తెలంగాణ ఉద్యమం.. రాష్ట్ర ఆవిర్భావం

తెలంగాణ ఉద్యమం.. రాష్ట్ర ఆవిర్భావం


గ్రూప్-1 పేపర్ 6 గ్రూప్-2 పేపర్ 4

 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్ష సిలబస్‌లో అభ్యర్థులు ఒకింత ఆందోళనకు గురవుతున్న పేపర్.. ‘తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం’. గ్రూప్-1 మెయిన్స్‌లో ఆరో పేపర్‌గా, గ్రూప్-2లో నాలుగో పేపర్‌గా పేర్కొన్న ఈ పేపర్ కోసం ఎలా చదవాలి? ఏఏ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి? అనే విషయమే చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం పేరుతో ప్రకటించిన పేపర్‌ను మూడు విభాగాలుగా వర్గీకరించారు. అవి.. ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70); సమీకరణ దశ '



 (1971-90); తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014). వాస్తవానికి గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2

 రెండో పేపర్‌లలో పేర్కొన్న తెలంగాణ సామాజిక-సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనే

 విభాగాలను సిలబస్ అంశాల్లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం.. రాష్ట్ర ఆవిర్భావం పేపర్‌లో రాణించేందుకు

 తెలుసుకోవాల్సిన అంశాలు.. మంచి మార్కుల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణుల విశ్లేషణ..

 

 ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70)

 హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రత్యేక సంస్కృతి, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ దృక్కోణం; తెలంగాణ ప్రజలు, కులాలు, మతాలు, కళలు, పండగలు, హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన, సాలార్‌జంగ్ సంస్కరణలు, ముల్కీ, నాన్ ముల్కీ తదితరాల గురించి తెలుసుకోవాలి. ఐడియా ఆఫ్ తెలంగాణ విభాగానికి సంబంధించి అభ్యర్థులు 1948లో హైదరాబాద్‌పై పోలీస్ చర్యతో తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ఈ క్రమంలో 1948 సెప్టెంబరు 13 నుంచి 17వ తేదీ వరకు జరిగిన ముఖ్య పరిణామాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ పోలీసు చర్యలో కీలక వ్యక్తులుగా గుర్తింపు పొందిన అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ప్రతినిధి కె.ఎం.మున్షి, అప్పటి హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ అలీ తదితర వ్యక్తుల గురించి అవగాహన కూడా ఎంతో ముఖ్యం. వీటితోపాటు ఆ సమయంలో వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాలు పాత్రలపై అవగాహన కూడా అవసరం.

 

 బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గం; 1952 ముల్కీ ఆందోళన; స్థానికులకు ఉద్యోగాల కోసం డిమాండ్; సిటీ కాలేజీ ఘటన, దాని ప్రాముఖ్యత; 1953లో తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్, చర్చ, 1953లో ఫజల్ అలీ కమిషన్, సిఫార్సులు తదితర అంశాలపై లోతైన అవగాహన పొందాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు; 1956లో ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం - అందులోని ముఖ్యాంశాలు తెలుసుకోవాలి. ఈ ఒప్పందంలో చేసుకున్న తీర్మానాలు - వాటికి కలిగిన విఘాతం వంటి కారణాలు ఇతర ముఖ్యాంశాలు. ఇదే క్రమంలో 1969లో జై తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన సంఘటనలపై దృష్టి పెట్టాలి. ఈ దశలో ముఖ్యమైన ఘటనలుగా ఉన్న అష్ట సూత్రాలు, అయిదు సూత్రాలు - వాటి ప్రభావాలు, కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వలసలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.1970 తర్వాత వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, ఉద్యోగాలు, వైద్యం, ఆరోగ్య రంగాల్లో తెలంగాణ పరిస్థితి. ఉద్యోగాలు, సర్వీస్ రూల్స్ ఉల్లంఘన, తెలంగాణ పోరాటం ప్రారంభం, నిరసనలు, ప్రత్యేకం తెలంగాణ కోసం 1969 పోరాటం; తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు; జీవో 36, అష్ట సూత్ర, పంచ సూత్ర పథకాలు, వాటి ప్రభావం గురించి విపులంగా తెలుసుకోవాలి.

 

 రెండో దశ.. సమీకరణ (1971-90)

 తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం పేపర్‌లో పేర్కొన్న రెండో దశ మొబిలైజేషన్ (సమీకరణ దశ) కోసం అభ్యర్థులు కొంత ఎక్కువ కసరత్తు చేయాలి. కారణం ఈ దశలో ఎన్నో ముఖ్య ఘట్టాలు, పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 1972లో జై ఆంధ్ర ఉద్యమం; 1973లో రాష్ర్టపతి పాలన, ఆరు సూత్రాల పథకం; తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు; రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ ఏర్పాటు వంటివి చదవాలి. జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైన మరుసటి సంవత్సరమే 1973 రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఈ సమయంలో ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకోవాలి. ఆర్టికల్ 371డి, రాష్ట్రపతి ఉత్తర్వులు, జీవో 610, ఉల్లంఘనలు తదితర అంశాలపై అవగాహన పొందాలి. న క్సలైట్ ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, రైతు కూలీ సంఘాలు, గిరిజన భూముల ఆక్రమణ, ఆదివాసీల తిరుగుబాటు, జల్, జంగల్, జమీన్ నేపథ్యం తెలుసుకోవడం పరీక్షల కోణంలో చాలా అవసరం. 1980ల్లో ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు, తెలంగాణ అస్తిత్వ అణచివేత; తెలంగాణ ఆత్మాభిమానం, భాషాసంస్కృతులపై దాడి తదితర అంశాలను అధ్యయనం చేయాలి. 1990ల్లో ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు, వాటి ప్రభావం; పెరిగిన ప్రాంతీయ అసమానతలు; తెలంగాణలో వ్యవసాయం, చేతివృత్తుల రంగాల్లో సంక్షోభం, తెలంగాణ సమాజం, ఆర్థిక వ్యవస్థ వాటి ప్రభావం గురించి అవగాహన పొందాలి. దాంతోపాటు తెలంగాణ అస్తిత్వం కోసం జరిగిన చర్చలపైనా దృష్టిపెట్టాలి.

 

 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. మూడో దశ

 తెలంగాణ ఉదమ్యం- రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్యమైన దశ మూడో దశ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1990-2014) దశ. గ్రూప్స్ అభ్యర్థులు దీనికి సంబంధించి లోతైన అవగాహన పొందాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ దశలో ఏర్పాటైన ముఖ్యమైన పార్టీలు / సంస్థల గురించి సమాచారం, వాటి నేపథ్యాలు తెలుసుకోవాలి. తెలంగాణలో ప్రజాచైతన్యం, పౌరసంఘాల ఆవిర్భావం, ప్రత్యేక తెలంగాణ అస్థిత్వ భావన, తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ ప్రకటన, తెలంగాణ విద్యార్థుల వేదిక వంటి అంశాలపై ముఖ్యంగా దృష్టిసారించాలి. ముఖ్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితుల గురించి అధ్యయనం చేయాలి.

 

 ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు కారణమైన పలు రాజకీయ పార్టీల తెలంగాణ వ్యతిరేక విధానాల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలు, సభలు, సమావేశాలు మొదలు 2009 నవంబర్ 29న టీఆర్‌ఎస్ వ్యవస్థాపకులు కె. చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహారదీక్షకు దారి తీసిన పరిస్థితులు, డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటన వరకు అన్నీ ముఖ్యమే అని గుర్తించాలి. తెరాస, కాంగ్రెస్, భాజపా, వామపక్షాలు, తెదేపా, ఎంఐఎంవంటి పార్టీల పాత్రపైనా అవగాహన పెంపొందించుకోవాలి. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం, సాహిత్యం, కళలు, కవులు, రచయితలు, గాయకులు, మేధావులు, ఉద్యోగులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మహిళల పాత్ర గురించి తెలుసుకోవాలి. జేఏసీ కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ.. సమీకరణ దశలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో ముందుకు కదిలిన పార్టీలు / ఫోరంలతోపాటు మరింత కీలకంగా వ్యవహరించింది జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ). ఈ నేపథ్యంలో అభ్యర్థులు పొలిటికల్ జేఏసీ, తెలంగాణలో శాఖల వారీగా ఏర్పాటైన జేఏసీలు వాటి కార్యకలాపాలు, నిరసన కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా మిలియన్ మార్చ్; సడక్ బంద్; సకల జనుల సమ్మె; పల్లె పల్లె పట్టాలపైకి వంటి ఉద్యమ కార్యక్రమాలు ఆ సందర్భంలో జరిగిన పర్యవసానాల గురించి తెలుసుకోవాలి.

 

 గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీల గురించి క్రమానుగతంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా లలిత్ కుమార్ కమిటీ (1969); భార్గవ, వాంఛూ కమిటీ (1969); భరత్‌రెడ్డి కమిటీ (1985); 610 జీవో (1985); గిర్‌గ్లానీ కమిషన్ (2001); ప్రణబ్ ముఖర్జీ కమిటీ (2005); శ్రీ కృష్ణ కమిటీ (2010) వాటి సిఫార్సులపై అధ్యయనం చేయాలి. వీటితోపాటు శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులపై 2011, మార్చి 23న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పేర్కొన్న అంశాలు చదవాలి.

 

 తెలంగాణ ఆవిర్భావం దిశగా

 ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి శ్రీ కృష్ణ కమిటీ సిఫార్సుల తర్వాత క్రమంలో తెలంగాణ ఏర్పాటు దిశగా జరిగిన పరిణామాలపై అవగాహన కూడా ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో 2013, జూలై 1న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన; ఆగస్ట్ 6 విభజన కమిటీ ఏర్పాటు; ఏకే ఆంటోనీ నేతృత్వంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు ముఖ్యాంశాలుగా గుర్తించాలి. వీటికి కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం, తర్వాత లోక్‌సభ ఆమోదం; గెజిట్ విడుదల, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు ఇవ్వడం (మార్చి 4, 2014) ఒక క్రమశ్రేణిలో చదవాలి. తర్వాత 2014లో ఎన్నికలు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటన వంటి అంశాలు కూడా ముఖ్యమే.

 

 పేపర్-2తో అనుసంధానం చేసుకుంటూ

 తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం పేపర్‌ను గ్రూప్-1 మెయిన్స్‌లో, గ్రూప్-2లో రెండో పేపర్‌గా పేర్కొన్న తెలంగాణ సామాజిక-సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ ఆవిర్భావంతో అనుసంధానం చేసుకుంటే కొంత సమయం కలిసొస్తుంది. సామాజిక, సాంసృతిక చరిత్రకు సంబంధించి కవులు, కళాకారులు వంటి విషయాలపై అవగాహన లభిస్తుంది. తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి నిజాం కాలం నాటి పరిస్థితులపై సమాచారం పొందొచ్చు.

 

 డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో

 కొత్తగా పేర్కొన్న పేపర్ గ్రూప్-1, గ్రూప్-2 రెండింటిలోనూ ఉంది. ఇది ఈ రెండు పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సమయం పరంగా కలిసొచ్చే అంశంగా మలచుకోవాలి. గ్రూప్-1 మెయిన్స్ కోణంలో డిస్క్రిప్టివ్ విధానంలో చదువుతూ ముఖ్యాంశాలతో బిట్స్ / షార్ట్ నోట్స్ రూపొందించుకుంటే గ్రూప్-2కు కూడా ఉపకరిస్తుంది.

 

 సులువైన పేపర్ ఇదే

 తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం పేపర్ విషయంలో అభ్యర్థులు ఆందోళన అనవసరం. ఇతర పేపర్లతో పోల్చితే ఇదే ఎంతో సులువైన పేపర్‌గా పేర్కొనొచ్చు. ఇందులో కవర్ అయ్యే అంశాలన్నీ సీరియస్ అభ్యర్థులకు ఇప్పటికే తెలిసి ఉంటాయి. ఓపెన్ యూనివర్సిటీ హిస్టరీ పుస్తకాలు, అకాడమీ పుస్తకాలు చదవడం ద్వారా ప్రామాణిక సమాచారం తెలుస్తుంది. వీటితోపాటు ఎమర్జెన్సీ ఆఫ్ ఏపీ- నారాయణ రావు; తెలంగాణ చరిత్ర - సుంకిరెడ్డి నారాయణ రెడ్డి; ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ - సరోజిని రేగాని పుస్తకాలు కూడా ఆరో పేపర్‌లో విషయ పరిజ్ఞానానికి దోహదం చేస్తాయి. ఇక.. సమకాలీన సమాచారం కోసం గత ఆరేళ్ల పత్రికలు చదవడం ఎంతో అవసరం.

 - ప్రొఫెసర్ ఎ.సత్యనారాయణ,

 ఓయూ హిస్టరీ డిపార్ట్‌మెంట్,

 సిలబస్ కమిటీ సభ్యులు.

 

 సబ్జెక్ట్‌గా కాకుండా.. జనరల్‌గా..

 గ్రూప్స్ ఔత్సాహికులు ఆరో పేపర్‌ను ఒక సబ్జెక్ట్ పేపర్‌గా కాకుండా జనరల్ పేపర్‌గా భావిస్తే ఆందోళనకు స్వస్తి పలకొచ్చు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష-ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులు అన్నీ సమకాలీన అంశాలుగానే పేర్కొనొచ్చు. వీటిలో సంసిద్ధత పొందేందుకు ప్రత్యేక శిక్షణ కూడా అక్కర్లేదు. అభ్యర్థులు దీన్ని గుర్తించాలి. సమకాలీన అంశాలపై అవగాహన ఉంటే సులువుగానే ఈ పేపర్‌లో మెరుగైన మార్కులు పొందొచ్చు.

 - ప్రొఫెసర్ జి.భద్రునాయక్,

 కేయూ హిస్టరీ డిపార్ట్‌మెంట్,

 సిలబస్ కమిటీ సభ్యులు.

 

 కాన్సెప్ట్ ఓరియెంటేషన్‌తో

 టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్స్ ఔత్సాహికులు ‘తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం’ పేపర్ ప్రిపరేషన్ విషయంలో కాన్సెప్ట్ ఓరియెంటేషన్‌తో చదవాలి. గ్రూప్-1 మెయిన్స్ కోణంలో వ్యాస రూప సమాధానాలిచ్చే విధంగా ఒక అంశానికి సంబంధించి పూర్తి నేపథ్యం తెలుసుకోవాలి. అదే అంశంలోని ముఖ్యాంశాలను బిట్స్ రూపంలో రాసుకుంటే గ్రూప్-2కు ఉపకరిస్తాయి. ఇక కేవలం గ్రూప్-2నే లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు అన్ని సంఘటనలు, పరిస్థితులు, ముఖ్య తేదీలు, వ్యక్తులు-వారి ప్రాముఖ్యత, కళలు-కవులు, గ్రంథాలు-రచయితలు వంటి వాటిపై దృృష్టి పెట్టాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఇన్‌డెరైక్ట్ ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి గ్రూప్-2 అభ్యర్థులు కూడా ఆయా అంశాల నేపథ్యంపై అవగాహన ఏర్పరచుకోవడం ముఖ్యం.

 - ప్రొఫెసర్ మురళి,

 సీనియర్ ఫ్యాకల్టీ, హిస్టరీ.

 

 

 ఇన్‌పుట్స్

 డా. బి.జె.బి. కృపాదానం,    సీనియర్ ఫ్యాకల్టీ

 గురజాల శ్రీనివాసరావు,    సీనియర్ ఫ్యాకల్టీ

 కె.యాకుబ్ బాషా,    సీనియర్ ఫ్యాకల్టీ

 సీహెచ్ మోహన్,    సీనియర్ ఫ్యాకల్టీ

 డా. బి.రమేష్,    సీనియర్ ఫ్యాకల్టీ

 డా. పి.మురళి,    సీనియర్ ఫ్యాకల్టీ

 బి.కృష్ణారెడ్డి,    సీనియర్ ఫ్యాకల్టీ

 అల్లాడి అంజయ్య,    సీనియర్ ఫ్యాకల్టీ

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top