎస్.. టాటా సన్స్ డివిజన్‌గా 1968లో ఏర్పాటైంది. 1995లో ప్రత్యేక కంపెనీగా టాటా సన్స్ నుంచి విడివడింది.

 

 హిజ్రాలకు పథకాల్లో థర్డ్ జెండర్ ఆప్షన్

 వివిధ స్కాలర్‌షిప్/ఫెలోషిప్ పథకాల్లో హిజ్రాలకు (ట్రాన్స్‌జెండర్) థర్డ్ జెండర్‌గా నమోదు చేసుకునేలా ఆప్షన్ ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు యూజీసీ పథకాల్లో ఈ అవకాశం కల్పించాలని తెలిపింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి జస్పాల్ ఎస్.సంధు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, జైనులను మైనారిటీలుగానే పరిగణించాలని పేర్కొన్నారు.

 

 బ్రెయిలీ లిపిలో సర్దార్ జీవిత చరిత్ర

 భారత ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవిత చరిత్రను సాయిబాబా గౌడ్ బ్రెయిలీ లిపిలో రచించారు. ఈ పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోడీ జూలై 23న ఢిల్లీలో ఆవిష్కరించారు. సాయిబాబా గౌడ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో అంధుల పాఠశాలను నిర్వహిస్తున్నారు.

 

 మై గవ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ప్రధాని

 పరిపాలనలో ప్రజలను మరింత భాగస్వామ్యుల్ని చేసేందుకు ఝడజౌఠి.జీఛి.జీ అనే పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రధాని నరేంద్రమోడీ జూలై 26న ప్రారంభించారు. గంగానది ప్రక్షాళన, నైపుణ్యాల అభివృద్ధితోపాటు పలు అంశాలపై పౌరుల ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వెబ్‌సైట్‌ను రూపొందించారు.

 

 మానవాభివృద్ధిలో భారత్‌ది 135 వ స్థానం

 ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) మానవాభివృద్ధి నివేదిక-2013ను జూలై 24న విడుదల చేసింది. ఇందులో 187 దేశాల జాబితాలో భారత్ 135వ స్థానంలో నిలిచింది. కాగా తొలి మూడు స్థానాల్లో నార్వే, ఆస్ట్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లు ఉన్నాయి. భారత్ హెచ్‌డీఐ (మానవాభివృద్ధి సూచీ) విలువ 0.586. మానవ జీవన ప్రమాణాల అభివృద్ధి విషయంలో భారత్ మధ్యస్థ కేటగిరీలో ఉందని పేర్కొంది. 1980-2013 మధ్య కాలంలో భారత్‌లో హెచ్‌డీఐ విలువ 0.369 నుంచి 0.586కు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఆరోగ్యకరమైన దీర్ఘ ఆయుః ప్రమాణం, జ్ఞాన సముపార్జనకు అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణం అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 220 కోట్లకు పైగా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. ఇందులో 80 కోట్ల మంది పేదరికం అంచున  ఉన్నారు.

 

 రాష్ట్రీయం

 భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు జీఎస్‌ఐ గుర్తింపు


 ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా భీమిలి ఎర్రమట్టి దిబ్బలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియో హెరిటేజ్ సైట్)గా గుర్తించింది. ఈ దిబ్బలు సుమారు 20 వేల ఏళ్ల కిందట ఏర్పడ్డాయి.

 

 దక్షిణ ప్రాంతీయ మండలి వైస్ చైర్మన్‌గా కేసీఆర్

 కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించే దక్షిణ ప్రాంతీయ మండలి వైస్ చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కేంద్ర ప్రభుత్వం నియ మించింది. ఈ మండలికి చైర్మన్ కేంద్ర హోం శాఖమంత్రి.

 

 సాహితీ విమర్శకుడు చేరా కన్నుమూత

 ప్రముఖ తెలుగు భాషా వేత్త , సాహితీ విమర్శకుడు చేకూరి రామారావు (79) హైదరాబాద్‌లో జూలై 22న కన్నుమూశారు. చేరాగా సుపరిచితుడైన రామారావు ఖమ్మం జిల్లాకు చెందినవారు.

 

 అంతర్జాతీయం

 భారత్ వృద్ధి 5.4 శాతం


 బ్రిక్స్ దేశాల్లో భారత్ మినహా ఇతర దేశాల అభివృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య సంస్థ తగ్గించింది. ఈ ఏడాది ఇండియా 5.4 శాతం, వచ్చే ఏడాది 6.4 శాతం పురోగతి సాధిస్తుందని ప్రపంచ ఆర్థిక భవితపై జూలై 25న విడుదల చేసిన నివేదికలో తెలిపింది. బ్రిక్స్‌లో (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) రష్యా 0.9శాతం (1.1 శాతం డౌన్‌గ్రేడ్), చైనా 7.4 శాతం(0.2 శాతం), బ్రెజిల్ 1.3 శాతం (0.6 శాతం), దక్షిణాఫ్రికా 1.7 శాతం (0.6 శాతం) వృద్ధి నమోదుచేస్తాయని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 3.4 శాతానికి చేర్చింది.

 

 సుష్మాస్వరాజ్ నేపాల్ పర్యటన

 భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నేపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నేపాల్ అధ్యక్షుడు రామ్‌బరన్ యాదవ్, ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా తదితరులతో  సమావేశమయ్యారు. అంతేకాకుండా రక్షణ, భద్రత, వాణిజ్యం, జల విద్యుత్.. తదితర రంగాల్లో సహకారాన్ని పెంచుకునేందుకు ఇరుదేశాలు అంగీరించాయి.  ఇండో- నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశానికి(జేసీఎం) సహ అధ్యక్షత వహించేందుకు, ఆగస్టు 3 నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేపాల్ పర్యటనకు రంగం సిద్ధం చేసేందుకు సుష్మా నేపాల్‌లో పర్యటించారు.  23 ఏళ్ల తర్వాత ఉభయ దేశాల మధ్య జేసీఎం సమావేశం జరిగింది.

 

 చైనా క్షిపణి నిరోధక పరీక్ష విజయవంతం

 చైనా గగనతలానికి క్షిపణి రక్షణ కవచం ఏర్పాటులో భాగంగా ఆ దేశం జూలై 23న మూడోసారి క్షిపణి నిరోధక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.

 

 బాల్యవివాహాలు భారత్‌లోనే అధికం

 ప్రపంచ వ్యాప్తంగా జరిగే బాల్య వివాహాల్లో మూడింట ఒక వంతు భారతదేశంలోనే జరుగుతున్నాయని యూనిసెఫ్ పేర్కొంది. బాల్య వివాహాల సంఖ్య అత్యధికంగా ఉన్న పది దేశాల్లో భారత్, నైగర్, బంగ్లాదేశ్, చాద్, మాలి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, గినియా,ఇథియోయా, బుర్కినాఫాసో, నేపాల్ ఉన్నాయి.

 

  క్రీడలు

 గ్లాస్గోలో ప్రారంభమైన 20వ కామన్‌వెల్త్ క్రీడలు


 20 వ కామన్‌వెల్త్ క్రీడలు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జూలై 23న ప్రారంభమయ్యాయి. ఇంగ్లండ్ రాణి ఎలిజిబెత్-2 క్రీడలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ప్రారంభ కార్యక్రమంలో ముందుగా మైదానంలో అడుగుపెట్టిన భారత్ మార్చ్‌పాస్ట్ బృందానికి షూటర్ విజయ్‌కుమార్ నేతృత్వం వహించారు. 71 దేశాలకు చెందిన 4,950 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొనగా, వీరిలో భారత్ నుంచి 213 మంది అథ్లెట్లు ఉన్నారు. మొత్తం 17 క్రీడాంశాల్లో ఈ పోటీలు జరుగుతాయి. క్రీడల అధికార మస్కట్‌కు క్లైడ్ అని పేరు పెట్టారు. గ్లాస్గో నగరం మధ్య నుంచి పారే నది పేరే క్లైడ్. ఈ క్రీడల్లో తొలి స్వర్ణం ఇంగ్లండ్‌కు చెందిన జోడీ స్టింప్సన్‌కు మహిళల ట్రయిథాన్‌లో దక్కింది. భారత్ తరపున తొలి స్వర్ణం మహిళల 48 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ సంజిత్ కుమ్‌చమ్ సాధించింది. ఇదే క్రీడల్లో మహిళల  వెయిట్ లిఫ్టింగ్ 53 కిలోల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన  తెలుగమ్మాయి మత్స సంతోషి కాంస్య పతకం సాధించింది. కెనడా జిమ్నాస్ట్ ప్యాట్రికా బెజ్‌బెంకో(17) రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో ఐదు స్వర్ణ పతకాలు గెలుచుకొని క్వీన్ ఆఫ్ కామన్‌వెల్త్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.

 

 ఫోర్బ్స్ విలువైన ఆటగాళ్ల జాబితా

 ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్’ ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్థికంగా విలువైన ఆటగాళ్ల’ జాబితాను ప్రకటించింది. ఇందులో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐదో స్థానంలో నిలిచాడు.  2013లో ధోని 21 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 126 కోట్లు) ఆర్జించాడు. ఈ జాబితాలో రోజర్ ఫెడరర్ (టెన్నిస్), గోల్ఫ్ ఆటగాడు టైగర్‌వుడ్స్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. బాస్కెట్‌బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ రెండో స్థానంలో ఉండగా... ఫిల్ మికెల్సన్ (గోల్ఫ్), షరపోవా (టెన్నిస్) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

 

 రికియార్డోకు హంగరీ గ్రాండ్ ప్రి టైటిల్

 ఫార్ములా వన్ హంగరీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో గెలుచుకున్నాడు. జూలై 27న బుడాపెస్ట్‌లో జరిగిన రేసులో ఫెరారీ డ్రైవర్ అలోన్సో రెండో స్థానం సాధించాడు.

 

 వరల్డ్ కబడ్డీ లీగ్ ప్రారంభం

 వరల్డ్ కబడ్డీ లీగ్ (డబ్ల్యూకేఎల్) జూలై 24న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ లీగ్ అధ్యక్షుడిగా, భారత హాకీ మాజీ కెప్టెన్ పర్గత్‌సింగ్ లీగ్ కమిషనర్‌గా ఈ లీగ్ ఏర్పడింది. ఎనిమిది జట్లు ఈ లీగ్‌లో ఉంటాయి. ఆగస్టు 9 నుంచి నాలుగు నెలలపాటు ఐదు దేశాల్లో 13 నగరాల్లో కబడ్డీ పోటీలు లండన్‌లో ప్రారంభమవుతాయి.

 

 సైన్స్ అండ్ టెక్నాలజీ

 అత్యాధునిక సమాచార వ్యవస్థ.. దిశానెట్


 విపత్తులు, ప్రమాదాల సమయంలో సమాచార వ్యవస్థలు పనిచేయని ప్రదేశాల్లో అండగా నిలిచే అత్యాధునిక సమాచార వ్యవస్థను భారత్-జపాన్ శాస్త్రవేత్తలు జూలై 24న ప్రదర్శించారు. దీనికి దిశానెట్ అని పేరు పెట్టారు. సమాచార వ్యవస్థ అందుబాటులో లేనిచోట కూడా ఇది పనిచేస్తుంది.ఆపదలో ఉన్న వారికి ఆసరాగా నిలవ డమే కాకుండా బాధితులు, బంధువులకు సాంత్వన కలిగించడంలో ఇది కీలకం కానుంది. ఈ పరిశోధనలో హైదరాబాద్ ఐఐటీ, చెన్నై ఐఐటీ, ఎన్‌జీఆర్‌ఐతో పాటు టోక్యో కియో విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు.

 

 అండమాన్‌లో పరిశోధనలకు

 బయల్దేరిన సింధుసాధన


 భారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన పరిశోధన నౌక సింధుసాధన అండమాన్ సముద్రంలో పరిశోధన సాగించేందుకు జూలై 27న విశాఖ పోర్టునుంచి బయలుదేరింది. అత్యాధునిక పరిశోధన సదుపాయాలు గల ఈ నౌకను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశోధనల కోసం గుజరాత్‌లోని ఏబీసీ షిప్‌యార్డ్ రూపొందించింది. రూ. 220 కోట్లతో నిర్మించిన ఈ నౌక 6వేల మీటర్ల లోతులో పరిశోధనలు నిర్వహించగలదు.

 

 క్లోనింగ్ ముర్రా జాతి కోడెదూడ

 హ్యాండ్ గెడైడ్ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఛండీగఢ్‌లోని నేషనల్ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్‌డీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఒక కోడెదూడను సృష్టించారు. జూలై 23న జన్మించిన దీనికి రజత్ అని పేరు పెట్టారు.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top