మెకానికల్.. మెరిసే..!!

మెకానికల్.. మెరిసే..!! - Sakshi


ఇంజనీరింగ్ స్పెషల్

నిత్యం ఉపయోగించే వాషింగ్ మెషిన్, గడియారాలు, సంగీత పరికరాలు, గన్స్, సైకిల్ మొదలైనవన్నీ మెకానికల్ ఇంజనీర్ల సృష్టే!  మార్కెట్ ఒడిదొడుకులతో పెద్దగా ప్రభావితం కాకుండా స్థిరమైన అవకాశాలు అందించే బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ ఔత్సాహికుల కోసం  మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు,  ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, కెరీర్ స్కోప్ వివరాలు..

 

కోర్సు ఇలా

జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ అర్హత పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే ప్రఖ్యాత ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. వీటితో పాటు ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో సీటు దక్కించుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ద్వారా రాష్ట్రంలోని క్యాంపస్ కాలేజీలు, ప్రైవేటు  కాలేజీల్లో సీటు లభిస్తుంది. థర్మో డైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ, థర్మల్ ఇంజనీరింగ్ తదితర కోర్ సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది.

 

ఉద్యోగ అవకాశాలు

ఏరోస్పేస్ ఇంజనీర్, ఏరోనాటికల్ ఇంజనీర్, ఆటోమోటివ్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, న్యూక్లియర్ ఇంజనీర్, టూల్ డిజైనర్.. మొదలైన వాటిలో కెరీర్ ప్రారంభించవచ్చు. ఆసక్తి ఉన్నవారు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ దిశగా పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్‌లోని పరిశోధన సంస్థల్లో చేరొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, వీఎస్‌ఎస్‌సీ, ఇస్రో, ఐవోసీ, డీఆర్‌డీవో, సెయిల్, ఎన్‌టీపీసీ, డిఫెన్స్, పీడబ్ల్యుడీ, సీపీడబ్ల్యుడీ, ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ల్లో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది.

 

ఉన్నత విద్య

మెకానికల్ ఇంజనీరింగ్ చేశాక ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు గేట్, పీజీఈసెట్ ద్వారా ఎంటెక్‌లో చేరొచ్చు. హైడ్రాలిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్, మ్యానుఫాక్చరింగ్ ఇంజనీరింగ్, ఏరో డైనమిక్స్ తదితర స్పెషలైజేన్లలో ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. అలాగే మేనేజ్‌మెంట్ విద్య పట్ల ఆసక్తి ఉంటే... క్యాట్, మ్యాట్, ఎక్స్‌ఏటీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి  పరీక్షల్లో ప్రతిభను చూపడం ద్వారా ఎంబీఏలో చేరొచ్చు.  

 

విధులు

మెకానికల్ ఇంజనీర్లు వారు పనిచేసే ఇండస్ట్రీ, స్పెషలైజేషన్ ఆధారంగా వేర్వేరు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డిజైన్, ప్రొడక్షన్, అనాలసిస్ అండ్ టెస్టింగ్, ఇన్‌స్టాలేషన్, మెయింటెన్స్ విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.

 

టాప్ రిక్రూటర్స్

టాటా గ్రూప్, గోద్రెజ్ గ్రూప్, ఎల్ అండ్ టీ, సీమెన్స్, జీఈ, హ్యుందాయ్ మోటార్స్, ఫోర్డ్, ఆశోక్ లేల్యాండ్, రాయల్ ఎన్‌ఫీల్డ్, మహింద్రా అండ్ మహింద్రా, జిందాల్ మొదలైనవి.

 

మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఏరియా.. కంప్యూటేషనల్ ఫ్లుయిడ్ డైనమిక్స్ (సీఎఫ్‌డీ) ద్వారా డిజైన్ ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి. ఈ విభాగంలో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. హానీవెల్, జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) లాంటి పెద్ద కంపెనీలు సీఎఫ్‌డీపై అవగాహన ఉన్నవారిని నియమించుకుంటున్నాయి.

- వి. ఉమామహేశ్వర్, అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,  ఉస్మానియా యూనివర్సిటీ

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top