సాహసికులు ఇష్టపడే కెరీర్.. గ్లేసియాలజిస్ట్

సాహసికులు ఇష్టపడే కెరీర్.. గ్లేసియాలజిస్ట్


జమ్మూకాశ్మీర్‌లోని ఖేలాన్‌మార్గ్‌లో 2010, ఫిబ్రవరి 8న సంభవించిన మంచు ఉత్పాతం దేశాన్ని నివ్వెరపరిచింది. ఇండియన్ ఆర్మీ వార్‌ఫేర్ స్కూల్‌పై మంచు దిమ్మెలు కుప్పకూలాయి. ఈ దుర్ఘటనలో కెప్టెన్‌తో సహా 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మృత్యురూపంలోని హిమ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేసే నిపుణులు అక్కడ అందుబాటులో ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. హిమాలయాల్లో హిమనీనదాలు(అవలాంచీ), మంచు తుపాన్ల బెడద అధికం. వీటితో ప్రతిఏటా అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగడం పరిపాటిగా మారింది. హిమపాతాలను ముందుగానే గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. ఈ నేపథ్యంలో గ్లేసియాలజిస్ట్‌లు, అవలాంచీ నిపుణులకు డిమాండ్ పెరిగింది. పర్వతారోహణపై ఆసక్తి, మంచు కొండల అందాలపై అనురక్తి ఉన్నవారికి సరిగ్గా సరిపోయే కెరీర్ ఇది.  

 

విదేశాల్లోనూ కొలువులు

 గ్లేసియాలజిస్ట్‌లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. రక్షణ శాఖలో వీరిని నియమించుకుంటున్నారు. మంచు తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో సర్వేలు, మ్యాపింగ్, గృహ, రహదారుల నిర్మాణం వంటి వాటిలో గ్లేసియాలజిస్ట్‌లు, అవలాంచీ ఎక్స్‌పర్ట్స్ భాగస్వామ్యం తప్పనిసరి. మంచు తీవ్రతను తట్టుకొనే నిర్మాణాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. హిమాలయాల్లో మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధి చెందుతుండడంతో గ్లేసియాలజిస్ట్‌లకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీరికి విదేశాల్లోనూ కొలువులు ఉన్నాయి. ఈ రంగంలో బాధ్యతలు ఉత్సాహభరితంగా, సవాళ్లతో కూడుకొని ఉంటాయి. సుందరమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పనిచేసుకోవచ్చు. సాహసాలను ఇష్టపడేవారు ఇందులో సులభంగా రాణించొచ్చు.

 

కావాల్సిన నైపుణ్యాలు

 గ్లేసియాలజిస్ట్‌లకు పరిశోధనా, విశ్లేషణా నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే సామర్థ్యం అవసరం. పర్వతారోహణపై అవగాహన పెంచుకోవాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఇందుకు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ స్పిరిట్ అవసరం. నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి.

 

అర్హతలు

 గ్లేసియాలజిస్ట్‌గా మారాలనుకుంటే సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత మ్యాథమెటిక్స్/ఫిజికల్/బయాలాజికల్/కెమికల్/ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్ సబ్జెక్టులతో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులను అభ్యసించాలి. మన దేశంలో ప్రముఖ విద్యాసంస్థలు ఆయా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

 

వేతనాలు

 గ్లేసియాలజిస్ట్‌లు, స్నో సైంటిస్ట్‌లకు సీనియారిటీని బట్టి లెవల్ ఎ, లెవల్ బి... లెవల్ హెచ్ వరకు హోదాలుంటాయి. లెవల్ ఎ నిపుణులకు నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వేతనం ఉంటుంది. నాలుగైదేళ్లలో లెవల్ బి, సిలకు చేరుకోవచ్చు. ఈ దశలో నెలకు రూ.38 వేలు అందుతుంది. మెరుగైన పనితీరు, అనుభవంతో లెవల్ హెచ్‌కు చేరుకుంటే నెలకు రూ.లక్షకు పైగానే పొందొచ్చు. దీంతోపాటు ఉచిత వైద్యం, ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్), వసతి.. వంటి ప్రయోజనాలు ఉంటాయి.

 

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు

 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్

 వెబ్‌సైట్: www.drdo.gov.in

 టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్

 వెబ్‌సైట్: www.tifr.res.in

 వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ-డెహ్రాడూన్

 వెబ్‌సైట్: www.wihg.res.in

 జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ

 వెబ్‌సైట్: www.jnu.ac.in

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top