క్యూబా మాజీ అధ్యక్షుడు క్యాస్ట్రో కన్నుమూత

క్యూబా మాజీ అధ్యక్షుడు క్యాస్ట్రో కన్నుమూత - Sakshi

 అంతర్జాతీయం

 క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూత

 క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో (90) అనారోగ్యంతో నవంబర్ 25న కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన తమ్ముడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో తెలిపారు. ఫిడెల్ క్యాస్ట్రో 1926, ఆగస్టు 13న బిరాన్ (హొల్లూయిన్ ప్రావిన్స్)లో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. నాటి అమెరికా అనుకూల క్యూబా నియంత ఫుల్జెనికో బటిస్టా సేనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా చేస్తున్న ఆందోళనల్లో విద్యార్థి నాయకుడిగా పాల్గొన్నారు. ఈ పోరాటంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొని పార్టీ నాయకుడిగా ఎదిగారు. ఆయన నాయకత్వంలోనే చేగువేరాతోపాటు వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా కార్యకర్తలు విప్లవ పోరాటం సాగించి.. 1959లో క్యూబాను హస్త్తగతం చేసుకున్నారు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు.

 

  జపాన్‌లో భారీ భూకంపం, సునామీ

 జపాన్ ఈశాన్య తీరంలో నవంబర్ 22న 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీనికి కొనసాగింపుగా సునామీ కూడా వచ్చింది. భూకంప ప్రభావంతో కొన్ని నిమిషాల్లోనే సముద్ర అలలు మీటరు ఎత్తున లేచి ఫుకుషిమా అణుశక్తి కేంద్రాన్ని ముంచెత్తాయి. ఫుకుషిమా నగరానికి 37 కి.మీ. దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో 11.4 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

 

  అత్యధిక వరి దిగుబడిని సాధించిన చైనా శాస్త్రవేత్త  

 హైబ్రిడ్ వరి పితామహుడిగా పేరుగాంచిన చైనా వ్యవసాయ శాస్త్రవేత్త యువాన్ లాంగ్‌పింగ్ భారీ స్థాయిలో వరి పండించి సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారని చైనా అధికారులు నవంబర్ 25న ప్రకటించారు. గ్యాంగ్‌డాంగ్‌లో ఆయన పండించిన వరి 0.07 హెక్టార్‌కు 1,533.78 కిలోల వార్షిక దిగుబడి ఇచ్చిందని తెలిపారు. హెబీ, యునాన్ ప్రాంతాల్లో 0.07 హెక్టార్‌కు వరుసగా 1,082.1 కిలోలు, 1,088 కిలోల దిగుబడి వచ్చిందని.. ఎత్తై ప్రాంతాల్లో ఇవి రికార్డు స్థాయి దిగుబడులని అన్నారు. యువాన్.. 1974లో ప్రపంచంలో మొట్టమొదటి సారిగా హైబ్రిడ్ వరిని అభివృద్ధి చేశారు.

 

  పేటెంట్ హక్కుల్లో చైనా ప్రపంచ రికార్డు

  మేధోసంపత్తి హక్కులకు సంబంధించి చైనా 2015లోనే 11 లక్షల దరఖాస్తులు చేసింది. పేటెంట్ హక్కుల కోసం వివిధ దేశాలు చేసుకున్న దరఖాస్తుల వివరాలను ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ మేధోసంపత్తి హక్కుల సంస్థ అధిపతి ఫ్రాన్సిస్ గుర్రీ నవంబర్ 24న వెల్లడించారు. ఈ జాబితాలో అమెరికా 5,78,000 దరఖాస్తులతో రెండో స్థానంలో, జపాన్ 3,25,000 దరఖాస్తులతో మూడో స్థానంలో, దక్షిణ కొరియా 2,14,000 దరఖాస్తులతో నాలుగో స్థానంలో ఉన్నాయి.

 

 జాతీయం

 హైదరాబాద్‌లో జాతీయ స్థాయి డీజీపీ, ఐజీల సదస్సు

 జాతీయ స్థాయి డీజీపీ, ఐజీల వార్షిక సదస్సు హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో నవంబర్ 26న జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ పోలీసులు మరింత చురుగ్గా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియ శిక్షణలో భాగంగానే జరగాలన్నారు. మనస్తత్వం, మనోవిజ్ఞాన నైపుణ్యాలు శిక్షణలో కీలకాంశాలుగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని ‘ఇండియన్ పోలీస్ ఎట్ యువర్ కాల్’ అనే యాప్‌ను ఆవిష్కరించారు. తర్వాత విధి నిర్వహణలో విశేష ప్రతిభ చూపిన నిఘా విభాగం అధికారులను పోలీసు పతకాలతో సత్కరించారు. ఈ సదస్సులో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, పోలీస్ అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ, వివిధ రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు పాల్గొన్నారు.

 

  సెర్న్‌లో అనుబంధ సభ్య దేశంగా భారత్

 యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్(సెర్న్)లో భారత్ అనుబంధ సభ్య దేశంగా చేరింది. ముంబైలో నవంబర్ 21న దీనికి సంబంధించిన ఒప్పందంపై భారత్, సెర్న్ ప్రతినిధులు సంతకాలు చేశారు. సెర్న్.. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ లేబొరేటరీ. 2004లో భారత్ ఇందులో పరిశీలక దేశంగా చేరింది. తాజాగా అనుబంధ సభ్య దేశంగా చేరడంతో భారత కంపెనీలు సెర్న్‌కు చెందిన ఇంజనీరింగ్ కాంట్రాక్ట్‌లను పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సెర్న్‌లో ఉద్యోగాలకు భారతీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ సభ్యత్వం వల్ల భారత్‌కు దాదాపు రూ.78 కోట్ల వ్యయం అవుతుంది. సెర్న్ జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో 22 సభ్య దేశాలు. నాలుగు అనుబంధ సభ్య దేశాలు ఉన్నాయి.

 

  ఫ్రీ టాక్‌టైమ్ పథకాన్ని ప్రవేశపెట్టిన గోవా

 దేశంలో తొలిసారిగా ‘గోవా యువ ఇనిషియేటివ్ స్కీమ్’ పేరుతో 100 నిమిషాల టాక్‌టైమ్, 1 జీబీ డేటా (2 ఎంబీపీఎస్)ను ఉచితంగా అందించే పథకాన్ని గోవా ప్రభుత్వం నవంబర్ 25న ప్రకటించింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువత (16- 30 ఏళ్ల మధ్య)ను ఆకర్షించేందుకు గోవాలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద 1.25 లక్షల మంది లబ్ధి పొందనున్నారని గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ తెలిపారు.

 

 రాష్ట్రీయం

  హైదరాబాద్‌లో సైబర్ భద్రత జాతీయ సదస్సు

 సైబర్ భద్రతపై జాతీయ సదస్సు నవంబర్ 22 నుంచి రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగింది. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ఏర్పాటు చేసిన ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. 

 

  నందిని ిసిధారెడ్డికి తెలుగు వర్సిటీ పురస్కారం

 ప్రముఖ కవి నందిని సిధారెడ్డి 2016కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అందించే విశిష్ట పురస్కారానికి నవంబర్ 22న ఎంపికయ్యారు. 

 

 ఆర్థికం

 భారత్ కొత్త నోట్లపై నిషేధం విధించిన నేపాల్

 భారత్ విడుదల చేసిన కొత్త రూ.500, రూ.2000 నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ నవంబర్ 24న ప్రకటించింది. భారత్ రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను మార్చుకోవడంలో ఆ దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ యాక్ట్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయనంత వరకు భారత్‌కు చెందిన కొత్త కరెన్సీ నోట్ల మార్పిడి ఉండదని పేర్కొంది. నోటిఫికేషన్ వల్ల విదేశీ పౌరులు భారత కరెన్సీని నిర్దిష్ట మొత్తంలో కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుందని ఆ దేశ అధికారులు తెలిపారు.

 

 బ్యాంక్ ఖాతాల వివరాల కోసం స్విట్జర్లాండ్‌తో ఒప్పందం

 2018, సెప్టెంబర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని భారతీయుల బ్యాంక్ ఖాతాల వివరాలను పొందేందుకు భారత్ ఆ దేశంతో నవంబర్ 22న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సంయుక్త ప్రకటన ఒప్పందంపై సీబీడీటీ ైచైర్మన్ సుశీల్‌చంద్ర, స్విస్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్.. రోడిట్ న్యూఢిల్లీలో సంతకాలు చేశారు. 

 

 క్రీడలు

 ఉత్తమ ప్రొఫెషనల్ బాక్సర్‌గా వికాస్ క్రిషన్

 2016 ఉత్తమ ప్రొఫెషనల్ బాక్సర్‌గా భారత బాక్సర్ వికాస్ క్రిషన్‌ను అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఏఐబీఏ-ఐబా) నవంబర్ 27న ఎంపిక చేసింది. భారత్ నుంచి ఓ బాక్సర్‌కు పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. హరియాణాకు చెందిన 24 ఏళ్ల వికాస్ రియో ఒలింపిక్స్‌లో 75 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు.

 

  ఉత్తమ మహిళా బాక్సర్‌గా     సిమ్రన్‌జిత్ కౌర్ 

 జాతీయ మహిళా చాంపియన్‌షిప్‌లో 64 కిలోల విభాగంలో టైటిల్ గెలుచుకొని పంజాబ్‌కు చెందిన సిమ్రన్‌జిత్ కౌర్ ఉత్తమ బాక్సర్‌గా నిలిచింది. ఆమె హరిద్వార్‌లో నవంబర్ 24న జరిగిన పోటీలో జ్యోతి (హరియాణ)పై గెలుపొందింది. ఈ పోటీల్లో ఆరు స్వర్ణ పతకాలు సాధించిన హరియాణా టీమ్ చాంపియన్‌షిప్ దక్కించుకుంది. రెండు స్వర్ణ పతకాలతో రైల్వేస్ రెండో స్థానంలో నిలిచింది. 

 

  ఎఫ్ 1- 2016 ప్రపంచ  చాంపియన్‌గా రోస్‌బర్గ్

 మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ 2016 ఫార్ములావన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నవంబర్ 27న జరిగిన అబుదాబి గ్రాండ్ ప్రిలో రెండో స్థానం పొందిన రోస్‌బర్గ్.. మొత్తం 385 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ (380 పాయింట్లు) అబుదాబి రేసులో చాంపియన్‌గా నిలిచినా రోస్‌బర్గ్ టాప్-3లో నిలవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

 

  హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌లుగా సింధు, సమీర్ వర్మ

 హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సమీర్ వర్మ, పి.వి.సింధు  రజత పతకాలు సాధించారు. కౌలూన్‌లో నవంబర్ 27న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లాంగ్ ఆంగస్ (హాంకాంగ్) చేతిలో వర్మ ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధుపై తై జు ఝంగ్ (చైనీస్ తైపీ) గెలుపొందింది.  సింధు, సమీర్ వర్మలకు 15,200 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది.

 

  అర్జెంటీనాకు డేవిస్ కప్ టైటిల్

 డేవిస్ కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అర్జెంటీనా గెలుచుకుంది. జాగ్రెట్ (క్రొయేషియా)లో నవంబర్ 28న జరిగిన ఫైనల్లో క్రొయేషియాపై విజయం సాధించింది. గతంలో అర్జెంటీనా 1981, 2006, 2008, 2011లలో ఫైనల్లో ఓడిపోయింది. 116 ఏళ్ల డేవిస్ కప్ చరిత్రలో విజేతగా నిలిచిన 15వ జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. అమెరికా అత్యధికంగా 35 సార్లు ఈ టైటిల్‌ను సాధించింది.

 

 వార్తల్లో వ్యక్తులు

 మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇకలేరు: కర్నాటక సంగీత వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నవంబర్ 22న చెన్నైలో అస్తమించారు. ఆయన 1930, జూలై 6న తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తంలో జన్మించారు. ఏడేళ్ల వయసులో తొలి కచేరీ చేసిన మంగళంపల్లి.. వీణ, వయోలిన్, మృదంగం, కంజీర వంటి వాయిద్యాల్లోనూ ప్రావీణ్యం గడించారు. గణపతి, సర్వశ్రీ, మహితి, లవంగి వంటి కొత్త రాగాలను సృష్టించి సంగీత బ్రహ్మగా వినుతికెక్కారు. ఇండియాతోపాటు మలేషియా, సింగపూర్, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, కెనడా వంటి దేశాల్లో 25 వేలకుపైగా కచేరీలు చేశారు. సంగీతానికి ఆయన సేవలకు గుర్తింపుగా 1971లో పద్మశ్రీ, 1991లో పద్మవిభూషణ్, 1998లో సంగీత నాటక అకాడమీ అవార్డుతోపాటు అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. 

 

  ఇస్రో మాజీ చైర్మన్ ఎంజీకే మీనన్ మృతి: ఇస్రో మాజీ చైర్మన్ ఎంజీకే మీనన్ (88) న్యూఢిల్లీలో నవంబర్ 22న కన్నుమూశారు. ఆయన ఐదు దశాబ్దాలకుపైగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశిష్ట సేవలందించారు. మీనన్ 1972లో ఇస్రో చైర్మన్‌గా ఎంపికయ్యారు. వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో శాస్త్ర, సాంకేతిక శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర  ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

 

  మాలినీ సుబ్రమణియంకు ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడం అవార్డు: భారత్‌కు చెందిన మాలినీ సుబ్రమణియం న్యూయార్క్‌లో నవంబర్ 22న ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడం అవార్డును అందుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై కథనాలను ప్రచురించినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆమెతోపాటు ఆస్కార్ మార్టినెజ్ (ఎల్‌సాల్వెడార్), క్యాన్ దుండర్ (టర్కీ), అబూజెయిద్ (ఈజిప్టు) కూడా అవార్డులు అందుకున్నారు.

 

  పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా ఖమర్ బజ్వా: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను నియమిస్తూ పాక్ ప్రధాని నవంబర్ 26న ప్రకటన చేశారు. ఆయన గతంలో పాక్ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌లో కీలకంగా వ్యవహరించారు. ఆర్మీ చీఫ్‌గా ఎంపికవడానికి ముందు ట్రైనింగ్ అండ్ ఎవల్యూషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా             పనిచేశారు.

 

  ప్రముఖ పాత్రికేయుడు పడ్గావ్‌కర్ మృతి: ప్రముఖ పాత్రికేయుడు దిలీప్ పడ్గావ్‌కర్  (72) నవంబర్ 25న మరణించారు. ఆయన గతంలో ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. 2008లో జమ్మూకశ్మీర్‌లో శాంతి చర్చల కోసం ప్రభుత్వం నియమించిన త్రిసభ్య బృందంలో సభ్యుడిగా వ్యవహరించారు.

 
Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top