హెచ్‌–1వీసా అభద్రతాభావంలో వీసా హోల్డర్లు

హెచ్‌–1వీసా  అభద్రతాభావంలో వీసా హోల్డర్లు - Sakshi


హెచ్‌–1బి వీసా నిబంధనలు కఠినతరం.. అమెరికాలో అడుగుపెట్టాలంటే అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.. ఇప్పటికే  హెచ్‌–1బి వీసాతో పనిచేస్తున్న భారతీయుల్లో భవిష్యత్తుపై ఆందోళన.. విద్య, ఉద్యోగాల కోసం  అమెరికాకు వెళ్లాలనుకునే వారితో పాటు ఇప్పటికే అక్కడున్న ఉద్యోగులూ.. నిబంధనలు ఎప్పుడు? ఎలా? మారతాయోనని దిగులు చెందుతున్నారు. ఇప్పుడు తాజాగా అమెరికా ప్రభుత్వం హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్ల జారీని రద్దు చేయనుందనే వార్తలు మరింత గుబులు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌–4 వర్క్‌ వీసాలపై ఫోకస్‌..



ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తేగానీ అవసరాలు తీరని పరిస్థితి. అమెరికా అయినా.. ఇండియా అయినా.. ఆస్ట్రేలియా అయినా ఇదే పరిస్థితి. అమెరికాలాంటి దేశాల్లో పనిచేస్తున్న విదేశీయుల్లో.. తమ జీవిత భాగస్వామి కూడా ఏదో ఒక కొలువులో కుదురుకుంటే ఎంతోకొంత ఆదాయం అందుకోవచ్చనే ఆశ ఉంటుంది. దీంతో ఆర్థికంగా మెరుగుపడొచ్చని అనుకుంటారు.



దీనికి 2015లో అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానం కలిసొచ్చింది. దీని ద్వారా.. హెచ్‌–1బి వీసాతో స్కిల్డ్‌ వర్కర్‌గా అమెరికాలో అడుగుపెట్టిన వ్యక్తి.. తనతోపాటు వచ్చిన జీవిత భాగస్వామి కూడా అమెరికాలోనే తన అర్హతలకు తగిన ఉద్యోగం సొంతం చేసుకునే వీలు ఉండేది. స్వయం ఉపాధి కోణంలో సొంత వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.



అంతేకాకుండా హైస్కిల్డ్‌ ప్రొఫెషనల్స్‌ జాబితాలో పేర్కొన్న ఉద్యోగాలను సైతం సొంతం చేసుకోవచ్చు. అయితే ఇలా ఉద్యోగం పొందిన అభ్యర్థులు.. తమకు ఉద్యోగం కల్పించిన సంస్థల యాజమాన్యాల నుంచి ఈఏడీ (ఐ766)గా పిలిచే ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ను తీసుకుని ఇమిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు అందించాల్సి ఉంటుంది.



హెచ్‌–1బికి సమానంగా

ప్రస్తుత నిబంధనల ప్రకారం– హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్ల కాలపరిమితి.. హెచ్‌–1బి వీసా కాల పరిమితికి అనుగుణంగా ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం హెచ్‌–1బి వర్క్‌ పర్మిట్‌ ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా ఆరేళ్లు పనిచేయొచ్చు. దీనికి అనుగుణంగానే సదరు హెచ్‌–1బి వర్క్‌ హోల్డర్‌ భాగస్వామి కూడా హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ పేరుతో ఆరేళ్లు పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తన జీవిత భాగస్వామి హెచ్‌–1బి వీసాను పొడిగిస్తే.. ఆ మేరకు తాను కూడా హెచ్‌– 4 డిపెండెంట్‌ వర్క్‌ వీసాను పునరుద్ధరించుకుని, పొడిగించుకోవచ్చు.



భారత్‌ నుంచే అధికంగా

అమెరికా ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానంలో అధికంగా లబ్ధి పొందిన వారు ఆసియా వాసులేనని.. అందులోనూ భారత్‌కు చెందిన వారే అధికంగా ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. తొలుత 2015లో ఈ విధానంలో 1,80,000 మంది అర్హులు ఉంటారని అంచనా వేశారు. వీరిలో 55 వేల మందికి హెచ్‌–4 వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. వీరిలో భారత్‌కు చెంది హెచ్‌–1బి వీసా పొందిన వారి జీవిత భాగస్వాముల సంఖ్య 40 నుంచి 50 శాతం మధ్యలో ఉందని అంచనా. మొత్తం మీద 2016 నాటికి హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానంలో వర్క్‌ వీసా పొందిన వారి సంఖ్య 1,31,051.



అమెరికన్‌ల నుంచి వ్యతిరేకత

హెచ్‌–1బి వీసాల కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నామని నిరసన వ్యక్తం చేస్తున్న అమెరికన్‌ యువత.. హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానంపై మరింత ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో గతేడాది హెచ్‌–4 వర్క్‌ పర్మిట్ల విధానాన్ని రద్దు చేయాలంటూ అక్కడి న్యాయస్థానాల్లో పిటీషన్లు కూడా దాఖలు చేశారు. హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్లు అమెరికాలోని యువత అవకాశాలను అడ్డుకోవని అక్కడి న్యాయస్థానాలు పేర్కొన్నాయి. అమెరికాలో  కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ వీసా హోల్డర్లలో ఆందోళన మొదలైంది. ఇమిగ్రేషన్‌ విధానాలను కఠినం చేస్తామని, విదేశీయులకు వర్క్‌ వీసాల విషయంలో నిబంధనలు మరింత క్లిష్టతరం చేస్తామనే ట్రంప్‌ ప్రభుత్వ ప్రకటనలతో హెచ్‌–4 సహా వారి భాగస్వాములైన హెచ్‌–1బి వీసా హోల్డర్లలోనూ ఆందోళన నెలకొంటోంది.



హోంల్యాండ్‌ సెక్యూరిటీ చేతిలోనే భవిష్యత్తు

ప్రస్తుత పరిస్థితులను పరిగణిస్తే హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానాన్ని కొనసాగించడమా లేదా రద్దు చేయడమా అనేది అమెరికా డిపార్ట్‌మెంట్‌మెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఈ విషయంపై సమీక్ష జరిపి నిర్దిష్ట నిర్ణయాన్ని 60 రోజుల్లోపు తెలియజేయాలని గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగాన్ని ఆదేశించారు. అయితే ఇంకా స్పష్టత రాని కారణంగా.. మరో 180 రోజులు గడువు ఇవ్వాలని హోం ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ఈ నెల మూడో తేదీన ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రస్తుతం హెచ్‌–4 వీసాతో పని చేస్తున్నవారిలో ఉత్కంఠ నెలకొంది.



ఎన్నో వెసులుబాట్లు

హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ పొందే వారికి.. ఉద్యోగాల కోణంలో హెచ్‌–1బి వీసా విధానాలతో పోల్చితే ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి..



హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ హోల్డర్స్‌  ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు. హెచ్‌–1బి మాదిరిగా స్పాన్సర్‌ కంపెనీలోనే పని చేయా లనే నిబంధన లేదు. అదే విధంగా నిర్దిష్ట   కాల పరిమితిలో ఒక సంస్థ నుంచి మరో  కొత్త సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంటుంది.



మహిళలు స్వయం ఉపాధి కోణంలోనూ ఆదాయం పొందొచ్చు. బేబీ కేర్‌ సెంటర్స్, బ్యూటీ సెలూన్స్, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ వంటివి నెలకొల్పి వ్యాపారం చేయొచ్చు. తమ జీవిత భాగస్వాముల హెచ్‌–1బి వీసా కాల పరిమితిని పొడిగిస్తే.. దానికి తగిన విధంగా తమ హెచ్‌–4 వీసా గడువును కూడా పొడిగించుకునే అవకాశం ఉంటుంది.



అన్నిటికంటే ముఖ్యంగా హెచ్‌–4 డిపెండెంట్‌ వీసాల జారీ కోణంలో సంఖ్యా పరంగా ఎలాంటి పరిమితి లేదు.



రెండు లక్షల మందిపై ప్రభావం

హెచ్‌–4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానాన్ని సమీక్షించాలనే నిర్ణయం, రద్దు చేయాలనే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో.. ఈ ప్రభావం అమెరికాలో నివసిస్తున్న రెండు లక్షల మంది విదేశీయులపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం హెచ్‌–1బి వీసాతో అడుగు పెట్టినవారి జీవిత భాగస్వాములు కూడా తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు చేస్తున్నారు. తాజా నిర్ణయం వారందరికీ శరాఘాతంగా మారనుంది.



Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top