ఆలోచనకు అండాదండ

ఆలోచనకు అండాదండ


ఆలోచనకు అండాదండ



స్టార్టప్‌ సంస్థలు, ఎంటర్‌ప్రెన్యూర్‌ ఔత్సాహికులు.. ఇటీవల విస్తృతంగా వినిపిస్తున్న మాటలు. ముఖ్యంగా.. యువత వినూత్న ఆలోచనలు, విభిన్న వ్యాపార అంశాలతో స్వయం ఉపాధి(స్టార్టప్స్‌) దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు తోడ్పడే చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అకడమిక్‌ స్థాయి నుంచే నైపుణ్యాలు అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) కొత్త స్టార్టప్‌ పాలసీని రూపొందించింది. ఆ వివరాలు..



ఇదీ ఉద్దేశం

సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, స్వదేశీ ఉత్పత్తులను పెంచడం, అందులో యువతను భాగస్వాములు చేసి స్వయం ఉపాధి దిశగా వారు అడుగులు వేసేలా చూడడం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్టార్టప్‌ ఇండియా’ లక్ష్యం.



ఇదీ పరిస్థితి

ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ల విద్యార్థులు మినహా దేశంలో చాలామంది యువతకు ‘స్టార్టప్‌’ గురించి పెద్దగా పెద్దగా అవగాహన లేదు. స్టార్టప్స్‌ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మరికొందరిలో అయోమయం.



ఇదీ కార్యాచరణ

టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్, ప్రధానంగా ఏఐసీటీఈ పరిధిలో దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు స్టార్టప్స్‌పై పూర్తి అవగాహన కల్పించడం. అందుకుతగ్గట్లు విధానపరంగా మార్పుచేర్పులు. తొలి దశలో రూ. 433.53 కోట్ల నిధుల కేటాయింపు.



2025 నాటికి లక్ష సాంకేతిక స్టార్టప్స్‌

ఏఐసీటీఈ స్టార్టప్‌ పాలసీ ప్రధాన లక్ష్యం.. 2025 నాటికి జాతీయ స్థాయిలో కనీసం లక్ష సాంకేతిక(టెక్నాలజీ) ఆధారిత సంస్థలు నెలకొల్పేలా చూడటం. తద్వారా పది లక్షల మందికి ఉపాధి కల్పించడం. విద్యా సంస్థలు, విద్యార్థులు ఆసక్తి చూపేలా కరిక్యులం, బోధన విధానం, అకడమిక్‌ స్ట్రక్చర్‌లో మార్పులను ఏఐసీటీఈ నిర్దేశించుకుంది.



ఆన్‌–క్యాంపస్‌ స్టార్టప్స్‌

స్టూడెంట్‌ డ్రివెన్‌ ఆన్‌–క్యాంపస్‌ స్టార్టప్స్‌ రూపొందడం పాలసీలో ప్రధానంగా పేర్కొనాల్సిన అంశం. ఇందుకోసం విద్యార్థులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను లక్ష్యంగా ఎంచుకునేలా ఇన్‌స్టిట్యూట్స్‌ ప్రోత్సహించాలి. ప్రస్తుత కరిక్యులం, పెడగాగీలో మార్పులు చేసి స్టార్టప్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం దక్కేలా కొత్త కరిక్యులం తీసుకురావాలి.



కొత్త కరిక్యులం ఇలా

వ్యాపార అవకాశాలను గుర్తించడం.. ఐడియా జనరేషన్, ఐపీఆర్‌/పేరెంటింగ్‌ ‘లా’స్, స్టార్టప్‌ ఫైనాన్స్, స్టార్టప్‌ ఏర్పాటు –మనుగడ కోణంలో సదరు వ్యక్తులకు ఉండాల్సిన సహజ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అంశాల సమ్మిళితంగా స్టార్టప్‌ కోర్స్‌ కరిక్యులం ఉండాలి.



టీబీఐల ఏర్పాటు

ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లోనూ ప్రత్యేకంగా టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌ (టీబీఐ)లు ఏర్పాటు చేయాలి. స్టార్టప్‌ ఆలోచనలకు.. ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌ ద్వారా అనుమతి లభించే విధంగా టీబీఐలు తోడ్పడాలి.



యాక్సలరేటర్స్‌

ఔత్సాహిక యువతకు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు అందించేందుకు యాక్సలేటర్స్‌ విధానాన్ని పేర్కొన్నారు. దీనిప్రకారం.. స్టార్టప్‌ యాక్సలరేటర్స్, మెంటార్స్, ఇతర నిపుణుల నేతృత్వంలో నిర్దిష్ట ప్రోగ్రామ్‌లను రూపొందించడం, మంచి వ్యాపార ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడం చేయాలి.



గుర్తింపు లభించేలా

జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌ రూపొందించడం ఔత్సాహికులకు కలిసొచ్చే మరో ముఖ్య విధానం. ఔత్సాహిక విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్‌ రిపోర్ట్స్‌ను ఈ ప్లాట్‌ఫామ్‌లో ఇన్‌స్టిట్యూట్స్‌ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి తన ఆలోచనతో రూపొందించిన స్టార్టప్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను ఏంజెల్‌ ఇన్వెస్టర్స్, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు సైతం చూసే అవకాశం లభిస్తుంది.



ప్రత్యేక సబ్జెక్ట్‌లు

కరిక్యులం మార్పులపరంగా బీటెక్‌ ప్రోగ్రామ్‌లో ఏడాదికో నిర్దిష్ట కోర్సులను బోధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు... బీటెక్‌ మూడో సంవత్సరంలో బేసిక్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ఉండాలని పేర్కొంది. సంవత్సరాలవారీగా బేసిక్స్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అకౌంటింగ్‌ అండ్‌ బుక్‌ కీపింగ్, బేసిక్స్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యూరియల్‌ మార్కెటింగ్, ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలను వారంలో గరిష్టంగా నాలుగు గంటల వ్యవధిలో బోధించాలి.



స్పెషలైజేషన్‌గా స్టార్టప్‌ స్ట్రీమ్‌

స్టార్టప్‌ స్ట్రీమ్‌ను ఒక స్పెషలైజేషన్‌గా ఎంచుకునే అవకాశం కల్పించడం మరో ముఖ్యాంశం. బీటెక్, బీఆర్క్, పీజీడీఎం, ఎంటెక్, ఎంబీఏ, బీ ఫార్మసీ తదితర ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌లలో.. ‘స్టార్టప్‌ : లాంచింగ్‌ అండ్‌ సస్టెయినింగ్‌’ పేరుతో ఇన్‌స్టిట్యూట్‌లు స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌ను ఆఫర్‌ చేయాల్సి ఉంటుంది.



వేసవి/శీతాకాల ఇంటర్న్‌షిప్‌

స్టార్టప్‌ లాంచింగ్‌ అండ్‌ సస్టెయినింగ్‌ స్పెషలైజేషన్‌ విద్యార్థులు.. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, పూర్వ విద్యార్థులు నెలకొల్పిన స్టార్టప్‌ సంస్థల్లో వేసవి లేదా శీతాకాల ఇంటర్న్‌షిప్‌ చేయడం తప్పనిసరి. దీనివల్ల వారికి ఆర్థిక నిర్వహణ అంశాలపై ప్రాథమిక అవగాహన లభిస్తుంది.



ఐడియా ల్యాబ్స్‌ ఏర్పాటు

ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లోనూ ఐడియా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలి. బీటెక్‌ తృతీయ సంవత్సర విద్యార్థులకు అవకాశం కల్పించి, వారి వ్యాపార ఆలోచనలను సంబంధిత నిపుణులు పరిశీలించేలా చూడటం, కార్యాచరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడం, ఐపీఆర్‌లను దాఖలు చేయడం వంటివి ఈ ఐడియా ల్యాబ్స్‌ నిర్వహించాలి.



మూక్‌ నమోదు తప్పనిసరి

విద్యార్థులు తప్పనిసరిగా స్టార్టప్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సును మాసివ్‌లీ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌ (మూక్స్‌) విధానంలో అభ్యసనం చేయాలి. స్టార్టప్‌పై అవగాహన కలిగేందుకు ఇది ఉపయుక్తం. ఇందుకోసం ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థలు అందిస్తున్న మూక్స్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి.



ఏంజెల్స్, వీసీస్‌.. ఇన్‌స్ట్రక్టర్స్‌గా

స్టార్టప్‌ ఏర్పాటులో అత్యంత కీలకమైనది నిధుల సమీకరణ. నిధుల సమీకరణ కోసం ఎలా వ్యవహరించాలి..? అనే అంశంపై అవగాహన కల్పించేందుకు ఏంజెల్‌ ఇన్వెస్టర్స్, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లను పార్ట్‌ టైం కోర్స్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌గా రప్పించే ఏర్పాట్లు చేయాలి.



స్టార్టప్‌–ఫెస్ట్‌

ఔత్సాహిక యువత, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు, ఫండింగ్‌ ఏజెన్సీలను అనుసంధానం చేసేలా.. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌ స్టార్టప్‌ ఫెస్టివల్స్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.



ప్రేరణకు వెబ్‌పోర్టల్‌

ఔత్సాహికులకు ప్రేరణ లభించేలా ఏఐసీటీఈ ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా విద్యార్థులు మెంటార్స్‌తో అనుంసధానమై సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం లభించనుంది. ఈ వెబ్‌పోర్టల్‌లో సబ్జెక్ట్‌ నిపుణులు, పరిశోధకులు, ఫ్యాకల్టీ, ట్రైనర్స్‌ వివరాలు అందుబాటులో ఉంటాయి.



జాతీయస్థాయి ప్రోగ్రామ్‌

ఇన్‌స్టిట్యూట్‌ స్థాయిలో స్టార్టప్‌ ఫెస్టివల్స్‌ను నిర్వహించడమే కాక .. ఏఐసీటీఈ కూడా జాతీయ స్థాయిలో ప్రత్యేక యాక్సలరేషన్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించనుంది. ఇది నాస్కామ్‌ 10000 స్టార్టప్స్‌ ప్రోగ్రామ్‌ మాదిరిగా ఉంటుంది. దీనిద్వారా ఎంపికైన 50 స్టార్టప్‌ సంస్థలకు ఏడాదికి రూ. 25 లక్షలు చొప్పున ఏంజెల్‌ ఫండ్స్‌ లభిస్తాయి.



ఆలోచన మంచిది

స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అంటే ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలోనే సాధ్యం అనుకుంటున్న పరిస్థితులున్నాయి. అలాంటిది ఏఐసీటీఈ అనుబంధ కళాశాలల్లో ఔత్సాహికులను ప్రోత్సహించే విధానం తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇన్‌స్టిట్యూట్‌లు తప్పనిసరిగా చొరవ చూపేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఉద్దేశం నెరవేరుతుంది.

– ప్రొఫెసర్‌ వి.వెంకట రమణ,

 కో ఆర్డినేటర్, టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్, హెచ్‌సీయూ

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top