సర్కారీ కొలువులకు సిద్ధంకండి!


 తెలంగాణలో కొలువుల పిలుపు ఎప్పుడెప్పుడు వినిపిస్తుందా అని ఎదురుచూస్తున్న ఔత్సాహికులకు ఆ శుభవార్త త్వరలోనే చెవినపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వివిధ విభాగాల్లో దాదాపు 25 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో జూలైలో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయనే వార్తలు నిరుద్యోగుల్లో ఆశలను చిగురింపజేస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో లక్షా ఏడువేలకు పైగా ఖాళీలున్నట్లు అధికారికంగా తేలిన లెక్క. ప్రాధాన్యత బట్టి కీలక విభాగాల్లో ముందుగా ఉద్యోగాలను భర్తీ చేయాలిన ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి వాతావరణంలో భర్తీ కానున్న ఉద్యోగాలు, వాటిని చేజిక్కించుకునేందుకు అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్...

 

 పోలీస్ శాఖలో భారీగా

  త్వరలో చేపట్టనున్న నియామకాల్లో పోలీస్ శాఖలో భర్త్తీల కు అధిక ప్రాధాన్యం లభించనుంది. మొత్తం 25వేల ప్రతిపాదిత ఖాళీల్లో వీటి సంఖ్య 10,810గా ఉంది. ఇందులో కానిస్టేబుల్ కేడర్ నుంచి ఎస్‌ఐ వరకు పలు ఖాళీలున్నాయి. అవి.. ఎస్‌ఐ(మేల్): 467; ఎస్‌ఐ(ఫిమేల్): 77; ఆర్‌ఎస్‌ఐ: 59, కానిస్టేబుల్ (మేల్): 2978; కానిస్టేబుల్ (ఫిమేల్): 38; ఏఆర్ కానిస్టేబుల్ - 2169; ఏఆర్ కానిస్టేబుల్ (ఫిమేల్): 57; ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ - 174. ఇవే కాకుండా కానిస్టేబుల్ (ైడ్రైవర్) విభాగంలో 3,600 పోస్టుల భర్తీ జరగనున్నట్లు సమాచారం.

 

 ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో

 అటవీశాఖలో దాదాపు రెండు వేల పోస్టుల భర్తీ జరగనుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టే అసిస్టెంట్ కన్జర్వేటర్; ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొదలు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వరకు ఈ ఖాళీలు ఉన్నాయి. గతంలో ఎఫ్‌ఎస్‌ఓ, బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నియామకాలను అటవీ శాఖ స్వయంగా జిల్లా, డివిజన్ స్థాయిలో చేపట్టేది. ఈసారి వీటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపడతారని చెబుతున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారుల స్పందన మాత్రం భిన్నంగా ఉంది. ‘రాత పరీక్ష వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టడం సులభమే.



కానీ క్షేత్ర స్థాయిలో నిర్వహించే వాకింగ్ టెస్ట్ తదితర ఫిజికల్ ఎఫిషీయన్సీ టెస్ట్‌లను పర్యవేక్షించడం సర్వీస్ కమిషన్‌కు కొంచెం క్లిష్టమైన అంశం’ అని ఆ శాఖలోని ఓ ఉన్నతాధికారి అభిప్రాయం. ఈ శాఖలో ఎఫ్‌ఆర్‌ఓ, ఎఫ్‌ఎస్‌ఓలకు అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కాగా బీట్ ఆఫీసర్లకు ఇంటర్మీడియెట్; అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకు పదో తరగతి ఉత్తీర్ణత అర్హతగా ఉండేది. ఈసారి కూడా ఇదే విధానం అమలు కానుంది. గతంలో జనరల్ నాలెడ్జ్, జనరల్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లిష్ విభాగాలకు సంబంధించి పరీక్షలో మూడు పేపర్లు ఉండేవి. ఈసారి కూడా ఇదే విధంగా ఉండే అవకాశముంది.

 

 ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు అద్భుత అవకాశం

 ప్రభుత్వం తాజాగా గుర్తించిన ఖాళీలు ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణుల్లో ఆనందోత్సాహాలు నింపుతున్నాయి. ఇరిగేషన్, వాటర్ గ్రిడ్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌కో, జెన్‌కో తదితర విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో దాదాపు అయిదు వేల పోస్టులు భర్తీ చేయనున్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కోలలో బీటెక్ అర్హతగా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, డిప్లొమా అర్హతగా సబ్ ఇంజనీర్ పోస్టుల సంఖ్య దాదాపు రెండు వేలు ఉంది.



 వైద్య, అనుబంధ కోర్సులు అర్హతగా

 ఎంబీబీఎస్, నర్సింగ్, ఫార్మసీ తదితర వైద్య అనుబంధ కోర్సుల్లో ఉత్తీర్ణత అర్హతగానూ పలు ఖాళీలు గుర్తించారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్ నర్సులు,ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, అదే విధంగా ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలకు సంబంధించి స్పష్టత వచ్చినట్లు సమాచారం.

 

 మారనున్న సిలబస్

 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టనున్న ఉద్యోగాలకు సంబంధించి ఈసారి సిలబస్‌లో మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా జనరల్‌స్టడీస్‌లో భాగంగా ఉండే చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీల విషయంలో తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఇప్పటికే సిలబస్ కమిటీ విధివిధానాలు రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. సబ్జెక్ట్ స్పెసిఫిక్ పేపర్లు (ఉదా: ఇంజనీరింగ్ పోస్టులకు నిర్వహించే టెక్నికల్ పేపర్లు)లో సిలబస్‌లో మార్పులు ఉండకపోయినా.. జనరల్ స్టడీస్ విషయంలో మార్పులు తథ్యం.

 

 గ్రూప్-1 స్థాయిలో 300?

 పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలంటే అభ్యర్థులకు టక్కున గుర్తొచ్చేది గ్రూప్-1 నియామకాలు. డిప్యూటీ కలెక్టర్/ఆర్‌డీఓ, డీటీఓ, డీఎస్పీ తదితర హోదాలకు సంబంధించిన గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఎదురుచూస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో నియామకాల ప్రక్రియలో గ్రూప్-1 స్థాయిలో 300 పోస్టుల వరకు భర్తీ చేయనున్నట్లు సమాచారం. అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

 

 పరీక్ష విధానంలోనూ మార్పు

 ఉద్యోగ నియామక పరీక్షల స్వరూపంలో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. ఈ మేరకు స్కీం ఆఫ్ ఎగ్జామినేషన్‌ను ఖరారు చేసేందుకు ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. ఇది ప్రస్తుతం వివిధ పరీక్షల తీరుతెన్నుల్లో మార్పులపై అధ్యయనం చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే పరీక్షల స్వరూపంపై స్పష్టత వస్తుంది. అదే విధంగా గరిష్ట వయో పరిమితి సడలింపు విషయంపైనా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే జనరల్ కేటగిరీకి గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు. దీన్ని అయిదు లేదా పదేళ్లు పెంచే ప్రతిపాదన  కూడా ఉంది.

 

 ఔత్సాహికులు కదలాలిలా

 కొంచెం ఆలస్యమైనప్పటికీ ఉద్యోగ నియామకాల పర్వం ప్రారంభం కానుంది. అందువల్ల చాలా కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహికులు ఇప్పటి నుంచి తమ ప్రిపరేషన్‌కు పదునుపెట్టుకోవాలి. ముఖ్యంగా జనరల్‌స్టడీస్ ప్రిపరేషన్‌కు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చరిత్ర, జాగ్రఫీ, ఆర్థిక అంశాల్లో కచ్చితంగా తెలంగాణ ప్రాంత సంబంధిత అంశాలపై ప్రశ్నలు ఉంటాయని సిలబస్ కమిటీ కూడా స్పష్టం చేసింది. దీన్ని గుర్తించి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి.

 

 తెలంగాణ చరిత్ర

 శాతవాహనులు; ఇక్ష్వాకులు; తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష సాహిత్యం పూర్వాపరాలు, కవులు- కళాకారులు ఆయా రాజ వంశాల పరిపాలన కాలంలోని ప్రముఖ కట్టడాలు; వాణిజ్యం తదితర అంశాలపై అధ్యయనం అవసరం. అదే విధంగా చాళుక్యులు-బాదామీ వంశం; రాష్ట్ర కూటులు; తెలంగాణ ప్రాంతంలో భక్తి ఉద్యమాలు; కాకతీయ రాజ వంశం; కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీ; నిజాం రాజుల గురించి పూర్తి పరిజ్ఞానం సొంతం చేసుకోవాలి. దాంతోపాటు రజాకార్ల ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలు చదవాలి.

 

 ఎకానమీ

 ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాలను చదివేటప్పుడు తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉపయోగకరం. ఎకానమీకి సంబంధించి తాజాగా తెలంగాణ బడ్జెట్‌లోని అంశాలు; ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు; ప్రభుత్వం చేపట్టిన పాలసీలు (ఉదాహరణ పారిశ్రామిక విధానం, ఐటీ విధానం తదితరాలు) గురించి తెలుసుకోవాలి. అదే విధంగా బడ్జెట్‌లో పేర్కొన్న ప్రాధాన్యత రంగాలు, వాటికి కేటాయించిన నిధులు, లక్ష్యాలు, లక్షిత వర్గాల సమాచారాన్ని అధ్యయనం చేయాలి.

 

 జాగ్రఫీ

 తెలంగాణ ప్రాంత భౌగోళిక స్వరూపం విషయంలో ముఖ్యమైన అంశాలను గుర్తించాలి. ఈ ప్రాంతంలో అత్యధికంగా పండే పంటలు -వాటిని సాగుచేస్తున్న ప్రాంతాలు; నదులు, పరీవాహక ప్రాంతాలు వాటి పరిధిలో ఎక్కువగా పండే పంటలు; ముఖ్యమైన ఉత్పత్తులకు కేంద్రాలుగా నిలిచే ప్రాంతాలు (ఉదా: సిరిసిల్ల చేనేత); ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు; ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు వంటి అంశాలు తెలుసుకోవాలి.

 

 ఇతర అంశాలు

 తెలంగాణ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, జాగ్రఫీలను మినహాయిస్తే జనరల్ స్టడీస్‌లో భాగంగా ఉండే ఇతర అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, పాలిటీ. వీటికోసం హైస్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. బేసిక్ సైన్స్ అంశాలతోపాటు ఈ విభాగంలో తాజా పరిణామాలు (ఉపగ్రహ ప్రయోగాలు, క్షిపణుల ప్రయోగాలు తదితర) తెలుసుకోవాలి.

 

 పరిపాలనతో ముడిపడిన ఆర్థిక అంశాలు

 అభ్యర్థులు ప్రిపరేషన్‌లో భాగంగా పరిపాలనతో ముడిపడిన ఆర్థిక అంశాలపై దృష్టిసారించాలి. తెలంగాణ ప్రాంతంలోని రైతుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలు పాలనాపరమైన అంశాల పరిధిలోకి వస్తే వాటి ద్వారా కలిగిన లబ్ధి ఆర్థిక అంశాలకు సంబంధించినదిగా పేర్కొనొచ్చు. ఇటీవల కాలంలో ప్రవేశ పెట్టిన పథకాలకు సంబంధించిన నిర్ణయాలు పాలనాపరమైనవికాగా, వాటి కోసం కేటాయించిన నిధులు, లక్షిత వర్గాలు, లక్ష్యాలు వంటివి ఎకానమీ పరిధిలో ఉంటాయి.

 - బి.కృష్ణారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ.

 

 నిర్మాణాలు, కవులు కళాకారులు

  చరిత్రకు సంబంధించి ఆయా రాజ వంశాల కాలంలో నిర్మాణాలు, వారి కాలంలో పేరొందిన కళలు, సాహితీపరమైన అంశాలు, ముఖ్యమైన కవులు-రచనలు తెలుసుకోవాలి. స్వాతంత్య్ర పోరాటంలో తెలంగాణ ప్రాంతంలో ప్రాంతంలో చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి.

 - జోగినాయుడు, హిస్టరీ సబ్జెక్ట్ నిపుణులు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top