లక్షలు వదిలి.. లక్ష్యం దిశగా కదిలి

లక్షలు వదిలి.. లక్ష్యం దిశగా కదిలి


నేపథ్యం

 పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న పాతూరి శ్రీనివాసరావు ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అమ్మ మంజుల గైనకాలజిస్ట్. తమ్ముడు శివ సాత్విక్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

 

 స్ఫూర్తి

 అమ్మా, నాన్నలిద్దరూ ఉన్నత విద్యావంతులు కావడంతో వారే స్ఫూర్తిగా నిలిచారు. కెరీర్ విషయంలో కావల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చిన్నప్పటి నుంచి ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో చదవాలని పట్టుదలగా ఉండేది. దానికి తగ్గట్టే ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో బీటెక్ (ఈఈసీఈ) విభాగంలో సీటు లభించింది.

 

 ఐఐటీలో టాపర్:

 ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో టాపర్‌గా నిలవడం చాలా సంతోషానిచ్చింది. కాకపోతే అందరూ భావించినట్లు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టలేదు. ఏరోజు పాఠాలను ఆ రోజే పునశ్చరణ చేసేవాణ్ని. సబ్జెక్ట్‌ను కష్టపడికాకుండా ఇష్టంతో చదివే వాణ్ని. దాంతో ప్రిపరేషన్‌లో ఎప్పుడూ ఇబ్బంది ఎదురు కాలేదు. మా బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) నుంచి 120 మందికి నలుగురు మాత్రమే 92.8 శాతం స్కోర్ సాధించారు. మొత్తం మీద యూనివర్సిటీ తరపున ఇన్‌స్టిట్యూట్ సిల్వర్ మెడల్ అందుకున్నవారిలో నేనొక్కడినే తెలుగు వాణ్ని.

 

 ఉద్యోగం వదిలి

 క్యాంపస్ సెలెక్షన్‌లో చెన్నైలోని ఈబే వెబ్‌సైట్ సంస్థ రూ. 22 లక్షల వేతనంతో ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. మా బ్రాంచ్‌లో నాదే అత్యధిక పే-ప్యాకేజీ కూడా. ఆ జీతంతో జీవితాన్ని సరదాగా గడిపేయొచ్చు. కానీ పీహెచ్‌డీ చేయడం నా ముందున్న లక్ష్యం. అందుకే ఉద్యోగ అవకాశాన్ని వదులుకున్నాను.

 

 నాలుగు వర్సిటీలకు:

 పీహెచ్‌డీ కొసం ఏడు యూనివర్సిటీలకు దరఖాస్తు చేయగా అమెరికాలోని నాలుగు యూనివర్సిటీలకు ఎంపికయ్యాను. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పర్‌డ్యూ వర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశం లభించింది. వీటిలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పీహెచ్‌డీ చేస్తాను.

 

 ఈఈసీఈనే ఎందుకంటే..  

 ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ)లో  పరి శోధనలు చేయడానికి పరిధి ఎక్కువగా ఉంటుంది. భవిష్యత అంతా ఈ రంగానిదే. అందుకనే ఈ విభాగాన్ని ఎంచుకున్నాను.

 

 నూతన ఆవిష్కరణలు:

 పీహెచ్‌డీలో భాగంగా ఎలక్ట్రికల్ సిగ్నల్ అండ్ ఇమేజింగ్ ప్రాసెసింగ్‌లో సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నిస్తా. నేరస్థులు తమను గుర్తుపట్టకుండా ముసుగులు ధరిస్తుంటారు. అలాంటి సమయంలో వారిని సులువుగా గుర్తించడం, అలాగే మాటతీరు మార్చినా అసలు వ్యక్తి ఎవరో తెలుసుకునే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. అంతేకాకుండా సొంతంగా సాఫ్ట్‌వేర్ బిజినెస్ ప్రారంభించి పది మందికి ఉపాధి కల్పించాలన్నదే ఆశయం.

 

 అకడెమిక్ ప్రొఫైల్

     10వ తరగతి: 560/600 మార్కులు

     ఇంటర్మీడియెట్: 963/1000 మార్కులు

     ఐఐటీ జేఈఈ: 383వ ర్యాంక్

     (ఓపెన్ కేటగిరీ)

      - చైతన్య వంపుగాని, గుడివాడ అర్బన్,

 కృష్ణా జిల్లా.

 

 

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top