ఇంజనీరింగ్‌పై క్రేజ్‌ తగ్గుతోందా?

ఇంజనీరింగ్‌పై క్రేజ్‌ తగ్గుతోందా? - Sakshi


ఇంజనీరింగ్‌.. యువతలో క్రేజ్‌ ఉన్న కోర్సు. ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో సీటు లక్ష్యంగా శ్రమిస్తుంటారు. నాణేనికి మరోవైపు చూస్తే... ఇటీవల కాలంలో బీటెక్‌పై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతోందా.. ఇంజనీరింగ్‌ పూర్తిచేసినా.. ఉద్యోగాలు లభించవనే ఆందోళన పెరుగుతోందా.. అందుకే ప్రత్యామ్నాయ కోర్సులపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత రెండు, మూడేళ్లుగా గణాంకాలను పరిశీలిస్తే ఇవి నిజమే అనిపిస్తోంది. ఈ ధోరణిపై ప్రత్యేక కథనం..



కోర్‌ బ్రాంచ్‌ల్లో ఎవర్‌గ్రీన్‌గా పేర్కొనే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ మొదలు.. సాఫ్ట్‌వేర్‌ నిపుణులను తయారు చేసే సీఎస్‌ఈ వరకూ.. బ్రాంచ్‌ ఏదైనా ఆయా కోర్సుల స్వరూపం, ఉద్దేశం ఒకటే. ప్రొడక్ట్‌ డిజైన్, డెవలప్‌మెంట్, ప్రొడక్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నిక్స్, ప్లానింగ్, తదితర సాంకేతిక నైపుణ్యాలు నేర్పించే కోర్సు ఇంజనీరింగ్‌. కానీ.. గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్‌పై ఆసక్తి తగ్గుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.



ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సైతం

ఐఐటీలు, నిట్‌లు.. దేశంలో ఇంజనీరింగ్‌ విద్యను అందించడంలో పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లు. వీటిలో సైతం గత రెండు, మూడేళ్లుగా సీట్లు మిగిలిపోతున్నాయి. గతేడాది జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) ఆధ్వర్యంలో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి ఆరు రౌండ్లుగా కౌన్సిలింగ్‌ నిర్వహించినప్పటికీ.. తుది రౌండ్‌ తర్వాత 3,100 సీట్లు మిగిలిపోవడం గమనార్హం. ఐఐటీ సీటు హాట్‌ కేక్‌ అనుకునే పరిస్థితుల్లో.. ఇలా సీట్లు మిగిలిపోవడం హెచ్‌ఆర్‌డీ శాఖను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. సీట్లు మిగిలిపోవడంపై ప్రత్యేకంగా విచారణ కమిటీని నియమించింది. అంతకుముందు ఏడాది (2015–16)లోనూ ఇదే పరిస్థితి.



60 నుంచి 70 శాతం లోపే భర్తీ

రాష్ట్రాల స్థాయిలో ఇంజనీరింగ్‌ ప్రవేశాలు, విద్యార్థుల ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటే.. గత రెండు, మూడేళ్లుగా కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ అవుతున్న సీట్ల సంఖ్య మొత్తం సీట్లలో 60 నుంచి 70 శాతం లోపే ఉంటోంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా.. జాతీయ స్థాయిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏఐసీటీఈ గణాంకాల ప్రకారం– జాతీయ స్థాయిలో ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో 16 లక్షలకుపైగా సీట్లు ఉంటే భర్తీ అయిన సీట్లు మాత్రం 8.5 లక్షలలోపే.



ఇంజనీరింగ్‌ సీట్లు భారీగా మిగిలిపోవడానికి రాష్ట్ర స్థాయి, ప్రాంతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీ కొరత, లేబొరేటరీ, ల్యాబ్స్, ఇతర మౌలిక సదుపాయాల కొరతే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. సరైన బోధన, మౌలిక సదుపాయాలు లేని కాలేజీల్లో చేరితే తమ భవిష్యత్తు పరంగా ఉద్యోగ, ఉన్నత విద్య పరంగా నేటి పోటీ ప్రపంచంలో రాణించడం కష్టమని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినాlనిరాకరించే పరిస్థితి నెలకొంది.



ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఖాళీలెందుకు?

రాష్ట్ర స్థాయి, ప్రాంతీయ స్థాయి కళాశాలల్లో సీట్లు మిగిలిపోవడానికి మౌలిక సదుపాయాల కొరత కారణంగా కనిపిస్తోంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సైతం సీట్లు మిగిలిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. అవి..



జోసా పేరుతో చేపడుతున్న ఉమ్మడి కౌన్సెలింగ్‌లో ప్రాథమ్యాలు సరిగా పేర్కొనకపోవడం.. పర్యవసానంగా సీటు కేటాయింపు పరంగా ఆసక్తి లేని బ్రాంచ్‌ లభించడం. దీనిలో చేరేందుకు విద్యార్థులు నిరాకరించడం.



ఫీజుల పెంపు కూడా విద్యార్థులు ఇంజనీరింగ్‌కు దూరమయ్యేలా చేస్తున్నాయి. గతేడాది నుంచి ఇంజనీరింగ్‌ ఫీజులు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో కొన్ని ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్‌ టాప్‌ ర్యాంకర్లకు, ఇంటర్మీడియెట్‌ స్థాయిలో బోర్డ్‌ టాపర్స్‌కు ఉచిత విద్యను అందిస్తున్నాయి. దీంతో విద్యార్థులు వాటివైపు దృష్టి సారిస్తున్నారు.



ఇండస్ట్రీ సర్వేలు కూడా..

ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో సీట్లు మిగిలిపోవడానికి సీఐఐ, నాస్‌కామ్‌ వంటి సంస్థల సర్వేలు కారణమనే వాదన వినిపిస్తోంది. విద్యార్థుల్లో జాబ్‌ రెడీ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ కంపెనీలు ఆశించిన స్థాయిలో ఉండటంలేదని; కేవలం 7 శాతం నుంచి 10 శాతం మందిలో మాత్రమే నైపుణ్యాలుంటున్నాయన్నది, ఇలాంటివారికే ఉద్యోగాలు లభిస్తున్నాయన్నది పలు సర్వేల సారాంశం. టైర్‌–2, టైర్‌–3 ఇన్‌స్టిట్యూట్‌లలో మౌలిక సదుపాయాల కొరత విద్యార్థుల

ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌పై ప్రభావం చూపుతోందని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇక విద్యార్థుల కోణంలో.. సాఫ్ట్‌వేర్‌ రంగం పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. దాంతో భవిష్యత్‌ అవకాశాల పరంగా ఎన్నో సందేహాలు. ఇలాంటి కారణాలు విద్యార్థులను ఇంజనీరింగ్‌కు ప్రత్యామ్నాయాలు వెతికేలా చేస్తున్నాయంటున్నారు నిపుణులు.



కోర్సు గురించి తెలియకుండానే

వాస్తవానికి ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ఆ కోర్సు గురించి సరైన అవగాహన ఉండటం లేదు. బెస్ట్‌ ర్యాంకు సాధిస్తే ఐఐటీల్లో చేరొచ్చు.. ఇంజనీరింగ్‌ పూర్తిచేస్తే మంచి ఉద్యోగం వస్తుంది అని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ, ఇంజనీరింగ్‌ కోర్సు స్వరూపం గురించి తెలుసుకోవడానికి ముందస్తు ప్రయత్నం చేయడంలేదు. దానికి తోడు తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఉంటోంది. కోర్సులో చేరిన తర్వాత తమ అంచనాలకు భిన్నంగా కోర్సు ఉండటంతో విద్యార్థులు మనసు పెట్టి చదవక, రాణించలేకపోతున్నారు. ఐఐటీలు, యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాలల్లో సైతం తొలి ఏడాదిలో ఉత్తీర్ణత శాతం 50 శాతం లోపే ఉండటం ఇందుకు నిదర్శనం.



సైన్సెస్‌పై పెరుగుతున్న ఆసక్తి

ఇంజనీరింగ్‌పై క్రేజ్‌ తగ్గడానికి విద్యార్థుల్లో సైన్స్‌ కోర్సులపై ఆసక్తి,   అవగాహన పెరగడం మరో కారణం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇటీవల కాలంలో హైస్కూల్‌ స్థాయి నుంచే సైన్స్, అందులో పరిశోధనలను ప్రోత్సహించేలా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతూ, స్కాలర్‌షిప్‌ పథకాలను సైతం అందిస్తోంది. దాంతో విద్యార్థులు తమ సహజ ఆసక్తి మేరకు సైన్స్‌ కోర్సులపై దృష్టిసారిస్తున్నారు. దీనికి అనుగుణంగానే సైన్స్‌ కోర్సులను అందించే  ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య సైతం పెరుగుతోంది. ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్, బీఎస్‌–ఎంఎస్‌ డ్యూయల్‌ డిగ్రీ వంటి సైన్స్‌ కోర్సులను ఆఫర్‌ చేయడం ద్వారా... ఒక్కసారి కాలు పెడితే పీజీ చేసే వరకు వెనుదిరిగి చూసుకునే అవసరం ఉండదు.



ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్‌ను పరిగణనలోకి తీసుకున్నా.. వాటికి మూలం మ్యాథమెటిక్స్, సైన్స్‌ నుంచే ఉంటుంది. వీటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విధంగా సంబంధిత నైపుణ్యాలు ఉన్న విద్యార్థులే ఇంజనీరింగ్‌లో రాణించగలుగుతున్నారు. అంతేకాకుండా ఇంజనీరింగ్‌ ఔత్సాహిక విద్యార్థులకు ఇచ్చే ముఖ్యమైన సలహా.. ఆసక్తి ఉంటేనే ఇంజనీరింగ్‌లో చేరాలి. లేకుంటే విలువైన సమయం వృథా అవుతుంది. ప్రస్తుతం సైన్సెస్‌లోనూ ఎన్నో అవకాశాలున్నాయి. ఫిజికల్‌ సైన్సెస్, లైఫ్‌ సైన్సెస్, బయొ సైన్సెస్‌ రంగాల్లో కొత్త ఆవిష్కరణల దిశగా పరిశోధనలు చేసే అర్హతలున్న అభ్యర్థులకు మంచి డిమాండ్‌ ఉంది.

– డాక్టర్‌ డి.ఎన్‌.రెడ్డి, డైరెక్టర్, ఈఎస్‌సీఐ–హైదరాబాద్‌.



ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్లు మిగిలిపోవడాన్ని.. ఇంజనీరింగ్‌ విద్యపై ఆసక్తి తగ్గుతోందని చెప్పడానికి కారణంగా పేర్కొనడం సరికాదు. జోసా విధానంలో ఆన్‌లైన్‌ ద్వారా చేపడుతున్న కౌన్సెలింగ్‌పై విద్యార్థులకు అవగాహన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ర్యాంకు ఆధారంగా ప్రాథమ్యాల ఎంపికలో సరిగా వ్యవహరిస్తే నచ్చేlబ్రాంచ్‌లో సీటు రావడం ఖాయం. గత ఏడాది సీట్లు మిగలడానికి ప్రధాన కారణం ఇదే.

– ప్రొఫెసర్‌  కె.వి.కృష్ణ, జోసా–2016

ఆర్గనైజింగ్‌ చైర్మన్‌.


 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top