ఎంసెట్-2015.. ఎన్ని మార్కులు.. ఏ ర్యాంకు!?


 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కోలాహలం ముగిసింది. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చరల్ కోర్సుల్లో ప్రవేశానికి రెండేళ్లపాటు శ్రమించిన విద్యార్థులు.. ఇక ఎన్ని మార్కులు వస్తే ఏ ర్యాంకు  వస్తుంది? ఇంటర్మీడియెట్ వెయిటేజీతో కలిపి వచ్చే ర్యాంకు ఎంత ? అనే లెక్కలు వేసుకునే పనిలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో ఎంసెట్-2015లో ఇంటర్మీడియెట్ మార్కులు; ఎంసెట్ మార్కులతో కలిపితే ఆశించదగిన  ర్యాంకులపై నిపుణుల అంచనాలు..

 

 గతేడాది వరకు తెలుగు విద్యార్థులందరికీ ఎంసెట్ ఉమ్మడిగా జరిగిన విషయం; ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వేర్వేరుగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ర్యాంకుల అంచనాపై ఇటు విద్యార్థుల్లో, అటు తల్లిదండ్రుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో గత సంవత్సరంతో పోల్చితే కొంచెం తక్కువ మార్కులు వచ్చినా మెరుగైన ర్యాంకు ఆశించేందుకు అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

 

 ర్యాంకుల సరళి అంచనా.. ఇలా:

 ఈసారి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ర్యాంకుల పరంగా కొన్ని సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. గతేడాది వరకు ఆంధ్రప్రదేశ్ రీజియన్ విద్యార్థులు కూడా ఎంసెట్‌లో పోటీ పడగా.. ఈసారి ఆ ప్రాంతానికి చెందిన దాదాపు 80 వేల మంది పోటీ తగ్గింది. దీంతో టీఎస్ ఎంసెట్ 2015లో మార్కులు తక్కువగా వచ్చినా.. కాస్త మెరుగైన ర్యాంకు పొందొచ్చు. ఉదాహరణకు ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 135 మార్కులకు 100లోపు ర్యాంకు పొందేందుకు ఆస్కారముంది. గత సంవత్సరం ఇవే మార్కులకు 150 వరకు ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెద్దగా మార్పులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఇంజనీరింగ్ విభాగంలో పోటీ దాదాపు గతేడాది స్థాయిలోనే ఉంది. అంతేకాకుండా టీఎస్ ఎంసెట్ కంటే దాదాపు 40 వేల మంది విద్యార్థులు అధికంగా ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో పోటీ పడ్డారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ఇంజనీరింగ్ విభాగంలో కటాఫ్ 118 నుంచి 125 మధ్యలో ఉండొచ్చని అంచనా.

 

 మెడికల్ ఇలా:

 ఎంసెట్ మెడికల్ విభాగంలో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ దాదాపు దగ్గరగా ఉంది. టీఎస్ ఎంసెట్‌లో 84,678; ఏపీ ఎంసెట్‌లో 81,027 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో ఎంసెట్ కటాఫ్ మార్కులు 115-120 మధ్యలో ఉంటాయని నిపుణుల అభిప్రాయం (ఇంటర్మీడియెట్‌లో 530 మార్కులకు పైగా సాధించిన నేపథ్యంలో). అంతేకాకుండా గతేడాది ఉమ్మడిగా జరిగిన ఎంసెట్‌తో పోల్చినా పెద్దగా మార్పులు ఉండవని అంచనా.

 

 వెయిటేజీ!

 ఇంటర్మీడియెట్‌లోని గ్రూపు సబ్జెక్టుల 600 మార్కులను 25కు కుదించి ఎంసెట్‌లో వెయిటేజీ నిర్ణయిస్తారు. అంటే ఐపీఈలో సాధించిన ప్రతి 24 మార్కులు ఎంసెట్‌లో 1 మార్కుకు సమానం. అలాగే ఎంసెట్‌లో 160 మార్కులను 75కు కుదిస్తారు. ఈ రెండింటి మొత్తం వెయిటేజీ ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top