ఎడ్యుకేషన్ & జాబ్స్


వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శుక్రవారం నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వివరాలకు కమిషన్ వెబ్‌సైట్ www.tspsc.gov.inవెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా కమిషన్ కార్యదర్శి పేర్కొన్నారు.

 

 11 నుంచి టీ మెడికల్ కౌన్సెలింగ్

 విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్/ బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10న స్పెషల్(ఎన్‌సీసీ, ఆర్మీ, పీహెచ్, ఆంగ్లో ఇండియన్, పీఎంసీ) కేటగిరీ అభ్యర్థులకు హైదరాబాద్ జేఎన్‌టీయూ(కూకట్‌పల్లి)లో కౌన్సెలింగ్ జరుగుతుందని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 14 వరకు రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌ను హైదరాబాద్ జేఎన్‌టీయూ, వరంగల్ కాకతీయ వర్సిటీ, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో నిర్వహించనున్నామన్నారు.

 

 ఈ నెల 11న మొదటి నుంచి 3 వేల ర్యాంకుల వరకు, 12న 3,001 నుంచి 8 వేల ర్యాంకుల వరకు, 13న 8,001 నుంచి 15వేల ర్యాంకుల వరకు అభ్యర్థులను ఆహ్వానించినట్లు తెలిపారు. 14వ తేదీన 15,001 నుంచి అర్హత సాధించిన చివరి ర్యాంకుల వరకు రిజర్వేషన్(ఎస్సీ/ఎస్టీ/బీసీ) కేటగిరీ అభ్యర్థులను పిలిచినట్లు వివరించారు. వివరాలను వర్సిటీ (http://ntruhs.ap.nic.in) వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

 

 ‘లా పీజీ డిప్లొమా’కు దరఖాస్తుల ఆహ్వానం

 హైదరాబాద్: ఓయూ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐపీఆర్ సైబర్ లా ఇన్సూరెన్స్, టాక్సేషన్ పీజీ డిప్లొమా కోర్సు ప్రవేశానికి ఈ నెల 20న నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఓయూ పరీక్ష విభాగం అధికారులు శుక్రవారం కోరారు. సంబంధిత దరఖాస్తులు శనివారం నుంచి అందుబాటులో ఉంటాయన్నారు.  వివరాలకు 81068 94644 నంబరులో సంప్రదించాలని చెప్పారు.

 

 ఎస్వీయూ అడ్మిషన్ల గడువు పెంపు

 తిరుపతి యూనివర్సిటీ క్యాంపస్: ఏపీలోని ఎస్వీ యూనివర్సిటీ దూర విద్యా విభాగంలో పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు డీడీఈ (డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుక్యేషన్) డెరైక్టర్ ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన వారు దగ్గరలోని స్టడీ సెంటర్‌లో సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చని పేర్కొన్నారు. అసైన్‌మెంట్ మార్కులు పొందని విద్యార్థులు రూ. 500 ఫీజు చెల్లించి తిరిగి అసైన్‌మెంట్లు సమర్పించాలని సూచించారు.

 

 థర్డ్ బీడీఎస్ ఫలితాలు విడుదల

 విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ ఏడాది జూన్/జూలైలో నిర్వహించిన తృతీయ సంవత్సరం బీడీఎస్ ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం ఈ నెల 19 లోగా సబ్జెక్టుకు రూ. 2 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ తెలిపారు. ఫలితాలు వర్సిటీ వెబ్‌సైట్ (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్)లో పొందవచ్చు.

 

 నేడు ఉత్తమ టీచర్లకు అవార్డులు

 సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రదానం

 సాక్షి, హైదరాబాద్: గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ఉత్తమ టీచర్లను ఎంపిక చేశారు. వివిధ జిల్లాల నుంచి అత్యుత్తమ సేవలందిస్తున్న టీచర్లను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2015లకు పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసింది. అలాగే వివిధ ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు, వర్సిటీల్లో ఉత్తమ సేవలందిస్తున్న అధ్యాపకులను, ఆచార్యులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేస్తూ ఉన్నత విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరందరికీ శనివారం రవీంద్రభారతిలో జరగనున్న గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ.10వేల నగదు, వెండి పతకం, ప్రశంసాపత్రాలను అందిస్తారు. ఉత్తమ ఉపాధ్యాయుల పూర్తి జాబితా... www.sakshi.comలో ఉంది.

 

 ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.200 కోట్లు

 సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా వివిధ శాఖలకు చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లకు బడ్జెట్ విడుదల ఉత్తర్వులు(బీఆర్వోలు) ఇచ్చింది. బీసీ సంక్షేమశాఖకు (ఈబీసీ) రూ.99.65 కోట్లు, ఎస్సీ అభివృద్ధిశాఖకు రూ.50 కోట్లు, మైనారిటీ సంక్షేమశాఖకు రూ.30 కోట్లు, గిరిజనసంక్షేమశాఖకు రూ.20 కోట్లు, వికలాంగుల సంక్షేమశాఖకు రూ.35 లక్షలు రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్‌ఫీజు (ఆర్‌టీఎఫ్) కింద స్కాలర్ షిప్స్ నిధులను విడుదల చేస్తూ బీఆర్వోలు ఇచ్చారు.  

 

 ఎస్సీ శాఖకు రెండో త్రైమాసికానికి రూ.36.66 కోట్లకు బీఆర్వోలు

 ఎస్సీ అభివృద్ధిశాఖకు వివిధ పథకాలు, కార్యక్రమాల కోసం రెండో త్రైమాసికం కింద రూ. 36.66 కోట్లకు ప్రభుత్వం బీఆర్వోలు ఇచ్చింది. వీటిలో భాగంగా ఇందిరమ్మ పథకంలో భాగంగా బలహీన వర్గాలకు ఇళ్లస్థలాల సేకరణ కోసం, సబ్‌ప్లాన్ అమలుకోసం, తెలంగాణ స్టడీ సర్కిల్‌కు సహాయం, బుక్‌బ్యాంక్, ఆర్థిక మద్దతు పథకాలు, ప్రభుత్వ హాస్టళ్లు, ఎస్సీ గృహాలకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇతర అవసరాల కోసం ఈ మొత్తానికి బీఆర్వోలు ఇచ్చారు. ఈ మేరకు ఆర్థికశాఖ కార్యదర్శి  కె.రామకృష్ణారావు శుక్రవారం విడివిడిగా ఉత్తర్వులు జారీచేశారు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top