ఎడ్యుకేషన్ & జాబ్స్: మరో 161 ఇంజనీరింగ్ పోస్టులు


మరో 161 ఇంజనీరింగ్ పోస్టులు

మొత్తంగా 931 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 770 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నోటిఫికేషన్‌ను జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ... తా జాగా మరో 161 పోస్టులను (సివిల్ ఇంజనీరింగ్) అందులో చేర్చింది. మొత్తంగా 931 పోస్టులను ఆ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదనంగా చేర్చిన 161 పోస్టులకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వివరణలు రానందున అప్పుడు నోటిఫికేషన్‌లో చేర్చలేదని తెలిపారు. ప్రస్తుతం వాటిపై పూర్తి స్థాయిలో వివరణలు వచ్చినందున నోటిఫికేషన్‌లో చేర్చినట్లు వివరించారు. అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అదేనెల 20న పరీక్ష ఉంటుందని వివరించారు. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించారు.

 

  ఐసెట్ ప్రవేశాలకు 3 వేల మంది ఆప్షన్లు

 సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు ఐసెట్ వెబ్ ఆప్షన్లలో భాగంగా శుక్రవారం 3,047 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించగా శుక్రవారం వరకు 14,237 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని పేర్కొన్నారు.

 

నేటి నుంచి ఓయూ సెట్ సర్టిఫికెట్ల పరిశీలన


 సాక్షి, హైదరాబాద్: ఓయూసెట్-2015కు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులకు శనివారం నుంచి సెప్టెంబర్ 1 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. మొత్తం 25,098 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. మొదటి రెండు విడతల్లో కలిపి 16,250 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 31, వచ్చేనెల ఒకటిన ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు నేరుగా కౌన్సెలింగ్ జరగనుందని పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

 

  రాష్ర్టస్థాయిలోనూ విదేశీ అధ్యాపకులతో బోధన

 సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్‌వర్క్ (గేయిన్) కింద ఐఐటీ, ఎన్‌ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లోలాగే రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా విదేశీ అధ్యాపకులతో బోధన చేయించొచ్చని కేంద్ర మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది. విదేశీ విశ్వ విద్యాలయాలు, ఇతర రంగాలకు చెందిన అధ్యాపకులతో బోధన చేయించేందుకు వీలుగా గేయిన్ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. అయితే ఎన్‌బీఏ అక్రిడిటేషన్ కలిగి ఉన్న కోర్సులనే వారితో బోధింపచేయాలని పేర్కొంది.

 

హెచ్‌సీయూ అధ్యాపకులకు పతకాలు

 సాక్షి, హైదరాబాద్: రసాయన శాస్త్రంలో చేస్తున్న పరిశోధనలకు గాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ  కెమిస్ట్రీ ప్రొఫెసర్లు డీబీ రామాచారి, కేసీ కుమార స్వామిలకు ‘ద కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా’ (సీఆర్‌ఎస్‌ఐ) రజత, కాంస్య పతకాలకు ఎంపిక చేసింది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పతకాలను వీరికి సీఆర్‌ఎస్‌ఐ అందించనుంది. ప్రొ. కేసీ కుమార స్వామి రసాయన శా్రస్తంలో 168 ప్రచురణలను వెలువరించారు. కెమికల్ రీసెర్చ్‌లో ప్రొ.రామాచారి 70 ప్రచురణలు వెలువరించి, ఐఎన్‌ఎస్‌ఏ యంగ్ సైంటిస్ట్ మెడల్ ఏకే బోస్ అవార్డులను అందుకున్నారు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top