నాకు నప్పే గ్రూప్‌ ఏది?

నాకు నప్పే గ్రూప్‌ ఏది?


పదో తరగతి పరీక్షలు ముగిశాయి.. త్వరలోనే ఫలితాలు కూడా విడుదలవుతాయి. తర్వాత భవిష్యత్‌కు బాటవేసే ఇంటర్‌ దిశగా అడుగులు.. మరి ఇంటర్‌లో ఏ గ్రూప్‌ తీసుకుంటే మంచిది? ఏ గ్రూప్‌ ఎవరికి నప్పుతుంది? అనుకూలమైన గ్రూప్‌ ఏది? ఇలా అనేక సందేహాలు. కారణం.. ఇంటర్‌లో తీసుకున్న గ్రూప్‌పైనే భవిష్యత్తు అవకాశాలు ఆధారపడి ఉంటాయనేది నిస్సందేహం. ఇంటర్మీడియెట్‌లో గ్రూప్‌ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై విశ్లేషణ..



పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల్లో అధిక శాతం మంది నుంచి వచ్చే సమాధానమిదే.  కారణం.. విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్‌ కోర్సుల గురించి చిన్నప్పటి నుంచే ఇంట్లోనూ, పాఠశాలల్లోనూ అవగాహన కల్పిస్తున్న పరిస్థితులు. మరోవైపు ఈ రెండు కోర్సులకు కెరీర్‌ పరంగా సమాజంలో క్రేజ్‌ ఉండటం. అయితే గ్రూప్‌ ఎంపికలో మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనేది నిపుణుల సూచన. కీలకమైన పదో తరగతి తర్వాత గ్రూప్‌ ఎంపికలో  తప్పటడుగు వేస్తే అది దీర్ఘకాలంలో భవిష్యత్‌ కెరీర్‌ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయం.



ఆçసక్తికే పెద్దపీట

ఇంటర్మీడియెట్‌లో గ్రూప్‌ ఎంపికలో విద్యార్థులు ప్రధానంగా ఆసక్తికి ప్రాధాన్యమివ్వాలనేది నిపుణుల అభిప్రాయం. నైపుణ్యాలుంటే ఇంజనీరింగ్, మెడికల్‌తోపాటు అనేక రంగాల్లో ఇప్పుడు అవకాశాలు పుష్కలం. ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌లో చేరుతున్న విద్యార్థులు తాము బ్యాచిలర్‌ స్థాయి కోర్సులు పూర్తి చేసుకునే నాటికి విభిన్న రంగాల్లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. కాబట్టి కెరీర్‌ అంటే ఇంజనీరింగ్, మెడికల్‌ మాత్రమే అనే ఆలోచన నుంచి బయటకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లే ఏకైక మార్గమని భావించకుండా స్వీయ ఆసక్తి మేరకు గ్రూప్‌ ఎంపిక చేసుకోవాలంటున్నారు.



ఎంపీసీ.. ప్రత్యేక నైపుణ్యాలు

ఇంటర్మీడియెట్‌లో క్రేజీ గ్రూప్‌ ఎంపీసీ. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లు ఉండే ఈ గ్రూప్‌లో రాణించాలంటే విద్యార్థులకు కొన్ని సహజమైన లక్షణాలు అవసరం. అవి.. న్యూమరికల్‌ స్కిల్స్, కంప్యూటేషన్‌ స్కిల్స్‌. అంతేకాకుండా ఏదైనా ఒక అంశాన్ని నిశితంగా పరిశీలించి, దాని వెనుక కారణాలు తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నవారికి ఎంపీసీ గ్రూప్‌ సరితూగుతుంది.



గణితంపై ఇష్టం.. సైన్స్‌ అంటే భయం

కొందరు విద్యార్థులకు గణితమంటే ఇష్టం. అదే సమయంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే భయం. అలాంటి వారు గ్రూప్‌ ఎంపికలో ఆందోళనకు గురవుతారు. ఇలాంటి వారికి చక్కటి మార్గం ఎంఈసీ. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్‌ సబ్జెక్టుల కలయికగా ఉండే ఈ గ్రూప్‌లో మ్యాథమెటిక్స్, కామర్స్‌ రెండు సబ్జెక్ట్‌లూ అంకెలు, గణాంకాల ఆధారంగా ఉంటాయి. అంతేకాకుండా భవిష్యత్తు అవకాశాల కోణంలోనూ ఎంఈసీ విద్యార్థులకు చక్కటి మార్గాలున్నాయి. ఎంఈసీ విద్యార్థులు  చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కోర్సుల్లో అడుగుపెట్టి ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.



లైఫ్‌ సైన్సెస్‌పై ఆసక్తి.. బైపీసీ

బైపీసీ పూర్తిచేసి, ఎంట్రెన్స్‌లో ర్యాంకు సాధిస్తే ఎంబీబీఎస్, బీడీఎస్‌లో చేరొచ్చు. బైపీసీ గ్రూప్‌లో చేరే అభ్యర్థులకు ప్రధానంగా లైఫ్‌సైన్సెస్‌పై ఆసక్తి ఉండాలి. మన పరిసరాల్లోని పర్యావరణంపై అవగాహన ఉండాలి. వాటి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత అవసరం. అప్పుడే ఈ గ్రూప్‌లో రాణించగలరు. బైపీసీలోని ప్రధానమైన రెండు సబ్జెక్ట్‌లు బోటనీ, జువాలజీల్లో మొక్కలు, వృక్షాలు, జంతువులు– వాటి వ్యవస్థలకు సంబంధించిన అంశాలుంటాయి. ఈ గ్రూప్‌లో చేరితే కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్‌ అనే కాకుండా.. వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ సైన్స్, హోమియోపతి, నేచురోపతి వంటి మరెన్నో ఇతర కోర్సుల్లో చేరే అవకాశం లభిస్తుంది.



సీఈసీ

కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్‌ సబ్జెక్ట్‌లు కలయికగా ఉండే ఈ గ్రూప్‌ పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సులు పూర్తిచేసుకొని కార్పొరేట్‌ సంస్థల్లో వైట్‌ కాలర్‌ జాబ్స్‌ సొంతం చేసుకోవచ్చు. ఈ గ్రూప్‌లో చేరే అభ్యర్థులకు న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌ ఉండాలి. అంతేకాకుండా విస్తృతంగా చదవడాన్ని, తాజా మార్పులపై అవగాహన పెంచకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top