డీఎస్సీ-2014 విజేతగా నిలవాలంటే..

డీఎస్సీ-2014 విజేతగా నిలవాలంటే.. - Sakshi


 సంక్షోభ పరిస్థితుల కారణంగా చాలా నెలలుగా ప్రభుత్వ కొలువుల ప్రకటనలు లేకపోవడంతో నిరుద్యోగ యువత మనో వేదనకు గురైంది. ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం కొత్త రూపు సంతరించుకున్న నవ్యాంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందన్న వార్తలు యువతలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం రోజున గురువుల నియామకాలకు ప్రకటన వెలువరించనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకటించడంతో ఔత్సాహికులు గెలుపే లక్ష్యంగా సన్నద్ధతను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష విధానం ఎలా ఉంటుంది? విజయానికి వ్యూహాలేమిటి? తదితరాలపై ఫోకస్..

 

 సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా, ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న ప్రతి నిమిషాన్నీ టీచర్ ఉద్యోగాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. తొలుత సిలబస్‌పై అవగాహన పెంపొందించుకొని, సరైన ప్రణాళికతో సన్నద్ధం కావాలి.

 

 ఎస్‌జీటీ పరీక్ష విధానం:

 సబ్జెక్ట్    ప్రశ్నలు    మార్కులు

 జీకే, కరెంట్ అఫైర్స్    20    10

 విద్యా దృక్పథాలు    20    10

 లాంగ్వేజ్-1 (తెలుగు)    18    9

 లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్)    18    9

 మ్యాథ్స్ కంటెంట్    18    9

 సైన్స్ కంటెంట్    18    9

 సోషల్ కంటెంట్     18    9

 టీచింగ్ మెథడాలజీ    30    15

 మొత్తం    160    80

 

 మెథడ్స్‌కు సంబంధించి తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లో ఒక్కో దాన్నుంచి ఆరు ప్రశ్నలు చొప్పున మొత్తం 30 ప్రశ్నలు వస్తాయి. వీటికి 15 మార్కులుంటాయి. డీఎస్సీలో టెట్ స్కోర్‌కు వెయిటేజ్ 20 మార్కులకు ఉంటుంది. టెట్‌లో సాధించిన ప్రతి 7 1/2 మార్కులకు 1 మార్కు చొప్పున వెయిటేజీ ఉంటుంది.

 

 జీకే, కరెంట్ అఫైర్స్:

 ఈ విభాగంలో స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక నామాలు; నదీ తీర నగరాలు; ప్రపంచ దేశాలు-రాజధానులు; ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు; సర్వోత్తమమైనవి; సైన్స్ అండ్ టెక్నాలజీ; అవార్డులు; సదస్సులు; వార్తల్లో వ్యక్తులు; క్రీడారంగ విశేషాలు; కేంద్ర, రాష్ర్ట వార్షిక బడ్జెట్‌లు; అంతర్జాతీయ రాజకీయ అంశాలు; భారతదేశంలో రాష్ట్రాల విభజన తదితర అంశాలపై దృష్టిసారించాలి. పరీక్షకు ముందు 8 నెలల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి.  వర్తమాన వ్యవహారాల కు దినపత్రికలు చదవాలి.

 

 విద్యా దృక్పథాలు:

 భారతదేశంలో విద్యా చరిత్ర- కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు-హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (2005), విద్యా హక్కు చట్టం వంటి అంశాలను చదవాలి. గత డీఎస్సీలో అన్ని అంశాలకూ సమాన ప్రాధాన్యమిచ్చారు. ప్రిపరేషన్ కోసం డీఎడ్ స్థాయి విద్యా దృక్పథాలు ప్రభుత్వ పాఠ్యపుస్తకాన్ని అభ్యసనం చేయాలి.

 

 కంటెంట్:

 కంటెంట్ కోసం పదో తరగతి వరకు రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. సోషల్‌లో భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం; మ్యాథ్స్‌లో సంఖ్యామానం, అంకగణితం, బీజగణితం, సమితులు- సంబంధాలు, క్షేత్రగణితం, రేఖాగణితం; తెలుగులో కవులు-కావ్యాలు, భాషా రూపాలు, పరుషాలు-సరళాలు; ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వొకాబ్యులరీ, ఆర్టికల్స్-ప్రిపొజిషన్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి.

 

 మెథడాలజీ:

 బోధనా లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, బోధనా ప్రణాళిక, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకుని అధ్యయనం చేయాలి. గత డీఎస్సీలో ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, తెలుగు మెథడాలజీ నుంచి క్లిష్టమైన ప్రశ్నలు వచ్చాయి. సన్నద్ధత కోసం డీఎడ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను చదవాలి.

 

 సక్సెస్ మంత్రఓ విజేత సూచనలు..కంటెంట్ చదివేటప్పుడు క్రమపద్ధతిని అనుసరించాలి. ఉదాహరణకు మూడో తరగతిలో విశ్వానికి సంబంధించిన అంశాలుంటే మొదట వాటిని చదివి, సంబంధిత అంశాలు ఏ తరగతుల్లో ఉన్నాయో గుర్తించి వాటన్నింటినీ ఒకేసారి అధ్యయనం చేయాలి. ఏదైనా ఒక అంశం ఎనిమిదో తరగతి వరకు ఉండి, 9, 10 తరగతి పుస్తకాల్లో పునరావృతమవుతుందో వాటి మీద అధిక దృష్టి పెట్టాలి. టీచింగ్ మెథడాలజీ అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. అప్పుడే చదివిన అంశాలు గుర్తుంటాయి. ఉదాహరణకు సైన్స్ మెథడాలజీలో ‘ప్రాజెక్టు పద్ధతి’ అనే అంశాన్ని చదివిన వెంటనే మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్‌ల మెథడాలజీలోని ప్రాజెక్టు పద్ధతిని కూడా అధ్యయనం చేయాలి. అప్పుడే ప్రాజెక్టు అంటే ఏమిటి? దాని లక్ష్యాలు ఏమిటి? వంటి అంశాలపై పూర్తిస్థాయి అవగాహన వస్తుంది. అప్పుడు ‘ప్రాజెక్టు’ నుంచి ప్రశ్న ఎలా ఇచ్చినా తేలిగ్గా సమాధానం గుర్తించగలం. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నప్పుడూ ఇదే క్రమాన్ని అనుసరించాలి.

 

 రోజూ దినపత్రికలను తప్పనిసరిగా చదవాలి. ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఏదైనా అంశంపై వార్త వస్తే వాటి అనుబంధ విషయాలను కూడా అధ్యయనం చేయాలి. ప్రశ్న నేరుగా రాని సందర్భాల్లో ఇలాంటి ప్రిపరేషన్‌తో లాభపడతాం. కొందరు మొదటే శిక్షణ సంస్థల మెటీరియల్‌ను చదవడం ప్రారంభిస్తారు. ఇది సరికాదు. తొలుత పాఠ్యపుస్తకాలను బాగా చదివిన తర్వాతే మెటీరియల్‌ను చదవాలి. శిక్షణ సంస్థలు నిర్వహించే మాక్ టెస్ట్‌లకు హాజరుకావాలి. అప్పుడే ప్రిపరేషన్‌లో లోటుపాట్లు తెలుస్తాయి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో తెలుస్తుంది. వాటికనుగుణంగా ప్రణాళికను మార్చుకునేందుకు వీలవుతుంది. ప్రశ్నను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని, వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంపొందించుకునేందుకు నమూనా పరీక్షలు ఉపయోగపడతాయి.

 

 క్లిష్టంగా ఉన్న అంశాలను పేపర్‌పై రాసుకొని, గదిలో గోడకు అతికించుకొని, వీలున్నప్పుడల్లా చదివితే వాటిపై వారం రోజుల్లో పట్టు సాధించవచ్చు. ఒక వారం దేశాలు-రాజధానులు; మరో వారం ప్రముఖ యుద్ధాలు-జరిగిన తేదీలు.. ఇలా వివిధ అంశాలను తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు. సెల్‌ఫోన్ వాయిస్ రికార్డర్‌తో క్లిష్టమైన అంశాలను రికార్డు చేసుకొని, నిద్రపోయే ముందు వినొచ్చు. ఇలా ఎవరికివారు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే తీవ్ర పోటీ ఉన్న డీఎస్సీలో విజయం సాధించగలం. ఏ అంశాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. రకరకాల కారణాల వల్ల ఒకశాతం అంశాల్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ ఒక్కశాతమే విజయావకాశాలను దెబ్బతీస్తుందని గుర్తించాలి.ప్రారంభంలోనే దాదాపు రూ.22 వేల వేతనం; ఆహ్లాదకరమైన పని వాతావరణం; ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దే సదవకాశం.. ఇవన్నీ టీచర్ ఉద్యోగంతో ఖాయం చేసుకోవచ్చు. ఓ ఐదు నెలల పాటు పటిష్ట ప్రణాళికతో సాధన చేస్తే విజయం మీదే!

  - డి.అజయ్ కుమార్;

 ఎస్‌జీటీ విజేత; పశ్చిమగోదావరి.

 

 స్కూల్ అసిస్టెంట్

  పరీక్ష విధానం

 సబ్జెక్ట్    ప్రశ్నలు    మార్కులు

 జీకే, కరెంట్ అఫైర్స్    20    10

 విద్యా దృక్పథాలు    20    10

 కంటెంట్ (సంబంధిత సబ్జెక్ట్)    88    44

 మెథడాలజీ    32    16

 మొత్తం    160    80

 

 ప్రతి ప్రశ్నకు 0.5 (అర) మార్కు. మొత్తం 160 ప్రశ్నలకు 80 మార్కులు కేటాయించారు. టెట్ స్కోర్‌కు వెయిటేజ్ 20 మార్కులకు ఉంటుంది. ఎస్‌జీటీలోని జీకే, కరెంట్ అఫైర్స్; విద్యా దృక్పథాలు; టీచింగ్ మెథడాలజీ, కంటెంట్ అంశాలు స్కూల్ అసిస్టెంట్‌లోనూ ఉంటాయి. కంటెంట్‌కు ఆరు నుంచి ఇంటర్ వరకు పాఠ్య పుస్తకాలు చదవాలి.

 

 స్కూల్ అసిస్టెంట్- సోషల్ స్టడీస్

 కంటెంట్: భూగోళశాస్త్రం: సౌర కుటుంబం-భూమి; భూ ఉపరితల స్వరూపాలు-వర్గీకరణ; ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు; ఖండాలు; భారతదేశ ఉనికి-భౌతిక అమరిక; వాతావరణం; సముద్రాలు; ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం నుంచి ప్రశ్నలు వస్తాయి. 15 మార్కులకుగాను 30 ప్రశ్నలు వస్తాయి. 2012 డీఎస్సీలో ప్రపంచ భూగోళశాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

 

 చరిత్ర: మధ్యయుగ  ప్రపంచం; ప్రాచీన భారతీయ నాగరికతలు; ఢిల్లీ సుల్తానులు; మొఘలుల సామ్రాజ్యం; భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం; ఆధునిక ప్రపంచం; ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులు; సమకాలీన ప్రపంచం అంశాల నుంచి 15 మార్కులకుగాను 30 ప్రశ్నలు వస్తాయి. పౌరశాస్త్రం: భారత రాజ్యాంగం; లౌకికత్వం-భారతదేశం; ప్రపంచ శాంతి-భారతదేశం పాత్ర; ఐక్యరాజ్య సమితి వంటి పాఠ్యాంశాల నుంచి 7 మార్కులకుగాను 14 ప్రశ్నలు వస్తాయి. అర్థశాస్త్రం: ద్రవ్యోల్బణం; ఆర్థికాభివృద్ధి; భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు; జాతీయ ఆదాయం; ద్రవ్యం వంటి పాఠ్యాంశాల నుంచి 7 మార్కులకుగాను 14 ప్రశ్నలు వస్తాయి. 2012 డీఎస్సీలో 9, 10 తరగతుల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.

 

 మెథడాలజీ:

 ఈ విభాగంలో ప్రధానంగా సాంఘిక అధ్యయన బోధనా ఉద్దేశాలు; విలువలు; విద్యా ప్రణాళిక; ఉపాధ్యాయుడు; బోధనోపకరణాలు; మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో బోధనోపకరణాలు నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మెథడాలజీకి డీఎడ్, బీఎడ్ స్థాయి పాఠ్యపుస్తకాలను చదవాలి.

 ఎస్‌ఏ- గణిత శాస్త్రం

 

 కంటెంట్: ప్రధానంగా బీజ గణితం, వ్యాపార గణితం, క్షేత్ర గణితం, రేఖా గణితం, త్రికోణమితి, శ్రేఢులు, సమితులు-సంబంధాలు వంటి అంశాల నుంచి 44 మార్కులకు 88 ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో వైశ్లేషిక రేఖాగణితం, బహుపదులు, త్రికోణమితి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మెథడాలజీ: ఈ విభాగంలో ప్రధానంగా గణితశాస్త్ర బోధనా లక్ష్యాలు, బోధనా విలువలు, బోధనా ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం వంటి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో బోధనా పద్ధతులు నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.

 

 ఎస్‌ఏ-బయాలజీ

 కంటెంట్: ప్రధానంగా జీవ ప్రపంచం, సూక్ష్మ జీవుల ప్రపంచం, జీవశాస్త్రం-ఆధునిక పోకడలు; జంతు ప్రపంచం వంటి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. 2012 డీఎస్సీలో జువాలజీ కంటే బోటనీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మెథడాలజీ: ప్రధానంగా జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు, విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళిక, జీవశాస్త్ర ఉపగమాలు-పద్ధతులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో అన్ని అంశాలకు సమ ప్రాధాన్యమిచ్చారు.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top