ఆర్థిక సర్వే 2016–17

ఆర్థిక సర్వే 2016–17


స్థూల ఆర్థిక స్థిరత్వం నేపథ్యంలో 2016లో భారతదేశం రెండు ముఖ్య విధాన నిర్ణయాలను చవిచూసింది. అందులో ఒకటి వస్తు, సేవల పన్నుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ కాగా, రెండోది పెద్ద నోట్ల రద్దు. వస్తు, సేవల పన్ను.. కామన్‌ ఇండియన్‌ మార్కెట్‌ను సృష్టించడంతో పాటు పన్ను విధానంలో గవర్నెన్స్‌ను, వృద్ధి–పెట్టుబడులను పెంచేందుకు తోడ్పడుతుంది. నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల ప్రభావాలు ఏర్పడినా దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయి.



డిమాండ్‌ ఆధారిత, డీమానిటైజేషన్, తర్వాతి పన్ను సంస్కరణల్లో భాగంగా భూమి, రియల్‌ ఎస్టేట్‌ను వస్తు, సేవల పన్ను పరిధిలోకి తేవడం, పన్ను రేట్లు, స్టాంప్‌ డ్యూటీలను తగ్గించడం లాంటిæచర్యలు వ్యయాల తగ్గింపు ద్వారా ప్రయోజనాలను గరిష్టపర్చడానికి సహకరిస్తాయి. డీమానిటైజేషన్‌ వల్ల అవినీతి తగ్గుదల, ఆర్థిక వ్యవస్థలో అధిక డిజిటలైజేషన్, ఫైనాన్షియల్‌ సేవింగ్స్‌ పెరుగుదల, ఆర్థిక వ్యవస్థలో సంఘటిత కార్యకలాపాల వృద్ధి లాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి.



2016–17లో అభివృద్ధి సమీక్ష

2016–17 మొదటి అర్ధ భాగంలో వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.2 శాతం. 2015–16 రెండో అర్ధ భాగంలో సాధించిన వృద్ధి రేటు (7.6 శాతం) కంటే ఇది తక్కువ. కార్పొరేట్‌ రంగ వ్యయ ప్రణాళికల నేపథ్యంలో బ్యాలెన్స్‌ షీట్లపై ఒత్తిడి పెరిగిన కారణంగా స్థిర పెట్టుబడిలో తగ్గుదల నమోదైంది. దాంతో వృద్ధి రేటులోనూ తగ్గుదల ఏర్పడింది. మరోవైపు ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుతో ప్రభుత్వ వినియోగంలో పెరుగుదలతోపాటు అభివృద్ధి చెందిన దేశాల్లో డిమాండ్‌ పెరుగుదల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతి రంగంలో రికవరీ లాంటి ధనాత్మక ప్రభావాలను కూడా చవిచూసింది. 2015–16 మొదటి అర్ధ భాగంలో సాధారణ జీడీపీ వృద్ధి క్షీణించినా 2016–17 మొదటి అర్ధ భాగంలో మాత్రం సాధారణ జీడీపీ వృద్ధి పురోగమించింది.



2016–17 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో వివిధ రంగాల్లో వృద్ధి ధోరణులను పరిశీలిస్తే.. 1) పారిశ్రామిక, ప్రభుత్వేతర సేవల రంగంలో వృద్ధి పెరుగుదల 2) రుతుపవనాల అనుకూలత కారణంగా వ్యవసాయ రంగంలో వృద్ధి పెరుగుదల 3) ప్రభుత్వ పాలన, రక్షణ  రంగంలో పటిష్ట వృద్ధి లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.



వినియోగ ధరల సూచీ నూతన సిరీస్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో సగటున 4.9 శాతంగా నమోదైంది. ఖరీఫ్‌ కాలంలో వ్యవసాయ ఉత్పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా 2016, జూలై నుంచి వినియోగధరల సూచీల్లో తగ్గుదల ఏర్పడింది. పప్పుధాన్యాల ధరల్లో తగ్గుదల కారణంగా 2016, డిసెంబర్‌ చివరి నాటికి వినియోగధరల సూచీ ద్రవ్యోల్బణం 3.4 శాతానికి తగ్గింది. మరోవైపు టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 2015, ఆగస్టులో రుణాత్మకం (–5.1 శాతం) కాగా, 2016 డిసెంబర్‌ చివరి నాటికి 3.4 శాతానికి తగ్గింది.



కరెంట్‌ అకౌంట్‌ లోటులో తగ్గుదల సంభవించి 2017 మొదటి అర్ధ భాగం నాటికి  జీడీపీలో 0.3 శాతానికి తగ్గుతుంది. 2016, జనవరి చివరి నాటికి 350 బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ మారక నిల్వలు 2016, డిసెంబర్‌ చివరి నాటికి 360 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 2015, ఏప్రిల్‌–డిసెంబర్‌తో పోల్చితే 2016, ఏప్రిల్‌–డిసెంబర్‌లో వాణిజ్య లోటు 23.5 శాతం మేర తగ్గింది. అమెరికా, జర్మనీల్లో అధిక వృద్ధితోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు మెరుగైన కారణంగా ఎగుమతులు పెరిగి వాణిజ్య లోటు తగ్గింది.



కేంద్ర ప్రభుత్వం 2016–17 ఆర్థిక సంవత్స రంలో జీడీపీలో 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యసాధ నకు కట్టుబడింది. గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న అదనపు రాబడి చర్యల కారణంగా ఎక్సైజ్‌ డ్యూటీలతోపాటు సేవల పన్ను రాబడి కూడా పెరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరం  ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంతో పోల్చితే 2016 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్యకాలంలో వాస్తవిక పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో 11.2 శాతం వృద్ధి నమోదవడంతో ఎక్సైజ్‌ డ్యూటీల రాబడి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల ఫైనాన్స్‌పై ఒత్తిడి పెరిగింది. కొన్నేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి లోటు పెరుగుతోంది. 2014–15లో రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి లోటు జీడీపీలో 2.5 శాతం కాగా, 2015–16లో 3.6 శాతానికి పెరిగింది.



2017–18 ఆర్థిక సంవత్సరంలో సరిపడా నూతన కరెన్సీ చెలామణిలోకి రానుంది. దీంతో ఆర్థిక వృద్ధి తిరిగి సాధారణ స్థాయికి చేరుకోగల దు. రుతుపవనాల అనుకూలత, ప్రపంచ వృద్ధి రేటు పెరుగుదలకు సంబంధించిన అంచనాల నేపథ్యంలో ఎగుమతుల్లో పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం అమలుచేసే సంస్కరణలు దేశంలో వృద్ధి రేటు పెరుగుదలకు తోడ్పడతాయి. 2016–17తో పోల్చితే 2017– 18లో చమురు ధరల్లో 1/6 వంతు పెరుగుదల వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.



కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థలో స్థిర పెట్టుబడుల్లో తగ్గుదల ఏర్పడింది. అదే సమయంలో ప్రైవేటుæ పెట్టుబడుల్లోనూ తగ్గుదల అధికంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు పెరిగితే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటును పెంచేందుకు చేపడుతున్న పటిష్ట చర్యల కారణంగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది.



వివిధ రంగాల్లో వృద్ధి

కేంద్ర గణాంక సంస్థ విడుదల చేసిన మొదటి ముందస్తు గణాంకాల ప్రకారం 2016–17లో భారత ఆర్థిక వ్యవస్థలో జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతం. కేంద్ర గణాంక సంస్థ తర్వాతి సవరణల్లో వృద్ధి రేటు తగ్గే అవకాశం కూడా ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో 7.2 శాతం వృద్ధి నమోదైంది. కాగా, రెండో అర్ధ భాగంలో వృద్ధిని కేంద్ర గణాంక సంస్థ 7 శాతంగా అంచనా వేసింది.    

మొదటి ముందస్తు అంచనాల ప్రకారం స్థిర బేసిక్‌ ధరల వద్ద స్థూల కలిపిన విలువ 2015–16లో 7.2 శాతం కాగా, 2016–17లో 7 శాతం. 2016 –17 మొదటి అర్ధ భాగంలో స్థిర బేసిక్‌ ధరల వద్ద స్థూల కలిపిన విలువలో వృద్ధి 7.2 శాతం కాగా, రెండో అర్ధ భాగంలో 6.7 శాతంగా అంచనా.



మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2016–17లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో బేసిక్‌ ధరల వద్ద స్థూల కలిపిన విలువలో వృద్ధి 4.1 శాతం కాగా, పారిశ్రామిక రంగంలో వృద్ధి 5.2 శాతం, సేవా రంగంలో  వృద్ధి 8.8 శాతం.

పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఉప రంగాలైన మైనింగ్‌ అండ్‌ క్వారీయింగ్‌ రంగంలో రుణాత్మక వృద్ధి (–1.8 శాతం) నమోదు కాగా, తయారీ రంగంలో 7.4 శాతం, నిర్మాణ రంగంలో 2.9 శాతం, విద్యుచ్ఛక్తి, గ్యాస్, వాటర్‌ సప్లయ్‌లో 6.5 శాతం వృద్ధి నమోదైంది.

సేవా రంగానికి సంబంధించి ఉపరంగాల్లో వృద్ధిని పరిశీలించినప్పుడు ప్రభుత్వ పాలన, రక్షణ రంగంలో అధిక వృద్ధి నమోదైంది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, నిల్వల్లో 6 శాతం వృద్ధి నమో దు కాగా, ఫైనాన్షియల్, రియల్‌ ఎస్టేట్, వృత్తి పరమైన సేవల్లో 9 శాతం, ప్రభుత్వ పాలన, రక్షణ రంగంలో 12.8 శాతం వృద్ధి నమోదైంది.



ఎగుమతులు, దిగుమతులు

ప్రపంచ వృద్ధి, వాణిజ్యంలో తగ్గుదల కారణంగా భారత్‌లో ఎగుమతులు 2014–15లో 1.3 శాతం, 2015–16లో 15.5 శాతం క్షీణించాయి. ఎగుమతులకు సంబంధించి రుణాత్మక వృద్ధి ధోరణి తొలగి.. 2016–17 (ఏప్రిల్‌ – డిసెంబర్‌)లో ఎగుమతుల వృద్ధి 0.7 శాతంగా నమోదైంది. 2015–16 (ఏప్రిల్‌ – డిసెంబర్‌)లో మొత్తం ఎగుమతుల్లో పెట్రోలియం, చమురు, లూబ్రికెంట్స్‌ ఎగుమతుల వాటా 11.1 శాతం కాగా, 2016–17 (ఏప్రిల్‌–డిసెంబర్‌)లో 9.8 శాతానికి తగ్గింది. ఇదే కాలానికి సంబంధించి పెట్రోలియం, చమురు, లూబ్రికెంట్స్‌యేతర ఎగుమతుల్లో పెరుగుదల 2.2 శాతంగా నమోదైంది.



2015–16లో ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, ఆసియా, సీఐఎస్, బాల్టిక్‌ దేశాలకు భారత్‌ ఎగుమతులు తగ్గాయి. కానీ, 2016–17 (ఏప్రిల్‌–డిసెంబర్‌)లో భారత్‌ ఎగుమతులు ఐరోపా, అమెరికా, ఆసియా దేశాలకు సంబంధించి వరుసగా 2.6 శాతం, 2.4 శాతం, 1.1 శాతం మేర పెరిగాయి. కానీ, ఆఫ్రికాకు భారత్‌ ఎగుమతుల్లో 13.5 శాతం మేర తగ్గుదల ఏర్పడింది. 2016–17లో అమెరికా, యూఏఈ, హాంకాంగ్‌లు భారత్‌కు సంబంధించి అతిపెద్ద ఎగుమతి కేంద్రాలుగా నిలిచాయి.



దిగుమతుల విలువ 2014–15లో 448 బిలియన్‌ డాలర్లు కాగా, 2015–16లో 381 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. క్రూడ్‌ చమురు ధరల తగ్గుదల కారణంగా దిగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడింది. 2015–16లో బంగారం, సిల్వర్‌ దిగుమతిలో 35.9 శాతం తగ్గుదల ఏర్పడింది.



ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, ఆసియా, సీఐఎస్, బాల్టిక్‌ దేశాల నుంచి భారత్‌ దిగుమతులు 2015–16లో తగ్గాయి. కానీ, 2016–17 (ఏప్రిల్‌–నవంబర్‌)లో íసీఐఎస్, బాల్టిక్‌ ప్రాంతాల నుంచి భారత్‌ దిగుమతుల్లో పెరుగుదల 10.3 శాతంగా ఉంటే మిగిలిన 4 ప్రాంతాల నుంచి భారత్‌ దిగుమతుల్లో తగ్గుదల ఏర్పడింది. 2016–17 (ఏప్రిల్‌ – నవంబర్‌)లో భారత దిగుమతులకు సంబంధించి చైనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, అమెరికాలు ముఖ్య కేంద్రాలుగా నిలిచాయి.



2015–16 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు –130.1 బిలియన్‌ డాలర్లుగా, కరెంట్‌ అకౌంట్‌ లోటు –22.2 బిలియన్‌ డాలర్లుగా, జీడీపీలో కరెంటు అకౌంట్‌ లోటు –1.1 శాతంగా, నికర మూలధన ప్రవాహాలు జీడీపీలో 1.9 శాతంగా, జీడీపీలో వాణిజ్య లోటు –6.3 శాతంగా నమోదయ్యాయి.



విదేశీ రుణం

2016, సెప్టెంబర్‌  చివరి నాటికి భారతదేశ విదేశీ రుణం 484.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 2016, మార్చి నెలాఖరుతో పోల్చితే 2016, సెప్టెంబర్‌ నాటికి విదేశీ రుణం 0.8 బిలియన్‌ డాలర్లు తగ్గడానికి కారణం.. వాణిజ్య రుణాలు, స్వల్పకాల రుణం తగ్గడమే. 2016, జూన్‌ స్థాయితో పోల్చితే 2016, సెప్టెంబర్‌ చివరి నాటికి విదేశీ రుణం 4.8 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. మొత్తం విదేశీ రుణంలో (2016, సెప్టెంబర్‌) ప్రభుత్వ రుణం 20.1 శాతం కాగా, ప్రభుత్వేతర రుణం 79.9 శాతం. మొత్తం విదేశీ రుణంలో డాలర్‌ రూపంలోని రుణం 55.6 శాతం కాగా భారత రూపాయి వాటా 30.1 శాతం, స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 5.8 శాతం, జపాన్‌ యన్‌ 4.8 శాతం, పౌండ్‌ స్టెర్లింగ్‌ 0.7 శాతం, యూరో 2.4 శాతం, ఇతర కరెన్సీలు 0.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2016, సెప్టెంబర్‌ చివరి నాటికి భారతదేశానికి ఉన్న మొత్తం విదేశీ రుణంలో దీర్ఘకాల విదేశీ రుణం వాటా 83.2 శాతం కాగా, స్వల్పకాల రుణం 16.8 శాతం. మొత్తం విదేశీ రుణంలో విదేశీ మారక నిల్వలు 76.8 శాతం.



కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ను పటిష్టపర్చడానికి చర్యలు

భారతదేశంలో కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ను పటిష్టపర్చేందుకు రిజర్వు బ్యాంక్‌ అనేక చర్యలను తీసుకొంది. ఇందులో భాగంగా కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌లో పెట్టుబడిదారులను పెంచడం, మార్కెట్‌ ద్రవ్యత్వం పెంపునకు   సంబంధించిన ఖాన్‌ కమిటీ సిఫార్సులను ఆమోదించింది. దీనికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు కింది విధంగా ఉన్నాయి.



1.    వాణిజ్య బ్యాంకులు తమ మూలధన అవసరాల నిమిత్తం, అవస్థాపన సౌకర్యాలు, చౌక గృహాల నిర్మాణంపై పెట్టుబడులను పెంచుకోవడానికి వీలుగా మసాలా బాండ్ల జారీకి అనుమతి.

2.    సెబీలో రిజిస్టరైన బ్రోకర్లు కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌లో కార్పొరేట్‌ రుణ సెక్యూరిటీలకు సంబంధించి రెపో లేదా రివర్స్‌ రెపో ఒప్పందాలను చేపట్టడానికి అనుమతి.

3.    కార్పొరేట్‌ బాండ్లకు సంబంధించి వాణిజ్య బ్యాంకులు అందించే పాక్షిక పరపతిని 20 నుంచి 50 శాతానికి పెంచడం.

4.    ప్రభుత్వ బాండ్లకు సంబంధించి ‘మార్కెట్‌ మేకర్స్‌’గా ఉండే విషయంలో ప్రాథమిక డీలర్లకు అనుమతి. తద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలు రిటైల్‌ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటాయి.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top